Pillar
-
హైదరాబాద్ లో పిల్లర్ పక్కనే కుంగిపోయిన భూమి
-
విరిగిన రోలర్ కోస్టర్ పిల్లర్.. తప్పిన పెను ప్రమాదం
నార్త్ కరోలినా: అత్యంత ఎత్తులో నిర్మితమైన ఓ రోలర్ కోస్టర్ రైడ్ జరుగుతున్న సమయంలో వీడియో తీశాడు ఓ సందర్శకుడు. వీడియోలో ఒక సన్నివేశం చూసి గగుర్పాటుకు గురై వెంటనే నిర్వాహకులను అప్రమత్తం చేశాడు. ఈ రోలర్ కోస్టర్ తాలూకా బ్రిడ్జి పిల్లర్ ఒకదానికి బీట రావడంతో రైడ్ సమయంలో పక్కకు కదులుతూ ప్రమాదకరంగా కనిపించింది. అలాగే నిర్లక్ష్యంగా దీనిని నిర్వహించి ఉంటే ఎంతటి దారుణం జరిగేదోనని అంటున్నారు నెటిజన్లు. ఫ్యూరీ 325 పేరుతో నడిచే రోలర్ కోస్టర్ కు స్థానికంగా విశేషమైన ప్రజాదరణ ఉంది. ఈ రైడ్ ను జీవితంలో ఒక్కసారి అయినా ఆస్వాదించాలని ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తూ ఉంటారు. అయితే దీని నిర్వహకులు దీనిలోని ఒక పిల్లర్ కు బీట వచ్చిన విషయాన్ని గమనించలేదు. రోలర్ కోస్టర్ స్థితిగతులను పట్టించుకోకుండా యధావిధిగా నిర్వహిస్తూ కాసులు గడించే పనిలో నిమగ్నమయ్యారు. ఇక్కడికి విచ్చేసిన ఓ సందర్శకుడు తన మొబైల్ లో రోలర్ కోస్టర్ రైడ్ ను బంధించాలని ప్రయత్నించాడు. ఆ సమయంలో అతను ఓ ప్రమాదాన్ని పసిగట్టాడు. ఆయన తీసిన వీడియోని నిశితంగా గమనించగా దీని పిల్లర్లలో ఒక పిల్లర్ కు పెద్ద బీటే వచ్చినట్లు కనిపించింది. వీడియోలో బీట వచ్చిన పిల్లర్ గుండా రోలర్ కోస్టర్ వెళ్ళినప్పుడు పిల్లర్ కదులుతున్న దృశ్యం స్పష్టంగా కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్లడంతో ప్రస్తుతానికైతే ఈ రోలర్ కోస్టర్ రైడ్ ను నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన తర్వాతే దీన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. ఈ వీడియోని ఆ సందర్శకుడు ట్విట్టర్లో పొందుపరిచాడు. రోలర్ కోస్టర్ ఏ మాత్రం పట్టుతప్పినా అందులో ఉన్నవారి ప్రాణాల సంగతేమి కాను. గాలిలోని ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. సందర్శకుడు ఈ అమ్యూజ్మెంటు సంస్థ మేనేజ్మెంటును అప్రమత్తం చేసి పెను విపత్తునే తప్పించాడని నెటిజన్లు అతడిని అభినందిస్తున్నారు. A visitor at a North Carolina amusement park spotted a large crack on a roller coaster's pillar on Friday. The ride, which was billed as one of the tallest of its kind, has now been closed as crews make repairs. https://t.co/9xqRRgXyWl pic.twitter.com/HTHculBdl9 — The New York Times (@nytimes) July 2, 2023 ఇది కూడా చదవండి: కుక్కను కారులోనే వదిలి తాజ్‌మహల్ చూసి వచ్చారు.. తిరిగొచ్చి చూస్తే.. -
మోడల్ ప్రాణం తీసిన ర్యాంప్ వాక్
-
ఢిల్లీ ఐరన్‌పిల్లర్... తుప్పుపట్టని చరిత్ర
ఇది ఢిల్లీ ఐరన్‌పిల్లర్... ఎత్తు 23 అడుగుల ఎనిమిది అంగుళాలు. వ్యాసం పదహారు అంగుళాలు. బరువు మూడు టన్నులకు పైమాటే. తుప్పుపట్టని భారత చరిత్రకు ప్రతీక. భారతీయ శాస్త్రనైపుణ్యానికి ప్రతిబింబం. దేశ రాజధానిలో ఇనుప స్తంభం... ఎక్కడ ఉంది? ఢిల్లీ నగరంలో మెహ్రౌలీలో ఉంది. అర్థమయ్యేలా చెప్పాలంటే కుతుబ్‌మినార్ ఆవరణలో ఉంది. ఎవరు నిలబెట్టారిక్కడ? తోమార్ రాజు అనంగ పాలుడు కావచ్చు, బానిస పాలకుడు ఇల్టుట్మిష్ కావచ్చు. ఈ కావచ్చుల వెనుక ఇంకా మరెన్నో కావచ్చులున్నాయి. దీనిని ఎవరు నిర్మించారనే ప్రశ్నకు సమాధానం ఈ స్తంభం మీదున్న శాసనాలే. సంస్కృత భాషలో బ్రాహ్మి లిపిలో ఉన్న ఈ శాసనాలను చదవడానికి అక్బర్ చేయని ప్రయత్నం లేదు. అయితే ఈ ప్రయత్నంలో సఫలమైంది బ్రిటిష్ పాలకులే. లండన్ ఆర్కియాలజిస్టుల మేధోతవ్వకం తర్వాత బయటపడిన వాస్తవం ఏమిటంటే... ఇది పదహారు వందల ఏళ్ల నాటి స్తంభం. గుప్తుల కాలం నాటిది. రెండవ చంద్రగుప్తుడు క్రీ.శ నాలుగవ శతాబ్దంలో మధ్యప్రదేశ్‌లోని విష్ణుపాద కొండల మీద స్థాపించాడని వెల్లడైంది. ఈ పిల్లర్ మీద పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు భారతదేశంలో గుప్తుల కాలం నాటికే లోహశాస్త్రం అత్యున్నత దశకు చేరి ఉండేదని సూత్రబద్ధంగా నిర్ధారించారు. అంత పెద్ద పుస్తకాలు చదివి అంత గొప్ప సైన్స్‌ను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అయినా ఏం ఫర్వాలేదు. ఈ పిల్లర్‌ని చూసి ఆ మేధోఘనులకు ఒక సెల్యూట్ చేసి, పిల్లర్ ముందు నిలండి ఫొటో తీసుకుంటే ఎప్పటికీ తుప్పు పట్టని ఓ మంచి జ్ఞాపకం మన ఆల్బమ్‌లో నిక్షిప్తమై ఉంటుంది. నిజమో! కాదో!! కానీ... ఈ పిల్లర్ చూడడానికి సన్నగా ఉన్నట్లే అనిపిస్తుంది. కానీ పిల్లర్ మన వీపుకి తగిలేటట్లు నిలబడి రెండు చేతుల్ని వెనక్కి చాచి పిల్లర్‌ని చుట్టడానికి ప్రయత్నిస్తే చేతులు అందవు. ఈ ప్రయత్నంలో రెండు అరచేతుల్ని పట్టుకోగలిగిన వాళ్లు గొప్ప వ్యక్తులవుతారని అక్కడ ఒక సరదా నమ్మకం ఉండేది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి చేతులు అందాయని కూడా చెప్పేవారు. పర్యాటకులందరూ ప్రయత్నించి విఫలమయ్యేవాళ్లు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేయడానికి కూడా వీల్లేదు. పిల్లర్ చుట్టూ కంచె కట్టేశారు. దూరంగా నిలబడి చూసి ఆనందించాల్సిందే. మధ్యప్రదేశ్‌లోనే ఎందుకు? కర్కాటక రేఖ మన దేశంలో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరామ్.. మొత్తం ఎనిమిది రాష్ట్రాల గుండా ప్రయాణిస్తుంది. ఎక్యునాక్స్‌డే (పగలు– రాత్రి సమంగా ఉండేరోజు) సూర్యుడి గమనం సాగే రేఖామార్గంలో మధ్యప్రదేశ్‌లో ఉన్న విష్ణుపాద కొండల మీద ఈ ఇనుపస్తంభాన్ని స్థాపించారు. ఇది ఈ ఇనుపస్తంభ స్థాపన వెనుక ఉన్న ఖగోళ విజ్ఞానం. అంతకు మించిన లోహశాస్త్ర విజ్ఞానం కూడా ఈ పిల్లర్‌లో నిక్షిప్తమై ఉంది. బ్రిటిష్ కాలంలో ఆర్కియాలజిస్ట్ జేమ్స్ ప్రిన్సెప్ 1817లో ఈ పిల్లర్ మీద అధ్యయనం చేసి ప్రపంచానికి తెలియచేశాడు. మెటలర్జరిస్ట్ సర్ రాబర్ట్ హోడ్‌ఫీల్డ్ 1912లో రీసెర్చ్ మొదలు పెట్టాడు. అనేకమంది శాస్త్రవేత్తలు ఇందులోని శాస్త్రీయత మీద పరిశోధనలు చేసి రెండు వందల యాభైకి పైగా పేపర్లు, పుస్తకాలు వెలువరించారు. ఇది ఒక మెటలర్జికల్ వండర్ అని తేల్చేశారంతా. ఈ ఐరన్ పిల్లర్‌ని తుప్పపట్టనివ్వని లోహపు పూత మందం మిల్లీమీటరులో ఇరవయ్యో వంతు. ఈ టెక్నాలజీ మీద ఇంకా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. – వాకా మంజులా రెడ్డి -
విషాదం: ప్రాణం తీసిన పిల్లర్ గుంత
సాక్షి, బంజారాహిల్స్: పిల్లర్‌కోసం తీసిన గుంత బాలుడి ప్రాణం బలిగొంది. ఆడుకుంటూ వెళ్లిన బాలుడు గుంత వరదనీటితో నిండిపోవడంతో పొరపాటున అందులో పడి ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. వనపర్తి జిల్లా కంచిరాపల్లి తండాకు చెందిన గోపాల్, మోనిక దంపతులు కూలిపనులు చేసుకుంటూ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నాలుగేళ్ల చిన్న కుమారుడు మూడవత్ సిద్దు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నాడు. బస్తీని ఆనుకొని ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ కాలనీలో పరుచూరి రవీంద్రనాథ్ అనే వ్యక్తి భవన నిర్మాణం చేపట్టాడు. భవన బిల్డర్ నారాయణరావు గత రెండేళ్ల నుంచి ఈ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. నిర్మాణంలో భాగంగా పలు గుంతలు తీశారు. ఇటీవలి వర్షాలకు ఆ గుంతలు వరదనీటితో నిండిపోయాయి. లిప్ట్ కోసం తీసిన భారీ గుంత కూడా వరద నీటితో నిండిపోయింది. ఆడుకుంటూ వెళ్లిన సిద్దు ఆ గుంతలో పడిపోయాడు. గంట సేపు గడిచినా కొడుకు కనిపించకపోడంతో తల్లి మోనిక అన్ని ప్రాంతాలు గాలిస్తూ నిర్మాణంలో ఉన్న ఖాళీ ప్లాట్‌లోకి వెళ్లి వెతికింది. ఓ గుంతలో కొడుకు విగత జీవిగా నీళ్లపై కనిపించాడు. బాలుడి మృతితో బస్తీవాసులు విషాదంలో మునిగిపోయారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గోడకూలి బాలిక మృతి అబిడ్స్: మంగళ్‌హాట్ ఆర్కేపేట్లో విషాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి పాత గోడ కూలి ఐదేళ్ల బాలిక మృతిచెందింది. ఆర్కేపేట్లో నివా సం ఉంటున్న ఇమ్రాన్ ఇల్లు ఓ వైపు గోడ కూలడంతో అతని కుమార్తె ఆదిబా(5) మృతి చెందింది. దీంతో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబ ఫసియుద్దీన్, మంగళ్‌హాట్ కార్పొరేటర్ పరమేశ్వరీ సింగ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రియురాలిని మరువలేక.. నాగోలు: ప్రేమించిన యువతిని మరిచిపోలేక ఓ ఆర్ఎంపీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం, ఎల్లాపురం గ్రామానికి చెందిన దున్నా ఉదయ్‌కుమార్ (27) ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులోని ఓ లాడ్జిలో దిగాడు. శనివారం మధ్యాహ్నం వరకు గదిలో నుంచి బయటకు రాలేదు. లాడ్జి సిబ్బంది తలుపుకొట్టినప్పటికీ స్పందించలేదు. దీంతో వారు ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచిచూడగా సీలింగ్‌ఫ్యాన్‌కు కట్టిన నైలాన్‌తాడుకు ఉదయ్‌కుమార్ మృతదేహం వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు ముందు ఉదయ్ రాసిన సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివాహానికి ముందే ఓ యువతిని ప్రేమించానని, ఆ యువతిని మరిచిపోలేక మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకొంటున్నానని అందులో పేర్కొన్నాడు విద్యుదాఘాతంతో యువకుడి మృతి ఉప్పల్: సెల్లార్లో నిండిన వరద నీటిని తోడటానికి మోటార్ పంపు ఆన్ చేస్తుండగా విద్యుదాఘానికి గురైన ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు..చిలుకానగర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ వద్ద గల జోగు శ్రీనివాస్(45) మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఇంటిసెల్లార్ నిండిపోయింది. దీంతో శ్రీనివాస్ సెల్లార్ నీటిని తోడటానికి మోటార్‌ను బిగించి స్విచ్ ఆన్ చేశాడు. విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కిందపడిపోయాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బోడుప్పల్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతి చెందాడని వైద్యులు తెలిపారు. -
పెచ్చులూడుతున్న ప్రాభవం!
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర షాన్.. మన హైదరాబాద్ సంతకం.. ఈ చారిత్రక నగరానికి తలమానికంగా విరాజిల్లుతున్న చార్మినార్ భవితవ్యం ప్రమాదంలో పడింది. 428 ఏళ్ల ఈ కట్టడం నుంచి ఓ భారీ పెచ్చు ఊడి కింద పడింది. మక్కా మసీదు వైపు మినార్‌లో ఉన్న పూల డిజైన్‌లో కొంత భాగం బుధవారం రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో కింద పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు పేలిందేమోననే భయంతో అక్కడున్నవారంతా మక్కా మసీదు వైపు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత వచ్చి, పెచ్చు ఊడి కింద పడిన సంగతి గుర్తించారు. దాదాపు రెండు మూడు క్వింటాళ్ల బరువైన భాగం అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడున్న బండరాయి సైతం పగిలిపోయింది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయింది. పెద్ద డ్యామేజీయే...: చార్మినార్ నిర్మించిన 233 ఏళ్ల తర్వాత ఓ వైపు మినార్ కూలిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా ధ్వం సమైన దాఖలాలు లేవు. అయితే, బుధవారం రాత్రి ఊడిపడిన పెచ్చు ఈ 195 ఏళ్లలో జరిగిన పెద్ద డ్యామేజీ అని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఓసారి, దాదాపు 17 ఏళ్ల క్రితం ఓసారి.. చిన్నచిన్న పెచ్చులు ఊడిపడ్డాయి. అవి చాలా చిన్నవి కావడంతో అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఊడిపడిన పెచ్చు భారీగా ఉండటంతో ఈ కట్టడం శిథిలావస్థకు చేరుకుంటోందన్న హెచ్చరికగానే భావించాలని అంటున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్లక్ష్యానికి ఫలితం ఇలా మొదలైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మినార్‌లో పెచ్చులూడిన ప్రదేశం కాలుష్యమే కారకం... కొన్ని దశాబ్దాలుగా వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్‌కు అతి చేరువగా సంచరిస్తుండటం.. ఈ కట్టడం బలహీనపడటానికి కారణమైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, రేగుతున్న ధూళి కణాలు చార్మినార్ కట్టడం పటుత్వం దెబ్బతినేలా చేశాయి. విషవాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్, ధూళికణాలు.. అన్నీ కలిపి కట్టడం గోడలపై పూతలాగా ఏర్పడ్డాయి. వాన నీళ్లు, వాతావరణంలోని తేమను గోడలు పీల్చుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. డంగు సున్నం, కరక్కాయ పొడి, నల్లబెల్లం, రాతి పొడి, గుడ్డు సొన మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించారు. ప్రధాన కట్టడం రాతిదే అయినా, దానిపైన ఈ మిశ్రమాన్ని మందంగా ఏర్పాటు చేశారు. ఇవి తడిని పీల్చుకోవు. కానీ సందర్శకులు వారి పర్యటనకు గుర్తుగా చార్మినార్ గోడలపై లోతుగా పేర్లు చెక్కుతున్నారు. అవి క్రమంగా పగుళ్ల తరహాలో ఏర్పడి తేమను లోనికి పీల్చుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా పై పూతతోపాటు, లోపలి ప్రధాన రాతి కట్టడం కూడా బలహీన పడిందని నిపుణులు గుర్తించారు. అందుకే కొన్నేళ్లుగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ శాఖ(ఏఎస్ఐ) అధికారులు గోడలకు కెమికల్ ట్రీట్మెంట్ చేసి సంప్రదాయ మిశ్రమంతో దెబ్బతిన్న భాగాలను సరి చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం చుట్టుముట్టిన ఫలితంగా కట్టడం బాగా బలహీనపడింది. ధూళి కణాలు (రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్) సాధారణ స్థాయి 80. అది పెరిగేకొద్దీ కట్టడం క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. ప్రస్తుతం అది చార్మినార్ వద్ద 110 నుంచి 140 వరకు ఉందని గుర్తించారు. ఇక నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 60 కాగా, చార్మినార్ వద్ద అది 90 పాయింట్ల వరకు నమోదవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 20 శాతం ఉండాల్సి ఉండగా చార్మినార్ వద్ద 25 శాతాన్ని మించుతోంది. కాపాడే పని.. నష్టం చేసిందా? చార్మినార్‌కు వాహనాల కాలుష్యం ప్రధాన శత్రువుగా గుర్తించి దాన్ని నివారించే ఉద్దేశంతో చార్మినార్ చుట్టూ వాహనాలు రాకుండా చేయాలని చాలాకాలం క్రితమే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు చేపట్టారు. చార్మినార్ వద్దకు నడుస్తూ మాత్రమే వెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇటీవలే ఆ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ చుట్టూ రోడ్డుపై రాళ్లు పరచటంతోపాటు, కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు పనులు చేపట్టారు. కానీ, ఇది పురాతన కట్టడాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నిబంధనల ప్రకారం జరగలేదని ఇప్పటికే అటు పురావస్తుశాఖ అధికారులతోపాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో భాగంగా డోజర్లు, పొక్లెయిన్లు, ఇతర భారీ యంత్రాలను వినియోగించారు. అవి చార్మినార్ కట్టడం పక్కనే రోజుల తరబడి పనులు చేశాయి. వాటి నుంచి ఉత్పన్నమయ్యే తరంగాలు కట్టడం కదిలేలా చేస్తాయని అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు జరిపారు. ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు మరమ్మతు జరగని భాగమది... 428 ఏళ్ల క్రితం 48.7 మీటర్ల ఎత్తుతో అత్యంత పటిష్టంగా నిర్మించిన అందమైన కట్టడం చార్మినార్. అప్పట్లో రూ.లక్ష వ్యయంతో దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. చార్మినార్ నిర్మించాక 233 ఏళ్ల అనంతరం 1824లో నైరుతి వైపు భాగం ఉన్నట్టుండి కుప్పకూలింది. ప్రకృతి విపత్తే దానికి కారణమనే వాదన ఉంది. ఆ వెంటనే దాదాపు రూ.60 వేల వ్యయంతో దాన్ని పునర్నిర్మించారు. దెబ్బతిన్న మిగతా కొన్ని భాగాలకు కూడా మరమ్మతు చేశారు. కానీ ప్రస్తుతం పెచ్చు ఊడిన ప్రాంతానికి ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. అంటే అది నాలుగు శతాబ్దాల క్రితం నాటి నిర్మాణమన్న మాట. దీంతో స్వతహాగానే ఆ భాగం కొంత బలహీనపడి ఉంటుంది. దీనికి అటు కాలుష్యం కాటు, వాతావరణ ప్రభావం, బలమైన యంత్రాలతో అతి సమీపంలో చేపట్టిన పనుల వల్ల ఏర్పడ్డ తరంగాల ప్రభావం.. ఇలా అన్నీ కలిసి భారీ పెచ్చు ఊడిపోవటానికి కారణమై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో పురావస్తు శాఖ అధికారులు ఇతమిత్థమైన కారణం చెప్పనప్పటికీ, కాలుష్యంతో బలహీనపడ్డ విషయంలో ఎలాంటి అనుమానమే లేదని పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో చేపట్టిన పనుల వల్ల సమస్య ఉత్పన్నమై ఉంటుందని, ఇటీవలి అకాల భారీ వర్షాలకు ఆ భాగం కొంత దెబ్బతిని పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. గురువారం రాత్రి ఏఎస్ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలింద్ తదితరులు ఈ కట్టడాన్ని పరిశీలించారు. శుక్రవారం ప్రత్యేక నిపుణులు వచ్చి పరిశీలించనున్నారు. కాగా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా గురువారం చార్మినార్‌ను సందర్శించారు. పెచ్చు ఊడిపడటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
మెట్రో పిల్లర్‌లో చీలిక.. ఆందోళనలో ప్రయాణికులు
శివాజీనగర(కర్ణాటక): బెంగళూరు నగరంలోని ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో కనిపించిన చీలికను సరిచేసిన కొన్ని నెలల అనంతరం తాజాగా మరో చోట చీలిక కనిపించింది. సౌత్ ఎండ్ సర్కిల్ పిల్లర్ ఒకటిలో చీలిక కనిపించిన సమాచారం మెట్రో రైలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. అయితే బీఎంఆర్సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సేఠ్ ఈ విషయంపై రైలు ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శుక్రవారం ఉదయం బసవనగుడి సమీపంలో ఉన్న సౌత్ ఎండ్ సర్కిల్లో పిల్లర్‌లో చీలిక కనిపించిందన్న సమాచారం క్షణంలోనే అన్ని వైపుల వ్యాపించి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది. తక్షణమే స్థలానికి చేరుకున్న బీఎంఆర్సీఎల్ అధికారులు మెట్రోలోని ఈ స్థలంలో ఏ చీలిక కనిపించలేదని స్పష్టం చేసి ప్రయాణికుల్లో ధైర్యాన్ని నింపారు. మెట్రో రెండో విడత పిల్లర్ యొక్క ఒక బేరింగ్ మాత్రం కిందకు పడింది. దానిని తక్షణమే సరిచేశారు. మెట్రో రైలు మార్గంలో అన్ని పిల్లర్లలో బేరింగ్లు కిందకు పడటం సాధారణంగా జరుగుతుంది. దీనిని అప్పుడప్పుడు సరిచేస్తామని, అదే విధంగా ఈ భాగంలో బేరింగ్‌ను సరిచేస్తామని బీఎంఆర్సీఎల్ ప్రజా సంప్రదింపుల అధికారి యశ్వంత్ తెలియజేశారు. ఇంతకు ముందు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్‌లో చీలిక ఏర్పడటంతో ఆ మార్గంలో రైలు ప్రయాణాన్ని రద్దు చేసి మరమ్మతులు చేపట్టిన విషయం తెల్సిందే. -
చిచ్చురేపిన ‘పిల్లర్ 81’
సాక్షి, న్యూఢిల్లీ : అది మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లా, క్వాతా కునౌ అనే కుగ్రామం. అక్కడ పట్టుమని పది కుటుంబాలు కూడా లేవు. ఊరు నుంచి పారే వాగు నీరే వారికి తాగు నీరు, సాగు నీరు. చుట్టూ ఎత్తైన కొండలు, కోనలు, దట్టమైన అడవితో అందమైన ప్రకృతి. పచ్చని పంటల మధ్య కడుపు చల్లగా ఆ కుటుంబాల జీవితం వెచ్చగా సాగిపోతోంది. వారి జీవితాల్లో ఇప్పుడొక సరిహద్దు రాయి చిచ్చు రేపింది. సరిగ్గా ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన మయన్మార్, మణిపూర్ సరిహద్దు రాయి గ్రామానికి ఈవల ఇటీవల వెలసింది. అప్పటి నుంచి సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు క్వాతా కునౌ గ్రామం వనరులను దోచుకుంటున్నారు. అడ్డుపడితే గొడవ పడుతూ దాడులకు కూడా సిద్ధం అవుతున్నారు. మణిపూర్ నుంచి మయన్మార్‌కు పారుతున్న నంజిలోక్ నదిపై క్వాతా కునౌ గ్రామస్థులు కట్టుకున్న చిన్న డామ్‌లోని నీటిని సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు తమ వ్యవసాయానికి వాడుతున్నారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దు లోపల ఉన్నందున డ్యామ్ తమదేనని గ్రామస్థులను దబాయించడమే కాకుండా సరిహద్దు ఆవలికి తరలి పోవాల్సిందిగా కూడా గ్రామస్థులను బెదిరిస్తున్నారు. మూడు కిలోమీటర్లకు ఆవల ఉండాల్సిన సరిహద్దు 81వ రాయి ఊరవతలికి ఎలా వచ్చిందని తెంగ్నౌపాల్ జిల్లా కమిషనర్ అబుజమ్ తొంబికాంటా సింగ్‌ను మీడియా ప్రశ్నించగా భారత్, మైన్మార్ సంయుక్త సర్వే బందం ఇటీవలనే ఈ అనుబంధ సరిహద్దు రాయిని ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతకుమించి ఆయన వద్ద సమాచారం లేదు. ఇరు దేశాల మధ్య సరిహద్దు రాయులు ఎక్కడో దూరాన ఉండడం వల్ల అనుబంధ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకోవాలని మయన్మార్‌లోని తాము నగరంలో గత అక్టోబర్ నెలలో జరిగిన ఉమ్మడి చర్చల్లో నిర్ణయించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కశ్మీర్‌లాగా ఆధీన రేఖ, వాస్తవాధీన రేఖ అంటూ భారత్–మయన్నార్ దేశాల మధ్య లేనప్పుడు ఎందుకు ఈ అనుబంధ సరిహద్దు రాళ్లు అన్న ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం దొరకలేదు. సరిహద్దును కాపాలాగాసే అస్సాం రైఫిల్స్ దళాలకు అనువుగా ఉండేందుకు అనుబంధ సరిహద్దు రాయినీ ఏర్పాటు చేశారని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది మయన్మార్‌కు భూమిని ధారాదత్తం చేయడమేనని రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, పలు సామాజిక సంస్థలు గొడవ చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ భైరేన్ సింగ్, శాసన సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, అస్సాం రైఫిల్స్ ప్రతినిధులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని వేశారు. మణిపూర్, మయన్మార్ మధ్య 1969–70 మధ్య ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి కూడా ముందుకు కదిలి వచ్చిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. 1967, మార్చి నెలలో మయన్మార్‌తో భారత్‌కు మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం ఆ రాయిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. 1969–70లో ఏర్పాటు చేసిన 81 రాయి మూడు కిలీమీటర్లకు ఆవల ఉండగా, 2010, అక్టోబర్ నెలలో ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి దాదాపు కిలోమీటరు ఇవతలకు ఉంది. 2017–18 సంవత్సరంతో ఇటీవల ఏర్పాటు చేసిన సరిహద్దు రాయి సరిగ్గా మూడు కిలోమీటర్ల ఇవతల ఉంది. ఈ రాయిపైనా 81కి బదులు 80 అనే అంకె ఉంది. 81 అనే రాయి మరోటి ఉందని చెప్పడానికా? అలా చెప్పి సమర్థించుకోవడానికా? తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు. కశ్మీర్లో అంగుళం స్థలం కూడా వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వం మయన్మార్‌కు మాత్రం మూడు కిలోమీటర్ల విస్తీర్ణ స్థలాన్ని ఎలా వదిలేసిందని, ఎన్ని వేల కోట్లు చేతులు మారాయంటూ కాంగ్రెస్, స్థానిక సామాజిక వర్గలు రాష్ట్రంలో వరుస ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీనే తాను ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ నివేదిక అందినప్పటికీ దాన్ని బహిర్గతం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి భరేన్ సింగ్ ఈ నెల 11వ తేదీన సరిహద్దు, అనుబంధ సరిహద్దు రాళ్లను తేల్చడానికి ఓ ఉన్నతాధికార బందాన్ని పంపించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జూలై 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర బందం వస్తోంది. -
పిల్లర్ గుంటలో పడి బాలుడి మృతి
పిల్లర్ కోసం తీసిన గుంటలో పడి బాలుడు మృతిచెందిన సంఘటన శంషాబాద్ మిషన్‌కంపౌడ్ సమీపంలోని శీనయ్య వెంచర్లో గురువారం వెలుగుచూసింది. స్థానిక శీనయ్య వెంచర్లో కార్మికులుగా పనిచేస్తున్న హరీష్, యాదమ్మ దంపతుల ఆరేళ్ల కుమారుడు బాలు పిల్లర్ గుంటలో పడి మృతిచెందాడు. శ్రీనయ్య వెంచర్లో పిల్లర్ల కోసం గుంటలు తవ్వారు. అందలో వర్షపు నీరు చేరడంతో ప్రమాదవశాత్తు బాలుడు అందులో పడి మృతిచెందాడు. గుంటల వద్ద ఎలాంటి సేఫ్టీ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని కార్మికులు ఆందోళన చేస్తున్నారు. కార్మికులు అనంతపూర్ వాసులుగా గుర్తించారు. -
పిల్లర్ గోతిలో పడి బాలుడి దుర్మరణం
విషాదంలో తల్లిదండ్రులుఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నంలో పిల్లర్ నిర్మాణం కోసం తీసిన గోతిలో పడి ఐదేళ్ల బాలుడు మృతి చెందాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. స్థానిక ప్రసాద్ నగర్లో గోవాతి సుధాకర్, అనిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు నాగేంద్రబాబు అలియాస్ మహేష్ (5) బుధవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆడుకుంటూ ఇంటి ఎదురుగా పిల్లర్ నిర్మాణం కోసం తవ్విన గోతిలో పడిపోయాడు. 6.30 గంటల సమయంలో అతడి గురించి తల్లికి ఆరా వచ్చి చుట్టుపక్కల వారిని అడిగింది. ఆ సమయంలో గోతిలోనుంచి అరుపులు వినిపించాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు వచ్చి మహేష్ అందులో ఉన్నట్లు గుర్తించి రక్షించేందుకు యత్నించారు. వారు మొదట చాంతాడు ఇవ్వగా పట్టుకున్నాడు. అయితే జారి పడిపోయి మళ్లీ ఎక్కలేకపోయాడు. ఆ తర్వాత కేకలు వేయడం కూడా తగ్గిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై గణేష్ సిబ్బందితో ఘటనాస్థలికి వచ్చారు. వెంటనే జేసీబీని రప్పించి పక్కగా తవ్విస్తూ 10 అడుగుల లోతులో ఉన్న పిల్లవాడిని బయటకు తీశారు. వారు అందించిన సమాచారంతో 108 సిబ్బం ది వచ్చారు. మహేష్‌కు ప్రథమ చికిత్సచేసి రక్షించేందుకు యత్నిం చారు. కొద్దిసేపటి తరువాత చనిపోయాడని తెలిపారు. బాలుడి మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించి ఇబ్రహీంపట్నం సీఐ రాంబాబు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎంత శ్రమించినా దక్కని ఫలితం మహేష్‌ను కాపాడేందుకు స్థానికులు కృషి చేశారు. మూ డు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బాలుడి ప్రాణాలు దక్కకపోవడంతో నిరాశ చెందారు. ప్రసాద్ నగర్‌కు చెందిన ఓ మహిళ ఇంటి నిర్మాణం కోసం ఈ గోతులు తీయించింది. వాటిపై ఏమి కప్పకపోవడంతో మహేష్ ఆడుకుంటూ ఓ గోతిలో పడి మృతిచెందాడు. విషాదంలో సుధాకర్ కుటుంబం మహేష్ తండ్రి సుధాకర్ స్వస్థలం శ్రీకాకుళం జిల్లా పొందూరు. ఇబ్రహీంపట్నం వలస వచ్చి నూడిల్స్ బండి పెట్టుకుని వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుధాకర్, అనిత దంపతులకు మహేష్‌తో పాటు శ్రీజ అనే కుమార్తె ఉంది. కుమారుడి అకాల మరణంతో దంపతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. అధికారుల పరామర్శ సుధాకర్ కుటుంబసభ్యులను బుధవారం రాత్రి అధికారులు పరామర్శించారు. ఇబ్రహీంపట్నం తహశీల్దార్ హరిహరిబ్రహ్మాజీ, ఇబ్రహీంపట్నం సీఐ రాంబాబు, గ్రామ సర్పంచ్ అజ్మీరా స్వర్ణ, వార్డు సభ్యులు నల్లమోతు ప్రసాద్, రాయపూడి వెంకట్రావు, వైఎస్సార్ పార్టీ నాయకులు మధుబాబు, ఎన్.రవిలు పరామర్శించిన వారిలో ఉన్నారు.