సాక్షి, న్యూఢిల్లీ : అది మణిపూర్‌లోని తెంగ్‌నౌపాల్ జిల్లా, క్వాతా కునౌ అనే కుగ్రామం. అక్కడ పట్టుమని పది కుటుంబాలు కూడా లేవు. ఊరు నుంచి పారే వాగు నీరే వారికి తాగు నీరు, సాగు నీరు. చుట్టూ ఎత్తైన కొండలు, కోనలు, దట్టమైన అడవితో అందమైన ప్రకృతి. పచ్చని పంటల మధ్య కడుపు చల్లగా ఆ కుటుంబాల జీవితం వెచ్చగా సాగిపోతోంది. వారి జీవితాల్లో ఇప్పుడొక సరిహద్దు రాయి చిచ్చు రేపింది. సరిగ్గా ఆ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన మయన్మార్, మణిపూర్ సరిహద్దు రాయి గ్రామానికి ఈవల ఇటీవల వెలసింది. అప్పటి నుంచి సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు క్వాతా కునౌ గ్రామం వనరులను దోచుకుంటున్నారు. అడ్డుపడితే గొడవ పడుతూ దాడులకు కూడా సిద్ధం అవుతున్నారు.
మణిపూర్ నుంచి మయన్మార్‌కు పారుతున్న నంజిలోక్ నదిపై క్వాతా కునౌ గ్రామస్థులు కట్టుకున్న చిన్న డామ్‌లోని నీటిని సరిహద్దు ఆవలి గ్రామం ప్రజలు తమ వ్యవసాయానికి వాడుతున్నారు. ఇప్పుడు మయన్మార్ సరిహద్దు లోపల ఉన్నందున డ్యామ్ తమదేనని గ్రామస్థులను దబాయించడమే కాకుండా సరిహద్దు ఆవలికి తరలి పోవాల్సిందిగా కూడా గ్రామస్థులను బెదిరిస్తున్నారు. మూడు కిలోమీటర్లకు ఆవల ఉండాల్సిన సరిహద్దు 81వ రాయి ఊరవతలికి ఎలా వచ్చిందని తెంగ్‌నౌపాల్ జిల్లా కమిషనర్ అబుజమ్ తొంబికాంటా సింగ్‌ను మీడియా ప్రశ్నించగా భారత్, మైన్మార్ సంయుక్త సర్వే బందం ఇటీవలనే ఈ అనుబంధ సరిహద్దు రాయిని ఏర్పాటు చేసిందని చెప్పారు. అంతకుమించి ఆయన వద్ద సమాచారం లేదు.
ఇరు దేశాల మధ్య సరిహద్దు రాయులు ఎక్కడో దూరాన ఉండడం వల్ల అనుబంధ సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకోవాలని మయన్మార్‌లోని తాము నగరంలో గత అక్టోబర్ నెలలో జరిగిన ఉమ్మడి చర్చల్లో నిర్ణయించారని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కశ్మీర్‌లాగా ఆధీన రేఖ, వాస్తవాధీన రేఖ అంటూ భారత్–మయన్నార్ దేశాల మధ్య లేనప్పుడు ఎందుకు ఈ అనుబంధ సరిహద్దు రాళ్లు అన్న ప్రశ్నకు ఆయన వద్ద కూడా సమాధానం దొరకలేదు. సరిహద్దును కాపాలాగాసే అస్సాం రైఫిల్స్ దళాలకు అనువుగా ఉండేందుకు అనుబంధ సరిహద్దు రాయినీ ఏర్పాటు చేశారని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ఇది మయన్మార్‌కు భూమిని ధారాదత్తం చేయడమేనని రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్, పలు సామాజిక సంస్థలు గొడవ చేయడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ భైరేన్ సింగ్, శాసన సభ్యులు, జిల్లా ఉన్నతాధికారులు, అస్సాం రైఫిల్స్ ప్రతినిధులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని వేశారు.
మణిపూర్, మయన్మార్ మధ్య 1969–70 మధ్య ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి కూడా ముందుకు కదిలి వచ్చిందని జిల్లా డిప్యూటీ కమిషనర్ ధ్రువీకరించారు. 1967, మార్చి నెలలో మయన్మార్‌తో భారత్‌కు మధ్య కుదిరిన సరిహద్దు ఒప్పందం ప్రకారం ఆ రాయిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి సరిహద్దుల్లో మార్పులు చోటు చేసుకున్న సందర్భాలు లేవు. 1969–70లో ఏర్పాటు చేసిన 81 రాయి మూడు కిలీమీటర్లకు ఆవల ఉండగా, 2010, అక్టోబర్ నెలలో ఏర్పాటు చేసిన 81వ సరిహద్దు రాయి దాదాపు కిలోమీటరు ఇవతలకు ఉంది. 2017–18 సంవత్సరంతో ఇటీవల ఏర్పాటు చేసిన సరిహద్దు రాయి సరిగ్గా మూడు కిలోమీటర్ల ఇవతల ఉంది. ఈ రాయిపైనా 81కి బదులు 80 అనే అంకె ఉంది. 81 అనే రాయి మరోటి ఉందని చెప్పడానికా? అలా చెప్పి సమర్థించుకోవడానికా? తెలియదు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల వద్ద ఎలాంటి సమాధానం లేదు.
కశ్మీర్‌లో అంగుళం స్థలం కూడా వదులుకోవడానికి ఇష్టపడని ప్రభుత్వం మయన్మార్‌కు మాత్రం మూడు కిలోమీటర్ల విస్తీర్ణ స్థలాన్ని ఎలా వదిలేసిందని, ఎన్ని వేల కోట్లు చేతులు మారాయంటూ కాంగ్రెస్, స్థానిక సామాజిక వర్గలు రాష్ట్రంలో వరుస ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జూలై 6వ తేదీనే తాను ఏర్పాటు చేసిన ఉన్నతాధికార కమిటీ నివేదిక అందినప్పటికీ దాన్ని బహిర్గతం చేయకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి భరేన్ సింగ్ ఈ నెల 11వ తేదీన సరిహద్దు, అనుబంధ సరిహద్దు రాళ్లను తేల్చడానికి ఓ ఉన్నతాధికార బందాన్ని పంపించాల్సిందిగా కోరుతూ కేంద్రానికి లేఖ రాశారు. జూలై 18వ తేదీన రాష్ట్రానికి కేంద్ర బందం వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment