మక్కా మసీదు వైపు ఉన్న మినార్ నుంచి పెచ్చు ఊడిన దృశ్యం
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగర షాన్.. మన హైదరాబాద్ సంతకం.. ఈ చారిత్రక నగరానికి తలమానికంగా విరాజిల్లుతున్న చార్మినార్ భవితవ్యం ప్రమాదంలో పడింది. 428 ఏళ్ల ఈ కట్టడం నుంచి ఓ భారీ పెచ్చు ఊడి కింద పడింది. మక్కా మసీదు వైపు మినార్‌లో ఉన్న పూల డిజైన్‌లో కొంత భాగం బుధవారం రాత్రి 11.40 గంటలకు భారీ శబ్దంతో కింద పడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. బాంబు పేలిందేమోననే భయంతో అక్కడున్నవారంతా మక్కా మసీదు వైపు పరుగులు తీశారు. కాసేపటి తర్వాత వచ్చి, పెచ్చు ఊడి కింద పడిన సంగతి గుర్తించారు. దాదాపు రెండు మూడు క్వింటాళ్ల బరువైన భాగం అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడున్న బండరాయి సైతం పగిలిపోయింది. రాత్రి సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.
పెద్ద డ్యామేజీయే...: చార్మినార్ నిర్మించిన 233 ఏళ్ల తర్వాత ఓ వైపు మినార్ కూలిపోయింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా ధ్వం సమైన దాఖలాలు లేవు. అయితే, బుధవారం రాత్రి ఊడిపడిన పెచ్చు ఈ 195 ఏళ్లలో జరిగిన పెద్ద డ్యామేజీ అని అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల క్రితం ఓసారి, దాదాపు 17 ఏళ్ల క్రితం ఓసారి.. చిన్నచిన్న పెచ్చులు ఊడిపడ్డాయి. అవి చాలా చిన్నవి కావడంతో అంతగా పట్టించుకోలేదు. కానీ తాజాగా ఊడిపడిన పెచ్చు భారీగా ఉండటంతో ఈ కట్టడం శిథిలావస్థకు చేరుకుంటోందన్న హెచ్చరికగానే భావించాలని అంటున్నారు. దశాబ్దాల పాటు కొనసాగిన నిర్లక్ష్యానికి ఫలితం ఇలా మొదలైందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.
మినార్‌లో పెచ్చులూడిన ప్రదేశం
కాలుష్యమే కారకం...
కొన్ని దశాబ్దాలుగా వేల సంఖ్యలో వాహనాలు చార్మినార్‌కు అతి చేరువగా సంచరిస్తుండటం.. ఈ కట్టడం బలహీనపడటానికి కారణమైంది. వాహనాల నుంచి వెలువడే పొగ, రేగుతున్న ధూళి కణాలు చార్మినార్ కట్టడం పటుత్వం దెబ్బతినేలా చేశాయి. విషవాయువులు, నైట్రోజన్ డయాక్సైడ్, ధూళికణాలు.. అన్నీ కలిపి కట్టడం గోడలపై పూతలాగా ఏర్పడ్డాయి. వాన నీళ్లు, వాతావరణంలోని తేమను గోడలు పీల్చుకుంటే ప్రమాదం పొంచి ఉన్నట్టే. డంగు సున్నం, కరక్కాయ పొడి, నల్లబెల్లం, రాతి పొడి, గుడ్డు సొన మిశ్రమంతో చార్మినార్‌ను నిర్మించారు. ప్రధాన కట్టడం రాతిదే అయినా, దానిపైన ఈ మిశ్రమాన్ని మందంగా ఏర్పాటు చేశారు. ఇవి తడిని పీల్చుకోవు. కానీ సందర్శకులు వారి పర్యటనకు గుర్తుగా చార్మినార్ గోడలపై లోతుగా పేర్లు చెక్కుతున్నారు. అవి క్రమంగా పగుళ్ల తరహాలో ఏర్పడి తేమను లోనికి పీల్చుకునేలా చేస్తున్నాయి. ఫలితంగా పై పూతతోపాటు, లోపలి ప్రధాన రాతి కట్టడం కూడా బలహీన పడిందని నిపుణులు గుర్తించారు. అందుకే కొన్నేళ్లుగా కేంద్ర పురావస్తు సర్వేక్షణ శాఖ(ఏఎస్‌ఐ) అధికారులు గోడలకు కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి సంప్రదాయ మిశ్రమంతో దెబ్బతిన్న భాగాలను సరి చేస్తున్నారు. కానీ కొన్ని దశాబ్దాలుగా కాలుష్యం చుట్టుముట్టిన ఫలితంగా కట్టడం బాగా బలహీనపడింది. ధూళి కణాలు (రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్) సాధారణ స్థాయి 80. అది పెరిగేకొద్దీ కట్టడం క్రమంగా దెబ్బతినడం మొదలవుతుంది. ప్రస్తుతం అది చార్మినార్ వద్ద 110 నుంచి 140 వరకు ఉందని గుర్తించారు. ఇక నాన్ రెస్పిరబుల్ సస్పెండెడ్ పార్టిక్యులేట్ మ్యాటర్ సాధారణ స్థాయి 60 కాగా, చార్మినార్ వద్ద అది 90 పాయింట్ల వరకు నమోదవుతోంది. నైట్రోజన్ డయాక్సైడ్ స్థాయి కూడా 20 శాతం ఉండాల్సి ఉండగా చార్మినార్ వద్ద 25 శాతాన్ని మించుతోంది.
కాపాడే పని.. నష్టం చేసిందా?
చార్మినార్‌కు వాహనాల కాలుష్యం ప్రధాన శత్రువుగా గుర్తించి దాన్ని నివారించే ఉద్దేశంతో చార్మినార్ చుట్టూ వాహనాలు రాకుండా చేయాలని చాలాకాలం క్రితమే నిర్ణయించారు. ఈ నేపథ్యంలో చార్మినార్ పాదచారుల ప్రాజెక్టు చేపట్టారు. చార్మినార్ వద్దకు నడుస్తూ మాత్రమే వెళ్లాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఇటీవలే ఆ పనులు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా చార్మినార్ చుట్టూ రోడ్డుపై రాళ్లు పరచటంతోపాటు, కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుకు పనులు చేపట్టారు. కానీ, ఇది పురాతన కట్టడాలను పరిరక్షించే ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్న నిబంధనల ప్రకారం జరగలేదని ఇప్పటికే అటు పురావస్తుశాఖ అధికారులతోపాటు ఇటు స్వచ్ఛంద సంస్థలు, నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పనుల్లో భాగంగా డోజర్లు, పొక్లెయిన్‌లు, ఇతర భారీ యంత్రాలను వినియోగించారు. అవి చార్మినార్ కట్టడం పక్కనే రోజుల తరబడి పనులు చేశాయి. వాటి నుంచి ఉత్పన్నమయ్యే తరంగాలు కట్టడం కదిలేలా చేస్తాయని అప్పట్లోనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా భారీ యంత్రాలతో పనులు జరిపారు. ఆ ప్రభావమే ఇప్పుడు కనిపిస్తోందని అంటున్నారు.
ఇప్పటి వరకు మరమ్మతు జరగని భాగమది...
428 ఏళ్ల క్రితం 48.7 మీటర్ల ఎత్తుతో అత్యంత పటిష్టంగా నిర్మించిన అందమైన కట్టడం చార్మినార్. అప్పట్లో రూ.లక్ష వ్యయంతో దీన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. చార్మినార్ నిర్మించాక 233 ఏళ్ల అనంతరం 1824లో నైరుతి వైపు భాగం ఉన్నట్టుండి కుప్పకూలింది. ప్రకృతి విపత్తే దానికి కారణమనే వాదన ఉంది. ఆ వెంటనే దాదాపు రూ.60 వేల వ్యయంతో దాన్ని పునర్నిర్మించారు. దెబ్బతిన్న మిగతా కొన్ని భాగాలకు కూడా మరమ్మతు చేశారు. కానీ ప్రస్తుతం పెచ్చు ఊడిన ప్రాంతానికి ఇప్పటి వరకు మరమ్మతు చేయలేదు. అంటే అది నాలుగు శతాబ్దాల క్రితం నాటి నిర్మాణమన్న మాట. దీంతో స్వతహాగానే ఆ భాగం కొంత బలహీనపడి ఉంటుంది. దీనికి అటు కాలుష్యం కాటు, వాతావరణ ప్రభావం, బలమైన యంత్రాలతో అతి సమీపంలో చేపట్టిన పనుల వల్ల ఏర్పడ్డ తరంగాల ప్రభావం.. ఇలా అన్నీ కలిసి భారీ పెచ్చు ఊడిపోవటానికి కారణమై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక పరిశీలనలో పురావస్తు శాఖ అధికారులు ఇతమిత్థమైన కారణం చెప్పనప్పటికీ, కాలుష్యంతో బలహీనపడ్డ విషయంలో ఎలాంటి అనుమానమే లేదని పేర్కొంటున్నారు. భారీ యంత్రాలతో చేపట్టిన పనుల వల్ల సమస్య ఉత్పన్నమై ఉంటుందని, ఇటీవలి అకాల భారీ వర్షాలకు ఆ భాగం కొంత దెబ్బతిని పడిపోయి ఉంటుందని చెబుతున్నారు. గురువారం రాత్రి ఏఎస్‌ఐ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్ట్ మిలింద్ తదితరులు ఈ కట్టడాన్ని పరిశీలించారు. శుక్రవారం ప్రత్యేక నిపుణులు వచ్చి పరిశీలించనున్నారు. కాగా, నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ కూడా గురువారం చార్మినార్‌ను సందర్శించారు. పెచ్చు ఊడిపడటానికి గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment