దగ్గరుంటే బర్కత్ ఉంటుందని ప్రజల విశ్వాసం
అప్పటి వెయ్యి రూపాయలకు.. రూ.5 లక్షల వరకు డిమాండ్
కొంత మందికి హాబీ.. మరికొంత మందికి ఉపాధి
అరుదైన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్..
17 వరకూ ఉర్దూ ఘర్‌లో ప్రదర్శన
నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17 వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్‌లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లు అందుబాటులో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించ వచ్చు.. అలాగే తమకు నచి్చనవి కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు ఉన్నాయి.
ఇప్పటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్(అల్యూమినియం)తో తయారైన ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి నుంచి ఐదు వరకూ.. మధ్యలో నాలుగో పైసా ఉండదనే విషయం కూడా తెలిసి ఉండదు. తూటు పైసతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో పురాతన నాణేలు, కరెన్సీతో పాటు పురాతన వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంది. అల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను బీఎస్‌ఎన్‌ఎల్ మాజీ సీటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. – చార్మినార్
తూటు పైసా నుంచి ఏక్ అణా వరకూ..
ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్‌లో ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏక్ అణా, దో అణా.. నయా పైసా, తూటు పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్‌తో తయారైన కుళాయిలు, దీపాంతలు..ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకూ ఉర్డూ ఘర్ వేదికైంది.
సేకరణకు చక్కటి వేదిక..
నగరంతో పాటు గుంటూరు, ముంబయి, ఢిల్లీ, అకోలా, బెంగళూర్, నాగ్‌పూర్, ఓడిస్సా, బీహార్, చెన్నై, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శిస్తున్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక.
నాటి కరెన్సీతోనే..
నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా దాన, ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి వెయ్యి రూపాయలకు రూ.5 లక్షల వరకూ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టి ఖరీదు చేశాడని.. తిరిగి తమకు విక్రయిస్తే.. రూ.5లక్షల 50వేలు ఇస్తామంటున్నా.. ఇవ్వడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇది అప్పట్లో లండన్‌లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు.
ఏడాదికోసారి..
ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ చర్రితను తెలుపుతుంది. దీని ద్వారా పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. పురాతన వస్తువుల సేవకరణ చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ విక్రయించడానికి వచ్చాను. ఏడాదికోసారైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉండాలి. – మహ్మద్ తాహెర్, హసన్‌నగర్
చరిత్రను తెలిపేందుకు..
నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో ఇటువంటి అరుదైన చారిత్రక సంపదను ఎగ్జిబిషన్‌లో ఉంచుతున్నాం.. ప్రజలకు చరిత్రను తెలపడంతోపాటు, పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాం. ఇది దేశ సంపద. – సిరాజుద్దీన్, ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment