nijam period
-
Hyderabad: మొఘల్‌పురాలో.. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్!
నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది. అరుదైన కాయిన్స్, కరెన్సీ ఎగ్జిబిషన్ పాతబస్తీ మొఘల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ నెల 17 వరకూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకూ కొనసాగనుంది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచ వ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించిన పురాతన నాణేలు, నోట్లు అందుబాటులో ఉంచారు. మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని ఇక్కడ విక్రయించ వచ్చు.. అలాగే తమకు నచి్చనవి కొనుక్కోవచ్చు. వాటికున్న చారిత్రక ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి ధరలు ఉన్నాయి.ఇప్పటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్(అల్యూమినియం)తో తయారైన ఒక్క పైసా, రెండు పైసలు, మూడు పైసలు, ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలీదు. ఒకటి నుంచి ఐదు వరకూ.. మధ్యలో నాలుగో పైసా ఉండదనే విషయం కూడా తెలిసి ఉండదు. తూటు పైసతో పాటు వెండి, బంగారు నాణేలు సైతం చూడని వారున్నారు. వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్‌పురాలోని ఉర్దూ ఘర్‌లో పురాతన నాణేలు, కరెన్సీతో పాటు పురాతన వస్తువులతో కూడిన ప్రత్యేక ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంది. అల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను బీఎస్ఎన్ఎల్ మాజీ సీటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు. – చార్మినార్తూటు పైసా నుంచి ఏక్ అణా వరకూ..ఇప్పటి తరం వారు చూడని నోట్లు, కాయిన్స్ ఎన్నో ఈ ఎగ్జిబిషన్లో ఉన్నాయి. నిజాం కాలం నాటి ఏక్ అణా, దో అణా.. నయా పైసా, తూటు పైసా, సిల్వర్, గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్, బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్, సిల్వర్, మెటల్, బ్రాంజ్‌తో తయారైన కుళాయిలు, దీపాంతలు..ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకూ ఉర్డూ ఘర్ వేదికైంది.సేకరణకు చక్కటి వేదిక..నగరంతో పాటు గుంటూరు, ముంబయి, ఢిల్లీ, అకోలా, బెంగళూర్, నాగ్‌పూర్, ఓడిస్సా, బీహార్, చెన్నై, కలకత్తా తదితర ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ, కాయిన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తున్నారు. పురాతన వస్తువులు సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక.నాటి కరెన్సీతోనే.. నాటి కరెన్సీతో నిజాం నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ లేకుండా దాన, ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం. అందుకే నాటి వెయ్యి రూపాయలకు రూ.5 లక్షల వరకూ డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి రూ.5 లక్షలు పెట్టి ఖరీదు చేశాడని.. తిరిగి తమకు విక్రయిస్తే.. రూ.5లక్షల 50వేలు ఇస్తామంటున్నా.. ఇవ్వడానికి ఇష్టపడడం లేదని చెబుతున్నారు. ఇది అప్పట్లో లండన్‌లో ముద్రించారని, అందుకే డిమాండ్ అని చెబుతున్నారు.ఏడాదికోసారి..ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ చర్రితను తెలుపుతుంది. దీని ద్వారా పిల్లలు జ్ఞానాన్ని పొందుతారు. పురాతన వస్తువుల సేవకరణ చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న పాత కాయిన్స్ విక్రయించడానికి వచ్చాను. ఏడాదికోసారైనా ఇలాంటి ఎగ్జిబిషన్ ఉండాలి. – మహ్మద్ తాహెర్, హసన్నగర్చరిత్రను తెలిపేందుకు.. నాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్ దోహదం చేస్తాయి. అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో ఇటువంటి అరుదైన చారిత్రక సంపదను ఎగ్జిబిషన్లో ఉంచుతున్నాం.. ప్రజలకు చరిత్రను తెలపడంతోపాటు, పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తోడ్పడుతున్నాం. ఇది దేశ సంపద. – సిరాజుద్దీన్, ఏపీజే అబుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ -
22 ఏళ్లుగా భూమిపై ఊరి పోరు
సాక్షి, జైపూర్(చెన్నూర్): ప్రభుత్వాలు..పాలకుల నిర్లక్ష్యంతో నేటికీ కాన్కూర్ మిగులు భూముల లెక్కతేలడం లేదు. అటవీశాఖ, గ్రామస్తుల మధ్య రెండు దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. దీంతో భూముల కోసం రైతులు 22 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజాం కాలంలో మండలంలోని అంకన్నపాడ్ చెరువు కింద కాన్కూర్ రైతులు వెయ్యి ఎకరాలకుపైగా పంటలు సాగు చేశారు. తాత, ముత్తాతల కాలంలో ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం గడిపారు. కాలక్రమేనా 1969 గెజిట్‌లోని సెక్షన్–4 ద్వారా కాన్కూర్ శివారు భూములను (కాన్కూర్ బ్లాక్)రక్షిత అటవీప్రాంతం పరిగణంలోకి తీసుకున్నట్లు ప్రస్తావించింది. కాన్కూర్ శివారులో అప్పటి సెత్వార్ పట్టా ప్రకారం సర్వేనంబర్ 132/11/11లో అటవీశాఖ అధీనంలో 2400 ఎకరాలకుపైగా భూమి ఉంది. 1969 గెజిట్‌లో ప్రస్తావించింది 797 ఎకరాలు కాగా మిగిలిన 1600 ఎకరాల మిగులు భూములపై కాన్కూర్ వాసుల పోరాటం 1996 నుంచి మొదలైంది. ఆభూములపై ఆధారపడ్డ రైతులు..భూమి లేని నిరుపేదలు ఉన్న ఊర్లో ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలస కూలీలుగా వెళ్లారు. ప్రభుత్వాలు..పాలకులు మిగులు భూములపై దృష్టి సారించకపోవడంతో దశాబ్దాలుగా ఈ భూ సమస్య కొలిక్కిరావడం లేదు. పలుమారు జాయింట్ సర్వేలు నిర్వహించినా మిగులు భూముల లెక్కతేలలేదు. 2008లో గ్రామసభ నిర్వహించి అటవీశాఖ అధికారులు, కాన్కూర్ గ్రామస్తులు ఎవరూ ఆ వివాదాస్పద భూములపైకి వెళ్లకూడదని నిర్ణయించారు. జాయింట్ సర్వే నిర్వహించాక మిగులు భూములు తేలుస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు. పదేళ్లు గడుస్తున్నా సమస్య కొల్కిరాకపోవడంతో కాన్కూర్ బ్లాక్‌పై కన్నెసిన అటవీశాఖ ఈ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, కాన్కూర్ వాసులు అడ్డగించడం ఫలితంగా రాష్ట్రస్థాయికి కాన్కూర్ భూ సమస్య చేరింది. దీని మూలంగానే కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టీఎస్ ఎఫ్డీసీ వీసీఅండ్‌ఎండీ చందన్మిత్రలు క్షుణ్ణంగా కాన్కూర్ భూములను పరిశీలించి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఏడీఎస్ఎల్ఆర్ అధికారులను ఆదేశించారు. ఈ అధికారులు సర్వే నిర్వహించి కాన్కూర్ శివారు భూములన్నీ అటవీశాఖవేనని నివేదిక ఇవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వంపైనే ఆశలు.. కాన్కూర్ గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు మాటల యుద్ధం పెరుగుతోంది. మిగులు భూములు తేల్చాకే అటవీశాఖ అధికారులు ఇక్కడి భూముల్లో అడుగు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూశాఖ అధికారులను, అటవీశాఖ అధికారులు తప్పుడు రికార్డులతో తప్పుతోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు కాన్కూర్ బ్లాక్ తమవేనని చెబుతుండగా గ్రామస్తులు ప్రభుత్వ భూములు ఉన్నాయని అంటున్నారు. 22 ఏళ్లుగా గ్రామస్తులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ఎప్పుటికైనా భూమి రాకపోతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మిగులు భూమి లెక్కతేలితే కాన్కూర్ గ్రామస్తులతోపాటు మండల ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. వివిధ రకాల ప్రభుత్వ భవనాలు ఇక్కడ నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుంటే తప్పా కాన్కూర్ గ్రామస్తులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. కాన్కూర్వాసుల తలరాత మారేనా? మండలంలోని కాన్కూర్ గ్రామస్తులు మిగులు భూముల కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గ్రామశివారులోని 151, 152, 154, 185, 171, 201 సర్వే నంబర్లలో సుమారు 1600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా..106, 107, 136 సర్వే నంబర్లలో ఐదెకరాల వరకు ఉన్న పట్టా భూమిసైతం అటవీశాఖ అధీనంలో ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద కుటుంబాలే. వందమందికి పైగా ప్రభుత్వం ఈ భూముల్లో పట్టాలు ఇచ్చింది. కాని భూవివాదంతో ప్రయోజనం లేకుండాపోతోంది. పంటలు పండించిండ్రు.. నాటికాలంలో మా తండ్రులు ఈ భూముల్లో పంటలు పండించిండ్రు. అంకన్నపాడ్ చెరువు కింద పంటలు సాగు చేసిండ్రు. కొన్నేళ్ల నుంచి అటవీశాఖ వాళ్లు ఈ భూముల్లోకి రానివ్వడం లేదు. పొట్టకూటి కోసం మా బిడ్డలు పడరాని పాట్లు పడుతుండ్రు. మా భూములు మాకిచ్చి న్యాయం చేయాలి. – రేగుంట మల్లయ్య, కాన్కూర్ 1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4లో ప్రస్తావన.. కాన్కూర్ శివారులోని సర్వే నంబర్ 132/11లో 1481 ఎకరాల భూమి ఉండగా 1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4 ద్వారా 797ఎకరాల భూమిని రక్షిత అటవీప్రాంతం పరిగణలోకి తీసుసుకుంటున్నట్లు ప్రస్తావించింది. ఇందులో మిగులు భూమితోపాటు సర్వేనంబర్ 132(పీపీ) 982 ఎకరాలు, 106లో 24 సెంట్లు, 107లో 36సెంట్లు, 136లో 4ఎకరాల 22సెంట్లు అటవీశాఖ అధీనంలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిజాంకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మురళీమనోహర్రావుకు 70 ఎకరాలు పట్టా ఉంది. సెక్షన్–4లో ప్రస్తావించిన భూమిపోగా మిగులు భూమి పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాని అటవీశాఖ అధికారులు మాత్రం సెక్షన్–4.. సెక్షన్–15తో సమానమని అటవీ ప్రాంతంలో పట్టా భూములుంటే ప్రభుత్వం పరిహారం చెల్లించి వాటిని అటవీశాఖకు అప్పగిస్తుందని చెబుతున్నారు. తుదిశ్వాస వరకు పోరాటం.. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ కాన్కూర్ మిగులు భూముల కోసం పోరాటం చేస్తాం. ఒక పక్క ప్రభుత్వం నిరుపేదలకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని చెబుతున్నా ఇక్కడ భూమి ఉండి దున్నుకోలేక రైతులు అడ్డా కూలీలుగా మారారు. – బత్తుల శ్రీనివాస్‌యాదవ్, కాన్కూర్ భూ పోరాట సమితి అ«ధ్యక్షుడు -
మాయమవుతున్న మన చరిత్ర
మహానగర చరిత్ర మాయమవుతోంది. చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతున్నాయి. నగరం నడిబొడ్డున నిజాం కాలంలో నిఘా కేంద్రంగా సేవలందించిన ఎత్తయిన కట్టడం శిథిలావస్థలో ఉంది. 1850లో నిజాం సైన్యాధిపతి టిప్పుఖాన్శత్రువుల కదలికలను గుర్తించేందుకు దీనిని నిర్మించారు. ‘టిప్పు వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. మల్టీప్లెక్స్ నిర్మాణాల కోసం చరిత్రను ఖతం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చరిత్ర సంపదను కాపాడాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సిటీ లుక్ ఔట్’ కట్టడంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో :నిజాం కాలంలో సైన్యాధిపతిగా పనిచేసిన టిప్పుఖాన్ ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించాడు. ఆయన తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. దీంతో టిప్పుఖాన్ యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొంది సైన్యంలో చేరాడు. అనతి కాలంలోనే సైన్యాధిపతిగా ఎదిగాడు. నిజాం పాలకులకు దగ్గరయ్యాడు. నగర సంరక్షణ నిమిత్తం ప్రహరీనిర్మాణం, నిఘా కేంద్రం ఏర్పాటు బాధ్యతలను నిజాం టిప్పుఖాన్కు అప్పగించాడు. ఎత్తయిన ప్రదేశంలో నిఘా కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన టిప్పుఖాన్.. ప్రస్తుతలక్డీకాపూల్లోని ఎత్తయిన కొండపైదీనిని నిర్మించాడు. నగరంపై నజర్... 1850లో 162 అడుగుల ఎత్తులో లక్డీకాపూల్‌లోని ఎత్తయిన కొండపై దీనిని నిర్మించాడు టిప్పుఖాన్. ఇక్కడి నుంచి చూస్తే గోల్కొండ ఫతేమైదాన్, హుస్సేన్‌సాగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలన్నీ కనిపించేవి. ఇక్కడి నుంచే నగరంలో ఏం జరుగుతుందనేది? సైనికులు ఎప్పటికప్పుడు కనిపెడుతుండేవారు. శత్రువుల కదలికలు, సైనికుల శిక్షణ, ఇతర కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేవారు. ఈ కట్టడం నాలుగు వైపులా గోడలకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి. విధులు నిర్వర్తించే సైనికులు అందులో నుంచి బైనాక్యూలర్లతో నగరంపై నజర్ పెట్టేవారు. ఈ ప్రదేశం నుంచి చూస్తే సిటీ మొత్తం మన కళ్లకు కడుతుంది. అందుకే ఇది ‘టిప్పుఖాన్ వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే మెట్ల తొలగింపు... ఇంతటి ఘన చరిత్ర ఉన్న ‘సిటీ లుక్ ఔట్’ కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. టవర్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్లను ఇప్పటికే తొలగించారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనాలే ఇందుకు కారణమవుతున్నాయి. కూల్చివేతలకు రంగం సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి ముసుగులో చారిత్రక కట్టడం అంతర్థానం అవుతున్నా... అధికారులు ఆవైపు వెళ్లడం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు, నిపుణులు కోరుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను ఈ టవర్ నుంచి చూసే వీలుందని, దీనికి మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తే టూరిజం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిరక్షించాలి... చారిత్రక కట్టాడాలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నగరంలో ప్రతి కదలికలపై నజర్ పెట్టేందుకు టిప్పుఖాన్ ఈ సిటీ లుక్ ఔట్ నిర్మించాడు. ఇక్కడ ఓవైపు గుట్ట మొత్తం ధ్వంసమైంది. టవర్‌పై ఎక్కడానికి మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని టవర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టవర్ పైకి ఎక్కేందుకు మార్గం ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అదే విధంగా ఎంతో విలువైన ఈ చారిత్రక కట్టడం రాబోయో తరాలకు జ్ఞాపకంగా మిగులుతుంది. – అనురాధారెడ్డి,ఇన్టాక్ సంస్థ రాష్ట్ర కో–కన్వీనర్ -
నిజాం కాలంలోనే జిల్లాకోర్టు
– 1950–51లో కోర్టు నిర్వహణ – ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టు సాధించాం : సీనియర్ న్యాయవాది బాల్‌రెడ్డి వనపర్తి : నిజాం కాలంలోనే ‘నాజీం జిల్లా’ పేరుతో వనపర్తిలో జిల్లాకోర్టు ఏర్పాటు చేసినట్లు స్థానిక సీనియర్ సిటిజన్లు వెల్లడిస్తున్నారు. ఇప్పటివరకు ఏ పత్రికల్లో, టీవీచానెళ్లలో ఈ విషయాన్ని వెల్లడించలేదు. స్థానికుల్లో చాలా మందికీ ఈ విషయమే తెలియదు. వనపర్తి జిల్లా ఏర్పడుతున్న సందర్భంగా వనపర్తికి చెందిన సీనియర్ న్యాయవాది జి. బాల్‌రెడ్డిని సాక్షి పలకరించింది. ప్రస్తుతం న్యాయవాది బాల్రెడ్డికి ఎనబై సంవత్సరాలు ఆయన న్యాయవ్యవస్థకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను సాక్షితో పంచుకున్నారు. నాజీం జిల్లా నిర్వహణను తాను విద్యార్థిదశలో ఉన్నప్పుడు చూశానని చెప్పారు. నాగవరం గ్రామంలోని రాజావారి వాసుదేవమ్మ తోట బంగ్లాలో నాజీం జిల్లా నిర్వాహణ జరిగేదన్నారు. సంస్థానాధీశుల కాలంలో కోర్టుల నిర్వహణ బాధ్యతలను నిజాం నవాబులు జాగీర్దార్లు అప్పగించారని, కోర్టు నిర్వహణ ఖర్చులు వారి ద్వారానే చెల్లింపులు జరిగేవని ఆయన తెలిపారు. సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసిన తర్వాత జిల్లాకు ఒక్కటే జిల్లాస్థాయి కోర్టు ఉండాలని ఇక్కడి కోర్టును మహబూబ్‌నగర్‌కు తరలించారు. 1962 నుంచి తాను న్యాయవాది వృత్తిలో పనిచేస్తున్నానని చెప్పారు. చిన్న చిన్న సంస్థానాల్లో మున్సిఫ్ కోర్టులు ఉండేవి గోపాల్పేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల, ఆత్మకూర్ నిజాం ఆధీనంలో ఉన్న చిన్న సంస్థానాల్లో అదాలత్ మున్సిఫ్ కోర్టులు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పైకోర్టు (జిల్లా కోర్టు) రావాలంటే వనపర్తి నాజీం జిల్లా కోర్టుకు వచ్చేవారు. ఇక్కడి నుంచి పైకోర్టుకు వెళ్లాలంటే హైదరాబాద్‌లో నవాబుల ఆధీనంలో నిర్వహించే ఉన్నత న్యాయస్థానానికి వెళ్లాల్సి ఉండేదన్నారు. అన్ని సంస్థానాలకు వనపర్తి మధ్యభాగంలో ఉన్న కారణంగా ఇక్కడి నాజీం జిల్లాను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. 1950–51వరకు నాజీం జిల్లా కోర్టు స్వాతంత్య్రానికి పూర్వం నుంచి సంస్థానాలు ఇండియన్ యూనియన్‌లో విలీనం అయిన తర్వాత జాగీర్దార్ వ్యవస్థను రద్దు చేసే వరకు 1950–51 వరకు వనపర్తిలోని వాసుదేవమ్మ తోటలో నాజీం జిల్లా కోర్టు నిర్వాహణ జరిగింది. కొన్ని అదాలత్ మున్సిఫ్ కోర్టులు రద్దు చేయబడ్డాయి. ఈ ఆధారంతోనే వనపర్తికి జిల్లా అదనపు కోర్టును సాధించాం సంస్థానాధీశుల కాలంలోనే వనపర్తిలో నాజీం జిల్లా పేరుతో జిల్లా కోర్టు ఉండేదనే ఆధారం చూపించి తాను వనపర్తి బార్ అసోషియేషన్ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో హైకోర్టుకు నివేధించి వనపర్తికి అదనపు జిల్లా కోర్టును మంజూరు చేయించామని న్యాయవాది బాల్‌రెడ్డి చెప్పారు. కొన్నేళ్ల క్రితమే ప్రస్తుత సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మదన్‌బీ లోకూర్ చేతుల మీదుగా అదనపు జిల్లా కోర్టును ప్రారంభించుకున్నామని అన్నారు. నా చిన్నతనంలో చూశాను అవునూ.. చిన్న తనంలో మా ఊర్లోని వాసుదేవమ్మ తోటబంగ్లలో కోర్టు నడిచేది. మంది మార్బలంతో ఒక్కోరోజు చాలామంది వచ్చేవారు. చదవుకునే రోజుల్లో సంస్థానం నుంచి ఎవరైనా వస్తే ఆసక్తిగా వెళ్లి చూసేవాళ్లం. ఇక్కడినుంచి వనపర్తి పాతకోటలోని జైలుకు చాలామందిని తీసుకెళ్లేవారు. – బత్తిని రాంరెడ్డి, రిటైడ్ ఉద్యోగి, నాగవరం, వనపర్తి