టిప్పుఖాన్ వాచ్ టవర్,టిప్పుఖాన్ వాచ్ టవర్ పక్కన కొనసాగుతున్న పనులు...
మహానగర చరిత్ర మాయమవుతోంది. చారిత్రక కట్టడాలు ఒక్కొక్కటిగా మట్టిలో కలిసిపోతున్నాయి. నగరం నడిబొడ్డున నిజాం కాలంలో నిఘా కేంద్రంగా సేవలందించిన ఎత్తయిన కట్టడం శిథిలావస్థలో ఉంది. 1850లో నిజాం సైన్యాధిపతి టిప్పుఖాన్‌శత్రువుల కదలికలను గుర్తించేందుకు దీనిని నిర్మించారు. ‘టిప్పు వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందిన ఈ చారిత్రక కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. మల్టీప్లెక్స్ నిర్మాణాల కోసం చరిత్రను ఖతం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చరిత్ర సంపదను కాపాడాలని చరిత్రకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సిటీ లుక్ ఔట్’ కట్టడంపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సాక్షి, సిటీబ్యూరో :నిజాం కాలంలో సైన్యాధిపతిగా పనిచేసిన టిప్పుఖాన్ ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించాడు. ఆయన తండ్రి నిజాం సైన్యంలో పనిచేసేవాడు. దీంతో టిప్పుఖాన్ యుద్ధ విద్యల్లో నైపుణ్యం పొంది సైన్యంలో చేరాడు. అనతి కాలంలోనే సైన్యాధిపతిగా ఎదిగాడు. నిజాం పాలకులకు దగ్గరయ్యాడు. నగర సంరక్షణ నిమిత్తం ప్రహరీనిర్మాణం, నిఘా కేంద్రం ఏర్పాటు బాధ్యతలను నిజాం టిప్పుఖాన్‌కు అప్పగించాడు. ఎత్తయిన ప్రదేశంలో నిఘా కేంద్రం ఏర్పాటు చేయాలని భావించిన టిప్పుఖాన్.. ప్రస్తుతలక్డీకాపూల్‌లోని ఎత్తయిన కొండపైదీనిని నిర్మించాడు.
నగరంపై నజర్...
1850లో 162 అడుగుల ఎత్తులో లక్డీకాపూల్‌లోని ఎత్తయిన కొండపై దీనిని నిర్మించాడు టిప్పుఖాన్. ఇక్కడి నుంచి చూస్తే గోల్కొండ ఫతేమైదాన్, హుస్సేన్‌సాగర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలన్నీ కనిపించేవి. ఇక్కడి నుంచే నగరంలో ఏం జరుగుతుందనేది? సైనికులు ఎప్పటికప్పుడు కనిపెడుతుండేవారు. శత్రువుల కదలికలు, సైనికుల శిక్షణ, ఇతర కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేవారు. ఈ కట్టడం నాలుగు వైపులా గోడలకు మధ్యలో రంధ్రాలు ఉంటాయి. విధులు నిర్వర్తించే సైనికులు అందులో నుంచి బైనాక్యూలర్లతో నగరంపై నజర్ పెట్టేవారు. ఈ ప్రదేశం నుంచి చూస్తే సిటీ మొత్తం మన కళ్లకు కడుతుంది. అందుకే ఇది ‘టిప్పుఖాన్ వాచ్ టవర్’, ‘సిటీ లుక్ ఔట్’గా ప్రసిద్ధి చెందింది.
ఇప్పటికే మెట్ల తొలగింపు...
ఇంతటి ఘన చరిత్ర ఉన్న ‘సిటీ లుక్ ఔట్’ కట్టడం ఇప్పుడు ధ్వంసమవుతోంది. టవర్ పైకి వెళ్లేందుకు ఉన్న మెట్లను ఇప్పటికే తొలగించారు. ఇక్కడ కొత్తగా నిర్మిస్తున్న భవనాలే ఇందుకు కారణమవుతున్నాయి. కూల్చివేతలకు రంగం సిద్ధమైనా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అభివృద్ధి ముసుగులో చారిత్రక కట్టడం అంతర్థానం అవుతున్నా... అధికారులు ఆవైపు వెళ్లడం లేదు. ఇలాంటి చారిత్రక కట్టడాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చరిత్రకారులు, నిపుణులు కోరుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాలను ఈ టవర్ నుంచి చూసే వీలుందని, దీనికి మరమ్మతులు చేసి అభివృద్ధి చేస్తే టూరిజం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పరిరక్షించాలి...
చారిత్రక కట్టాడాలు రాన్రాను కనుమరుగైపోతున్నాయి. నగరంలో ప్రతి కదలికలపై నజర్ పెట్టేందుకు టిప్పుఖాన్ ఈ సిటీ లుక్ ఔట్ నిర్మించాడు. ఇక్కడ ఓవైపు గుట్ట మొత్తం ధ్వంసమైంది. టవర్‌పై ఎక్కడానికి మార్గం లేకుండా పోయింది. ప్రభుత్వం చొరవ తీసుకొని టవర్ చుట్టూ గ్రీనరీ ఏర్పాటు చేసి, టవర్ పైకి ఎక్కేందుకు మార్గం ఏర్పాటు చేస్తే పర్యాటక ప్రదేశంగా మారుతుంది. అదే విధంగా ఎంతో విలువైన ఈ చారిత్రక కట్టడం రాబోయో తరాలకు జ్ఞాపకంగా మిగులుతుంది. – అనురాధారెడ్డి,ఇన్‌టాక్ సంస్థ రాష్ట్ర కో–కన్వీనర్
Comments
Please login to add a commentAdd a comment