కాన్కూర్ గ్రామం (పైన), కాన్కూర్ శివారులోని వివాదాస్పద భూములు (కింద)
సాక్షి, జైపూర్(చెన్నూర్): ప్రభుత్వాలు..పాలకుల నిర్లక్ష్యంతో నేటికీ కాన్కూర్ మిగులు భూముల లెక్కతేలడం లేదు. అటవీశాఖ, గ్రామస్తుల మధ్య రెండు దశాబ్దాలుగా నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. దీంతో భూముల కోసం రైతులు 22 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నిజాం కాలంలో మండలంలోని అంకన్నపాడ్ చెరువు కింద కాన్కూర్ రైతులు వెయ్యి ఎకరాలకుపైగా పంటలు సాగు చేశారు.
తాత, ముత్తాతల కాలంలో ఈ భూముల్లో వ్యవసాయం చేస్తూ జీవనం గడిపారు. కాలక్రమేనా 1969 గెజిట్‌లోని సెక్షన్–4 ద్వారా కాన్కూర్ శివారు భూములను (కాన్కూర్ బ్లాక్)రక్షిత అటవీప్రాంతం పరిగణంలోకి తీసుకున్నట్లు ప్రస్తావించింది. కాన్కూర్ శివారులో అప్పటి సెత్వార్ పట్టా ప్రకారం సర్వేనంబర్ 132/11/11లో అటవీశాఖ అధీనంలో 2400 ఎకరాలకుపైగా భూమి ఉంది. 1969 గెజిట్‌లో ప్రస్తావించింది 797 ఎకరాలు కాగా మిగిలిన 1600 ఎకరాల మిగులు భూములపై కాన్కూర్ వాసుల పోరాటం 1996 నుంచి మొదలైంది.
ఆభూములపై ఆధారపడ్డ రైతులు..భూమి లేని నిరుపేదలు ఉన్న ఊర్లో ఉపాధి కరువై పట్టణ ప్రాంతాలకు వలస కూలీలుగా వెళ్లారు. ప్రభుత్వాలు..పాలకులు మిగులు భూములపై దృష్టి సారించకపోవడంతో దశాబ్దాలుగా ఈ భూ సమస్య కొలిక్కిరావడం లేదు. పలుమారు జాయింట్ సర్వేలు నిర్వహించినా మిగులు భూముల లెక్కతేలలేదు. 2008లో గ్రామసభ నిర్వహించి అటవీశాఖ అధికారులు, కాన్కూర్ గ్రామస్తులు ఎవరూ ఆ వివాదాస్పద భూములపైకి వెళ్లకూడదని నిర్ణయించారు. జాయింట్ సర్వే నిర్వహించాక మిగులు భూములు తేలుస్తామని అప్పటి ఉమ్మడి జిల్లా జాయింట్ కలెక్టర్ చెప్పారు.
పదేళ్లు గడుస్తున్నా సమస్య కొల్కిరాకపోవడంతో కాన్కూర్ బ్లాక్‌పై కన్నెసిన అటవీశాఖ ఈ భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, కాన్కూర్ వాసులు అడ్డగించడం ఫలితంగా రాష్ట్రస్థాయికి కాన్కూర్ భూ సమస్య చేరింది. దీని మూలంగానే కలెక్టర్ ఆర్వీ కర్ణన్, టీఎస్ ఎఫ్‌డీసీ వీసీఅండ్‌ఎండీ చందన్‌మిత్రలు క్షుణ్ణంగా కాన్కూర్ భూములను పరిశీలించి పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించాలని ఏడీఎస్‌ఎల్‌ఆర్ అధికారులను ఆదేశించారు. ఈ అధికారులు సర్వే నిర్వహించి కాన్కూర్ శివారు భూములన్నీ అటవీశాఖవేనని నివేదిక ఇవ్వడం ఆందోళనకు గురిచేస్తోంది.
ప్రభుత్వంపైనే ఆశలు..
కాన్కూర్ గ్రామస్తులకు, అటవీశాఖ అధికారులకు మాటల యుద్ధం పెరుగుతోంది. మిగులు భూములు తేల్చాకే అటవీశాఖ అధికారులు ఇక్కడి భూముల్లో అడుగు పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రెవెన్యూశాఖ అధికారులను, అటవీశాఖ అధికారులు తప్పుడు రికార్డులతో తప్పుతోవపట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు కాన్కూర్ బ్లాక్ తమవేనని చెబుతుండగా గ్రామస్తులు ప్రభుత్వ భూములు ఉన్నాయని అంటున్నారు.
22 ఏళ్లుగా గ్రామస్తులు శాంతియుతంగా పోరాటం చేస్తున్నారు. ఎప్పుటికైనా భూమి రాకపోతుందా? అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. మిగులు భూమి లెక్కతేలితే కాన్కూర్ గ్రామస్తులతోపాటు మండల ప్రజలకు ప్రయోజనం కలుగనుంది. వివిధ రకాల ప్రభుత్వ భవనాలు ఇక్కడ నిర్మించుకునే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం స్పందించి నిర్ణయం తీసుకుంటే తప్పా కాన్కూర్ గ్రామస్తులకు న్యాయం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
కాన్కూర్‌వాసుల తలరాత మారేనా?
మండలంలోని కాన్కూర్ గ్రామస్తులు మిగులు భూముల కోసం 22 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. గ్రామశివారులోని 151, 152, 154, 185, 171, 201 సర్వే నంబర్లలో సుమారు 1600 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా..106, 107, 136 సర్వే నంబర్లలో ఐదెకరాల వరకు ఉన్న పట్టా భూమిసైతం అటవీశాఖ అధీనంలో ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద కుటుంబాలే. వందమందికి పైగా ప్రభుత్వం ఈ భూముల్లో పట్టాలు ఇచ్చింది. కాని భూవివాదంతో ప్రయోజనం లేకుండాపోతోంది.
పంటలు పండించిండ్రు..
నాటికాలంలో మా తండ్రులు ఈ భూముల్లో పంటలు పండించిండ్రు. అంకన్నపాడ్ చెరువు కింద పంటలు సాగు చేసిండ్రు. కొన్నేళ్ల నుంచి అటవీశాఖ వాళ్లు ఈ భూముల్లోకి రానివ్వడం లేదు. పొట్టకూటి కోసం మా బిడ్డలు పడరాని పాట్లు పడుతుండ్రు. మా భూములు మాకిచ్చి న్యాయం చేయాలి.
– రేగుంట మల్లయ్య, కాన్కూర్
1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4లో ప్రస్తావన..
కాన్కూర్ శివారులోని సర్వే నంబర్ 132/11లో 1481 ఎకరాల భూమి ఉండగా 1969 గెజిట్ ప్రకారం సెక్షన్–4 ద్వారా 797ఎకరాల భూమిని రక్షిత అటవీప్రాంతం పరిగణలోకి తీసుసుకుంటున్నట్లు ప్రస్తావించింది. ఇందులో మిగులు భూమితోపాటు సర్వేనంబర్ 132(పీపీ) 982 ఎకరాలు, 106లో 24 సెంట్లు, 107లో 36సెంట్లు, 136లో 4ఎకరాల 22సెంట్లు అటవీశాఖ అధీనంలో ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
నిజాంకాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన మురళీమనోహర్‌రావుకు 70 ఎకరాలు పట్టా ఉంది. సెక్షన్–4లో ప్రస్తావించిన భూమిపోగా మిగులు భూమి పంపిణీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాని అటవీశాఖ అధికారులు మాత్రం సెక్షన్–4.. సెక్షన్–15తో సమానమని అటవీ ప్రాంతంలో పట్టా భూములుంటే ప్రభుత్వం పరిహారం చెల్లించి వాటిని అటవీశాఖకు అప్పగిస్తుందని చెబుతున్నారు.
తుదిశ్వాస వరకు పోరాటం..
కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ కాన్కూర్ మిగులు భూముల కోసం పోరాటం చేస్తాం. ఒక పక్క ప్రభుత్వం నిరుపేదలకు మూడెకరాల భూమి పంపిణీ చేస్తామని చెబుతున్నా ఇక్కడ భూమి ఉండి దున్నుకోలేక రైతులు అడ్డా కూలీలుగా మారారు.
– బత్తుల శ్రీనివాస్‌యాదవ్, కాన్కూర్ భూ పోరాట సమితి అ«ధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment