ఇలాగేనా రెస్క్యూ? | Forest Department lacks a clear policy and action plan | Sakshi
Sakshi News home page

ఇలాగేనా రెస్క్యూ?

Published Mon, Feb 17 2025 5:05 AM | Last Updated on Mon, Feb 17 2025 5:05 AM

Forest Department lacks a clear policy and action plan

అటవీశాఖకు కొరవడిన స్పష్టమైన విధానం, కార్యాచరణ 

ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్న వైనం 

ఇటీవల నల్లగొండ జిల్లాలో అడవిదున్నను కాపాడటంలో విఫలం

అది అంతరించిపోయే జాతికి చెందినదిగా గుర్తింపు

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ఓ అడవిదున్న తప్పిపోయి వచ్చింది. అయితే దాన్ని సజీవంగా పట్టుకునేందుకు చేసిన రెస్క్యూ ఆపరేషన్‌ విఫలమైంది. పది రోజులపాటు ఈ దున్న కదలికలను ఆ జిల్లా పరిసరాల్లో అటవీశాఖ అధికారులు గుర్తించినా, జీవించి ఉండగా పట్టుకోలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోయే జాతికి చెందిన ఆ అడవిదున్న (ఇండియన్‌ బైసన్‌) మృతి చెందడం పట్ల పర్యావరణవేత్తలు, జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తంచేశారు. 

అరుదైన జంతువులు, వన్య›ప్రాణులను రక్షించాల్సిన అటవీశాఖ సన్నద్ధత, సంసిద్ధత, పరిమితులను ఈ ఘటన స్పష్టం చేస్తోందంటున్నారు. గతంలోనూ ఓ చిరుత, కొన్ని జంతువుల రెస్క్యూలో అటవీ అధికారులు, సిబ్బంది విఫలమైన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. రెస్క్యూలో అటవీశాఖకు ఓ స్పష్టమైన విధానం, కార్యాచరణ లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు, ఆపదలో ఉన్న జంతువులు, వన్యప్రాణులను కాపాడేందుకు, వెంటనే స్పందించేందుకు క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ (క్యూఆర్‌టీ) ఏర్పాటు చేస్తున్నామంటూ గతంలో చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. 

అసలేం జరిగిందంటే..
మేత, నీటికోసం వెతుక్కుంటూ దారితప్పిన దున్న చౌటుప్పల్‌ మండలం చిన్నకోడూరు గ్రామ సరిహద్దుల్లో కొందరికి కనిపించింది. ఎక్కడ జనవాసాల్లోకి వస్తుందోననే భయంతో దాన్ని బైక్‌లు, ఇతర వాహనాలపై నాలుగు గంటలపాటు వెంబడించారు. అప్పటికే ఆకలి, దప్పికతో ఉన్న దున్న పరిగెడుతూ డీ హైడ్రేషన్‌కు గురైంది. నోటి నుంచి నురగలు కక్కుతూ దయనీయస్థితికి చేరింది. 

దాన్ని రక్షించి, వైద్యం అందించి సురక్షిత ప్రాంతానికి తరలించే రెస్క్యూ టీమ్‌ అక్కడికి ఆలస్యంగా చేరుకుంది. వరంగల్‌ జూ నుంచి రెస్క్యూ టీమ్, నెహ్రూ జూపార్కు నుంచి వచ్చిన వెటరేరియన్‌ మత్తుమందు ఇచ్చి దున్నను నిలువరించే ప్రయత్నం చేశారు. వాహనంలోకి ఎక్కించి దానిని చికిత్స కోసం తరలిస్తున్న క్రమంలో అది అప్పటికే చనిపోయినట్టు గుర్తించారు.

ఉన్నవి రెండు బృందాలే..
రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్‌లోని నె హ్రూ జూపార్క్, వరంగల్‌లోని కాకతీయ జూపార్క్‌లో తాత్కాలిక ఏర్పాట్లతో రెండు బృందాలు పనిచేస్తున్నాయి. వీటికి రెస్క్యూ వెహికిల్స్, వెటరేరియన్లు ఉన్నా రు. రాష్ట్రంలో ఎక్కడ వన్యప్రాణులు, అటవీ జంతువులను కాపాడాల్సి వచ్చి నా.. ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటే అక్కడి నుంచి వాహనం, సిబ్బందిని పంపిస్తున్నారు. అయితే ఈ బృందాలు పాత బడిన వాహనాలు, పరికరాలు, సామగ్రి తోపాటు ఏవో తాత్కాలిక పద్ధతులతో నెట్టుకొస్తున్నాయి.
 
ఇప్పుడేం చేయాలి?
»  రాష్ట్రంలో వన్యప్రాణులు, జంతువు లకు సంబంధించి ఎక్కడైనా అనుకో ని సంఘటన లేదా ఆపద ఎదురైనా, అడవుల్లో అగ్నిప్రమాదాల వంటి ఘ టనలు జరిగినా త్వరితంగా స్పందించేలా బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలి. 
»    పాతబడిన వాహనాలను తొలగించి, కొత్త వాహనాలను అందుబాటులోకి తేవాలి. ట్రాంకిలైజర్‌ గన్స్, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచాలి. 
»   రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్‌ చేసేలా రెస్క్యూ బృందాలను ఏర్పాటు చేయాలి. 
» జంతువుల తీరుపై వెటర్నరీ డాక్టర్లకు శిక్షణ ఇచ్చి తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement