![Grape cultivation down in Telangana](/styles/webp/s3/article_images/2025/02/15/grape.jpg.webp?itok=v4Nj9RC8)
నాడు హైదరాబాద్ శివారులో విరివిగా సాగైన ద్రాక్ష
పదేళ్ల క్రితం వరకు పది వేల ఎకరాల్లో సాగు
ప్రస్తుతం గణనీయంగా తగ్గిన పంట విస్తీర్ణం
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 115 ఎకరాలకే పరిమితం
నగర విస్తరణ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూగర్భ జలాలు అడుగంటడం, పెరిగిన సాగు వ్యయంతో తగ్గిపోయిన పంట
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మహేశ్వరం, మన్సాన్‌పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్‌పల్లి, డబిల్‌గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.
సీజన్‌లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.
ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.
నవాబుల కాలంలో..
స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్‌యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్‌లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.
దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్‌కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్‌మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.
‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు.
2005 నుంచి తగ్గుముఖం
దిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది.
మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకే
నేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది.
– కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడ
ఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు
ఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
– చింతల వెంకట్‌రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment