grape farmers
-
‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్పేట్, మహేశ్వరం, మన్సాన్పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్పల్లి, డబిల్గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.సీజన్లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.నవాబుల కాలంలో..స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు. 2005 నుంచి తగ్గుముఖందిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది. మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకేనేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదుఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. – చింతల వెంకట్రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
Red Globe Grapes: ప్రయోగం ఫలించింది..
శింగనమల(అనంతపురం జిల్లా): రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి, ఉద్యాన పంటల సాగుకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో రైతులు సైతం పంటల సాగులో నూతన పంథాను అవలంబిస్తున్నారు. కొత్త రకం పంటల సాగుపై దృష్టి సారించి.. జిల్లాలోనే కాక పొరుగున ఉన్న రాష్ట్రాల్లోనూ ఆ తరహా పంటలపై అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే శింగనమల మండలం గుమ్మేపల్లికి చెందిన రైతు చంద్రప్రకాష్రెడ్డి (బాబు) సరికొత్త ద్రాక్ష రకాన్ని ఎంపిక చేసుకుని ప్రయోగదశలోనే ఆశించిన ఫలితాన్ని సాధించారు. చదవండి: ఏపీ విభజనపై ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు రెడ్గ్లోబ్ ద్రాక్ష పంట ఆస్ట్రేలియా రకం రెడ్ గ్లోబ్ ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాకే పరిమితమైన రెడ్ గ్లోబ్ రకం ద్రాక్షకు అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ ద్రాక్ష రకాన్ని సాగు చేస్తే ఎలా ఉంటుందని రైతు చంద్రప్రకాష్ రెడ్డి భావించారు. అనుకున్నదే తడవుగా రెడ్ గ్లోబ్ సాగు చేస్తున్న రైతుల గురించి ఆరా తీస్తూ కర్ణాటకలోని చిక్కబళ్లాపురానికి వెళ్లారు. అక్కడ ఓ రైతు సాగు చేస్తున్న రెడ్ గ్లోబ్ ద్రాక్షను పరిశీలించారు. 2019లో రూట్స్ తీసుకొచ్చి నాటారు. 2020లో రెడ్గ్లోబ్ అంటు కట్టించారు. ఒక్కొక్క అంటుకు రూ.150 చొప్పున ఖర్చు పెట్టారు. మొత్తం ఆరు ఎకరాల్లో ఆరు వేల అంటు మొక్కలు నాటారు. పందిరి, ఇతర ఖర్చులు అన్నీ కలిపి ఎకరాకు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టాడు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లోనే పండే ఈ రకం పంట జిల్లా వాతావరణ పరిస్థితులను తట్టుకుంటుందో.. లేదోననే అనుమానాలు ఉండేవి. అయితే అనూహ్యంగా పంట ఏపుగా పెరిగి ప్రస్తుతం కోత దశకు వచ్చింది. ఓ ప్రయోగం చేద్దామనుకున్నా.. రెడ్ గ్లోబ్ ద్రాక్ష రకం గురించి తెలియగానే ఎలాగైనా ఈ పంట సాగు చేయాలని అనుకున్నా. చిక్కబళ్లాపురంలో ఈ పంట సాగు చేస్తున్నట్లు తెలుసుకుని అక్కడికెళ్లి చూశాను. ఎర్ర నేలలు అనుకూలమని తెలిసింది. దీంతో నాకున్న 50 ఎకరాల్లో ఓ ఐదు ఎకరాల్లో ప్రయోగం చేద్దామని అనుకున్నా. అంటు మొక్కలు తీసుకొచ్చి ఆరు ఎకరాల్లో నాటాను. పశువుల పేడ ఎరువు వాడాను. దిగుబడి ఆశించిన దాని కన్నా ఎక్కువగానే ఉంది. ఎకరాకు 10 నుంచి 15 టన్నుల వరకూ దిగుబడి వస్తుందని అనుకుంటున్నా.ఈ లెక్కన తొలి కోతలో పెట్టుబడులు చేతికి వస్తే.. ఆ తర్వాత వరుస లాభాలు ఉంటాయి. ఆరు నెలల పాటు పంట కోతలు ఉంటాయి. సాధారణంగా మార్కెట్లో రెడ్ గ్లోబ్ ద్రాక్ష కిలో రూ.300 నుంచి రూ.500 వరకు ధర పలుకుతోంది. అయితే జిల్లాలో సరైన మార్కెటింగ్ వసతి లేకపోవడంతో ముంబయి, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని మార్కెట్కు తరలిస్తున్నా, కిలో రూ.180 నుంచి అమ్ముడుబోతోంది. – చంద్రప్రకాష్రెడ్డి, రైతు, గుమ్మేపల్లి, శింగనమల మండలం -
1,400 హెక్టార్లలో కాంట్రాక్టు సేద్యం
ద్రాక్ష రైతులతో ఎంఅండ్ఎం ఒప్పందం పండించిన పంట విదేశాలకు ఎగుమతి ధర తగ్గినా ఒప్పందం ధర చెల్లింపు అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు అద్దెకు ఈ ఏడాది రాష్ట్ర ట్రాక్టర్ల అమ్మకాల్లో 39% వృద్ధి మహీంద్రా అండ్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ సందీప్ జైస్వాల్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన ద్రాక్షను పండించి ఎగుమతి చేసే విధంగా రాష్ట్రానికి చెందిన ద్రాక్ష రైతులతో మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్ఎం) ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో విజయవంతమైన ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం ఈ ఏడాది రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నట్లు ఎంఅండ్ఎం ఫార్మ్ ఎక్విప్మెంట్ రంగ వైస్ప్రెసిడెంట్ సందీప్ జైస్వాల్ ‘సాక్షి’కి తెలియచేశారు. ఇప్పటికే 1,400 హెక్టార్లకు సంబంధించి వివిధ రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ముందుగా పెద్ద కమతాలపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విత్తనం నాటి, పంట కోసి ఎగుమతి చేసే వరకు తామే పూర్తి బాధ్యతను తీసుకుంటామని, మార్కెట్లో ధరలు తగ్గినా ముందుగా కుదుర్చుకున్న ఒప్పంద ధరనే చెల్లిస్తామన్నారు. ఒక వేళ ధర పెరిగితే వచ్చే లాభాలనుకూడా రైతులకు పంచనున్నట్లు జైస్వాల్ తెలిపారు. గతేడాది దేశం నుంచి అత్యధికంగా, 7,800 టన్నుల ద్రాక్షను బ్రిటన్, యునెటైడ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి చేసి ఎంఅండ్ఎం రికార్డు సృష్టించిందన్నారు. కేవలం ఎగుమతులే కాకుండా ఎంఅండ్ఎం ‘సాబొరో’ బ్రాండ్ పేరుతో దేశంలో వివిధ రకాల పండ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. ‘సమృద్ధి’తో వ్యవసాయ సేవలు రైతులకు ‘సమృద్ధి’ పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు. అతి తక్కువ ధరకే భూసార, నీటి పరీక్షలు, అలాగే పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తారని, ఇందుకు వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అమెరికాకు చెందిన ఒక సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 సమృద్ధి కేంద్రాలున్నాయని, ఏటా వీటి సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల పాయింట్లలో ఈ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,500మంది డీలర్లు ఉండగా ఇప్పటి వరకు వీటిలో 160 సమృద్ధి కేంద్రాలుగా మార్చామని, ఏటా వీటిని 50 సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమన్నారు. కేంద్రాల నుంచి రైతులకు అవసరమైన అత్యాధునిక పనిముట్లను అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు. కూలీలు దొరకడం కష్టం అవుతుండటంతో యంత్రాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 100 హెక్టార్లకు 5-7 ట్రాక్టర్లు ఉంటే అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 25 ట్రాక్టర్లు ఉన్నాయని, మన దేశంలో యంత్రాలతో చేస్తున్న వ్యవసాయం 19 శాతంగా ఉన్నట్లు జైస్వాల్ తెలిపారు. రెండేళ్ళు ఇలానే ట్రాక్టర్ల అమ్మకాలు ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో రికార్డుస్థాయిలో ట్రాక్టర్ల అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,000కు పైగా ట్రాక్టర్లను (39% వృద్ధి) విక్రయించినట్లు తెలిపారు. ఈ ఏడాది పంటలు బాగుండటంతో వచ్చే రెండేళ్ళు అమ్మకాలు ఇదే విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు జైస్వాల్ వివరించారు. గతేడాదితో పోలిస్తే దేశం మొత్తం మీద ఈ ఏడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదైతే ఎంఅండ్ఎం 25.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.