1,400 హెక్టార్లలో కాంట్రాక్టు సేద్యం | mahindra and mahindra MoU with andhra pradesh farmers | Sakshi
Sakshi News home page

1,400 హెక్టార్లలో కాంట్రాక్టు సేద్యం

Published Fri, Nov 15 2013 2:48 AM | Last Updated on Mon, Oct 8 2018 7:58 PM

1,400 హెక్టార్లలో కాంట్రాక్టు సేద్యం - Sakshi

1,400 హెక్టార్లలో కాంట్రాక్టు సేద్యం

  • ద్రాక్ష రైతులతో ఎంఅండ్‌ఎం ఒప్పందం
  •      పండించిన పంట విదేశాలకు ఎగుమతి
  •      ధర తగ్గినా ఒప్పందం ధర చెల్లింపు
  •      అత్యాధునిక వ్యవసాయ పనిముట్లు అద్దెకు
  •      ఈ ఏడాది రాష్ట్ర ట్రాక్టర్ల అమ్మకాల్లో 39% వృద్ధి
  •      మహీంద్రా అండ్ మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ సందీప్ జైస్వాల్
  • హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాణ్యమైన ద్రాక్షను పండించి ఎగుమతి చేసే విధంగా రాష్ట్రానికి చెందిన ద్రాక్ష రైతులతో మహీంద్రా అండ్ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్రలో విజయవంతమైన ఈ కాంట్రాక్ట్ వ్యవసాయం ఈ ఏడాది రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నట్లు ఎంఅండ్‌ఎం ఫార్మ్ ఎక్విప్‌మెంట్ రంగ వైస్‌ప్రెసిడెంట్ సందీప్ జైస్వాల్ ‘సాక్షి’కి తెలియచేశారు. ఇప్పటికే 1,400 హెక్టార్లకు సంబంధించి వివిధ రైతులతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ముందుగా పెద్ద కమతాలపై దృష్టిసారిస్తున్నట్లు ఆయన తెలిపారు. విత్తనం నాటి, పంట కోసి ఎగుమతి చేసే వరకు తామే పూర్తి బాధ్యతను తీసుకుంటామని, మార్కెట్లో ధరలు తగ్గినా ముందుగా కుదుర్చుకున్న ఒప్పంద ధరనే చెల్లిస్తామన్నారు. ఒక వేళ ధర పెరిగితే వచ్చే లాభాలనుకూడా రైతులకు పంచనున్నట్లు జైస్వాల్ తెలిపారు. గతేడాది దేశం నుంచి అత్యధికంగా, 7,800 టన్నుల ద్రాక్షను బ్రిటన్, యునెటైడ్ ఎమిరేట్స్ దేశాలకు ఎగుమతి చేసి ఎంఅండ్‌ఎం రికార్డు సృష్టించిందన్నారు. కేవలం ఎగుమతులే కాకుండా ఎంఅండ్‌ఎం ‘సాబొరో’ బ్రాండ్ పేరుతో దేశంలో వివిధ రకాల పండ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే.
     
     ‘సమృద్ధి’తో వ్యవసాయ సేవలు
     రైతులకు ‘సమృద్ధి’ పేరుతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు జైస్వాల్ తెలిపారు. అతి తక్కువ ధరకే భూసార, నీటి పరీక్షలు, అలాగే పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాస్త్రవేత్తలు సూచనలు ఇస్తారని, ఇందుకు వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అమెరికాకు చెందిన ఒక సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 సమృద్ధి కేంద్రాలున్నాయని, ఏటా వీటి సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. 2020 నాటికి దేశవ్యాప్తంగా ఉన్న డీలర్ల పాయింట్లలో ఈ సమృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,500మంది డీలర్లు ఉండగా ఇప్పటి వరకు వీటిలో 160 సమృద్ధి కేంద్రాలుగా మార్చామని, ఏటా వీటిని 50 సమృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నది లక్ష్యమన్నారు.  కేంద్రాల నుంచి రైతులకు అవసరమైన అత్యాధునిక పనిముట్లను అద్దెకు ఇస్తున్నట్లు తెలిపారు. కూలీలు దొరకడం కష్టం అవుతుండటంతో యంత్రాలకు డిమాండ్ పెరిగిందన్నారు. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 100 హెక్టార్లకు 5-7 ట్రాక్టర్లు ఉంటే అదే అభివృద్ధి చెందిన దేశాల్లో 25 ట్రాక్టర్లు ఉన్నాయని, మన దేశంలో యంత్రాలతో చేస్తున్న వ్యవసాయం 19 శాతంగా ఉన్నట్లు జైస్వాల్ తెలిపారు.
     
     రెండేళ్ళు ఇలానే ట్రాక్టర్ల  అమ్మకాలు
     ఈ ఏడాది వర్షాలు బాగా పడటంతో రికార్డుస్థాయిలో ట్రాక్టర్ల అమ్మకాలు జరుగుతున్నాయని, ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో 12,000కు పైగా ట్రాక్టర్లను (39% వృద్ధి) విక్రయించినట్లు తెలిపారు. ఈ ఏడాది పంటలు బాగుండటంతో వచ్చే రెండేళ్ళు అమ్మకాలు ఇదే విధంగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు జైస్వాల్ వివరించారు. గతేడాదితో పోలిస్తే దేశం మొత్తం మీద ఈ ఏడాది ట్రాక్టర్ల అమ్మకాల్లో 25 శాతం వృద్ధి నమోదైతే ఎంఅండ్‌ఎం 25.5 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement