
ముంబయి: అత్యాధునిక భద్రతా,నిఘా సాంకేతికత అభివృద్ధి చేయడంలో పేరుగాంచిన అమెరికాకు చెందిన అండ్యూరిల్ గ్రూపుతో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకున్నట్లు మహీంద్రా అండ్ మహీంద్రా(ఎమ్‌అండ్‌ఎమ్) కంపెనీ తెలిపింది. అండ్యూరిల్ గ్రూపు సహకారంతో కృత్రిమమేధ (ఏఐ) ఆధారంగా నడిచే అటానమస్ (స్వయం ప్రతిపత్తి) మారిటైమ్ సిస్టమ్స్, కౌంటర్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్(సీయూఎస్‌ఎస్) సొల్యూషన్స్, నెక్స్ట్ జనరేషన్ కమాండ్ అండ్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్‌లు తయారు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది.

ఈ అత్యాధునిక సాంకేతికతో ప్రాంతీయ భద్రత మరింత పటిష్టమవుతుందని పేర్కొంది. ఇంతేగాక మాడ్యులార్ అటానమస్ అండర్‌వాటర్ వెహికిల్స్(ఏయూవీ)లను అభివృద్ధి చేసేందుకు అండ్యూరిల్‌తో కుదిరిన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్‌అండ్‌ఎమ్ తెలిపింది.
సముద్ర తీర ప్రాంత భద్రత,నిఘాకు ఏయూవీలు ఎంతగానో ఉపయోగపడతాయని,ఏయూవీలతో జలాల లోపల మోహరించే ఆయుధ సంపత్తి మరింతగా పెరుగుతుందని పేర్కొంది. ఇవే కాకుండా డ్రోన్ దాడులను గర్తించి నిర్వీర్యం చేసే సీయూఏఎస్ సాంకేతికత అభివృద్ధి కోసం రెండు కంపెనీలు పనిచేస్తాయని తెలిపింది.

డ్రోన్‌లతో పెరిగిన వైమానక దాడుల ముప్పును అరికట్టడంలో సీయూఏఎస్ సాంకేతికత దోహద పడుతుందని వెల్లడించింది.రక్షణ నిఘా వ్యవస్థల్లో వాడే పలు రకాల సెన్సార్ సాంకేతికతలన్నింటిని కలిపి సెన్సార్ ఫ్యూజన్ ప్లాట్‌ఫాం అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు పనిచేస్తాయని ఎమ్‌అండ్‌ఎమ్ తెలిపింది.
భద్రత పరంగా ముంచుకొస్తున్న ముప్పును అత్యాధునిక సాంకేతికతో ఎదుర్కొనేందుకు రెండు కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందం ఉపయోగపడుతుందని ఎమ్‌అండ్‌ఎం గ్రూపు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్ వినోద్ సహాయ్ తెలిపారు.

ప్రస్తుతం డ్రోన్‌లు, మానవరహిత ఆయుధాల ద్వారా ఎదురువుతున్న భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోవడానికి స్వయం ప్రతిపత్తి కలిగిన సాంకేతిక వ్యవస్థలు ఎంతో ముఖ్యమని అండ్యూరిల్ గ్రూపు సీనియర్ వైఎస్ ప్రెసిడెంట్ గ్రెగ్ కాస్నర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment