security systems
-
ఇది విజయమా... వైఫల్యమా?
చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది. మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది. అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా? విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు. లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది. ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది. సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా? -
ఇంటర్ బోర్డు భద్రత వ్యవస్థ ట్యాంపర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు. ఆన్లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు. పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు. గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు. -
విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళనలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్వర్క్)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయ గల ముఖాల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్ వేర్‌ను వినియోగించనుంది. అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్ బ్రౌజర్ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్‌లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్వర్క్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ ఆధ్వర్య ంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్ లలో హైటెక్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడు తున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్‌టెల్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు? రైల్వేస్టేషన్లలోకి వచ్చే/వెళ్లే మార్గాలు, ప్లాట్ ఫామ్‌లు, వెయిటింగ్ హాళ్లు, ప్రయాణి కుల వంతెనలు, బుకింగ్ కార్యాలయాలు, పార్కింగ్ ప్రాంతాలు, ఇతర కీలక స్థలాల్లో ఇవి ఏర్పటవుతాయి. రైల్వే ఆవరణలను వీలైనంత మేర నిఘా పరిధిలోకి తెచ్చేలా డోమ్, బుల్లెట్, పాన్ టిల్ట్, అల్ట్రా హెచ్డీ–4కే రకాల ఐపీ కెమెరాలను వినియోగిస్తారు. ఉపయోగం ఏమిటి? ఈ సీసీటీవీ కెమెరా వ్యవస్థ ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల ద్వారా అనుసంధానమై ఉంటుంది. వాటి నుంచి అధీకృత సిబ్బంది ఫోన్ నంబర్లకు కూడా లింక్ ఉంటుంది. అలారంతో ఈ వ్యవస్థను జోడిస్తారు. సీసీ కెమెరాలు రికార్డు చేసే ఆయా చిత్రాలలోని వ్యక్తులు ఇప్పటికే పోలీసుల బ్లాక్‌లిస్టులో ఉన్న వారి చిత్రాలతో సరిపోలితే సంబంధిత అధికారుల ఫోన్లకు (లింక్ అయినవాటికి), అధీకృత కేంద్రాలకు హెచ్చ రికలు వెళ్తాయి. అలాగే ప్రతి ప్లాట్‌ఫామ్ వద్ద రెండు ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేస్తారు. ఆపదలో ఉన్న వారు/అవసరమైన వారు ఈ బటన్ నొక్కగానే వారి మొహాన్ని సీసీ కెమెరాలు క్లోజ్అప్లో బంధిస్తాయి. అక్కడి పరిసరాలను కూడా వీడియో తీస్తాయి. సంబంధిత అధి కారుల ఫోన్లకు, కేంద్రాలకు హెచ్చ రికలు, పంపుతాయి. అలా రం మోగటం ద్వారా స్టేషన్లలోని సిబ్బంది సులభంగా అప్రమత్త మయ్యేందుకు వీలు కలుగుతుంది. అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే వాటిని ఎదుర్కోవడంలో రైల్వే పోలీసులు, ఇతర సిబ్బంది మరింత సన్నద్ధంగా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. సంబంధిత ఆర్పీఎఫ్, కంట్రోల్ రూమ్‌లలో వీడియో ఫుటేజీని 30 రోజుల వరకు భద్రపరచవచ్చు. ఒక స్టేషన్లో రికార్డయిన దృశ్యాలను ఆ స్టేషన్లోనే కాకుండా డివిజినల్, జోనల్ స్థాయిలోని సీసీటీవీ కంట్రోల్ రూమ్‌లలో కూడా విశ్లేషించొచ్చు. రాష్ట్రంలో హైటెక్ కెమెరాల నిఘా ఉండే స్టేషన్లు ఇవే.. ఓయూఆర్ట్స్ కాలేజీ, డబీర్‌పురా, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, జామియా ఉస్మానియా, మలక్‌పేట, సీతాఫల్మండి, విద్యానగర్, యాఖుత్పురా, భరత్‌నగర్, బోరబండ, చందానగర్, ఫతేనగర్, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, జేమ్స్‌స్ట్రీట్, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నేచర్‌క్యూర్ హాస్పిటల్, నెక్లెస్‌రోడ్, సంజీవయ్య పార్క్, లింగంపల్లి, కాచిగూడ, బేగంపేట, వరంగల్, భద్రాచలం రోడ్, కాజీపేట, ఖమ్మం, మహబూబాద్, మంచిర్యాల, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్, తాండూరు, వికారాబాద్, బాసర, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. -
ఎయిర్ ఇండియా వన్ వచ్చేసింది
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం తరహాలోనే మన దేశంలో వీవీఐపీలు ప్రయాణించడం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఎయిర్ ఇండియా వన్ అమెరికా నుంచి భారత్‌కి చేరుకుంది. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ కలిగిన బోయింగ్–777 విమానం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ విమానం చేరుకున్నట్టు పౌర విమానయాన శాఖ అధికారులు వెల్లడించారు. ఈ విమానంలో ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య మాత్రమే ప్రయాణిస్తారు. వీవీఐపీలు ప్రయాణించడానికి వీలుగా డిజైన్ చేసి , క్షిపణి దాడుల్ని తట్టుకునే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేసి ఆధునీకరించడం కోసం రెండు విమానాల్ని డల్లాస్‌లో బోయింగ్ సంస్థకి పంపారు. వీటిలో ఒకటి భారత్‌కు వచ్చింది. రెండో విమానం మరో రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఈ విమానంపై భారత్ అనే అక్షరాలు, అశోక చక్రం ఉన్నాయి. గత జూలైలోనే ఈ విమానాలు భారత్‌కు చేరుకోవాల్సి ఉండగా కరోనా వైరస్, సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యమైంది. గడిచిన 25 సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఎయిర్ఇండియా వన్ కాల్ సైన్‌తో బోయింగ్ 747 విమానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రత్యేకతలివీ ► ఎయిర్ ఇండియా వన్ విమానంలో భద్రతా వ్యవస్థ అమెరికా అధ్యక్షుడి విమానం ఎయిర్ ఫోర్స్ వన్‌కి ఏ మాత్రం తీసిపోదు. ఈ విమానానికి క్షిపణి దాడుల్ని ఎదుర్కొనే రక్షణ వ్యవస్థ ఉంది. లార్జ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్‌ఫ్రేర్డ్ కౌంటర్‌మెజర్స్ (ఎల్ఏఐఆర్సీఎం), సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ (ఎస్పీఎస్)ను అమర్చారు. ► అమెరికా అధ్యక్ష విమానం తర్వాత మన ఎయిర్ ఇండియా వన్‌లోనే ఎస్‌పీఎస్‌ను అమర్చారు. ఈ రక్షణ వ్యవస్థతో శత్రువుల రాడార్ ఫ్రీక్వెన్సీని జామ్ చెయ్యగలదు. క్షిపణుల్ని దారి మళ్లించగలదు. ► అమెరికా నుంచి భారత్ మధ్య ప్రయాణం ఎక్కడా ఆగకుండా చేయవచ్చు. ఇంధనం నింపడానికి కూడా ఆగాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం వాడుతున్న విమానంలో పది గంటల తరువాత మళ్లీ ఇంధనం నింపవలసివస్తుంది. కొత్త విమానం గంటకు 900 కి.మీ. వేగంతో ప్రయాణిస్తుంది. ► విమానంలో ప్రధాని కార్యాలయం, సమావేశాల నిర్వహణకు పెద్ద హాలు ఉన్నాయి. ఈ లోహ విహంగం ఫూర్తి స్థాయి ఫ్లయింగ్ కమాండ్ సెంటర్ మాదిరి పనిచేస్తుంది. ► ఈ విమానాల తయారీకి రూ.8,400 కోట్లు ఖర్చు అయింది. ► ఈ విమానాలను ఎయిర్ ఇండియా పైలట్లు నడపరు. భారత వాయుసేనకి చెందిన పైలట్లు నడుపుతారు. ► ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్)కు ఈ రెండు విమానాల నిర్వహణ బాధ్యతల్ని అప్పగించారు. -
ప్రధాని భద్రత బడ్జెట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)’కి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 600 కోట్లను కేటాయించడంపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్లకు కల్పించిన ఎస్పీజీ భద్రతను గత సంవత్సరం కేంద్రం ఉపసంహరించింది. ప్రధాని, ఆయన అధికార నివాసంలో ఆయనతో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కల్పించేలా ఇటీవల ఎస్పీజీ చట్టంలో సవరణ చేశారు. రూ.600కోట్ల కెటాయింపుపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. ‘ప్రధాని మోదీ ‘ఫకీరీ’ దేశ ఖజానాపై రోజుకు రూ. 1.62 కోట్ల భారం మోపుతోంది’ అని అఖిల భారత మహిళాకాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జేఎన్‌యూలో 8 వేల మంది విద్యార్థులు న్నారు. వారిపై ప్రభుత్వం గ్రాంట్లు, సబ్సీడీల పేరుతో ఏటా రూ. 400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఒక స్వయం ప్రకటిత ఫకీరు భద్రత ఖర్చు ఏటా రూ. 563 కోట్లా?’ అని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీ భద్రతకు అయ్యే ఖర్చు తగ్గించండి. మీ దుబారాతో ఖజానా ఖాళీ అవుతోంది. మీరొక ఫకీరు. సింపుల్ మ్యాన్. భద్రతను పక్కనబెట్టి స్వేచ్ఛగా తిరగండి’ అని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘ప్రధాని భద్రత ఖర్చు ఏడాదికి రూ. 592 కోట్లు అంటే.. రోజుకు రూ. 1.62 కోట్లు. గంటకు రూ. 6.75 లక్షలు. నిమిషానికి రూ. 11,263’ అని మరో యూజర్ ట్విట్టర్లో లెక్కలు గట్టాడు. -
సేఫ్‌లో టోక్యో టాప్
న్యూఢిల్లీ: ప్రపంచంలోని సురక్షితమైన నగరాలు–2019 జాబితాలో ఆసియా–పసిఫిక్ ప్రాంతం ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. టాప్–10లో ఆరు ర్యాంకులను ఈ ప్రాంతంలోని నగరాలే చేజిక్కించుకున్నాయి. జపాన్ రాజధాని టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. అయితే ఈసారి అగ్రరాజ్యం అమెరికా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ.. తొలిసారి టాప్–10లోకి దూసుకొచ్చింది. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. ముంబై 45వ స్థానంలో.. ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి. ప్రపంచంలోని సురక్షితమైన నగరాల జాబితా–2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ గురువారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్–60 సిటీలతో ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. దీని ప్రకారం.. నిరసనకారుల ఆందోళనలతో అట్టుడికిపోతున్న హంకాంగ్ 2017లోని తన 9వ ర్యాంకుని కోల్పోయి.. 20వ స్థానానికి పడిపోయింది. ఇక ఆసియా–పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని చెప్పారు. ఆసియా నుంచి ఢాకా(బంగ్లాదేశ్), కరాచీ(పాకిస్తాన్), యంగూన్(మయన్మార్)లు వరుసగా 56, 57, 58 ర్యాంకుల్లో ఉన్నాయి. -
మార్కెట్లోకి 2019 ‘రెనో కాప్చర్’
ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్యూవీ ‘కాప్చర్’ మోడల్లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్ రూపొందినట్లు తెలిపింది. ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ (ఈబీడీ)తో కూడిన అత్యున్నత బ్రేకింగ్ వ్యవస్థ (ఏబీఎస్), బ్రేక్ అసిస్టెన్స్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్, డ్రైవర్ పక్కన వ్యక్తి సీట్ బెల్ట్ రిమైండర్, రెండు ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నట్లు తెలిపింది. -
ఏవోబీలో ఎర్రజెండా!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రలో విస్తరించిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)ను కంచుకోటగా చేసుకుని ఉద్యమాన్ని సాగిస్తున్న మావోయిస్టులు ఒకానొక సమయంలో తమ ఉనికిని చాటుకోవాల్సిన దుస్థితి నుంచి ఏకంగా ఒక శాసనసభ్యుడిని, మరో మాజీ ఎమ్మెల్యేను చంపే స్థాయికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఏవోబీలో ఎర్రజెండాపై ‘సాక్షి’ కథనం. భద్రతా విధానాల్లో మార్పులు: మావోయిస్టుల భద్రతా విధానాలు పకడ్బ్డందీగా ఉంటాయి. ఏవోబీకి కేంద్ర కమిటీ సభ్యులు వచ్చినప్పుడు, పోలీసులు తమ శిబిరాలపై దాడులు చేసినప్పుడు మావోయిస్టులు మూడంచెల భద్రతా విధానాన్ని అనుసరిస్తుంటారు. దానిలో లోపాలపై ముఖ్య నేతలు కొంత కాలం క్రితం సమీక్ష చేశారు. కొత్త వ్యూహం ప్రకారం.. డెన్‌లో కొందరు ఉంటే 25 మంది వరకు రక్షణ సెంట్రీల మాదిరిగా నాలుగు వైపులా ఉంటారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు: మారుతున్న కాలానికనుగుణంగా మావోయిస్టులు కూడా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఏవోబీలో చెడ్డా భూషణం గురించి తెలియని వారుండరు. అతను ఉద్యమంలో ఉన్నంత వరకు సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉండేది. అతను పట్టుబడ్డాక కుడుముల రవి, చలపతి వంటి వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాచార మార్పిడి కోసం ఉపయో గించారు. అలాగే తమకు అవసరమయ్యే ఆయుధాలను, ఆయుధ తయారీ సామగ్రిని మన్యంలో వ్యాపారాలు, కాంట్రాక్టు పనులు చేసే వారి నుంచే సమకూర్చుకుంటున్నారనే విషయం చాలా కాలం క్రితమే బయటపడింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్, ఒడిశా నుంచి మావోయిస్టులను రప్పించి కేడర్‌ను పెంచుకోవడంతోపాటు అగ్రనాయకత్వంలో మార్పులు చేశారు. సరికొత్త విధానాలు సాధారణంగా మావోయిస్టులు సమాచార మార్పిడికి సంప్రదాయ పద్ధతులనే ఎక్కువగా ఆచరిస్తుంటారు. ముఖ్యంగా కోడ్ భాషలోనే వారి ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఆధునిక సాంకేతిక సమాచార వ్యవస్థ అందుబాటులోకి వచ్చి కోడ్ భాషకు బదులు వాకీ టాకీలు, వైర్లెస్ పరికరాలు, స్మార్ట్ సెల్ఫోన్లు వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మావోయిస్టుల స్థావరాలను పోలీసులు సులభంగా కనిపెట్టగలుగుతున్నారు. ఒకప్పుడు మీడియాకు సమాచారం చెప్పాలంటే విలేకరులను అడవిలోకి తీసుకువెళ్లి మాట్లాడే వారు.కానీ ఇప్పుడు సీడీలు చేసి మరీ పంపిస్తున్నారు. దళపతి.. చలపతి అనంతపురం జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా ఉండేవారు. ఆయనే ఇప్పుడు మావోయిస్టు పార్టీకి ఏవోబీలో దళపతి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆంధ్రా–ఒడిశా బోర్డర్ (ఏవోబీ) ఇన్చార్జ్గా ఉన్నారు. ఇటీవలే జాంబ్రిని ఎన్కౌంటర్ చేసిన పోలీసులు చలపతిని టార్గెట్ చేశారు. కొరుకొండ ఏరియా కమిటీకి ఒకప్పుడు పట్టున్న ప్రాంతమైన అన్నవరం ప్రాంతంలో కొద్ది కాలంగా మావోయిస్టుల కదలికలు తగ్గాయి. డిప్యూటీ కమాండర్ వంతల మల్లేష్ లొంగుబాటుతో పోలీసుల దృష్టి ఈ ప్రాంతం నుంచి పక్కకు మళ్లడంతో చలపతి ఈ ప్రాంతాన్ని షెల్టర్ జోన్‌గా మార్చుకున్నాడని తెలుసుకుని పోలీసులు చేసిన దాడిలో అతను తప్పించుకున్నాడు. -
తిరుమల భద్రతలో రాజీపడొద్దు
► అత్యాధునిక పరికరాలు తెప్పించుకోండి ► టీటీడీ భద్రతాధికారులతో ఈఓ సింఘాల్ ఆదేశం తిరుపతి అర్బన్ : తిరుమల పుణ్యక్షేత్రం తో పాటు యాత్రికులకు భద్రత కల్పించడంలో రాజీ పడొద్దని టీటీడీ భద్రతాధికారులకు ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ సూచించారు. వివిధ భద్రతాపరమైన అంశాలపై గురువారం ఆయన తిరుపతి పరిపాలనా భవనంలో సీవీఎస్ఓ రవి కృష్ణ, ఇతర అధికారులతో సమీక్షించారు. ఈఓ మాట్లాడుతూ భక్తుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని తిరుపతి, తిరుమలలో ఉన్నతమైన భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు. శ్రీవారి ఆలయం, ఘాట్ రోడ్లు, నడక మార్గాలు, తిరుపతిలోని టీటీడీ సంస్థల్లో భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన భద్రతా పరికరాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ప్రధానంగా అలిపిరి టోల్గేట్ చెక్ పాయింట్, అలిపిరి, శ్రీవారిమెట్టు నడక మార్గాల్లో ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ కలిగిన అధునాతన సీసీ కెమెరాలు, టీవీలు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం ఉన్న సీసీ టీవీల్లో అప్‌గ్రేడ్ చేయాల్సినవి, పూర్తిగా మార్పు చేయాల్సిన వాటి వివరాలను రూపొం దించుకోవాలని సూచించారు. భద్రతా పరికరా ల నాణ్యతను పరిశీలించేందుకు నోయిడా నుంచి భద్రతా నిపుణులను రప్పించాలన్నారు. వాటికి అనుసంధానించే సాంకేతిక పరిజ్ఞానం అంశంలో హెచ్‌సీఎల్ సంస్థ ప్రతినిధుల సహకారం తీసుకోవాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల్లోపు సీసీ టీవీల ఏర్పాటు తిరుమలలో అధునాతన సీసీ టీవీలు బ్రహ్మోత్సవాల్లోపు ఏర్పాటు చేయాలని ఈఓ సింఘాల్ ఆదేశించారు. సీసీ టీవీలు, ఇతర భద్రతా పరికరాలను సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలన్నారు. తద్వారా నిరంతరం తిరుమల భద్రతను పర్యవేక్షించేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1లో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్(డీఎఫ్ఎండీ) పరికరాలు, అత్యాధునిక లగేజీ స్కానర్లు త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. భద్రతా పరికరాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. టీటీడీ తిరుమల జేఈఓ శ్రీనివాస రాజు, హెచ్‌సీఎల్ మేనేజర్ సాయికృష్ణ, పలు వురు భద్రతాధికారులు పాల్గొన్నారు.