చరిత్ర సృష్టించటం మంచిదే. కానీ ఆ చరిత్ర తరతరాలు చెప్పుకొనేలా వుండాలి. ఈ నెల 4న ప్రారంభమై ఎజెండా అంశాలన్నీ పూర్తికావటంతో ఒకరోజు ముందు గురువారం నిరవధిక వాయిదా పడిన పార్లమెంటు సమావేశాలు ఫలవంతమయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. లోక్‌సభ వరకూ చూస్తే ఈ సమావేశాలు దాదాపు 62 గంటలు సాగాయి. అత్యంత కీలకమైన 18 బిల్లులు చర్చల అనంతరం ఆమోదం పొందాయి. ఇందులో భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధారాల చట్టం స్థానంలో కొత్త చట్టాలుగా వస్తున్న భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులున్నాయి. టెలికమ్యూనికేషన్ల బిల్లువుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ల నియామకాల బిల్లుంది. వార్తాపత్రికల, మేగజిన్‌ల కొత్త రిజిస్ట్రేషన్ చట్టం తాలూకు బిల్లు కూడావుంది.
మొత్తంగా లోక్‌సభ 74 శాతం ఉత్పాదకతను చూపింది. రాజ్యసభ సైతం 17 బిల్లుల్ని ఆమోదించింది. సమావేశాలు 65 గంటల పాటు సాగాయి. దాని ఉత్పాదకత రేటు 79 శాతం వుంది. ఈ 17వ లోక్‌సభకు సంబంధించిఇవి 14వ సమావేశాలు. వీటన్నిటా ఈ సమావేశాలే అత్యంత ఫలవంతమైనవని గణాంకాలు వివరి స్తున్నాయి. వచ్చే సాధారణ ఎన్నికల్లోగా మరో సమావేశం మాత్రమే జరుగుతుంది. అందులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టడం మినహా మరే ఇతర కార్యకలాపాలూ వుండకపోవచ్చు. అయితే బాధాకరమైన అంశమేమంటే... ఈ ప్రధాన బిల్లుల చర్చల్లో దాదాపుగా విపక్షం లేదు. ఇరవైరెండేళ్ల నాటి చేదు అనుభవాన్ని గుర్తుకు తెస్తూ ఈనెల 13న యువకులు పదడుగుల ఎత్తునున్న ప్రేక్షకుల గ్యాలరీ నుంచి కిందకు దూకి పొగగొట్టాలు వదిలి దిగ్భ్రమపరిచారు. పార్లమెంటువెలుపల సైతం అదే సాగింది.
అమెరికాలో వున్న ఖలిస్తానీ తీవ్రవాది పన్నూ పార్లమెంటుపై దాడిచేస్తామని అంతకు చాలారోజులముందే బెదిరించాడు. అప్రమత్తంగా వుండాలని ఇంటెలిజెన్స్ వర్గాలు సైతం సూచించాయి. అయినా పార్లమెంటు భద్రత వ్యవహారాలు చూసే వ్యవస్థ నిద్రాణమై వుంది. దాడి జరిగి పదిరోజులు గడుస్తున్నా దానికి సూత్రధారులెవరో ప్రజలకు తెలియలేదు. 2001 దాడినుంచి భద్రతా వ్యవస్థలు ఏ గుణపాఠమూ నేర్చుకోలేదని ఈ పరిణామం తెలియజేసింది. ఇదిగాక దేశాన్ని ఆశ్చర్యపరిచిన ఘటన మరొకటుంది. అది తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సభా బహిష్కరణ. ఇన్ని చేదు ఉదంతాల మధ్య సమావేశాలు ఫలవంతంగా జరిగాయని అనుకోగలమా?
విపక్షాలు పాలకులను నిలదీయటం, అర్థవంతమైన చర్చల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం. తమ సూచనలనూ, సలహాలనూపట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించే ప్రభుత్వానికి మూకుమ్మడిగా తమ అసమ్మతిని తెలియ జేయటానికి వాకౌట్ ఒక ఆయుధం. తగిన జవాబిచ్చినా విపక్ష సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నినాదాలు చేస్తున్నారని, ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారని, అధ్యక్ష స్థానాన్ని కించపరుస్తున్నారని, దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని భావించినప్పుడు అందుకు కారకులైనవారిపై సస్పెన్షన్ వేటు వేయటం కూడా కొత్తేమీ కాదు. కానీ అటువంటి ఉదంతాలు రాను రాను పెరుగుతుండటం, రివాజుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. ఈసారి ఉభయ సభలనుంచీ 146 మంది ఎంపీలు సస్పెండయ్యారు.
లోక్‌సభలోకి యువకులు చొరబడటంపై ప్రధాని, హోంమంత్రి ప్రకటన చేయాలంటూ సభలో ఆందోళన నిర్వహించటం, వెల్‌లోకి వెళ్లి ప్లకార్డులు ప్రదర్శించటం కారణంగా ఈ సస్పెన్షన్లు చోటుచేసుకున్నాయి. కొందరు ఎంపీలపై సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు వెళ్లింది. దేశం మొత్తాన్ని దిగ్భ్రమలో పడేసిన ఉదంతంపై ప్రకటన చేసే విషయంలోకేంద్రం ఎందుకంత పట్టుదలకు పోయిందో ఆశ్చర్యం కలిగిస్తుంది. లోక్‌సభలో దాడిచేసిన ఉదంతంపై ప్రకటన చేసినంత మాత్రాన విపక్షాలకు లొంగిపోయినట్టు కాదు... సంప్రదాయ విరుద్ధం అసలే కాదు. ఈ ఉదంతం వెనక ఏ శక్తులున్నాయో, వారి ఉద్దేశాలేమిటో వివరించటం వల్ల, తదనంతరం తీసుకున్న పటిష్ట చర్యలేమిటో చెప్పటంవల్ల దేశ ప్రజలకు సాంత్వన కలుగుతుంది.
ఈ సస్పెన్షన్ల పర్యవసానంగా అత్యంత కీలకమైన బిల్లులపై విపక్షం ఆలోచనలేమిటో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. ఉదాహరణకు ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయసంహిత బిల్లు పోలీసులకు తగినంత జవాబుదారీతనం ఇవ్వకుండానే వారికి విస్తృతాధి కారాలు కట్టబెడుతున్నదని నిపుణులంటున్నారు. సీఆర్‌పీసీ స్థానంలో తెచ్చిన భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో ఏ చర్య ఉగ్రవాదమో, ఏది కాదో నిర్ణయించే అధికారాన్ని పోలీసులకు ఇచ్చారు. దీన్ని న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని విపక్షాలంటున్నాయి. ఇక టెలికాం బిల్లు అంశానికొస్తే జాతీయ భద్రతా ప్రయోజనాల కోసమంటూ తాత్కాలికంగా టెలికాం సర్వీసుల్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొనేందుకు అది వీలుకల్పిస్తోంది.
సీఈసీ, ఈసీల నియామకం సంగతి సరేసరి. వీటన్నిటిపైనా లోతైన చర్చ సాగొద్దా? పౌరుల్లో తలెత్తిన సందేహాలకు సమాధానాలు దొరకాల్సిన అవసరం లేదా? కనీసం అందుకోసమైనా విపక్షాల సస్పెన్షన్లు ఎత్తివేసివుంటే పాలకపక్షం పెద్ద మనసు వెల్లడయ్యేది. గత దశాబ్దం వరకూ రాజీవ్‌గాంధీ హయాంలో 66 మంది ఎంపీల సస్పెన్షనే రికార్డుగా నమోదైతే, ఈసారి ఆ సంఖ్య 146కి ఎగబాకటం ఆందోళనకరం. సమావేశాల అంతరా యానికి కారకులెవరన్న అంశాన్నలా వుంచితే... సమన్వయంతో, సదవగాహనతో మెలగి పార్లమెంటరీ వ్యవస్థ ఔన్నత్యాన్ని నిలబెట్టడం ఇరుపక్షాల బాధ్యత కాదా?
Comments
Please login to add a commentAdd a comment