లోక్‌సభలో జమిలి బిల్లులు | One nation one election bills introduced in Lok Sabha: 269 MPs vote in favour | Sakshi
Sakshi News home page

లోక్‌సభలో జమిలి బిల్లులు

Published Wed, Dec 18 2024 3:58 AM | Last Updated on Wed, Dec 18 2024 3:58 AM

One nation one election bills introduced in Lok Sabha: 269 MPs vote in favour

విపక్షాల వ్యతిరేకత మధ్యే ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రం

129వ రాజ్యాంగ సవరణ, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి మేఘ్‌వాల్‌

బిల్లులపై ఓటింగ్‌కు పట్టుబట్టిన కాంగ్రెస్‌ సహా విపక్షాలు 

అంగీకరించిన స్పీకర్‌.. కొత్త పార్లమెంటు భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్, పేపర్‌ స్లిప్‌ పద్ధతిన ఓటింగ్‌ 

అనంతరం 90 నిమిషాలపాటు వాడీవేడి చర్చ 

రాజ్యాంగానికి, లౌకిక స్ఫూర్తికి విరుద్ధం: విపక్షాలు 

పార్లమెంటుకు సవరణాధికారం లేదన్న కాంగ్రెస్‌ 

కొట్టిపారేసిన కేంద్రం, జేపీసీలో చర్చిద్దామన్న షా 

బిల్లులను జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం!

అనుకూలం 269, వ్యతిరేకం 198

కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోదీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఏక కాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు జమిలి బిల్లులను కేంద్రం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీన్ని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోదీ సర్కారుది ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి.

అధికార, విపక్షాల ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్‌ దాకా వెళ్లింది. జమిలి బిల్లులపై జేపీసీలో కూలంకషంగా చర్చిద్దామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రకటించినా విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంటులో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసీ మోదీ సర్కారు విఫలయత్నం చేస్తోందని ఎద్దేవా చేశాయి.

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం మరో కీలక ముందడుగు వేసింది. లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభలకూ ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. విపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్‌ రాజ్యాంగ (129వ సవరణ) సవరణ బిల్లును సభ ముందుంచారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అంటూ కాంగ్రెస్‌ తదితర విపక్షాలు దుయ్యబట్టాయి. వాటి అభ్యంతరాలను మంత్రి కొట్టిపారేశారు. రాష్ట్రాలు అనుభవిస్తున్న ఏ అధికారాలనూ ఈ బిల్లు తగ్గించబోదని స్పష్టం చేశారు.

దాదాపు 90 నిమిషాల పాటు అధికార, ప్రతిపక్షాల నడుమ వాడివేడి చర్చ జరిగింది. కాంగ్రెస్‌తో పాటు డీఎంకే, తృణమూల్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ (ఎస్పీ), శివసేన (యూబీటీ), మజ్లిస్‌ తదితర పార్టీలు బిల్లులను తీవ్రంగా వ్యతిరేకించాయి. వాటిపై ఓటింగ్‌కు పట్టుబట్టాయి. దాంతో ఎల్రక్టానిక్, పేపర్‌ స్లిప్‌ పద్ధతిన ఓటింగ్‌ జరిగింది. 269  మంది అనుకూలంగా ఓటేయడంతో బిల్లులను ప్రవేశపెట్టారు. దానికి వ్యతిరేకంగా ఏకంగా 198 మంది ఓటేయడం విశేషం. నూతన పార్లమెంటు భవనంలో ఎల్రక్టానిక్‌ ఓటింగ్‌ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా మంత్రి సభలో ప్రవేశపెట్టారు.

పుదుచ్చేది, ఢిల్లీ, జమ్మూ కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలను కూడా లోక్‌సభతో పాటే నిర్వహించేందుకు వీలు కల్పించడం దీని ఉద్దేశం. ప్రతిపాదిత బిల్లులు మౌలిక నిర్మాణ సూత్రానికి గొడ్డలిపెట్టన్న విపక్షాల ఆరోపణలు నిరాధారాలని మేఘ్వాల్‌ అన్నారు. రాజ్యాంగ సార్వభౌమత్వం, దాని సమాఖ్య–లౌకిక స్వభావాలు, కేంద్ర–రాష్ట్రాల మధ్య అధికారాల విభజన, న్యాయసమీక్ష వంటి కీలక సూత్రాలకు ఈ బిల్లుల ద్వారా అణుమాత్రం కూడా మార్పులు చేయబోవడం లేదని స్పష్టం చేశారు. విపక్షాల ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశపూరితాలని విమర్శించారు.

వాటిని విపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు. బిల్లుపై తమ అభ్యంతరాలను వారంతా సభ ముందుంచారు. వాటిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పందించారు. జమిలి బిల్లుపై ప్రతి దశలోనూ లోతైన చర్చ జరగాలన్నదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశమని తెలిపారు. ‘‘జమిలి బిల్లులు కేంద్ర మంత్రివర్గం ముందుకు వచ్చినప్పుడు మోదీ అదే చెప్పారు. లోతైన చర్చ నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ సంఘం పరిశీలనకు పంపాలని అభిప్రాయపడ్డారు’’ అని మంత్రి వెల్లడించారు. డీఎంకే సభ్యుడు టీఆర్‌ బాలు కూడా వాటిపై జేపీసీ పరిశీలన కోరారని గుర్తు చేశారు.

‘‘రాజ్యాంగ (129వ సవరణ) బిల్లుపై జేపీసీలో విస్తృతంగా చర్చ చేపట్టవచ్చు. అనంతరం జేపీసీ ఇచ్చే నివేదికను కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తుంది. తదనంతరం బిల్లుపై పార్లమెంటులో మరోసారి మనమంతా చర్చించుకోవచ్చు’’ అని విపక్షాలకు సూచించారు. రెండు బిల్లులను జేపీసీకి నివేదిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెడతానని మేఘ్వాల్‌ ప్రకటించారు. ఆ మేరకు బుధవారం తీర్మానం లోక్‌సభ ముందుకు వచ్చే అవకాశముంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు సాధారణ మెజారిటీ చాలు.

కానీ అవి గట్టెక్కాలంటే ఉభయ సభల్లోనూ మూడింట రెండొంతుల మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రస్తుతం రెండు సభల్లోనూ అంతటి మెజారిటీ లేదు. జమిలి ఎన్నికలపై ఏర్పాటైన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ముందు 32 పార్టీలు ప్రతిపాదనకు మద్దతివ్వగా 15  పార్టీలు వ్యతిరేకించడం తెలిసిందే.

మూడొంతుల మెజారిటీ ఏదీ?
జమిలి బిల్లులు రాజ్యాంగ వ్యతిరేకమని, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా విమర్శించారు. పార్లమెంటు ఆవరణలో ఆమె మీడియాతో మాట్లాడారు. బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలిందని కాంగ్రెస్‌ ఎంపీ శశీ థరూర్‌ అన్నారు. ‘‘కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి? ఇందులో ఏమన్నా అర్థముందా?’’ అని ప్రశ్నించారు. సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయతి్నంచిందని మనీశ్‌ తివారీ మండిపడ్డారు. ఓటింగ్‌ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందని పార్టీ ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ అన్నారు.  

పాలనలో స్థిరత్వానికే: కేంద్రం
జమిలి ఎన్నికలు భారత్‌కు కొత్తేమీ కాదని కేంద్రం పేర్కొంది. 1951 నుంచి 1967 దాకా అన్ని రాష్ట్రాల శాసనసభలకూ లోక్‌సభతో పాటే ఎన్నికలు జరిగాయని గుర్తు చేసింది. ‘‘పలు రాష్ట్రాల్లో అసెంబ్లీలు గడువుకు ముందే రద్దవడం వల్ల 1968, 1969 నుంచి జమి లికి బ్రేక్‌ పడింది’’ అని మంగళవారం ఉదయం లోక్‌సభలో జమిలి బిల్లులను ప్రవేశపెట్టడానికి ముందు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. నాలుగో లోక్‌సభ కూడా 1970లో గడువుకు ముందే రద్దయింది. దాంతో 1971లో సాధారణ ఎన్నికలు జరిగి ఐదో లోక్‌సభ కొలువుదీరింది. ఎమర్జెన్సీ నేపథ్యంలో దాని గడువును ఆర్టీకల్‌ 352 సాయంతో 1977 దాకా పొడిగించారు.

అనంతర కాలంలో ఆరో, ఏడో, తొమ్మిదో, 11వ, 12వ, 13వ లోక్‌సభలు కూడా అర్ధాంతరంగానే ముగిశాయి. ‘‘పలు రాష్ట్రాల్లో శాసనసభలకూ అదే పరిస్థితి ఎదురవుతూ వస్తోంది. దాంతో తరచూ ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే పరిస్థితి నెలకొంది. దాంతో పార్టీలు, నేతలు, చట్టసభ్యులు, అధికారులు పాలనను పక్కన పెట్టి ఎన్నికలను ఎదుర్కోవడంలో గడపాల్సి వస్తోంది. అందుకే కోవింద్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా దేశ ప్రయోజనాల రీత్యా జమిలి ఎన్నికలను తిరిగి పట్టాలపైకి తేవాలని సంకల్పించాం. పాలనలో స్థిరత్వానికి అది వీలు కల్పిస్తుంది’’ అని కేంద్రం వివరించింది.  

రాజ్యాంగంపై దాడి: కాంగ్రెస్‌
జమిలి బిల్లులను రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడిగా కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ అభివర్ణించారు. వాటిని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని ఆయన గుర్తు చేశారు. ‘‘జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు         నిర్ణిత కాలావధి కల్పించే ఆర్టీకల్‌ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుంది. కనుక సమాఖ్య వ్యవస్థ మౌలిక లక్షణమైన ప్రజాస్వామ్య నిర్మాణపు పునాదులనే ఈ బిల్లులు కదిలిస్తాయి’’ అని వాదించారు. దేశంలో నియంతృత్వాన్ని తేవడమే బీజేపీ ఉద్దేశమని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్‌ ఆరోపించారు.

అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును న్యూనతపరచడమేనని తృణమూల్‌ సభ్యుడు కల్యాణ్‌ బెనర్జీ విమర్శించారు. తమకు నచి్చన ప్రభుత్వాన్ని ఐదేళ్ల కాలానికి ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని టీఆర్‌ బాలు గుర్తు చేశారు. జమిలి ద్వారా దానికి గండికొట్టే అధికారం కేంద్రానికి లేదన్నారు. బిల్లులపై మాట్లాడేందుకు అధికార పక్ష సభ్యులకే స్పీకర్‌ ఓం బిర్లా ఎక్కువగా అవకాశమిస్తున్నారని విపక్ష సభ్యులు అభ్యంతరం వెలిబుచ్చడం ఉద్రిక్తతకు దారితీసింది.

‘‘పార్లమెంటుకు మీరు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారా? ఆ హక్కు ప్రతి పార్టీకీ ఉంది’’ అంటూ రిజిజు దుయ్యబట్టారు. బిల్లులకు బేషరతుగా మద్దతిస్తున్నట్టు బీజేపీ మిత్రపక్షాలు శివసేన (షిండే), టీడీపీ ప్రకటించాయి. బిల్లులను జేపీసీకి పంపాలని సుప్రియా సులే (ఎన్సీపీ–ఎస్‌పీ) కోరారు. ఈ బిల్లులు ప్రాంతీయ పార్టీలకు మరణ శాసనమని అసదుద్దీన్‌ ఒవైసీ (మజ్లిస్‌) ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement