న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)’కి ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ. 600 కోట్లను కేటాయించడంపై ట్విట్టర్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్‌లకు కల్పించిన ఎస్పీజీ భద్రతను గత సంవత్సరం కేంద్రం ఉపసంహరించింది. ప్రధాని, ఆయన అధికార నివాసంలో ఆయనతో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కల్పించేలా ఇటీవల ఎస్పీజీ చట్టంలో సవరణ చేశారు. రూ.600కోట్ల కెటాయింపుపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి.
‘ప్రధాని మోదీ ‘ఫకీరీ’ దేశ ఖజానాపై రోజుకు రూ. 1.62 కోట్ల భారం మోపుతోంది’ అని అఖిల భారత మహిళాకాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జేఎన్‌యూలో 8 వేల మంది విద్యార్థులు న్నారు. వారిపై ప్రభుత్వం గ్రాంట్లు, సబ్సీడీల పేరుతో ఏటా రూ. 400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఒక స్వయం ప్రకటిత ఫకీరు భద్రత ఖర్చు ఏటా రూ. 563 కోట్లా?’ అని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీ భద్రతకు అయ్యే ఖర్చు తగ్గించండి. మీ దుబారాతో ఖజానా ఖాళీ అవుతోంది. మీరొక ఫకీరు. సింపుల్ మ్యాన్. భద్రతను పక్కనబెట్టి స్వేచ్ఛగా తిరగండి’ అని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘ప్రధాని భద్రత ఖర్చు ఏడాదికి రూ. 592 కోట్లు అంటే.. రోజుకు రూ. 1.62 కోట్లు. గంటకు రూ. 6.75 లక్షలు. నిమిషానికి రూ. 11,263’ అని మరో యూజర్ ట్విట్టర్‌లో లెక్కలు గట్టాడు.
Comments
Please login to add a commentAdd a comment