Special Protection Group
-
‘బీఎండబ్ల్యూ ప్రధాని కోసం.. నా కారు మారుతి 800’
ఈ మాటలన్నది మాజీ ప్రధాని మన్మోహన్సింగ్. ఆయన నిరాడంబరతను ప్రస్తుత యూపీ మంత్రి, ఒకప్పుడు మన్మోహన్సింగ్ బాడీగార్డ్‌గా పనిచేసిన ఐపీఎస్ ఆఫీసర్ అసిమ్ అరుణ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘2004 నుంచి దాదాపు మూడేళ్ల పాటు మన్మోహన్‌కు బాడీగార్డుగా పనిచేశాను. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ప్రధానికి భద్రత కలి్పస్తుంది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్‌కు నాయకత్వం వహించే అవకాశం నాకు లభించింది. క్లోజ్ ప్రొటెక్షన్ టీమ్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్‌గా నేను ప్రధానికి దగ్గరగా ఉండాల్సి వచ్చేది. ఏదైనా కారణాలవల్ల ఆయన వెంట ఒక అంగరక్షకుడు మాత్రమే ఉండాల్సి వస్తే.. నేనే ఉండేవాడిని. నీడలా ఆయనతో ఉండటమే నా బాధ్యత. డాక్టర్ సింగ్ వద్ద కేవలం ఒక కారు ఉండేది. అది మారుతి 800. ప్రధానమంత్రి కాన్వాయ్‌లోని నల్ల బీఎండబ్ల్యూ కార్ల వెనుక అది పార్క్ చేసి ఉండేది. కాన్వాయ్ తీసే ప్రతీసారి ఆయన ఆ కారువైపు ఆతీ్మయంగా చూసేవారు. ఎందుకని అడిగితే.. ‘ఈ బీఎండబ్ల్యూ కారులో ప్రయాణించడం నాకు ఇష్టం లేదు అసిమ్. నా వాహనం అదే(మారుతి)’ అనేవారు. ఈ కారు మీ లగ్జరీ కోసం కాదు.. సెక్యూరిటీ ఫీచర్లున్నాయి కాబట్టి మీరు ఇదే వాడాలి’ అని వివరించేవాడిని’’ అంటూ గుర్తు చేసుకున్నారు. 2004లో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) బ్లాక్ క్యాట్ కమాండోగా శిక్షణ పొందిన తొలి ఐపీఎస్ అధికారి అసిమ్ అరుణ్. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. -
ఎస్పీజీ డైరెక్టర్ ఏకే సిన్హా కన్నుమూత
సాక్షి, ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భద్రతను పర్యవేక్షించే ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ(special protection group) డైరెక్టర్ అరుణ్ కుమార్ సిన్హా కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. 2016 నుంచి SPG డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు ఆయన. అంతకు ముందు ఆ పొజిషన్ 15 నెలలు ఖాళీగా ఉండడం విశేషం. ఈ ఏడాది మే 30వ తేదీన ఆయన పదవీ కాలం ముగియగా.. అంతకు ముందు రోజే ఆయన పదవీ కాలం పొడిగిస్తూ ఉత్తర్వులపై ప్రధాని మోదీ సంతకం చేశారు. ఎస్పీజీ డైరెక్టర్ బాధ్యతల కంటే ముందు ఆయన.. కేరళ డీజీపీ(ప్రత్యేక సేవలు, ట్రాఫిక్) నిర్వర్తించారు. కేరళ క్యాడర్‌కు చెందిన అరుణ్ కుమార్ సిన్హా.. 1987 ఐపీఎస్ బ్యాచ్. ఆ రాష్ట్ర పోలీస్‌విభాగంలో పలు బాధ్యతలు కూడా నిర్వహించారాయన. ప్రత్యేక భద్రతా బృందం ఎస్పీజీ.. 1984లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య ఘటన తర్వాత ఏర్పాటైంది. 1985 నుంచి ఇది ప్రధానులకు, మాజీ ప్రధానులకు, వాళ్ల వాళ్లకు కుటుంబ సభ్యలకు భద్రత కల్పిస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యుల రక్షణ బాధ్యతలను మాత్రమే చూసుకుంటోంది. -
ఎక్కడికక్కడ అప్రమత్తం .. భద్రత కట్టుదిట్టం
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా కీలక నేతలు హైదరాబాద్‌లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్న నేపథ్యంలో.. భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. సమావేశాలు జరిగే మాదాపూర్‌లోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(హెచ్ఐసీసీ)తోపాటు నోవాటెల్, రాజ్‌భవన్, బేగంపేట.. మోదీసభ జరిగే పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లో పెద్దయెత్తున భద్రతాబలగాలు మోహరిస్తున్నాయి. స్పెష ల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ), కేంద్ర బలగాలతో కలిసి నాలుగంచెల భద్రత ఏర్పాట్లు చేశారు. మొత్తం 15 వేల మంది భద్రత, బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. ఎస్పీజీ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్, శాంతిభద్రతల విభాగంతో పాటు టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు రంగంలోకి దిగుతున్నాయి. నగరవ్యాప్తంగా నిఘా, తనిఖీతోపాటు భారీగా మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రధాని తిరిగే మార్గాల్లో రూట్పార్టీలు ఉంటాయి. దుర్భేద్యంగా హెచ్ఐసీసీ జాగిలాలతో హెచ్ఐసీసీ, నోవాటెల్ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. ఎత్తైన భవనాల పైనుంచి రూఫ్‌టాప్ వాచ్ చేస్తున్నారు. పాస్ ఉన్న వాహనాలు, వ్యక్తులను మాత్రమే హెచ్ఐసీసీ లోపలికి అనుమతిస్తున్నారు. హైటెక్స్ లోపలికి వచ్చే ప్రతి ఒక్క వాహనాన్నీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. పాస్‌లేని పోలీస్ వాహనాలను సైతం తిప్పి పంపి స్తున్నారు. హెచ్ఐసీసీ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీపీసీఆర్ కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహించాకే లోపలికి అను మతి ఇస్తున్నారు. ఈ నెల 4వ తేదీ వరకు సైబరాబాద్ కమి షనరేట్ పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఐదుగురి కంటే ఎక్కువమంది గుమిగూడితే అరెస్టు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. శుక్రవా రం పరేడ్ గ్రౌండ్స్‌కు వెళ్లిన హైదరా బాద్ కొత్వాల్ సీవీ ఆనంద్ అధికారులతో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు సమీక్షించారు. మరోపక్క బేగంపేట విమానాశ్రయం నుం చి పరేడ్ గ్రౌండ్స్‌కు, అక్కడ నుంచి రాజ్‌భవన్ వరకు సెక్యూరిటీ, కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. గ్రౌండ్స్ ను శనివారం ఎస్పీజీ అ«ధీనంలోకి తీసుకోనుంది. శుక్రవా రం నుంచే బేగంపేట విమానాశ్రయం, పరేడ్ గ్రౌండ్స్, బాంబు నిర్వీర్యబృందాలతో తనిఖీ చేస్తున్నారు. ముందస్తు అరెస్టులు.. ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మొదలైన నిరసనలు విధ్వంసానికి దారితీయడం, ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వటంతో ప్రధాని పర్యటన నేపథ్యంలో అకస్మాత్తుగా ఆందోళనలు చేపట్టే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎమ్మార్పీఎస్ శనివారం సడక్‌బంద్‌కు పిలుపు ఇవ్వటంతో అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా సైబరాబాద్ పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. నేరచరితులు, రౌడీషీటర్లకు బైండోవర్లు విధిం చా రు. శంషాబాద్ మున్సిపాలిటి పరిధిలో ఎమ్మార్పీఎస్ పార్టీ కన్వీనర్ రాచమల్ల రాజును పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు.. హెచ్ఐసీసీ, నోవాటెల్ హోటల్ పరిసర ప్రాంతాలలో శని, ఆదివారాల్లో పలు మార్గాలలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు. జేఎన్టీయూ నుంచి సైబర్ టవర్స్, మియాపూర్ నుంచి కొత్తగూడ, కావూరి హిల్స్ నుంచి కొత్తగూడ, బయోడైవర్సిటీ నుంచి జేఎన్టీయూ, నారాయణమ్మ కాలేజ్ నుంచి గచ్చిబౌలి మార్గాలలో భారీ వాహనాలకు ప్రవేశం లేదు. ట్రాఫిక్ మళ్లింపు మార్గాలివే.. ►నీరూస్ జంక్షన్ నుంచి కొత్తగూడ జంక్షన్, గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాలను దుర్గం చెరువు – ఇనార్బిట్ – ఐటీసీ కోహినూర్ – ఐకియా – బయోడైవర్సిటీ – గచ్చి బౌలి మీదుగా సీవోడీ జంక్షన్‌కు మళ్లిస్తారు. సైబర్ టవర్స్, హైటెక్స్ జంక్షన్ల మీదుగా ప్రవేశం లేదు. ►మియాపూర్, కొత్తగూడ, హఫీజ్‌పేట మీదుగా హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్ – ఏఐజీ హాస్పిటల్ – ఐకియా – ఇన్నార్బిట్ – దుర్గం చెరువు రోడ్ మీదుగా వెళ్లాలి. ►ఆర్సీపురం, చందానగర్ మీదుగా మాదాపూర్, గచ్చిబౌలి వైపునకు వచ్చే వాహనాలు బీహెచ్ఈఎల్ – నల్లగండ్ల – హెచ్‌సీయూ – ఐఐఐటీ – గచ్చిబౌలి రోడ్డు మీదుగా వెళ్లాలి. అల్విన్, కొండాపూర్ రోడ్లో వాహనాలకు ప్రవేశం లేదు. -
ప్రధాని బస ఎక్కడా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న దృష్ట్యా ఆయన ఎక్కడ బస చేయనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గవర్నర్ కోరిక మేరకు రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే నెలలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నగరంలోనే ఉండనున్నారు. వీరంతా నోవాటెల్, తాజ్‌కృష్ణ సహా వివిధ హోటళ్లలో బస చేయనున్నారు. హెచ్ఐసీసీలో 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ఆఖరి రోజు పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ తదితరాలను పరిగణనలోకి తీసుకుని బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ కమిషనర్, మిలిటరీ వర్గాలు, కేంద్ర, రాష్ట్ర నిఘా అధికారులు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో పాటు బీజేపీ తరఫున నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు. రంగంలోకి ఫుట్ ప్యాట్రోలింగ్.. రాజ్‌భవన్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రధాని బస చేస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌భవన్ చుట్టూ ఎత్తైన భవనాలు ఉండటంతో పాటు మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటి నుంచి చూస్తే నేరుగా గెస్ట్‌హౌస్ కనిపిస్తుంది. దీంతో పాటు రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్కాలోనూ అనేక ఎత్తైన భవనాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎస్పీజీ వర్గాలు సెక్యూరిటీ వెట్టింగ్ చేస్తున్నాయి. ప్రధాని ఒకవేళ ఇక్కడే బస చేస్తే.. ఆయా భవనాల్లో పని చేస్తున్న, నివసిస్తున్న నిర్మాణ కార్మికులను పూర్తిగా ఖాళీ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. రాజ్‌భవన్‌తో పాటు పరేడ్‌గ్రౌండ్స్ చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలు, ఎంఎస్ మక్కాలోని అపార్ట్మెంట్లపై రూఫ్‌టాప్ వాచ్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో గస్తీ కాయడానికి ఫుట్ ప్యాట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపనున్నారు. మూడు షిఫ్టుల్లో.. 25 వేల మంది.. కార్యవర్గ సమావేశాలు, అతిథుల బస, రాకపోకలు సాగించే మార్గాల్లో కలిపి దాదాపు 25 వేల మందిని బందోబస్తు కోసం వినియోగించనున్నారు. వీళ్లు ప్రధాని ఢిల్లీలో బయలుదేరినప్పటి నుంచి ఆయన తిరిగి అక్కడకు చేరుకునే వరకు విధుల్లో ఉంటారు. ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రూట్ క్లియరెన్స్ కష్టమే.. ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేస్తే రెండు రోజుల పాటు హెచ్ఐసీసీకి, ఒక రోజు పరేడ్‌గ్రౌండ్స్‌కు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దాదాపు ఈ ప్రయాణమంతా రద్దీ వేళల్లోనే ఉంటుంది. ప్రధాని ప్రయాణించే మార్గంలో కచ్చితంగా ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో ఆపేసి గ్రీన్‌చానల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఏ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రెండు రూట్లలోనూ ట్రాఫిక్‌ను ఆపేయడం అనివార్యం. అలా చేయకుంటే ఎస్పీజీ వర్గాలు రూట్క్లియరెన్స్ ఇవ్వవు. అత్యంత కీలకమైన సికింద్రాబాద్– గచ్చిబౌలి మార్గంలో సాధారణ రోజుల్లోనే పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటించే మార్గంలో రూట్ క్లియరెన్స్ పెద్ద సవాలే అని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
ఎస్పీజీ: మరో కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: దేశంలో ప్రముఖుల భద్రత కోసం ఉద్దేశించిన ప్రత్యేక భద్రతా దళం(ఎస్పీజీ)లో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి దాకా పలువురు ప్రముఖ వ్యక్తులకు భద్రత కల్పించిన ఈ విభాగం.. ప్రధాన మంత్రికి మాత్రమే భద్రత కల్పించేలా కేంద్రం కీలక మార్పులు చేపట్టడంతో తాజాగా సిబ్బందిని తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా డెప్యుటేషన్ పూర్తయిన సుమారు 200 మంది సిబ్బందిని మాతృ విభాగాలకు పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. (ఎస్పీజీ చట్టానికి ప్రక్షాళన) కాగా కమాండో శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది 4 వేల మంది వరకు ఎస్పీజీలో ఉన్నారు. వీరిని విడతల వారీగా 50 నుంచి 60 శాతం మేర వెనక్కి పంపించి, అంతర్గత రక్షణ విధుల్లో వినియోగించుకుంటామని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీ భద్రతకు కేటాయించిన సిబ్బంది మాత్రమే ఎస్పీజీలో ఉంటారని అన్నారు. ఎస్పీజీ ఏర్పాటయ్యాక ఇలా కుదింపు చేపట్టడం ఇదే ప్రథమం. 1985లో ఏర్పాటైన ఎస్పీజీ కోసం వివిధ పారామిలటరీ, కేంద్ర సాయుధ పోలీసు బలగాల నుంచి సిబ్బందిని ఎంపిక చేసుకున్నారు. -
ప్రధాని భద్రత బడ్జెట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ భద్రతను పర్యవేక్షించే ‘స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)’కి ఈ సంవత్సరం బడ్జెట్లో రూ. 600 కోట్లను కేటాయించడంపై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, మాజీ ప్రధాని మన్మోహన్లకు కల్పించిన ఎస్పీజీ భద్రతను గత సంవత్సరం కేంద్రం ఉపసంహరించింది. ప్రధాని, ఆయన అధికార నివాసంలో ఆయనతో ఉండే కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కల్పించేలా ఇటీవల ఎస్పీజీ చట్టంలో సవరణ చేశారు. రూ.600కోట్ల కెటాయింపుపై సోషల్ మీడియాలో విమర్శలు పెరిగాయి. ‘ప్రధాని మోదీ ‘ఫకీరీ’ దేశ ఖజానాపై రోజుకు రూ. 1.62 కోట్ల భారం మోపుతోంది’ అని అఖిల భారత మహిళాకాంగ్రెస్ ట్వీట్ చేసింది. ‘జేఎన్‌యూలో 8 వేల మంది విద్యార్థులు న్నారు. వారిపై ప్రభుత్వం గ్రాంట్లు, సబ్సీడీల పేరుతో ఏటా రూ. 400 కోట్లను ఖర్చు చేస్తోంది. ఒక స్వయం ప్రకటిత ఫకీరు భద్రత ఖర్చు ఏటా రూ. 563 కోట్లా?’ అని ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘మోదీజీ.. మీ భద్రతకు అయ్యే ఖర్చు తగ్గించండి. మీ దుబారాతో ఖజానా ఖాళీ అవుతోంది. మీరొక ఫకీరు. సింపుల్ మ్యాన్. భద్రతను పక్కనబెట్టి స్వేచ్ఛగా తిరగండి’ అని మరో ట్విట్టర్ యూజర్ పేర్కొన్నారు. ‘ప్రధాని భద్రత ఖర్చు ఏడాదికి రూ. 592 కోట్లు అంటే.. రోజుకు రూ. 1.62 కోట్లు. గంటకు రూ. 6.75 లక్షలు. నిమిషానికి రూ. 11,263’ అని మరో యూజర్ ట్విట్టర్లో లెక్కలు గట్టాడు. -
ప్రియాంకకు భద్రత తగ్గింపుపై వాద్రా ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగించడంపై ఆమె భర్త రాబర్ట్ వాద్రా కేంద్ర సర్కార్‌పై ధ్వజమెత్తారు. గత నెలలో ప్రియాంక నివాసంలోకి ఓ కారు దూసుకురావడం భద్రతా లోపాలను ఎత్తిచూపిన క్రమంలో ఎస్పీజీ భద్రతను తొలగించకూడదని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా భద్రత విషయంలో రాజీపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతా లోపాలను మహిళల భద్రతకు ముడిపెడుతూ వాద్రా ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రభుత్వ తీరును ఆక్షేపించారు. ‘ప్రియాంకకు, నా కుమార్తె, కుమారుడు లేదా నాకు గాంధీ కుటుంబానికే భద్రత కరవవడం కాదు..దేశంలో మహిళలకు భద్రమైన పరిస్థితి కల్పించాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా భద్రతపై రాజీపడుతున్నారు..యువతులు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి..ఎలాంటి సమాజాన్ని మనం ఏర్పరుస్తున్నా’మని వాద్రా ఆ పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను తొలగించి జడ్ క్యాటగరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. -
ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఇతర విపక్షాల నిరసనల మధ్య స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీ కాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు. సోమవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెడితే బుధవారం ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బ్లాక్ క్యాట్ కమాండోలు ఉదాసీనంగా వ్యవహరించకుండా, వారి సమర్థత పెంచడం కోసమే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశామని చెప్పారు. తొలిరోజుల్లో ఏ ఉద్దేశంతో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారో దానినే పునరుద్ధరించామని వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కేవలం దేశాధిపతులకు మాత్రమే ఉంటుందని షా గుర్తు చేశారు. గాంధీ కుటుంబం భద్రతను మార్చాం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు భద్రతను తొలగించలేదని, జెడ్ ప్లస్ కేటగిరీకి భద్రతను మార్చామని అమిత్ షా చెప్పారు. వాస్తవానికి ఇప్పుడే గాంధీ కుటుంబానికి భద్రత మరింత పెరిగిందని అన్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ, అంబులెన్స్‌తో గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌లకు ఎస్పీజీ భద్రత తొలగించినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ గతంలో చేసినట్టుగా ప్రతీకారంతో తాము ఈ బిల్లు తీసుకురాలేదని షా అన్నారు. వీఐపీలందరికీ వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగానే భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్థాయిలో అందరికీ కల్పించలేమని చెప్పారు. షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇతర విపక్షాలు కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. వాటిని తిరస్కరించిన సభ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదించింది. గాడ్సే దేశభక్తుడు: ప్రజ్ఞా గాంధీజీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను ‘దేశభక్తుడు’గా పేర్కొంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో వివక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను డీఎంకే సభ్యుడు రాజా ప్రస్తావిస్తుండగా.. ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగిలారు. ఒక దేశభక్తుడిని మీరు ఉదాహరణగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. రాజా మాటలకు ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగలడంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గాడ్సేపై ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మరో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సమ్మెపై 14 రోజులు ముందే చెప్పాలి సమ్మెకు వెళ్లే కార్మికులు 14 రోజుల ముందే నోటీసు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టంలో ఇది భాగమని, దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని గంగ్వార్ అన్నారు. కార్మిక చట్టాలలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని పేర్కొన్న మంత్రి, అందులో భాగంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా మిళితం చేస్తున్నామని వెల్లడించారు. 2016లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, ఇది శ్రామిక శక్తిలో 20 శాతం ఉందని తెలిపారు. -
వారికి ఎస్పీజీ భద్రత ఉపంసహరణ.. కారణాలివే!
ఎస్పీజీ భద్రత.. వీవీఐపీలు, వీఐపీలకు ప్రాణ రక్షణ కోసం కల్పించే భద్రత. కానీ రాను రాను భారత్‌లో వీఐపీల భద్రత ఒక సామాజిక హోదాగా మారిపోయింది. ఆ భద్రత తీసేస్తే పరువు పోయినట్లుగా నేతలు విలవిల్లాడిపోతారు. అసలు భద్రత అంటేనే ఒక హడావుడి, ఒక హంగామా. కారు వెంట పరుగులు తీసే కమాండోలు, కారు తలుపు తీసి యువర్ అటెన్షన్ ప్లీజ్ అనే అధికారులు, వీఐపీలపై ఈగ వాలకుండా చూసే భద్రతా నైపుణ్యం కలిగినవారు ఎస్పీజీలో ఉంటారు. గాంధీ కుటుంబానికి తాజాగా మోదీ ప్రభుత్వం ఎస్పీజీ భద్రత తొలగించడంపై రాజకీయంగా తీవ్ర కలకలం రేగింది. ఇప్పుడు మాజీ ప్రధానుల కుటుంబాలకు కూడా ఎస్పీజీ భద్రత కట్ చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించిన సవరణ బిల్లును వచ్చేవారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో భారత్‌లో వీఐపీల భద్రత చర్చనీయాంశమైంది. ఇదే ఇవాళ్టి సండే స్పెషల్.. ఎస్పీజీ భద్రత అంటే... శౌర్యం, సమర్పణం, సురక్షణం.. ఈ మూడు సూత్రాలే ప్రాతిపదికగా మన దేశంలో ఎస్పీజీ పనిచేస్తుంది. అత్యంత శిక్షణ పొందిన ఘటికులైన అధికారులు ఈ గ్రూపులో ఉంటారు. దాదాపుగా 3 వేల మంది భద్రతా అధికారులు శిక్షణ పొంది సదా మీ సేవలో అన్నట్లుగా సిద్ధంగా ఉంటారు. వీసమెత్తు కూడా లోపాల్లేని భద్రతా వ్యవస్థను కల్పించడం వీరి బాధ్యత. సీఆర్పీఎఫ్ నుంచి మెరికల్లాంటి అధికారుల్ని ఏరి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ఎస్పీజీ గ్రూపులో పనిచేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆ అధికారులకు శారీరక దారుఢ్యం, నాయకత్వ లక్షణాలు, వృత్తి పట్ల నిబద్ధత, భద్రతా వ్యవహారాలపై సంపూర్ణ పట్టు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్కడ ఎలా మెలగాలన్న అవగాహన వంటివి మెండుగా ఉండాలి. ప్రధాని వంటి వీవీఐపీలు ఇంట్లో ఉన్నా, అడుగు తీసి బయటకు వేసినా, టూర్లకు వెళ్లినా నీడలా వీరు వెన్నంటే ఉండి వారికి భద్రత కల్పిస్తారు. వీవీఐపీలు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే 24 గంటల ముందే ఆ ప్రాంతం అంతా ఎస్పీజీ కమాండోల చేతుల్లోకి వెళుతుంది. ఎస్పీజీ అధికారులతో పాటు బాంబుల్ని నిర్వీర్యం చేసే స్క్వాడ్, జాగిలాలు కూడా వారి వెంట ఉంటాయి. ఎస్పీజీ భద్రతలో భాగంగా అత్యంత ఆధునిక వాహనాలను వినియోగిస్తారు. ఆయుధాలు కలిగిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, జామర్లు ఉంటాయి. నల్ల రంగు దుస్తులు ధరించి, చిమ్మ చీకట్లో కూడా స్పష్టంగా కనిపించే గాగుల్స్, కమ్యూనికేషన్ కోసం ఇయర్ పీస్‌లు, అత్యాధునిక ఆయుధాలతో కనురెప్ప కూడా వేయకుండా అనుమానాస్పదంగా ఎలాంటి కదలికలు కనిపించినా గ్రహించడమే వారి పని. ఇతర భద్రతా వలయాలు... భారత్‌లో వీఐపీలు, వీవీఐపీల కోసం వివిధ రకాల భద్రతా వ్యవస్థలు అమల్లో ఉన్నాయి. ఎస్పీజీ కాకుండా ఎక్స్, వై, జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలు వీఐపీల రక్షణ కోసం పనిచేస్తున్నాయి. ప్రధానికి ఎస్పీజీ భద్రత ఉంటుంది. నాయకులకు వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సమాచారాన్ని తీసుకుని భద్రత కల్పిస్తారు. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రా (రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్) విభాగం నుంచి సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి ఏ నాయకులకు ఏ భద్రత కల్పించాలో కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది. ఎక్స్ కేటగిరీ: ఇది సాధారణ భద్రత. కేవలం ఇద్దరు గన్మ్యాన్లు వీఐపీలకు రక్షణగా ఉంటారు. వై కేటగిరీ: ఈ కేటగిరీ కింద భద్రత పొందే వీఐపీలకు 11 మంది సిబ్బంది కాపలాగా ఉంటారు. ఒకరిద్దరు అధికారులు వీఐపీలు ఎక్కడికి వెళ్లినా కాపలాగా వెళతారు. జెడ్ కేటగిరీ: ఈ కేటగిరీ కింద 22 మంది భద్రతా అధికారులు రక్షణగా ఉంటారు. వీరిలో నలుగురైదుగురు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) కమాండోలు ఉంటారు. ఇతర సెక్యూరిటీ అధికారుల్ని ఢిల్లీ పోలీసులు లేదంటే సీఆర్పీఎఫ్ పోలీసులు కేటాయిస్తారు. ఒక ఎస్కార్ట్ వాహనం కూడా వెంట ఉంటుంది. మార్షల్ ఆర్ట్స్‌లో ఈ అధికారులు దిట్టలై ఉంటారు. జెడ్ ప్లస్: ఈ కేటగిరీలో 36 మంది అధికారులు వీవీఐపీలకు నిరంతరం రక్షణ ఇస్తారు. వీరిలో 10 మందికి పైగా ఎన్ఎస్జీ అధికారులే ఉంటారు. నివాసం వద్ద రొటేషన్ పద్ధతిలో రక్షణ కల్పిస్తారు. ఎస్పీజీ చట్టం కథ కమామిషు... 1984 సంవత్సరంలో ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీని అంగరక్షకులే దారుణంగా హత్యచేయడంతో ఆ తర్వాత ఏడాదే రాజీవ్ గాంధీ హయాంలో 1985 సంవత్సరంలో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారు. 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్ గాంధీకి ఎస్పీజీ భద్రతను తొలగించారు. 1991లో రాజీవ్ హత్య తర్వాత ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశారు. మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యులకు కనీసం పదేళ్ల పాటు ఎస్పీజీ భద్రత కల్పించడానికి వీలు కల్పిస్తూ చట్టాన్ని సవరించారు. 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఎస్పీజీ చట్టానికి మరోసారి సవరణలు చేసింది. మాజీ ప్రధానులు, వారి కుటుంబాలకు పదేళ్లకు బదులుగా పదవీ కాలం ముగిసిన తర్వాత ఏడాది వరకు మాత్రమే భద్రత కల్పించాలని, ఆ తర్వాత వారికున్న ముప్పు ఆధారంగా భద్రత కల్పించే కాలాన్ని పెంచుకుంటూ వెళ్లడానికి వీలుగా చట్ట సవరణల్ని చేసింది. అలా మాజీ ప్రధానులు హెచ్డీ దేవేగౌడ, ఐకే గుజ్రాల్, పీవీ నరసింహారావులకు అప్పట్లోనే ఎస్పీజీ భద్రతను తొలగించారు. కొద్ది రోజుల క్రితం గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రత తొలగించిన కేంద్ర ప్రభుత్వం ఇకపై మాజీ ప్రధానులు కుటుంబ సభ్యులకి భద్రత తొలగించేలా చట్టాన్ని చేయనుంది. ఈ మేరకు ఎస్పీజీ చట్టానికి చేసిన ప్రతిపాదిత సవరణల్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. వచ్చేవారం ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల కాలంలో కేంద్రం ఏకంగా 130మంది కీలక నేతలకు వీఐపీ భద్రతని తొలగించింది. గాంధీ కుటుంబానికి ఎందుకు తొలగించారంటే.. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరిగిన దగ్గర్నుంచి గాంధీ కుటుంబ సభ్యులు మాజీ ప్రధాని కుటుంబ హోదాలో ఎస్పీజీ భద్రత అనుభవిస్తున్నారు. కాలక్రమంలో ఎస్పీజీ భద్రత వారికి ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయిందన్న విమర్శలున్నాయి. రాహుల్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఎస్పీజీ కమాండోలను వెంట తీసుకువెళ్లడం మానేశారు. గత 28 ఏళ్లలో రాహుల్ 150 సార్లు విదేశీ పర్యటనలకు వెళితే కనీసం 140 సార్లు ఆయన ఎస్పీజీ కమోండోలను తీసుకువెళ్లలేదు. విదేశాలకు వెళ్లినప్పుడు కనీసం కొన్నాళ్ల ముందైనా ఎస్పీజీకి సమాచారం అందిస్తే వారు అక్కడికి వెళ్లి భద్రత కల్పిస్తారు. కానీ రాహుల్ ఒక్కోసారి ఆఖరి నిమిషంలో చెప్పడం, ఒక్కోసారి చెప్పా పెట్టకుండా విదేశాలకు చెక్కేస్తుండటంతో ఎస్పీజీ భద్రతా అధికారులు ఏం చేయలేని ఇరకాటంలో పడిపోయేవారు. 2005–2014 మధ్య కాలంలో రాహుల్ బుల్లెట్ ప్రూఫ్ లేని వాహనంలో కనీసం 1,800 సార్లు ప్రయాణించారని ఎస్పీజీ అధికారులు వెల్లడించారు. ఎస్పీజీ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి వాహనం రూఫ్‌పైన కూడా రాహుల్ ప్రయాణించారు. సోనియా, ప్రియాంకా కూడా చాలాసార్లు ఎస్పీజీ కమాండోలు లేకుండా విదేశాలకు వెళ్లడం పరిపాటిగా మారింది. ఎస్పీజీ భద్రత కల్పించడం అంటే ప్రజాధనాన్ని కోట్లలో వెచ్చించడమే. ప్రస్తుతం గాంధీ కుటుంబానికి ప్రాణానికి హాని పెద్దగా లేకపోవడం, వారికి కల్పించిన ఎస్పీజీ భద్రతని సరిగా వాడుకోకపోవడంతో మోదీ సర్కార్ వారి భద్రతను తొలగించాలని నిర్ణయించింది. భద్రతా వ్యయం ఎంతంటే... ఎస్పీజీ భద్రత కోసం ఏడాదికేడాది వ్యయం తడిసిమోపెడు అవుతూ ఉంది. జెడ్ ప్లస్ సెక్యూరిటీ కంటే ఎస్పీజీ భద్రతకయ్యే వ్యయం ఆరు రెట్లు ఎక్కువ. దీన్ని ఖజానా నుంచే ఖర్చు చేస్తారు. 2004–13 మధ్య కాలంలో గాంధీ కుటుంబం, మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయి భద్రత కోసం చేసిన ఖర్చు రూ. 1,800 కోట్లు 2018–19 సంవత్సరంలో కేటాయింపులు రూ. 411.68 కోట్లు 2019–20 సంవత్సరంలో కేటాయింపులు రూ. 535 కోట్లు ఇప్పటివరకు ఎస్పీజీ భద్రత సంపూర్ణంగా అనుభవించింది కేవలం అటల్ బిహారీ వాజ్‌పేయి మాత్రమే. గత ఏడాది ఆయన కన్నుమూసే వరకు ఎస్పీజీ భద్రతను కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కొనసాగించింది. ఇక ఒక వీఐపీ కోసం జెడ్ ప్లస్ సెక్యూరిటీకి నెలకయ్యే ఖర్చు సుమారు రూ. 25 లక్షలు ఒక వీఐపీ కోసం జెడ్సెక్యూరిటీకి నెలకయ్యే ఖర్చు సుమారు రూ. 15లక్షలు -
‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) కేంద్రం ఉపసంహరించింది. ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను కేంద్రం తగ్గించడం గమనార్హం. 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులు కేవలం ప్రధానికే భద్రత కల్పించనున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసే స్థాయికి దిగజారిందంటూ అహ్మద్ పటేల్ వ్యాఖ్యానించారు. కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆనంద్ శర్మ అన్నారు. -
సీఆర్పీఎఫ్ తాత్కాలిక డీజీగా సుదీప్ లక్డాకియా
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ అదనపు డీజీగా పనిచేస్తున్న సుదీప్ లక్డాకియాకు డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ హోం శాఖ మంగళవారం ఉత్తర్వులిచ్చింది. ఆయన బుధవారం(నేడు) బాధ్యతలు చేపట్టనున్నారు. 1984 బ్యాచ్ తెలంగాణ కేడర్‌కు చెందిన లక్డాకియా, ప్రస్తుతం సెంట్రల్ జోన్ లోని పారామిలటరీ బలగాలకు నేతృత్వం వహిస్తున్నారు. గతంలో ప్రధానికి భద్రత కల్పించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ)లో లక్డాకియా పనిచేశారు. హోంమంత్రిత్వ శాఖ, ప్రధాని నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ(ఏసీసీ) తదుపరి డీజీని నియమించేవరకు లక్డాకియా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. గతేడాది డైరెక్టర్ జనరల్‌గా నియమితులైన దుర్గాప్రసాద్ (1981 బ్యాచ్, తెలంగాణ కేడర్) సోమవారం పదవీ విరమణ చేశారు. -
ప్రధాని పర్యటనకు భారీ బందోబస్తు
ఈ నెల 7న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్ బహిరంగ సభకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గజ్వేల్‌లో ప్రధాని పర్యటనను పర్యవేక్షించడానికి స్వయంగా ఒక అదనపు డీజీ ర్యాంకు కలిగిన అధికారితో పాటు ఇద్దరు ఐజీలను, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 15వందల పోలీసు మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి... పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించారు. అదే విధంగా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల బందోబస్తును ప్రతీ నిముషాన్ని ఎస్పీజీ స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే ప్రధాని కాన్వాయితో పాటు సభ ప్రాంగణాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆదీనంలోకి తీసుకుంది. ఈ నెల 7న ప్రధాని ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా... గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది. వీటిలో ఒక దానిలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్లో డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు వెళ్లనున్నారు. మూడవ హెలికాప్టర్లో పూర్తిగా ప్రధాని భద్రతా సిబ్బంది వెళ్లనున్నారు. మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలు తెప్పించారు. అలాగే కాన్వాయ్‌కు సంబంధించి పోలీసు శాఖ శుక్రవారం నుంచే రిహార్సల్స్ ప్రారంభించారు. -
తుదిదశకు ప్రధాని సభ ఏర్పాట్లు
మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షణ * బస్సులు, జనం తరలింపుపై జిల్లా ఎమ్మెల్యేలతో సమీక్ష * రంగంలోకి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ * సభాస్థలి, హెడ్ రెగ్యులేటర్, హెలిపాడ్ల వద్ద తనిఖీలు గజ్వేల్: మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలో ఈ నెల 7న నిర్వహించనున్న ప్రధాని నరేంద్ర మోదీ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఆ రోజు కోమటిబండ గుట్టపై ప్రధాని ‘మిషన్ భగీరథ’ను ప్రారంభించనున్న విషయం విదితమే. పైలాన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. పైలాన్ చుట్టూ గార్డెనింగ్ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారు. పక్కనే నల్లాను బిగించనున్నారు. గుట్ట కింది భాగంలో నిర్వహించే బహిరంగ సభకు వేదిక ముస్తాబవుతోంది. జర్మన్ టెక్నాలజీతో రెరుున్ ప్రూఫ్ టెంట్లను వేస్తున్నారు. భారీ వర్షం వచ్చినా సభలో పాల్గొనే 2 లక్షల మందికి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వీరందరికీ కుర్చీలతోపాటు ప్రధాని ప్రసంగాన్ని దగ్గరగా వీక్షించేందుకు 50కిపైగా ఎల్ఈడీ స్క్రీన్ లను ఏర్పాటు చేస్తున్నారు. సభకు 3 వేలకు పైగా ఆర్టీసీ, 1500కు పైగా ప్రైవేటు బస్సులను వినియోగిస్తున్నారు. వీరికి బస్సులో కూర్చున్న వెంటనే పులిహోర లేదా పెరుగన్నంతో పాటు రెండు అరటిపండ్లు, వాటర్‌బాటిల్ అంది స్తారు. 12 గంటలకల్లా వేదిక వద్దకు వీరంతా చేరుకోవాల్సి ఉంటుంది. సభాస్థలిలో 250 సాధారణ, 100 మొబైల్ టాయ్లెట్లు ఏర్పాటు చేస్తున్నారు. రంగంలోకి ఎస్పీజీ ప్రధాని సభ నేపథ్యంలో ఎస్పీజీ రంగంలోకి దిగింది. గురువారం కోమటిబండకు ఎస్పీజీ డీఐజీ నంబియార్ ఆధ్వర్యంలో వచ్చిన బృందం సభాస్థలి, గుట్టపై ఉన్న హెడ్ రెగ్యులేటర్, హెలిపాడ్, సభాస్థలి చుట్టూ ఉన్న అటవీ ప్రాంతం, రోడ్లు వద్ద తనిఖీలు చేపట్టారుు. అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా జవాన్లు తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రధాని హెలిపాడ్ వద్ద డాగ్‌స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమానం వచ్చిన చోట తవ్వించి మరమ్మతు చేయిస్తున్నారు. కోమటిబండ నుంచి గుట్టపైకి వెళ్లే మార్గం, సభాస్థలితో పాటు ప్రధాని వచ్చే హెలిపాడ్ స్థలం వరకు రోడ్డుకు ఇరువైపులా ఆర్అండ్బీ ఆధ్వర్యంలో ఇనుప బారికేడ్లను ఏర్పాటు చేశారు. 4 కిలోమీటర్ల మేర ఇనుప కంచె ఉంది. ఈ మార్గం పొడవునా 32 సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. పనులను పర్యవేక్షించిన హరీశ్ కోమటిబండలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. గురువారం సాయంత్రం డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రోనాల్డ్‌రాస్ ఇతర ఉన్నతాధికారులతో కలసి ఏర్పాట్లపై ఆరా తీశారు. సభకు వివిధ నియోజకవర్గాల నుంచి తరలించే బస్సులు, జనాల సంఖ్యపై జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సమీక్ష జరిపారు. ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లు దాదాపు పూర్తి కావచ్చాయన్నారు. ఎస్పీజీ బృందం సైతం ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. -
ప్రియాంక కుటుంబానికి కొనసాగనున్న ప్రత్యేక భద్రత
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, పిల్లలకు విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును కొనసాగించాలని కేంద్రంలోని ఏన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలివ్వడం, తర్వాత రోజు ప్రభుత్వానికి ప్రియాంక లేఖ రాసిన సంగతి తెలిసిందే. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) వర్గాలు తెలిపాయి. కొన్ని నిబంధనల మేరకు ప్రియాంక కుటుంబానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో మార్పులు చేయాలని కోరుకోవడం లేదని ఎస్పీజీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి కల్పిస్తున్న ప్రత్యేక భద్రతపై సమీక్షించే ఉద్దేశం లేదని వెల్లడించారు. -
మమ్మల్నీ తనిఖీ చేయండి
* ఎస్పీజీ డెరైక్టర్‌కు ప్రియాంకా గాంధీ లేఖ న్యూఢిల్లీ: విమానాశ్రయాల వద్ద తనకు, తన భర్త రాబర్ట్ వాద్రా, పిల్లలకు తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) డెరైక్టర్‌కు ప్రియాంకా గాంధీ లేఖ రాశారు. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలిచ్చిన ఒకరోజు తర్వాత ప్రియాంక ఈ లేఖ రాయడం గమనార్హం. దీనిపై ఎస్పీజీ వర్గాలు స్పందిస్తూ.. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని తెలిపాయి. తాము ఎలాంటి విజ్ఞప్తి చేయకుండానే ఇంతకుముందున్న ఎస్పీజీ/ఢిల్లీ పోలీసులు తమను విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి మినహాయించారని ప్రియాంక తన లేఖలో పేర్కొన్నారు. తనిఖీల నుంచి తన భర్తకు మినహాయింపునివ్వరాదని ప్రభుత్వం భావిస్తే.. మేమందరం కలిసి వెళుతున్నప్పుడు తనకు, తన పిల్లలకు మాత్రమే మినహాయింపునివ్వడం సరికాదని తాను భావిస్తున్నానన్నారు. అయితే రాబర్ట్ వాద్రాను వీఐపీ లిస్టులో ఉంచటాన్ని రాజకీయం చేయరాదని కాంగ్రెస్ ప్రతినిధి శశి థరూర్ వ్యాఖ్యానించారు. వాద్రాకు భద్రతాపరమైన మినహాయింపులను సమీక్షిస్తామని మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా అన్నారు. -
యశోదాబెన్ కూడా ఎస్పీజీ భద్రత
భోపాల్: వాళ్లిద్దరూ దశాబ్దకాలంగా కలిసి ఉన్న దాఖలాలు లేవు. కాని కాబోయే దేశ ప్రధాని భార్య అనే హోదా మాత్రం ఆమెకు దక్కింది. ఆమె హోదాకు తగినట్టుగానే భద్రతను కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదంతా కాబోయే ప్రధాని నరేంద్రమోడీ భార్య యశోదా బెన్ భద్రత గురించి. మోడీకి ఇచ్చే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను యశోదాబెన్ కు ఇవ్వాలని కల్పించనున్నారు. ప్రధాని కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను కేటాయించాలనే నిబంధన ఉందని.. ఆ చట్ట ప్రకారమే మోడీ భార్యతోపాటు ఇతర సభ్యులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తున్నామని మధ్యప్రదేశ్ మాజీ పోలీస్ డైరెక్టరేట్ జనరల్ సుభాష్ చంద్ర పీటిఐకి వెల్లడించారు. మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ కు సుభాష్ చంద్ర సెక్యూరిటీ అధికారిగా సేవలందించారు. -
ఐపీఎస్‌లకు ఎస్పీజీ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసుశాఖ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. నాలుగు నెలల్లో పార్లమెంట్,h జరుగనున్న నేపథ్యంలో ఐపీఎస్ అధికారులకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) ద్వారా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రచారానికి వచ్చే అగ్రనేతలు, వివిధ పార్టీల ద్వారా పోటీచేసే అభ్యర్థులకు భద్రత కల్పించడంపై ఈ శిక్షణలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానమంత్రితోపాటు దేశవ్యాప్తంగా పలువురు కీలక నేతలకు భద్రత కల్పించడం ఎస్పీజీ ప్రత్యేకత. ఈ నేపథ్యంలో వీవీఐపీల భద్రతకు సంబంధించి తొలిసారి ఎస్పీజీ ద్వారా ఐపీఎస్‌లకు శిక్షణ అందిస్తున్నారు. జిల్లా ఎస్పీ, డీఐజీ, ఐజీ, శాంతిభద్రతల వ్యవహారాలను పర్యవేక్షించే అదనపు డీజీల వరకూ ఈ శిక్షణ అందిస్తున్నారు. రాజాబహదూర్ వెంకటరామారెడ్డి రాష్ట్ర పోలీసు అకాడమీ (ఆర్బీవీఆర్ అప్పా)లో మూడు దశల్లో శిక్షణ కొనసాగుతోంది. ఎన్నికల సందర్భంగా క్షేత్రస్థాయి వ్యవహారాలను పర్యవేక్షించే అధికారులను దశలవారీగా ఈ శిక్షణకు పంపుతున్నారు. ఇప్పటివరకూ 50 మంది ఐపీఎస్ అధికారులకు శిక్షణ పూర్తయిందని, వచ్చే నెలాఖరువరకూ వివిధ దశల్లో పలు బ్యాచ్‌లకు శిక్షణ అందిస్తామని ఆర్బీవీఆర్ అప్పా డెరైక్టర్ ఎం. మాలకొండయ్య ‘సాక్షి’కి తెలిపారు. నేతల భద్రత కోసం రాష్ట్రస్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులకు కూడా ఎస్పీజీ శిక్షణ అందిస్తున్నారు. -
జయకు జెడ్ ఫ్లస్ భద్రతపై పిటిషన్
సాక్షి, చెన్నై:రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతను కల్పించాలని కోరుతూ సోమవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు అగ్ని హోత్రి, శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి జే జయలలితకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించారు. జాతీయ స్థాయి నేతగా ఉన్న జయలలితకు భద్రతను మరింత పెంచాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, అందుకు తగ్గ చర్యల్ని కేంద్రం తీసుకోలేదు. దీంతో చెన్నైకు చెందిన న్యాయవాది బాలాజీ మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందులో జయలలిత జాతీయ స్థాయి నేత అని గుర్తు చేశారు. పధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రత కల్పించారని వివరించారు. అయితే, జయలలితకు ఆ భద్రతను కేటాయించడంలో కేంద్రం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని పేర్కొన్నారు. జయలలితకు తీవ్ర వాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నదని వివరించారు. బీజేపీ జాతీయ నేత అద్వానీ హత్యకు కుట్ర చేసిన తీవ్రవాదుల్ని జయలలిత ప్రభుత్వం కటకటాల్లోకి పంపిం చినట్లు పేర్కొన్నారు. తీవ్రవాదులపై ఉక్కుపాదం మోపుతున్న జయలలితకు తీవ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు సమాచారం అందిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే తాను ఈ విషయమై కేంద్రానికి, రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఇంత వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించినట్టు వివరించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తులు సతీష్‌కుమార్ అగ్ని హోత్రి, కేకే శశిధరన్ నేతృత్వంలోని బెంచ్ విచారణకు స్వీకరించింది. రాష్ట్ర ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ సోమయాజులు, కేంద్ర ప్రభుత్వం తరపున అదనపు సొలిసియేట్ జనరల్ విల్సన్ హాజరై తమ వాదన వినిపించారు. విచారణకు ముందుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని తీసుకోవాలని సూచించారు. తోసి పుచ్చిన కోర్టు: న్యాయమూర్తి బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం సాయంత్రం కూడా విచారణ జరిగింది. రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారుల్ని తక్షణం హాజరు కావాలని బెంచ్ ఆదేశించింది. దీంతో అధికారులు హాజరై జయలలితకు కల్పించిన భద్రత గురించి వివరించారు. ఆమెకు ఎస్పీజీ భద్రతకు కల్పించామని, ఎన్ఎస్జీ భద్రత వ్యవహారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందని చెప్పారు. జెడ్ ప్లస్ భద్రతా వ్యవహారం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న దష్ట్యా, ఈ పిటిషన్ విచారణను తోసి పుచ్చుతూ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.