సాక్షి, హైదరాబాద్: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం నగరానికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్న దృష్ట్యా ఆయన ఎక్కడ బస చేయనున్నారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. గవర్నర్ కోరిక మేరకు రాజ్‌భవన్‌లోనే బస చేస్తారని ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనిపై ఆయన భద్రతను పర్యవేక్షించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) నుంచి క్లియరెన్స్ రాలేదు. వచ్చే నెలలో రెండు రోజుల పాటు ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో పాటు ఇతర కేంద్ర మంత్రులు, 18 రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు నగరంలోనే ఉండనున్నారు. వీరంతా నోవాటెల్, తాజ్‌కృష్ణ సహా వివిధ హోటళ్లలో బస చేయనున్నారు.
హెచ్‌ఐసీసీలో 2, 3 తేదీల్లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలతో పాటు ఆఖరి రోజు పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభ తదితరాలను పరిగణనలోకి తీసుకుని బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించి నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం విస్తృత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, మిలిటరీ వర్గాలు, కేంద్ర, రాష్ట్ర నిఘా అధికారులు, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో పాటు బీజేపీ తరఫున నిర్వాహకులు ఇందులో పాల్గొన్నారు.
రంగంలోకి ఫుట్ ప్యాట్రోలింగ్..
రాజ్‌భవన్‌లోని గెస్ట్‌హౌస్‌లో ప్రధాని బస చేస్తారని ఆ వర్గాలు చెబుతున్నాయి. రాజ్‌భవన్ చుట్టూ ఎత్తైన భవనాలు ఉండటంతో పాటు మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటి నుంచి చూస్తే నేరుగా గెస్ట్‌హౌస్ కనిపిస్తుంది. దీంతో పాటు రాజ్‌భవన్ ఎదురుగా ఉన్న ఎంఎస్ మక్కాలోనూ అనేక ఎత్తైన భవనాలు ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ఎస్పీజీ వర్గాలు సెక్యూరిటీ వెట్టింగ్ చేస్తున్నాయి.
ప్రధాని ఒకవేళ ఇక్కడే బస చేస్తే.. ఆయా భవనాల్లో పని చేస్తున్న, నివసిస్తున్న నిర్మాణ కార్మికులను పూర్తిగా ఖాళీ చేయించాలని పోలీసులు భావిస్తున్నారు. రాజ్‌భవన్‌తో పాటు పరేడ్‌గ్రౌండ్స్ చుట్టూ ఉన్న ఎత్తైన భవనాలు, ఎంఎస్ మక్కాలోని అపార్ట్‌మెంట్లపై రూఫ్‌టాప్ వాచ్ ఏర్పాటు చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో గస్తీ కాయడానికి ఫుట్ ప్యాట్రోలింగ్ బృందాలను రంగంలోకి దింపనున్నారు.
మూడు షిఫ్టుల్లో.. 25 వేల మంది..
కార్యవర్గ సమావేశాలు, అతిథుల బస, రాకపోకలు సాగించే మార్గాల్లో కలిపి దాదాపు 25 వేల మందిని బందోబస్తు కోసం వినియోగించనున్నారు. వీళ్లు ప్రధాని ఢిల్లీలో బయలుదేరినప్పటి నుంచి ఆయన తిరిగి అక్కడకు చేరుకునే వరకు విధుల్లో ఉంటారు. ప్రతి రోజూ మూడు షిఫ్టుల్లో సిబ్బంది విధులు నిర్వహించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రూట్ క్లియరెన్స్ కష్టమే..
ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేస్తే రెండు రోజుల పాటు హెచ్‌ఐసీసీకి, ఒక రోజు పరేడ్‌గ్రౌండ్స్‌కు రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. దాదాపు ఈ ప్రయాణమంతా రద్దీ వేళల్లోనే ఉంటుంది. ప్రధాని ప్రయాణించే మార్గంలో కచ్చితంగా ట్రాఫిక్‌ను పూర్తి స్థాయిలో ఆపేసి గ్రీన్‌చానల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన ఏ మార్గంలో ప్రయాణిస్తున్నప్పటికీ రెండు రూట్లలోనూ ట్రాఫిక్‌ను ఆపేయడం అనివార్యం. అలా చేయకుంటే ఎస్పీజీ వర్గాలు రూట్‌క్లియరెన్స్ ఇవ్వవు.
అత్యంత కీలకమైన సికింద్రాబాద్– గచ్చిబౌలి మార్గంలో సాధారణ రోజుల్లోనే పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటించే మార్గంలో రూట్ క్లియరెన్స్ పెద్ద సవాలే అని, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాలతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ క్రమం తప్పకుండా ఆర్టీ పీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు.
(చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్)
Comments
Please login to add a commentAdd a comment