ఈ నెల 7న రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. గజ్వేల్ బహిరంగ సభకు దాదాపు నాలుగు వేల మంది పోలీసు సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టారు. గజ్వేల్‌లో ప్రధాని పర్యటనను పర్యవేక్షించడానికి స్వయంగా ఒక అదనపు డీజీ ర్యాంకు కలిగిన అధికారితో పాటు ఇద్దరు ఐజీలను, ఒక డీఐజీ, నలుగురు ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.
అదే రోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బహిరంగ సభకు 15వందల పోలీసు మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసి... పర్యవేక్షణ బాధ్యతను నగర కమిషనర్లకు అప్పగించారు. అదే విధంగా ఢిల్లీ నుంచి కూడా స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సిబ్బంది రంగంలోకి దిగారు. ప్రధాని పాల్గొనే కార్యక్రమాల బందోబస్తును ప్రతీ నిముషాన్ని ఎస్పీజీ స్వయంగా పర్యవేక్షించనుంది. అలాగే ప్రధాని కాన్వాయితో పాటు సభ ప్రాంగణాన్ని ఎస్పీజీ ఇప్పటికే తమ ఆదీనంలోకి తీసుకుంది. ఈ నెల 7న ప్రధాని ఢిల్లీ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకొని అక్కడి నుంచి నేరుగా... గజ్వేల్ వెళ్లేందుకు నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లను ఎస్పీజీ సిద్ధం చేసింది.
వీటిలో ఒక దానిలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు సీఎం కేసీఆర్, ఇద్దరు ప్రత్యేక భద్రతా సిబ్బంది ప్రయాణించనున్నారు. మరో హెలికాప్టర్‌లో డీజీపీ అనురాగ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు వెళ్లనున్నారు. మూడవ హెలికాప్టర్‌లో పూర్తిగా ప్రధాని భద్రతా సిబ్బంది వెళ్లనున్నారు. మరో హెలికాప్టర్‌ను రిజర్వులో ఉంచనున్నారు. ప్రధాని కాన్వాయ్ కోసం ఢిల్లీ నుంచి రెండు ప్రత్యేక వాహనాలు తెప్పించారు. అలాగే కాన్వాయ్‌కు సంబంధించి పోలీసు శాఖ శుక్రవారం నుంచే రిహార్సల్స్ ప్రారంభించారు.