న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఇతర విపక్షాల నిరసనల మధ్య స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుకు లోక్‌సభ బుధవారం ఆమోద ముద్ర వేసింది. ఈ సవరణ బిల్లు ప్రకారం ఇకపై ప్రధానమంత్రి, ఆయన కుటుంబ సభ్యులకు ఎస్పీజీ కమాండోల రక్షణ ఉంటుంది. మాజీ ప్రధానులు, వారితో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉండే కుటుంబసభ్యులకు ఆ ప్రధాని పదవీ కాలం ముగిసిన అయిదేళ్ల వరకు ఎస్పీజీ రక్షణ కల్పిస్తారు.
సోమవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెడితే బుధవారం ఈ సవరణ బిల్లుపై చర్చ జరిగింది. ఈ చర్చకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమాధానమిస్తూ బ్లాక్ క్యాట్ కమాండోలు ఉదాసీనంగా వ్యవహరించకుండా, వారి సమర్థత పెంచడం కోసమే ఎస్పీజీ చట్టానికి సవరణలు చేశామని చెప్పారు. తొలిరోజుల్లో ఏ ఉద్దేశంతో ఎస్పీజీ చట్టాన్ని తీసుకువచ్చారో దానినే పునరుద్ధరించామని వెల్లడించారు. ఇతర దేశాల్లో కూడా అత్యంత కట్టుదిట్టమైన భద్రత కేవలం దేశాధిపతులకు మాత్రమే ఉంటుందని షా గుర్తు చేశారు.
గాంధీ కుటుంబం భద్రతను మార్చాం
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె పిల్లలు రాహుల్, ప్రియాంకలకు భద్రతను తొలగించలేదని, జెడ్ ప్లస్ కేటగిరీకి భద్రతను మార్చామని అమిత్ షా చెప్పారు. వాస్తవానికి ఇప్పుడే గాంధీ కుటుంబానికి భద్రత మరింత పెరిగిందని అన్నారు. అత్యంత ఆధునిక భద్రతా వ్యవస్థ, అంబులెన్స్‌తో గాంధీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. మాజీ ప్రధానులు చంద్రశేఖర్, ఐకె గుజ్రాల్, మన్మోహన్ సింగ్‌లకు ఎస్పీజీ భద్రత తొలగించినప్పుడు ఎవరూ ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ గతంలో చేసినట్టుగా ప్రతీకారంతో తాము ఈ బిల్లు తీసుకురాలేదని షా అన్నారు. వీఐపీలందరికీ వారి ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు ఆధారంగానే భద్రతను కల్పిస్తున్నామని అన్నారు. ప్రధానమంత్రికి భద్రత కల్పించే స్థాయిలో అందరికీ కల్పించలేమని చెప్పారు. షా వ్యాఖ్యల్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ సభ నుంచి వాకౌట్ చేసింది. ఇతర విపక్షాలు కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించాయి. వాటిని తిరస్కరించిన సభ మూజువాణి ఓటుతో బిల్లుని ఆమోదించింది.
గాడ్సే దేశభక్తుడు: ప్రజ్ఞా
గాంధీజీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేను ‘దేశభక్తుడు’గా పేర్కొంటూ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభలో బుధవారం జరిగిన చర్చలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేయడంతో వివక్షాలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా మహాత్మా గాంధీని ఎందుకు చంపాడనే దానిపై గాడ్సే చేసిన ప్రకటనను డీఎంకే సభ్యుడు రాజా ప్రస్తావిస్తుండగా.. ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగిలారు. ఒక దేశభక్తుడిని మీరు ఉదాహరణగా చెప్పనక్కర్లేదు అని అన్నారు. రాజా మాటలకు ప్రజ్ఞా ఠాకూర్ అడ్డుతగలడంతో విపక్ష సభ్యులు నిరసన తెలిపారు. గాడ్సేపై ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని మరో కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు.
సమ్మెపై 14 రోజులు ముందే చెప్పాలి
సమ్మెకు వెళ్లే కార్మికులు 14 రోజుల ముందే నోటీసు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఈ మేరకు కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ బుధవారం రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త కార్మిక చట్టంలో ఇది భాగమని, దీనిపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో మంత్రిత్వ శాఖ సంప్రదింపులు జరుపుతోందని గంగ్వార్ అన్నారు. కార్మిక చట్టాలలో ప్రభుత్వం సంస్కరణలు తీసుకువస్తోందని పేర్కొన్న మంత్రి, అందులో భాగంగా 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మిళితం చేస్తున్నామని వెల్లడించారు. 2016లో జరిపిన ఒక సర్వే ప్రకారం దేశంలో 10 కోట్ల మంది వలస కార్మికులు ఉన్నారని, ఇది శ్రామిక శక్తిలో 20 శాతం ఉందని తెలిపారు.
ఎస్పీజీ చట్ట సవరణకు ఓకే
Published Thu, Nov 28 2019 3:14 AM | Last Updated on Thu, Nov 28 2019 7:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment