ప్రియాంక కుటుంబానికి కొనసాగనున్న ప్రత్యేక భద్రత
న్యూఢిల్లీ: ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా, పిల్లలకు విమానాశ్రయాల వద్ద తనిఖీల నుంచి కల్పిస్తున్న మినహాయింపును కొనసాగించాలని కేంద్రంలోని ఏన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం భావిస్తోంది. ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల వద్ద ప్రత్యేక భద్రతను నిరాకరించే అవకాశం ఉందంటూ పౌర విమానయాన మంత్రి అశోక్ గజపతి రాజు పరోక్షంగా సంకేతాలివ్వడం, తర్వాత రోజు ప్రభుత్వానికి ప్రియాంక లేఖ రాసిన సంగతి తెలిసిందే.
భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ఆధారంగా జరుగుతుందని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) వర్గాలు తెలిపాయి. కొన్ని నిబంధనల మేరకు ప్రియాంక కుటుంబానికి ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్టు వెల్లడించారు. ఈ విషయంలో మార్పులు చేయాలని కోరుకోవడం లేదని ఎస్పీజీ సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. ప్రియాంక కుటుంబానికి కల్పిస్తున్న ప్రత్యేక భద్రతపై సమీక్షించే ఉద్దేశం లేదని వెల్లడించారు.