సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పట్ల లక్నోలో యూపీ పోలీసులు వ్యవహరించిన తీరును ఆమె భర్త రాబర్ట్ వాద్రా తీవ్రంగా ఖండించారు. మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంకను మహిళా పోలీసులు అడ్డగించి దౌర్జన్యపూరితంగా వ్యవహరించడం సరైంది కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల్లో ఒకరు ప్రియాంక గొంతు పట్టుకోగా, మరొకరు తోసివేయడంతో ప్రియాంక కిందపడ్డారని అన్నారు.
‘నీకు అవసరమైన వారిని కలిసేందుకు ఎంతదూరమైనా వెళ్లే నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నానని, నిన్ను చూసి గర్విస్తున్నాన’ని వాద్రా ట్వీట్ చేశారు. మహిళా పోలీసులు అడ్డగించినా టూ వీలర్‌పై మాజీ ఐపీఎస్ అధికారి ఎస్‌ఆర్ దారాపురి కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు వెళ్లడం ఆమె అంకితభావానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘నీవు చేసింది సరైన పనే.. బాధలో మునిగి సహాయం కోసం వేచిచూసే వారిని కలిసేందుకు వెళ్లడం నేరమేమీ కాద’ని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా తనపై మహిళా పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ప్రియాంక చేసిన ఆరోపణలను యూపీ పోలీసులు తోసిపుచ్చారు. ప్రియాంక గాంధీపై పోలీసులు భౌతిక దాడికి పాల్పడ్డారని జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment