మీడియాతో మాట్లాడుతున్న నవీన్ మిత్తల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో భద్రత వ్యవస్థ ట్యాంపరింగ్‌కు గురైందని, కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే ఈ పని చేశారని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ వెల్లడించారు. బోర్డులో అత్యంత కీలకమైన సీసీ కెమెరా లకు సంబంధించిన పాస్‌వర్డ్ చోరీ అయిందని తెలియడంతో అప్రమత్తమైనట్టు తెలిపారు. ఈ విషయం గుర్తించిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దీని వెనుక సూత్రధా రులెవరో, ఏ అవసరాల కోసం ఈ కుట్రకు పాల్పడ్డారో దర్యాప్తులో తేలుతుందన్నారు. నేర చరిత్ర ఉన్న ఓ వ్యక్తి బోర్డు అధికారిని బెదిరించి, భయపెట్టి పాస్‌వర్డ్‌ను తస్కరించినట్టు ప్రాథమికంగా తెలిసిందన్నారు. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలిచ్చినట్టు మిత్తల్ వెల్లడించారు.
ఆన్‌లైన్ మూల్యాంకనం పూర్తి పారదర్శకం
అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాతే ఈ ఏడాది నుంచి ఇంటర్ సమా ధాన పత్రాల ఆన్‌లైన్ మూల్యాంకనం చేపడుతున్నట్లు మిత్తల్ తెలిపారు. దీనివల్ల మూల్యాంకనం పారదర్శకంగా ఉండటంతోపాటు తప్పుల నివారణ సాధ్య మవుతుందని తెలిపారు. గతంలో విద్యార్థి రీవ్యాల్యూయేషన్ కోరితే జిల్లాల నుంచి పేపర్లు తెప్పించడంలో తీవ్ర జాప్యం జరిగేదని, ఇప్పుడు ఆన్‌లైన్ చేయడం వల్ల వేగవంతంగా పూర్తవుతుందని చెప్పారు.
పేపర్లు దిద్దేవారికి ఇచ్చే టీఏ, డీఏ ఖర్చునూ నివారించవచ్చన్నారు. ఇప్పటికే అన్ని దేశాలూ, విశ్వవిద్యా లయాలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఆన్‌లైన్ మూల్యాంకనం కోసం అధ్యాపకు లకు అవసరమైన శిక్షణ కూడా ఇస్తామని వివరించారు. ఈ ఏడాది ప్రయోగాత్మ కంగా ఆర్ట్స్, కామర్స్, లాంగ్వేజ్‌లకు సంబంధించిన 35 లక్షల పేపర్లను ఆన్‌లైన్ ద్వారా వ్యాల్యుయేషన్ చేస్తున్నామని, రెండేళ్లలో ఈ విధానాన్ని పూర్తిగా విస్తరిస్తా మన్నారు.
గతంలో జరిగిన విధానంలో ప్రైవేటు కాలేజీలు సమాధాన పత్రాలు ఎక్కడకు వెళ్తున్నాయో తెలుసుకుని వారికి అనుకూలమైన విధానాలు అనుసరించారనే ఆరోపణలున్నాయని, ఇలాంటివి ఇప్పుడు సాగవనే ఉద్దేశంతో ఏసీబీ కేసులున్న ఓ వ్యక్తి పనిగట్టుకుని బోర్డు ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడని మిత్తల్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment