Chintala Venkata reddy
-
‘అనాబ్ – ఎ–షాహి’ ఎక్కడోయి ?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ముచ్చట గొలిపే పచ్చని పందిళ్లు.. పంట బాగా వస్తే ఆకుల్ని మించి గుత్తులుగా వేలాడుతూ కన్పించే పండ్లు. ఏళ్ల క్రితం హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో కనువిందు చేసిన ద్రాక్ష(Grape) తోటలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగయ్యాయి. ధనికుల పంటగా ప్రాచుర్యం పొందిన ద్రాక్ష పది హేనేళ్ల క్రితం మేడ్చల్, కీసర, శామీర్‌పేట్, మహేశ్వరం, మన్సాన్పల్లి, గట్టుపల్లి, బాసగూడతండా, రావిర్యాల, మంకాల్, కోళ్లపడకల్, ఆకాన్‌పల్లి, డబిల్‌గూడ, పెండ్యాల్, నాగారం (Nagaram) తదితర ప్రాంతాల్లో విరివిగా సాగయ్యేది. ఒక్కో గ్రామం పరిధిలో 350 నుంచి 400 ఎకరాల్లో ఈ తోటలు వేసే వారు.సీజన్లో శివారు ప్రాంతాల్లో వెలిసే తాత్కాలిక దుకాణాల్లో చవకగా లభించే పండ్లను నగరవాసులు ఆస్వాదించేవారు. జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల్ని నిలిపి మరీ కిలోల కొద్దీ కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. తదనంతర కాలంలో భూగర్భ జలాలు అడుగంటి నీటి కొరత ఏర్పడటం, పెట్టుబడి ఖర్చులు రెట్టింపవడం, చీడపీడల బెడద ఎక్కవవడం, అంచనాలకు మించి నష్టాలు వస్తుండటంతో క్రమేణా ద్రాక్ష సాగు తగ్గిపోయింది.ముఖ్యంగా జాతీయ, అంతర్జాతీయ ఐటీ, అనుబంధ కంపెనీలు నగరానికి క్యూకట్టడం, నగరం విస్తరిస్తూ శివారు ప్రాంతాలు రియల్ వెంచర్లుగా మారడం, భూముల ధరలకు రెక్కలు రావడం కూడా ద్రాక్ష తోటలు కన్పించకుండా పోయేందుకు కారణమయ్యింది. అప్పట్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పదివేల ఎకరాల్లో సాగైన ద్రాక్ష తోటలు..ప్రస్తుతం కేవలం 115 ఎకరాలకే పరిమితమైపోయాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది.నవాబుల కాలంలో..స్వాతంత్య్రానికి ముందు నిజాం నవాబుల భవంతుల వెనుక భాగం (బ్యాక్‌యార్డ్)లో ద్రాక్ష సాగు చేసేవారు. అయితే చాలాచోట్ల ఒకటి రెండు చెట్లే కన్పించేవి. హైదరాబాద్‌లో తెల్ల ద్రాక్ష పంటకు ‘అనాబ్–ఎ–షాహి’గా నామకరణం చేశారు. టోలిచౌకిలో గద్దె రామకోటేశ్వరరావు తొలిసారిగా ద్రాక్ష పంటను సాగు చేసినట్లు చరిత్ర చెబుతోంది. సాధారణంగా సమశీతోష్ణ మండలంలో పండే పంటను హైదరాబాద్ పరిసరాల్లో పండించి ఆయన ఒకరకంగా చరిత్ర సృష్టించారు.దీంతో అప్పటి ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. అప్పట్లో ఎకరానికి ఆరు నుంచి ఏడు టన్నుల వరకు దిగుబడి సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత అప్పటివరకు ఉగాండా, కెన్యా, దక్షిణాఫ్రికా దేశాల్లో స్థిరపడిన వారు అక్కడి అలజడుల కారణంగా హైదరాబాద్‌కు వలస వచ్చారు. పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేసి ’అనబిషాయి’ సాగు చేశారు. ఆంధ్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన కొందరు కూడా ద్రాక్షను సాగు చేశారు. ఇలా పలువురు ధనవంతులు ఈ పంటపై దృష్టి సారించారు. దీంతో ఆ పంటకు ’రిచ్మెన్ క్రాప్ (ధనికుల పంట)’గా పేరొచ్చింది.‘అనాబ్–ఎ–షాహి’ అంటే ద్రాక్షలో రారాజు అని అర్థం. నిజాం కాలంలో దీనికి నామకరణం చేశారు. 2005 నుంచి తగ్గుముఖందిగుబడితో పాటు లాభాలు అధికంగా ఉండటంతో 1990 తర్వాత స్థానిక రైతులు కూడా ఈ పంట సాగు మొదలు పెట్టారు. 1991లో హైదరాబాద్ వేదికగా గ్రేప్స్ పంటపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించడం గమనార్హం. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ద్రాక్ష పంటకు రాజధానిగా గుర్తింపు పొందింది. ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకుని మహారాష్ట్రలో కూడా సాగు ప్రారంభించారు. 2005 వరకు ఇక్కడి వైభవం కొనసాగింది. ఆ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పటి ఈ పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారాయి. దీంతో ఒకప్పుడు నగర వాసులకు తీపిని పంచిన స్థానిక ద్రాక్ష.. ప్రస్తుతం అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం మహా రాష్ట్ర నుంచి పెద్ద మొత్తంలో ద్రాక్ష దిగుమతి అవుతోంది. స్థానిక రైతులు పోటీలోనే లేని పరిస్థితి ఉంది. మెజార్టీ ఆదాయం సాగు ఖర్చుకేనేను గత 15 ఏళ్లుగా ద్రాక్ష పంటను సాగు చేస్తున్నా. ఒకసారి మొక్కను నాటితే 20 ఏళ్లపాటు దిగుమతి వస్తుంది. మొదట్లో ’థాంసన్’ వెరైటీని సాగు చేశా. తర్వాత ’మాణిక్ చమాన్’ వెరైటీని ఎంచుకున్నా. ఎకరాకు వెయ్యి మొక్కలు చొప్పున నాలుగు ఎకరాల్లో నాటా. మొక్కల ఎంపిక సహా సస్యరక్షణలో చిన్నచిన్న మెళుకువలు పాటించి నాటిన రెండేళ్లకే అనూహ్యంగా మంచి దిగుబడిని సాధించా. ప్రస్తుతం ఒక్కో చెట్టు నుంచి 20 కేజీల వరకు దిగుమతి వస్తోంది. ఎకరా పంటకు కనీసం నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వస్తుంది. అయితే కూలీ రేట్లు, ఎరువుల ధరలు పెరగడంతో మెజార్టీ ఆదాయం పంట సాగుకే ఖర్చవుతోంది. – కొమ్మిరెడ్డి అంజిరెడ్డి, రైతు, తుక్కుగూడఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదుఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. భూములూ అందుబాటులో లేవు. దీంతో ద్రాక్ష సాగు తగ్గిపోయింది. కూలీల ఖర్చులు పెరగడం, దిగుబడి సమయంలో ఈదురుగాలులు, వడగళ్ల వర్షం లాంటి వాటితో పంట నష్టపోవాల్సి వస్తోంది. మాలాంటి అనుభవం ఉన్న పాత రైతులే ద్రాక్షను సాగు చేయలేని పరిస్థితి ఉంది. ఇక కొత్తగా ఎవరైనా ప్రయత్నించినా భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. – చింతల వెంకట్‌రెడ్డి, ఒకప్పటి ద్రాక్ష రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
'మట్టి మనిషి' ఫిల్మ్ ప్రివ్యూ బాగుంది: నటుడు హర్షవర్దన్
నటుడు, రచయిత బాసంగి సురేష్ రచించిన ‘కవితా చిత్రమ్’ పుస్తకావిష్కరణ, బాసంగి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మట్టి మనిషి’ ఫిల్మ్ ప్రివ్యూ రామనాయుడు స్టూడియోస్ లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి గా నటుడు, రచయిత, దర్శకుడు హర్షవర్ధన్, గౌరవ అతిథి గా పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ కవితా చిత్రమ్ పుస్తకావిష్కరణ, మట్టి మనిషి ఫిల్మ్ ప్రివ్యూలో నటుడు, రచయిత హర్షవర్ధన్ చేతుల మీదగా జరిగింది. ఈ సందర్భంగా హర్షవర్ధన్ మాట్లాడుతూ.. పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతల వెంకటరెడ్డి ఒక శాస్త్రజ్ఞుడని , నిరుత్సాహపడుతున్న రైతులకు ఆయన స్పూర్తి అని కొనియాడాడు. ‘వెంకటరెడ్డి స్ఫూర్తితో తీసిన ‘మట్టి మనిషి’ డెమో ఫిల్మ్ బాగుంది. ఆయన బయోపిక్ కూడా రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి మాట్లాడుతూ..సాగుచేస్తున్న నేలలో నిస్సారవంతమైన భూమిని సారవంతం చేయడమే నా ప్రక్రియ . ఇది 2004 లో పేటెంట్ చేయబడింది. ఒక రైతు గా నేను చేసినవే పేటెంట్ కోసం రాశాను. వాటిని వాళ్ళు శాస్త్రీయంగా పరిశీలించి యదాతధంగా ఆమోదించారు. దీని గురించి ప్రధాని మోడీ కూడా మన్ కీ బాత్ లో ప్రస్తావించడం జరిగింది.’ అన్నారు ఈ కార్యక్రమంలో షేడ్స్ స్టూడియో సి.ఇ.ఓ దేవీ ప్రసాద్, బాసంగి సురేష్, చిత్రకారుడు, సినీ గీత రచయిత తుంబలి శివాజీ, సినీ దర్శకులు, ఎస్ ఎస్ పట్నాయక్, కర్రి బాలాజీ, కాళీ చరణ్, మధుసూదన రావు, సంగీత దర్శకుడు సాహిణి శ్రీనివాస్, మట్టి మనిషి దర్శకుడు విరాజ్ వర్మ, నటులు నవీన్, హరినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి తోటల సంరక్షణ.. సీవీఆర్ మెళకువలు
వర్షాకాలంలో మామిడి తోటల సంరక్షణకు మట్టి సేద్య నిపుణులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఈ సూచనలు చేశారు. మామిడి ప్రూనింగ్ చేయటానికి ముందు లేదా చేసిన తర్వాత ప్రతీ చెట్టుకు 25 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు+ 50 నుంచి 100 కిలోల లోపలి మట్టి (సబ్ సాయిల్.. అంటే భూమిలో 2 నుంచి 4 అడుగుల లోతు నుంచి తవ్విన మట్టి) + 5 కిలోల ఆముదం పిండి (హై డెన్సిటీ ప్లాంటింగ్‌లో అయితే ఆముదం పిండి చెట్టుకు 2 కిలోలు చాలు) వేసుకోవాలి. మట్టి, ఎరువు, ఆముదం పిండిని ఈ పాళ్లలో కలిపిన (130 కిలోల) మిశ్రమాన్ని సీజన్‌కు ఒకసారి ప్రతి చెట్టుకూ డ్రిప్పర్ల దగ్గర వేసుకోవచ్చు. ఆ తర్వాత, ప్రతి 15 రోజులకోసారి.. డ్రిప్పర్ల దగ్గర 2 కిలోల చొప్పున పై మట్టి (టాప్ సాయిల్) + లోపలి మట్టి కలిపిన మిశ్రమాన్ని వేసుకుంటే పోషకాల లోపం రాకుండా ఉంటుంది. చెట్టు ఎదుగుదల సంతృప్తికర స్థితికి వచ్చేంత వరకు ప్రతి 15 రోజులకోసారి వెయ్యాలి. అయితే, చెట్టుకు ఈ విధంగా 130 కిలోల మిశ్రమాన్ని ఒకటేసారి కాకుండా దాన్ని 4 భాగాలుగా విభజించి.. 20 రోజులకు ఒక్కో భాగాన్ని వేసుకోవచ్చు. అటువంటప్పుడు ఇక డ్రిప్పర్ల దగ్గర 15 రోజులకోసారి 2 కిలోల చొప్పున అదనంగా వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అమావాస్య/పౌర్ణమికి ముందు పిచికారీ: 200 లీటర్ల నీటిలో 20 కిలోల లోపలి మట్టి తో పాటు.. 2 కిలోల గోధుమ లేదా సోయా బీన్ మొలకల మిశ్రమాన్ని కలిపి పిచికారీ చెయ్యాలి. సంతృప్తికర స్థితికి తోట ఎదిగేంత వరకు అమావాస్యకు ముందు, పౌర్ణమికి ముందు ఈ మట్టి, మొలకల ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. -
మట్టే బంగారం !
* రసాయనిక ఎరువులకు బదులు మట్టినే ఎరువుగా వాడుతున్న దానిమ్మ రైతులు * సాగు ఖర్చు తగ్గడంతోపాటు పర్యావరణానికీ మేలు * ఎకరానికి 3-3.5 టన్నుల నాణ్యమైన దిగుబడి * విస్తరిస్తున్న చింతల వెంకటరెడ్డి సాగు పద్ధతి పంట పండాలంటే ఏదో ఒక ఎరువు వేయక తప్పదు. ఎరువు అంటే.. చటుక్కున స్ఫురించేది రసాయనిక ఎరువే! అంటే రసాయనిక ఎరువులు చల్లకుండా పంట పండిందంటే ఇప్పటికీ ఆశ్చర్యపడే వాళ్లున్నారు. అటువంటిది.. చెంచాడు రసాయనిక ఎరువు వాడకుండా, వర్మీ కంపోస్టు కూడా వాడకుండా కేవలం తమ దానిమ్మ తోటలో సాళ్ల మధ్యలో నుంచి పొడి మట్టిని తీసి.. ప్రతి పది రోజులకోసారి ఎరువుగా వేస్తూ బంగారు పంటలు పండిస్తున్న రైతులున్నారు! ఇది వినడానికి ఆశ్చర్యం గానో, అతిశయోక్తిగానో అనిపించవచ్చు కానీ.. ముమ్మాటికీ నిజం! రైతు కుటుంబంలో పుట్టిన కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి అన్నదమ్ములు. వరి, కూరగాయ రైతులైన వీరి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి. అదే మండలం రేగడి దోస్వాడ గ్రామంలో ఏడాదిన్నర క్రితం నుంచి దానిమ్మ తోటను సాగు చేస్తున్నారు. ఒక్క స్పూను రసాయనిక ఎరువు వేయకుండా చక్కని పంట దిగుబడి పొందుతున్నారు. 25 ఎకరాల చెల్క(ఎర్ర) భూమిని సాగులోకి తెచ్చి, గత ఏడాది జనవరి 18న భగువ రకం మొక్కలు ఎకరానికి 320 చొప్పున నాటి డ్రిప్ అమర్చారు. ప్రతి 10-12 రోజులకోసారి ఆ పొలంలోని సాళ్ల మధ్యలో కల్టివేటర్‌తో దున్ని.. ఆ పొడి మట్టినే దానిమ్మ మొక్కలకు ఎరువుగా వాడుతూ వచ్చారు. మొక్కకు అటొక డ్రిప్పరు, ఇటొక డ్రిప్పరు ఉంటుంది. ప్రతి డ్రిప్పర్ దగ్గర ఒక్కో తడవకు కిలో- కిలోన్నర మట్టిని వేస్తున్నారు. తోట ఎంతో ఆరోగ్యంగా పెరిగింది. ఒక చెంచా కూడా రసాయనిక ఎరువులు, వర్మీ కంపోస్టు వాడలేదని తోటను కంటికి రెప్పలా కాపాడుతున్న యువ రైతు సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, రెండు సార్లు పశువుల ఎరువు వేశామన్నారు. ఎకరానికి గత ఏడాది అక్టోబర్‌లో 2 టన్నులు, ఈ ఏడాది జూన్‌లో మరోసారి 3 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేశామని, ద్రవరూప ఎరువులు కూడా వాడలేదన్నారు. అయితే, చీడపీడలు రాకుండా క్రిమిసంహారక మందులు, శిలీంద్రనాశనులు మాత్రం మామూలుగానే వాడామని తెలిపారు. ఎర్రని రంగు, తీపి, నాణ్యత.. జనవరిలో నాటిన మొక్కలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో బెట్ట గట్టారు(డ్రైస్పెల్). ఆకు రాలడం కోసం ఈ ఏడాది జనవరి 17న ఎత్రిల్ పిచికారీ చేసి, ఐదు రోజుల తర్వాత నుంచి నీటి తడులివ్వడం ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీ నుంచి దానిమ్మ పండ్ల కోతకు శ్రీకారం చుట్టారు. చక్కని సైజు, ఎర్రని రంగు, తీపి, నాణ్యతలతో కూడిన దానిమ్మ పంట దిగుబడి రావడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. మొక్కకు 80 నుంచి 100 కాయల వరకు కాయడంతో కొమ్మలు నేల మీదకు వంగడంతో.. వెదురు కర్రలు పాతి తాళ్లతో పైకి ఎత్తి కట్టారు. ఎకరానికి మూడు- మూడున్నర టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానిమ్మ కాయ బరువు సాధారణం కంటే 10 శాతం అధికంగా ఉందని, తొక్క మందంగా ఉండడం వల్ల నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని సుధాకర్‌రెడ్డి అన్నారు. వెంకటరెడ్డి స్ఫూర్తితో.. సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే పొడి మట్టిని ఎరువుగా వాడి పంటలు పండించవచ్చనే సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులు కూడా వాడకుండా వరి, గోధుమ, కూరగాయలు సాగు చేశారాయన. భూమి(కనీసం అడుగు) లోపలి నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే పది రోజులకోసారి ఎరువుగా వాడి ఈ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. అధికాదాయాన్నిచ్చే పంటయిన ద్రాక్ష సాగులో మాత్రం క్రిమిసంహారక మందులు, శిలీంద్ర నాశనులు యథావిధిగా వాడుతూ.. రసాయనిక ఎరువులకు బదులుగా పొడి మట్టినే ఎరువుగా వేస్తున్నారు. ఈ సాగు పద్ధతిపై 70 దేశాల్లో పేటెంట్ హక్కులను సైతం పొందారు(పూర్తి వివరాలను 07-04-2014 నాటి ‘సాగుబడి’ పేజీలో ప్రచురించాం). మరో 300 ఎకరాల్లోనూ.. అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటల్లో ఒకటైన దానిమ్మ సాగులోనూ ఈ పద్ధతిని అనుసరించి పంటలు పండించడంలో ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి సోదరులు ముందంజ వేశారు. అల్వాల్‌కు చెందిన శంకర్‌రెడ్డి తదితరుల బృందం రంగారెడ్డి జిల్లాలోని వివిధ చోట్ల మరో 300 ఎకరాల్లో దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. వీరు కూడా గత ఏడాది నుంచి రసాయనిక ఎరువులకు బదులుగా మట్టి ఎరువునే వాడి.. ఎకరానికి మూడు టన్నులకు పైగా దిగుబడి సాధిస్తుండడం విశేషం. రసాయనిక ఎరువులు కొనే పని తప్పడంతో ఈ రైతులకు సాగు ఖర్చులు బాగా తగ్గాయి. పంటలకు వేసే రసాయనిక ఎరువుల వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలవనరులు కూడా కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులు తగ్గించు కోవ డంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ దోహద పడే విధంగా ఈ రైతులు పొడి మట్టినే ఎరువుగా వాడుతూ.. చక్కని దిగుబడులు సైతం తీయడం సంతోషదాయకం. వెంకటరెడ్డి చూపిన వెలుగుబాటలో మరికొందరు రైతులు పయనించడం par శుభసూచకం.ఙ- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ ఫొటోలు: ఎం.అనిల్ కుమార్ ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె..! వెంకటరెడ్డి గారి సూచనల మేరకు.. కేవలం పొడి మట్టినే ఎరువుగా వేసి పండించాం. రసాయనిక ఎరువుల అవసరం లేదని రుజువైంది. వట్టి మట్టితో పంట పండుతుందా? అని ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె. ఒకటి రెండు సార్లు మట్టి వేసిన తర్వాత పంట బాగుండడంతో నమ్మకం కుదిరింది. తెగుళ్లు, బ్యాక్టీరియా జబ్బులు రాలేదు. 180-300 గ్రాముల కాయలున్నాయి. రసాయనాలు వాడకపోవడం వల్ల రంగు, నాణ్యత, నిగారింపు వచ్చాయి. చూడ్డానికొచ్చిన రైతులు తలా ఒక మాట చెప్పినా.. వెంకటరెడ్డి గారి మీద నమ్మకంతో కొనసాగించి.. మంచి ఫలితం పొందడం ఆనందంగా ఉంది. ఇతర రైతులూ ఈ పద్ధతిని ఆచరించవచ్చు. - కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి(99089 34648), దానిమ్మ రైతులు, రేగడి దోస్వాడ, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా ఇప్పుడేమంటారు? మంచి యాజమాన్య మెల కువలు పాటిస్తారు కాబట్టి వెంకటరెడ్డి పొలంలో మట్టిని ఎరువుగా వాడినా పంటలు పండుతున్నాయని శాస్త్ర వేత్తలు అంటుండేవాళ్లు. ఇప్పుడు పలువురు రైతులు ఈ పద్ధతిలో చక్కగా దానిమ్మ పండించి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. పొడి మట్టిలో సకల పోషకాలు నిక్షిప్తమవుతాయి. ఈ మట్టికి నీరు తగిలినప్పుడు పోషకాలు విడుదలై పంటలకు అందుతున్నాయి.. అంతే! - చింతల వెంకటరెడ్డి(98668 83336), రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్ 300 ఎకరాల్లో పండిస్తున్నాం! 10 మంది రైతులం కలిసి 300 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నాం. వెంకటరెడ్డి చెప్పింది చెప్పినట్లు చేస్తున్నం. ఎకరానికి 3 టన్నులకు పైగా దిగుబడి వస్తుండడంతో సంతోషంగా ఉంది. కాయ బరువు 10% ఎక్కువగా ఉంది. కొనుగోలుదారులు తూకం చూసుకుం టున్నారు. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా 10 రోజులు ఈ కాయలు చెక్కుచెదరడం లేదు. - పెద్ది శంకర్‌రెడ్డి, దానిమ్మ రైతు, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్