మట్టే బంగారం ! | farmers to use of soil for Pomegranate crops instead of Fertilizers | Sakshi
Sakshi News home page

మట్టే బంగారం !

Published Mon, Aug 11 2014 12:41 AM | Last Updated on Mon, Oct 1 2018 6:38 PM

మట్టే బంగారం ! - Sakshi

మట్టే బంగారం !

* రసాయనిక ఎరువులకు బదులు మట్టినే ఎరువుగా వాడుతున్న దానిమ్మ రైతులు
* సాగు ఖర్చు తగ్గడంతోపాటు పర్యావరణానికీ మేలు
* ఎకరానికి 3-3.5 టన్నుల నాణ్యమైన దిగుబడి
* విస్తరిస్తున్న చింతల వెంకటరెడ్డి సాగు పద్ధతి


పంట పండాలంటే ఏదో ఒక ఎరువు వేయక తప్పదు. ఎరువు అంటే.. చటుక్కున స్ఫురించేది రసాయనిక ఎరువే! అంటే రసాయనిక ఎరువులు చల్లకుండా పంట పండిందంటే ఇప్పటికీ ఆశ్చర్యపడే వాళ్లున్నారు. అటువంటిది.. చెంచాడు రసాయనిక ఎరువు వాడకుండా, వర్మీ కంపోస్టు కూడా వాడకుండా కేవలం తమ దానిమ్మ తోటలో సాళ్ల మధ్యలో నుంచి పొడి మట్టిని తీసి.. ప్రతి పది రోజులకోసారి ఎరువుగా వేస్తూ బంగారు పంటలు పండిస్తున్న రైతులున్నారు! ఇది వినడానికి ఆశ్చర్యం గానో, అతిశయోక్తిగానో అనిపించవచ్చు కానీ.. ముమ్మాటికీ నిజం!

రైతు కుటుంబంలో పుట్టిన కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి అన్నదమ్ములు. వరి, కూరగాయ రైతులైన వీరి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వెల్లి. అదే మండలం రేగడి దోస్వాడ గ్రామంలో ఏడాదిన్నర క్రితం నుంచి దానిమ్మ తోటను సాగు చేస్తున్నారు. ఒక్క స్పూను రసాయనిక ఎరువు వేయకుండా చక్కని పంట దిగుబడి పొందుతున్నారు. 25 ఎకరాల చెల్క(ఎర్ర) భూమిని సాగులోకి తెచ్చి, గత ఏడాది జనవరి 18న భగువ రకం మొక్కలు ఎకరానికి 320 చొప్పున నాటి డ్రిప్ అమర్చారు. ప్రతి 10-12 రోజులకోసారి ఆ పొలంలోని సాళ్ల మధ్యలో కల్టివేటర్‌తో దున్ని.. ఆ పొడి మట్టినే దానిమ్మ మొక్కలకు ఎరువుగా వాడుతూ వచ్చారు.

 మొక్కకు అటొక డ్రిప్పరు, ఇటొక డ్రిప్పరు ఉంటుంది. ప్రతి డ్రిప్పర్ దగ్గర ఒక్కో తడవకు కిలో- కిలోన్నర మట్టిని వేస్తున్నారు. తోట ఎంతో ఆరోగ్యంగా పెరిగింది. ఒక చెంచా కూడా రసాయనిక ఎరువులు, వర్మీ కంపోస్టు వాడలేదని తోటను కంటికి రెప్పలా కాపాడుతున్న యువ రైతు సుధాకర్‌రెడ్డి తెలిపారు. అయితే, రెండు సార్లు పశువుల ఎరువు వేశామన్నారు. ఎకరానికి గత ఏడాది అక్టోబర్‌లో 2 టన్నులు, ఈ ఏడాది జూన్‌లో మరోసారి 3 టన్నుల చొప్పున పశువుల ఎరువు వేశామని, ద్రవరూప ఎరువులు కూడా వాడలేదన్నారు. అయితే, చీడపీడలు రాకుండా క్రిమిసంహారక మందులు, శిలీంద్రనాశనులు మాత్రం మామూలుగానే వాడామని తెలిపారు.

ఎర్రని రంగు, తీపి, నాణ్యత..
జనవరిలో నాటిన మొక్కలను గత ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో బెట్ట గట్టారు(డ్రైస్పెల్). ఆకు రాలడం కోసం ఈ ఏడాది జనవరి 17న ఎత్రిల్ పిచికారీ చేసి, ఐదు రోజుల తర్వాత నుంచి నీటి తడులివ్వడం ప్రారంభించారు. ఈ నెల 1వ తేదీ నుంచి దానిమ్మ పండ్ల కోతకు శ్రీకారం చుట్టారు.  చక్కని సైజు, ఎర్రని రంగు, తీపి, నాణ్యతలతో కూడిన దానిమ్మ పంట దిగుబడి రావడం చూపరులను ఆశ్చర్యచకితులను చేసింది. మొక్కకు 80 నుంచి 100 కాయల వరకు కాయడంతో కొమ్మలు నేల మీదకు వంగడంతో.. వెదురు కర్రలు పాతి తాళ్లతో పైకి ఎత్తి కట్టారు. ఎకరానికి మూడు- మూడున్నర టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. దానిమ్మ కాయ బరువు సాధారణం కంటే 10 శాతం అధికంగా ఉందని, తొక్క మందంగా ఉండడం వల్ల నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని సుధాకర్‌రెడ్డి అన్నారు.

వెంకటరెడ్డి స్ఫూర్తితో..
సికింద్రాబాద్‌లోని ఓల్డ్ అల్వాల్‌కు చెందిన రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి కొన్నేళ్ల క్రితమే పొడి మట్టిని ఎరువుగా వాడి పంటలు పండించవచ్చనే సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. రసాయనిక ఎరువులతోపాటు పురుగుమందులు కూడా వాడకుండా వరి, గోధుమ, కూరగాయలు సాగు చేశారాయన. భూమి(కనీసం అడుగు) లోపలి నుంచి తీసి ఎండబెట్టిన పొడి మట్టినే పది రోజులకోసారి ఎరువుగా వాడి ఈ పంటలు పండించడం ఆయన ప్రత్యేకత. అధికాదాయాన్నిచ్చే పంటయిన ద్రాక్ష సాగులో మాత్రం క్రిమిసంహారక మందులు, శిలీంద్ర నాశనులు యథావిధిగా వాడుతూ.. రసాయనిక ఎరువులకు బదులుగా పొడి మట్టినే ఎరువుగా వేస్తున్నారు. ఈ సాగు పద్ధతిపై 70 దేశాల్లో పేటెంట్ హక్కులను సైతం పొందారు(పూర్తి వివరాలను 07-04-2014 నాటి ‘సాగుబడి’ పేజీలో ప్రచురించాం).

 మరో 300 ఎకరాల్లోనూ..
అధికాదాయాన్నిచ్చే ఉద్యాన పంటల్లో ఒకటైన దానిమ్మ సాగులోనూ ఈ పద్ధతిని అనుసరించి పంటలు పండించడంలో ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి సోదరులు ముందంజ వేశారు. అల్వాల్‌కు చెందిన శంకర్‌రెడ్డి తదితరుల బృందం రంగారెడ్డి జిల్లాలోని వివిధ చోట్ల మరో 300 ఎకరాల్లో దానిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. వీరు కూడా గత ఏడాది నుంచి రసాయనిక ఎరువులకు బదులుగా మట్టి ఎరువునే వాడి.. ఎకరానికి మూడు టన్నులకు పైగా దిగుబడి సాధిస్తుండడం విశేషం. రసాయనిక ఎరువులు కొనే పని తప్పడంతో ఈ రైతులకు సాగు ఖర్చులు బాగా తగ్గాయి.

 పంటలకు వేసే రసాయనిక ఎరువుల వల్ల భూసారం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలవనరులు కూడా కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాగు ఖర్చులు తగ్గించు కోవ డంతోపాటు పర్యావరణ పరిరక్షణకూ దోహద పడే విధంగా ఈ రైతులు పొడి మట్టినే ఎరువుగా వాడుతూ.. చక్కని దిగుబడులు సైతం తీయడం సంతోషదాయకం. వెంకటరెడ్డి చూపిన వెలుగుబాటలో మరికొందరు రైతులు పయనించడం par శుభసూచకం.ఙ- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
ఫొటోలు: ఎం.అనిల్ కుమార్

ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె..!
వెంకటరెడ్డి గారి సూచనల మేరకు.. కేవలం పొడి మట్టినే ఎరువుగా వేసి పండించాం. రసాయనిక ఎరువుల అవసరం లేదని రుజువైంది. వట్టి మట్టితో పంట పండుతుందా? అని ఫస్ట్ మాకూ నమ్మకం లేకుండె. ఒకటి రెండు సార్లు మట్టి వేసిన తర్వాత పంట బాగుండడంతో నమ్మకం కుదిరింది. తెగుళ్లు, బ్యాక్టీరియా జబ్బులు రాలేదు. 180-300 గ్రాముల కాయలున్నాయి. రసాయనాలు వాడకపోవడం వల్ల రంగు, నాణ్యత, నిగారింపు వచ్చాయి. చూడ్డానికొచ్చిన రైతులు తలా ఒక మాట చెప్పినా.. వెంకటరెడ్డి గారి మీద నమ్మకంతో కొనసాగించి.. మంచి ఫలితం పొందడం ఆనందంగా ఉంది. ఇతర రైతులూ ఈ పద్ధతిని ఆచరించవచ్చు.
- కొలను ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి(99089 34648),
దానిమ్మ రైతులు, రేగడి దోస్వాడ, షాబాద్ మండలం, రంగారెడ్డి జిల్
లా  

ఇప్పుడేమంటారు?
మంచి యాజమాన్య మెల కువలు పాటిస్తారు కాబట్టి వెంకటరెడ్డి పొలంలో మట్టిని ఎరువుగా వాడినా పంటలు పండుతున్నాయని శాస్త్ర వేత్తలు అంటుండేవాళ్లు. ఇప్పుడు పలువురు రైతులు ఈ పద్ధతిలో చక్కగా దానిమ్మ పండించి చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం నిలకడ మీదే తెలుస్తుంది. పొడి మట్టిలో సకల పోషకాలు నిక్షిప్తమవుతాయి. ఈ మట్టికి నీరు తగిలినప్పుడు పోషకాలు విడుదలై పంటలకు అందుతున్నాయి.. అంతే!
- చింతల వెంకటరెడ్డి(98668 83336), రైతు శాస్త్రవేత్త, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్

300 ఎకరాల్లో పండిస్తున్నాం!
10 మంది రైతులం కలిసి 300 ఎకరాల్లో దానిమ్మ సాగు చేస్తున్నాం. వెంకటరెడ్డి చెప్పింది చెప్పినట్లు చేస్తున్నం. ఎకరానికి 3 టన్నులకు పైగా దిగుబడి వస్తుండడంతో సంతోషంగా ఉంది. కాయ బరువు 10% ఎక్కువగా ఉంది. కొనుగోలుదారులు తూకం చూసుకుం టున్నారు. ఫ్రిజ్‌లో పెట్టకపోయినా 10 రోజులు ఈ కాయలు చెక్కుచెదరడం లేదు.
 - పెద్ది శంకర్‌రెడ్డి, దానిమ్మ రైతు,
    ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement