గతంలో అంతగా కదలికలు లేని ప్రాంతాల్లోనూ సంచారం
33 జిల్లాలకుగాను 13కుపైగా జిల్లాల్లో నమోదైన కదలికలు
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు నిర్ధారణ
కవ్వాల్ టైగర్ రిజర్వ్ వెలుపల ఐదారు తిరుగుతున్నట్లు గుర్తింపు
తెలంగాణలో పెద్ద పులుల గాండ్రింపులు పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని రెండు పులుల అభయారణ్యాలైన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ (ఏటీఆర్), కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్)లలోనే కాకుండా కొత్త ప్రదేశాల్లోనూ పులులు కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల 30, 40 ఏళ్ల తర్వాత వాటి కదలికలు రికార్డవుతున్నాయి.
టైగర్ రిజర్వ్‌లలో పులుల సంఖ్య పెరుగుదలకు అనుకూల పరిస్థితులు ఉండటంతోపాటు పొరుగునే ఉన్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి అభయారణ్యాల్లోంచి రాష్ట్రంలోకి పులుల వలసలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఎందుకంటే.. తెలంగాణలో మెరుగైన అటవీ విస్తరణ, వేటకు తగిన సంఖ్యలో జంతువులు, నీటివనరులు, గడ్డి భూములు ఉన్నాయి. దీంతో పులులు ఇక్కడకు తరలి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాలకుగాను 13కుపైగా జిల్లాల్లో పులుల కదలికలను అధికారులు ఇటీవల గుర్తించారు. –సాక్షి, హైదరాబాద్
100 పులుల ఆవాసానికి అనుకూలం...
ఒక పులి (Tiger) స్వేచ్ఛగా తిరుగుతూ తన జీవనాన్ని సాగించేందుకు 50 చ.కి.మీ. అడవి అవసరమవుతుంది. దీన్నిబట్టి తెలంగాణలోని అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లతో కలుపుకుంటే దాదాపు 5 వేల చ.కి.మీ. అటవీ ప్రాంతం అందుబాటులో ఉంది. ఇది సుమారు 100 పులులు జీవించేందుకు, స్థిరనివాసం ఏర్పరచుకోవడానికి అవకాశం ఉందని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.
అమ్రాబాద్ (Amrabad Tiger Reserve) టైగర్ రిజర్వ్‌లో ప్రస్తుతం రాష్ట్రంలోనే అత్యధికంగా 33 పులులు ఉన్నట్లు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇక కవ్వాల్‌లో కోర్ ఏరియాలో కొంతకాలంగా ఒక్క పులి కూడా స్థిరనివాసం ఏర్పరచుకోలేదు. అయితే మహారాష్ట్ర–తెలంగాణ (ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా) టైగర్ కారిడార్, సరిహద్దు ప్రాంతాల్లో ఐదారు పెద్ద పులులు సంచరిస్తున్నట్లు తాజా ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇటీవల కాలంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే (Adilabad district) మనుషులపై పులుల దాడులు, ఒకరి మృతి, మరొకరు తీవ్రంగా గాయపడటం, పలుచోట్ల పశువుల సంహారం వంటివి చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దాదాపు 10–15 ఏళ్ల కిందట ‘టైగర్ టెరిటరీ’గా ఉన్న అడవులు కొన్నిచోట్ల ఆక్రమణలతో పొలాలు, పత్తి చేన్లుగా మారిపోయాయి.
మళ్లీ పులులు అక్కడకు చేరుకొనేటప్పటికి పత్తిచేన్లు మూడున్నర, నాలుగు అడుగుల మేర ఏపుగా పెరగడం, కిందకు వంగి పత్తి ఏరే కూలీలను వెనక నుంచి చూసి పులులు ఎరగా పొరబడి దాడులకు పాల్పడుతున్నాయని ఓ అటవీ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.
మహారాష్ట్రలో (Maharashtra) సంతానానికి జన్మనిచ్చాక పెద్ద పులులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్న క్రమంలో సరైన ఆవాసం దొరకకపోవడంతోపాటు ఆహారాన్వేషణలో దాడులు జరుగుతున్నాయని చెప్పారు. పులులు ఒకే మార్గంలో కాకుండా 3, 4 దిశల నుంచి వస్తుండటం వల్ల వాటి కదలికలను అంచనా వేయడం కష్టంగా మారుతోందన్నారు.
కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు...
కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
కొత్త ప్రాంతాల్లో ఆనవాళ్లు...
కొన్నేళ్లుగా పెద్ద పులులు కనిపించని భూపాలపల్లి, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, మంచిర్యాల, ఇచ్చోడ, బోథ్, పెద్దపల్లి వంటి చోట్ల ఇటీవల కాలంలో పులుల కదలికలు నమోదయ్యాయి. రాష్ట్ర పర్యావరణానికి సంబంధించి దీన్ని ముఖ్యమైన పరిణామంగా పర్యావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
దేశవ్యాప్తంగా మొత్తం 54 పులుల అభయారణ్యాలు ఉండగా వాటిలో 2 వేల చ.కి.మీ. పైబడి అటవీ వైశాల్యమున్న కొన్నింటిలో ఏపీలోని నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (ఎన్‌ఎస్‌టీఆర్) 3,728 చ.కి.మీ.లలో., తెలంగాణలోని అమ్రాబాద్ 2,611 చ.కి.మీ.లలో, కవ్వాల్ టైగర్ రిజర్వ్ 2,016 చ.కి.మీ.ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి.
పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం పులితోనే ముడిపడి ఉంది
పులికి హాని జరగకుండా సంరక్షించుకుంటే దాని ద్వారా ఇతర జంతువులకూ రక్షణ లభిస్తుంది. టైగర్‌ను ఫ్లాగ్íÙప్ ఫర్ ఎకోసిస్టమ్‌గా, అంబ్రెల్లా స్పీషిస్‌గా పరిగణిస్తాం. గొడుగు ఎలా అయితే తన నీడలో లేదా కింద ఉన్న వాటిని తడవకుండా రక్షిస్తుందో పులి కూడా అంతే.
పర్యావరణ వ్యవస్థ, జీవవైవిధ్యం కూడా పులితోనే ముడిపడి ఉంది. అడవులు, ముఖ్యంగా పులుల అభయాణ్యాల నుంచే వర్షపునీరు కిందకు ప్రవహించి నదుల్లోకి చేరుతోంది. వాననీటితోపాటు బురద, ఇసుక వంటివి నదుల్లోకి సిల్ట్ రూపంలో చేరకుండా అడవులు అడ్డుకుంటాయి. పండ్లు, ఫలాలతోపాటు అడవుల్లోని ఔషధ మొక్కల ద్వారా మనకు మందులు లభిస్తున్నాయి.
– ఫరీదా తంపాల్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్–నేచర్ స్టేట్ డైరెక్టర్ (హైదరాబాద్ సెంటర్)
పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది
తెలుగు రాష్ట్రాల్లోని 3 టైగర్ రిజర్వ్‌లు నదుల ఒడ్డునే ఉండటంతోపాటు ఈ అడవుల్లోంచే అత్యధిక వాటా నీరు నదుల్లోకి చేరుతోంది. అందువల్ల తెలంగాణ, ఏపీ భవిష్యత్ పర్యావరణపరంగా సురక్షితంగా ఉండాలంటే ఈ అభయారణ్యాల్లోని పులులను పరిరక్షించుకోవాల్సిన అవసరముంది.
పులుల ఆవాసాల ద్వారా పర్యావరణపరంగా అందుబాటులోకి వచ్చే సేవలను (ఎకోలాజికల్ సర్వీసెస్ ద్వారా) డబ్బు విలువ పరంగా లెక్కిస్తే ఒక్కో పులి రూ. 250 కోట్ల విలువ చేస్తుంది. కోవిడ్ సంక్షోభం మనందరికీ ప్రకృతి, పర్యావరణం, వన్యప్రాణులను గౌరవించాలని, కాపాడుకోవాలని నొక్కి చెబుతోంది.
– ఇమ్రాన్ సిద్దిఖీ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment