రాష్ట్రంలో కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అన్ని సానుకూల పరిస్థితులున్నా అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేయడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లవుతున్నా ఒక్కటంటే ఒక్కటీ కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పడలేదు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లు ఉండగా, కొత్తగా కనీసం రెండు పులుల అభయారణ్యాల ఏర్పాటుకు అవకాశం ఉంది.
కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటుకు కాగజ్‌నగర్, కిన్నెరసాని, ఏటూరునాగారంలలో సానుకూల వాతావరణం ఉంది. అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో నిధులొచ్చే అవకాశమున్నా రాష్ట్ర ప్రభుత్వపరంగా ముఖ్యంగా అటవీశాఖ నుంచి గట్టి ప్రయత్నాలు సాగడం లేదనే విమర్శలున్నాయి. – సాక్షి, హైదరాబాద్
తగ్గిన పులుల ఆక్యుపెన్సీ
తాజాగా విడుదలైన టైగర్ స్టేటస్ రిపోర్ట్–2022లోనూ రాష్ట్రంలో ‘పులుల ఆక్యుపెన్సీ’ తగ్గిందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. కొత్త టైగర్ రిజర్వ్ ఏర్పాటు ద్వారా రాష్ట్రానికి వివిధ ప్రయోజనాలు చేకూరే అవకాశమున్నా గట్టి ప్రయత్నాలు జరగడం లేదనే ఆరోపణలున్నాయి. 2014 తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా 8, 9 పులుల అభయారణ్యాలు ఏర్పడినా, రాష్ట్రానికి ఒక్కటి కూడా రాకపోవడానికి ఈ దిశలో కనీసం ప్రతిపాదనలు కూడా కేంద్రానికి చేరలేదని సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా వీటి ఏర్పాటుకు అటవీశాఖ ప్రతిపాదనలు పంపితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కవ్వాల్‌లో కనిపించని స్థిరనివాస పులులు!
ఉమ్మడి ఏపీలో 2012లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఏర్పడింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో భాగంగా ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రాష్ట్ర విభజన అనంతరం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌గా (ఏటీఆర్) ప్రకటించారు.ప్రస్తుతం అమ్రాబాద్‌లో పులులు పుష్కలంగా ఉన్నాయని, 2018తో పోలి్చతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగిందనే అంచనాలున్నాయి.
కవ్వాల్‌లోని చెన్నూరు డివిజన్‌లో స్థిరనివాసం ఏర్పరచుకున్న పులులే కనిపించకపోవడం ఆందోళన రేపుతోంది. ఎన్ని ఆడపులులు సంతానోత్పత్తి చేస్తున్నాయనే అంశం ప్రాతిపదికన ఆ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య వృద్ధికి అవకాశముంది, ప్రస్తుతం ఏటీఆర్‌లో కనీసం ఏడు ‘బ్రీడింగ్ ఫిమేల్ టైగర్స్’ ఉండటంతోపాటు కనీసం నాలుగు ఆడపులులు పిల్లలు పెట్టి వాటిని సంరక్షిస్తున్నాయని ఈ ప్రాంతంతో పరిచయమున్న నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏటీఆర్‌లో 30 దాకా పులులు (నాలుగైదు పులి పిల్లలు కలుపుకొని) ఉండగా, కేటీఆర్‌లో అసలు పులులే కనిపించని పరిస్థితులు ఏర్పడినందున కొత్త టైగర్ రిజర్వ్‌ల ఏర్పాటు అవశ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగజ్‌నగర్‌లో కనిపిస్తున్నాయ్...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఆనుకునే ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పెద్దపులుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటంతో తెలంగాణలోకి వాటి వలసలు పెరిగాయి. ప్రస్తుతం కొంతకాలంగా పులులు లేని ప్రాంతంగా కవ్వాల్ నిలుస్తోంది. దీని బయట టైగర్ కారిడార్‌లో ముఖ్యంగా కాగజ్‌నగర్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మూడో టైగర్ రిజర్వ్‌ను కాగజ్‌నగర్ ఏరియాలో ఏర్పాటు చేసి ఉంటే పులుల సంరక్షణకు పెద్దమొత్తంలో కేంద్ర నిధులు రావడంతోపాటు ఉద్యోగుల కేటాయింపు, స్థానికులకు ఉపాధి పెరిగే అవకాశం ఉండేదంటున్నారు. టైగర్ సఫారీ వంటి వాటికీ పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తారని, దీనివల్ల ఈ ప్రాంతానికి మరింత ప్రాచుర్యం లభిస్తుందని చెబుతున్నారు. మహారాష్ట్రలోని తడోబా, అంధారీ ప్రాంతానికి పక్కనే ఈ ప్రాంతం ఉండటంతోపాటు.. అక్కడి నుంచే పులులు ఇక్కడకు వస్తున్నందున మరో టైగర్ రిజర్వ్ ఏర్పాటుచేస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు.
వైల్డ్‌లైఫ్ శాంక్చురీగా ఉన్న కిన్నెరసాని, ఏటూరు నాగారంలోనూ పులుల సంచారం ఉన్నందున వాటిని కూడా టైగర్ రిజర్వ్‌గా ప్రకటించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ మూడింటిలో కనీసం రెండుచోట్ల టైగర్ రిజర్వ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. తక్కువ విస్తీర్ణంలో టైగర్ రిజర్వ్‌ను ఏర్పాటు చేసినా అడవులు, పర్యావరణానికి మేలు చేకూరుతుందని అంటున్నారు.
రాష్ట్రంలో పులుల అభయారణ్యానికి సానుకూలంగా ఉన్న ప్రాంతాలు
1. కాగజ్‌నగర్
2. కిన్నెరసాని
3. ఏటూరు నాగారం
Comments
Please login to add a commentAdd a comment