సాక్షి, మంచిర్యాల: వలస పులులకు వేటగాళ్ల ఉచ్చులు దినదినగండంలా మారాయి. కొంత కాలంగా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా– అందేరీ, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి పులుల అభయారణ్యం నుంచి తెలంగాణలోకి పులులు అడుగుపెడుతున్నాయి. కాగజ్‌నగర్‌లో కొన్ని పులులు స్థిర ఆవాసం ఏర్పాటు చేసుకుని వాటి సంతతి పెంచుకుంటున్నాయి. అలా ఆదిలాబాద్, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న పెన్‌గంగా, ఆసిఫాబాద్‌కు, మంచిర్యాల జిల్లాలోని ప్రాణహిత, గోదావరి దాటి ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాలకు, ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి, గోదావరి నదుల తీరం దాటి భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాలకు పులులు రాకపోకలు సాగిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా ఈ వలసలు క్రమంగా పెరుగుతున్నాయి. భవిష్యత్‌లోనూ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే వలస వస్తున్న పెద్దపులులకు వేటగాళ్ల ఉచ్చులు సవాల్‌గా మారాయి. కొందరు వేటగాళ్లు పులి సంచరించే ప్రాంతాలు తెలుసుకుని డబ్బు ఆశతో వాటిని మట్టుబెట్టే ప్రయత్నాలు చేస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూశాయి. జీవ వైవిధ్యంలో ప్రధాన పాత్ర పోషించే జాతీయ జంతువు.. భవిష్యత్ తరాలకు గోడ చిత్రంగా మిగిలిపోతుందా అని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూరు పరిధిలో కే 4 (కాగజ్‌నగర్) అనే ఆడ పులికి వేటగాళ్లు అమర్చిన ఉచ్చు
నడుము వద్ద చిక్కుకుని ప్రాణాపాయ స్థితిలోనే సంచరిస్తోంది.
ఈ పులి జీవించి ఉందో లేదోననే అనుమానాలున్నాయి.
ఈ చిత్రంలో కర్రకు బిగించి ఉన్న వైరు (వృత్తంలో) వన్యప్రాణులను వేటాడేందుకు అమర్చిన విద్యుత్ కంచె. ఏదైనా జంతువు ఈ వైరుకు తాకగానే కొద్ది సెకండ్లలోనే ప్రాణాలు కోల్పోతుంది. రెండు రోజుల క్రితం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నాగంపేట గ్రామస్తులు ఈ కంచెపై విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇస్తే కరెంట్ సరఫరా నిలిపివేశారు. అయితే అటవీ అధికారులు మాత్రం పెద్దగా పట్టించుకోలేదని గ్రామస్తులు చెబుతున్నారు.
దీనికి సమీపంలోనే నాగంపేట, బొప్పారం ప్రాంతాల్లో జే–1 అనే మగ పులి సంచరిస్తోంది. 2016లో ఇదే మండలంలోని పిన్నారంలో విద్యుత్ కంచెకు తగిలి మూడేళ్ల వయసున్న మగ పులి ప్రాణాలు కోల్పోయింది. తాజాగా ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో ఇదే తీరున ఉచ్చు వేసి పులిని హతమార్చారు. దేశవ్యాప్తంగా వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటనలు జరగడం వాటి ప్రాణాలకున్న ముప్పును, అటవీ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రతిబింబిస్తోంది.
కాగజ్‌నగర్ అడవుల్లో పులి కూనల సయ్యాట
పులి సంరక్షణకు చర్యలు
పులి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. కొందరు రైతులు పంటల రక్షణకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేస్తుండడంతో వన్యప్రాణులకు ముప్పు వాటిల్లుతోంది. అలాగే, వేటగాళ్ల నుంచి కూడా జాతీయ జంతువు ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. పలుచోట్ల పోడు భూములు పులి ఆవాసాలకు ప్రతికూలంగా మారాయి. ఉచ్చులు, వేట ఎంత ప్రమాదకరమైనవో అటవీ సమీప గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. పులి కదలికలపై నిత్యం అప్రమత్తంగా ఉంటున్నాం.
శివాని డోగ్రా, జిల్లా అటవీ అధికారి, మంచిర్యాల జిల్లా
Comments
Please login to add a commentAdd a comment