వన్యమృగాల అరణ్య రోదన | tiger hunters killing tigers in forests | Sakshi
Sakshi News home page

వన్యమృగాల అరణ్య రోదన

Published Tue, Jan 9 2018 6:43 AM | Last Updated on Wed, Oct 3 2018 5:26 PM

tiger hunters killing tigers in forests - Sakshi

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో వన్యప్రాణులకు రక్షణ లేకుండా పోయింది. అంతర్రాష్ట్ర వేటగాళ్లతో పాటు గ్రామాల్లోని స్థానికులు సైతం వన్యప్రాణాల ఉసురు తీస్తున్నారు. కుందేళ్లు మొదలుకొని అడవిపందులు, జింకలు, కొండగొర్రెలతో పాటు పులులు, చిరుతలను కూడా బతుకనిచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకా విచిత్రం ఏంటంటే... చనిపోయిన పులు ల చర్మాలకు సైతం రక్షణ లేని పరిస్థితి పూర్వ ఆదిలాబాద్‌ అడవుల్లో నెలకొంది. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, అవి నీతి అక్రమాల కారణంగా అడవులు, అటవీ జంతువులు మనుగడ సాగించడమే ప్రశ్నార్థకమవుతోంది. సీసీ కెమెరా ల్లో ఎప్పుడో ఓ పులి కనిపించగానే హడావుడి చేయడం, ఆ పులి పేరుతో కేంద్రం నుంచి వచ్చే నిధులతో సంవత్సరాల పాటు గడపడం అటవీశాఖలో సర్వసాధారణమై పోయిం ది. కవ్వాల్‌ పులుల అభయారణ్యానికి పులులు రాకుండా పోవడాకి గల కారణాలను విశ్లేషించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులు దారుణంగా విఫలమయ్యారు. అదే సమయంలో కవ్వాల్‌తో పాటు ఆదిలాబాద్‌ పూర్వ జిల్లాలోని చెన్నూర్, కాగజ్‌నగర్‌ డివిజన్‌ల పరిధిలో కి వచ్చిన పులులను కాపాడలేక, చేతులెత్తేస్తున్నారు. ప్రస్తుతం ఆదిలాబాద్‌ పాత జిల్లా పరిధిలో ఎన్ని పులులు ఉన్నాయంటే నోరు వెళ్లబెట్టే పరిస్థితి.

ఏడాదిలో ఓ పులి మరణం.. మరో పులి పిల్లకు ఉచ్చు
2016 డిసెంబర్‌ తొలివారంలో కోటపల్లి మండలం పిన్నా రం గ్రామంలో ఫాల్గుణ–2 అనే పులి వేటగాళ్ల ఉచ్చుకు బ లైంది. అడవిపందుల కోసం పొలం చుట్టు రైతు వేసుకున్న విద్యుత్‌ కంచెకు తగిలి ఆ పులి చనిపోయినట్లు అధికారులు తేల్చినా,దాని వెనుక వేటగాళ్ల ప్రమేయం ఉందనేది వాస్త వం. ఆ కేసుకు సంబంధించి ఇప్పటివరకు పెద్దగా పురోగతి కూడా లేదు. ఇది మరువక ముందే ఫాల్గుణ–1 అనే ఆడపులికి 2016లో జన్మించిన నాలుగు పిల్లల్లో ఒకటి (కె–4) చెన్నూర్‌ ప్రాంతానికి వచ్చింది. ఆరు నెలల క్రితం దీనిని వేటాడేందుకు వేటగాడు పెట్టిన ఉచ్చును తప్పించుకొని వచ్చిన కె–4కు ఇనుప తీగ ఒకటి శరీరానికి చుట్టుకుపోయింది. అది మెల్లమెల్లగా వెనుక కాళ్ల దగ్గర తుంటి ప్రాం తానికి వచ్చి ఆగింది. సుమారు రెండు సంవత్సరాల వయ స్సు వచ్చిన ఈ పులి తుంటి చుట్టూ ఇనుప ఉచ్చు అలాగే బిగుసుకుంటోంది. దీన్ని తొలగించాలంటే జాతీయ స్థాయిలో అనుమతి అవసరం. దాంతో ప్రాణాపాయ స్థితిలో పులి నీల్వాయి–చెన్నూర్‌ అడవుల్లోనే తిరుగుతోంది.

తల్లి... మూడు పిల్లల జాడేది..?
మహారాష్ట్ర నుంచి 2015లో కాగజ్‌నగర్‌ ప్రాంతానికి రెండు పులులు (ఫాల్గుణ–1, ఫాల్గుణ–2) రాగా, ఫాల్గుణ–2  కోటపల్లిలో పొలం చుట్టు నాటిన కరెంటు తీగలు తగిలి చనిపోయింది. ఫాల్గుణ–1 మాత్రం నాలుగు పిల్లలకు జన్మనివ్వగా, అందులో నాలుగవ పిల్ల కె–4 చెన్నూర్‌ ప్రాంతంలో తిరుగుతోంది. అంటే తల్లి ఫాల్గుణ–1, మిగతా మూడు పిల్లలు (కె–1, 2, 3) కాగజ్‌నగర్‌ రేంజ్‌లోనే ఉండాలి. కానీ వాటికి సంబంధించిన జాడలేవీ ఈ మధ్య కాలంలో కని పించలేదు. పులి పిల్లలు ఆరునెలల వయసు రాగానే తల్లి నుంచి దూరంగా వెళ్లిపోతాయి. ఒక పులి సంచరించే ప్రాం తానికి కనీసం 30 నుంచి 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో మరో పులి ఉండదు. ఈ నేపథ్యంలో ఈ తల్లి, మూడు పిల్లలు ఎక్కడ ఉన్నాయనే దానిపై స్పష్టత లేదు. కానీ కాగజ్‌నగర్‌ ప్రాంతంలో ఒక పులి మాత్రం సీసీ కెమెరా పుటేజీల్లో, కాలి గుర్తుల ద్వారా తేలింది. కుమరంభీం జిల్లా అటవీశాఖ అధికారి సైతం కాగజ్‌నగర్‌లో నాలుగు పులులున్నాయని ‘సాక్షి’కి తెలిపారు. కానీ ఈ పులులకు సంబంధించి గత కొంతకాలంగా ఎలాంటి గుర్తులు, ఆధారాలు గానీ కనిపిం చలేదు. పూర్వ ఆదిలాబాద్‌లోని కవ్వాల్‌లో ఒకటి, నీల్వా యి ప్రాంతంలో మరోటి, కాగజ్‌నగర్‌లోఒకటి చొప్పు న పులులున్నట్లు ఆధారాలుండగా, అధికారులు చెప్పే మిగతా ఏడు పులులకు సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు.

సాంబార్‌ జింక బావిలో పడితే గోప్యత ఎందుకు?
డిసెంబర్‌ 20న కాసిపేట మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు కుందేళ్ల కోసం వెంకటాపూర్‌ వెళ్లే దారిలో ఉర్లు పెడుతుండగా, అటవీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెపుతున్నారు. అయితే ఈ ఐదుగురు కుందేళ్ల కోసం కాకుండా జింకల కోసమే ఉర్లు పెట్టారని, ఓ జింక అందులో పడి చనిపోతే బెల్లంపల్లి ఎఫ్‌డీఓ కార్యాలయం ఆవరణలోనే పాతిపె ట్టారని ప్రచారం జరిగింది. దీనిని అటవీశాఖ అధికారులు ఖండించి ఉర్లు పెట్టిన ఐదుగురు వ్యక్తులను సోమవారం రిమాండ్‌కు పంపారు. డిసెంబర్‌ 20వ తేదీన సంఘటన జరిగితే, సర్పంచ్‌ భర్త గజానంద్, ఎంపీటీసీ భర్త మంగీలాల్‌ సంతకాలు తీసుకొని వారిని ఎందుకు వదిలేశారనే దానిపై అధికారుల వద్ద సమాధానం లేదు. ఊరి ప్రజాప్రతినిధులు చెప్పినందుకు వదిలేశామంటున్న అధికారులు విషయం ‘సాక్షి’లో వచ్చిన తరువాత అరెస్టు చూపించడం అనుమానాలకు తావిస్తోంది. దీనిని బట్టి ఎలాంటి వన్యప్రాణి విషయంలోనైనా అటవీశాఖ అధికారులు సానుభూతితోనే వ్యవహరిస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అటవీశాఖ రిమాండ్‌కు పంపించిన ఐదుగురిలో ఇద్దరు మైనర్లు కావడం గమనార్హం.

పులి చర్మం మాయం
కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లోని ఫారెస్ట్‌ క్వార్టర్స్‌లో భద్రపర్చిన పులి చర్మం ఇటీవల మాయమైన సంఘటన అటవీ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. 2016 నవంబర్‌ 21న మ హారాష్ట్రకు చెందిన కొందరు  పులి చర్మాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అప్పటి బెజ్జూర్‌ ఎఫ్‌ఆర్‌వో మోహన్‌రావు మండలంలోని ఏటిగూడ గ్రామంలో పట్టుకున్నారు. కేసు నమోదు చేసిన అధికారులు నిందితుల ను కోర్టులో హాజరుపర్చడంతో పాటు పులి చర్మాన్ని కోర్టు కు స్వాధీనం చేశారు. అయితే పులి చర్మాన్ని సేఫ్‌ కస్టడీ కింద ఉంచాలని కోర్టు అటవీశాఖ అధికారులకు సూచిం చింది. దీంతో ఆ చర్మాన్ని అప్పటి బెజ్జూర్‌ సెక్షన్‌ అధికారి వేణుగోపాల్‌కు అప్పగించగా, ఆయన బీట్‌ అధికారి రవీం దర్‌ సంరక్షణకు అప్పగించారు. రవీందర్‌ తాను నివాసం ఉంటున్న క్వార్టర్‌లోని ఓ గదిలో పులి చర్మాన్ని భద్రపర్చా రు. ఏడు నెలల క్రితం రవీందర్‌ సస్పెండ్‌ కాగా, నెలన్నర క్రితం వేణుగోపాల్‌ సైతం అవినీతి వ్యవహారంలో సస్పెం డయ్యారు. కొత్తగా సెక్షన్‌ అధికారిగా నియమితులైన శ్రావణ్‌కుమార్‌ పాత రికార్డులను పరిశీలిస్తూ పులి చర్మం భద్రపర్చిన విషయాన్ని గుర్తించారు. అయితే తాను పులి చర్మాన్ని చూసిన తర్వాతనే రికార్డులు స్వాధీనం చేసుకుంటానని అన్నారు. దీంతో అధికారులు డిసెంబర్‌ 18న గది తాళం ప గులగొట్టి చూడగా.. పులి చర్మం మాయమైన విషయం వెలుగులోకొచ్చింది. ఈకేసులో అనుమానంతో వేణుగోపా ల్, రవీందర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మాయమైన పులి చర్మం రూ.50లక్షల నుంచి రూ.కోటి విలువ చేస్తుం దని అధికారులు పేర్కొంటున్నారు. బెజ్జూర్‌లో పులి చర్మం మాయం కావడంతో గతేడాది కోటపల్లి అడవుల్లో మరణిం చిన పులిచర్మం ఎక్కడ ఉందనేది చర్చనీయాంశమైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement