తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది.
దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి.
2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది.
నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు
ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి.
చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్
పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు.
– మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్
Comments
Please login to add a commentAdd a comment