sheshachalam forests
-
పెద్దపులికి రూట్ క్లియర్
తిరుమల: నల్లమల అడవుల నుంచి శేషాచల కొండల్లోకి పెద్దపులులు రానున్నాయి. ఆ మేరకు అటవీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అహోబిలం నుంచి తిరుపతి వరకు 4,759 కిలోమీటర్ల మేర విస్తరించి శేషాచల కొండలు అపురూపమైన వృక్ష సంపదకే కాదు, వన్య మృగాలకూ నెలవు. ప్రపంచంలో మరెక్క డా కనిపించని ఎర్రచందనం చెట్లు ఒక్క శేషాచలం అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. చిరుతలు, ఎలుగుబంట్లు వంటి వన్యప్రాణులకు అడ్డాగా శేషాచలం ఉంది. దట్టమైన అటవీ ప్రాంతమైనా.. పెద్ద పులులు నివసించేందుకు అనువైన ప్రదేశమైనా.. ఇప్పటివరకు ఆ సందడి లేదు. కాగా శేషాచలం అటవీ ప్రాంతంలోకి పెద్ద పులులు వచ్చేలా అటవీశాఖ కారిడార్ ఏర్పాటు చేయనుంది. శేషాచలం అటవీ ప్రాంతంలో చిరుతల సంచారం ఎక్కు వగా ఉంటుంది. ఇవి అప్పుడప్పుడు తిరుమల ఘాట్ రోడ్డు, నడక మార్గాల్లో భక్తులకు కనిపిస్తూ ఉంటాయి. వారిపై దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. 2008లో శ్రీవారి మెట్టు నడకమార్గంలో బాలికపై చిరుత దాడి చేయగా.. రెండేళ్ల కిందట రెండో ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనదారులపై చిరుత దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భక్తులకు ఎలాంటి ప్రాణాపాయం లేదు. 2008లో మాత్రం బాలికపై దాడికి పాల్పడిన చిరుతను పట్టుకుని తిరిగి వైఎస్సార్ జిల్లా చిట్వేల్ అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు వదిలిపెట్టారు. అనంతరం వారం కిందట బాలుడిని తీసుకెళ్లి 500 మీటర్ల దూరంలో చిరుత వదిలిపెట్టి వెళ్లింది. టీటీడీ ఈ ఘటనపై వెంటనే స్పందించింది. 24 గంటల వ్యవధిలోనే చిరుతను బంధించి భాకరాపేట అటవీ ప్రాంతంలో వదిలిపెట్టింది. నల్లమలలో ఎక్కువైన పెద్ద పులులు ప్రస్తుతం నల్లమల అడవుల్లోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాంతాల్లో పెద్ద పులులున్నాయి. ప్రస్తుతం నల్లమల అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం పెరుగుతూ ఉండటంతో వాటిని శేషాచల కొండల వైపు మళ్లించాలని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. నల్లమల నుంచి బద్వేలు మీదుగా సిద్దవటం నుంచి తిరుమలకు కారిడార్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపడుతున్న అటవీశాఖ అధికారులు.. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలలోని మూడు వేల హెక్టార్లు మినహాయిస్తే మిగిలిన ప్రాంతాన్ని రిజర్వుడ్æ ఫారెస్టుగా పేర్కొంటారు. ఇక్కడ మనుషుల కన్నా జంతువులకే ఎక్కు వ ప్రాధాన్యం ఉంటుంది. మనుషులపై దాడిచేసే అలవాటు లేని చిరుతలే అప్పుడప్పుడు అటవీ ప్రాంతాన్ని దాటి వచ్చి తిరుమల నడకదా రులు, ఘాట్ రోడ్లపైకి వచ్చి భక్తులపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత దాడుల వల్ల ఎలాంటి ప్రాణాపాయం ఉండే అవకాశం లేకపోవడంతో భక్తులు సురక్షితంగా వాటి నుంచి బయటపడుతున్నారు. కానీ పెద్ద పులుల వ్యవహారం అలా ఉండదు. మరి చిరుతల తరహాలో పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. బద్వేల్ మీదుగా శేషాచలానికి కారిడార్ పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా బద్వేల్ మీదుగా శేషాచల కొండలకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తాం. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం శేషాచల కొండల్లో పెద్దపులి సంచారం లేదు. తిరుమల నడకమార్గంలో ఇబ్బందుల్లేకుండా చర్యలు. – మధుసూదన్ రెడ్డి, పీసీసీఎఫ్ -
ఎర్రస్మగ్లర్లు ఉన్నట్టా.. లేనట్టా?
చిత్తూరు, వైఎస్సార్ కడప, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో ఏ గ్రేడ్ ఎర్రచందనం వృక్షాలు ఉన్నాయి. దీనికి విదేశాల్లో విశేష డిమాండ్ ఉంది. దీంతో స్మగ్లర్లు కొండలు, కోనలు దాటి ఎర్రచందనం దుంగలను రాష్ట్ర సరిహద్దులను దాటిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం అటవీశాఖకు సహాయంగా టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది. ఇందులో 200 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే అటవీ శాఖలో శాశ్వత ఉద్యోగులు 400 మందికి పైగా ఉన్నారు. రెండు శాఖల అధికారుల మధ్య సమన్వయం లోపించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధిత శాఖల అధికారుల విభిన్న ప్రకటనలు బలాన్ని చేకూరుస్తున్నాయి. తిరుపతి అర్బన్: శేషాచలం అడవుల్లో ప్రధానంగా తమిళనాడుకు చెందిన ఎర్రస్మగ్లర్ల తాకిడి ఎక్కువగా ఉంటోంది. కరోనా లాక్డౌన్ కారణంగా కూలీలు, స్మగ్లర్లు శేషాచలం అడవులను వదిలిపెట్టి స్వగ్రామాలకు వెళ్లిపోయారు. లాక్డౌన్ సడలింపులతో మళ్లీ విజృంభిస్తున్నారు. పది రోజులుగా మళ్లీ తమిళనాడు నుంచి ఎర్రస్మగ్లర్లు గుంపులుగా శేషాచలం అడవుల్లోకి వచ్చారని టాస్క్‌ఫోర్స్ అధికారులు తెలిపారు. నాలుగు రోజుల వ్యవధిలోనే 2 టన్నులకు పైగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.2 కోట్లకు పైగా ఉంటుంది. ఒక్క స్మగ్లర్‌నూ పట్టుకోలేదు. 50 మంది స్మగ్లర్లను గుర్తించామని, వారు రాళ్ల దాడులు చేసి పరారయ్యారని అధికారులు తెలిపారు. లాక్డౌన్ ముందు తమిళ స్మగ్లర్లు డంపింగ్ చేసిన ఎర్రదుంగలను కొత్తగా పట్టుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ అధికారులు చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అటవీశాఖ అధికారులు వాదన మరోలా ఉంది. బీట్, సెక్షన్ ఆఫీసర్లతోపాటు డీఆర్ఓలు, ఎఫ్ఆర్ఓలు, ఔట్సోర్సింగ్ సిబ్బంది నిత్యం అడవుల్లో సంచరిస్తూన్నారని అధికారులు చెబుతున్నారు. లాక్డౌన్ తర్వాత ఒక్క స్మగ్లర్ కూడా అడవుల్లోకి వెళ్లలేదని పేర్కొంటున్నారు. ఇలా రెండు శాఖల అధికారులు విభిన్న ప్రకటనలు చేయడంతో గందరగోళం నెలకొంది. అడవుల్లో స్మగ్లర్లు ఉన్నట్టా.. లేక ఒక్కరిని కూడా లోపలికి వెళ్లకుండా నిరోధించారా అన్న దానిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తమిళ స్మగ్లర్ల గుంపులున్నాయి తమిళ స్మగ్లర్లు వారం పది రోజులుగా శేషాచలం అడవుల్లో గుంపులుగా చేరారు. అడవుల్లో కూంబింగ్ చేస్తున్న టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై రాళ్ల దాడులు చేస్తున్నారు. చంద్రగిరి సమీపంలోని భీమవరం క్రాస్ ఫారెస్ట్‌లో 30 మంది ఎర్రస్మగ్లర్లు మా వాళ్లపై దాడులు చేశారు. మా సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో స్మగ్లర్లు పరారయ్యారు. 34 ఎర్రదుంగలను స్వాధీనం చేసుకున్నాం. వాటి విలువ రూ.1.5 కోట్లపైమాటే. తమిళ్ల స్మగ్లర్లు కోవిడ్–19ను సైతం లెక్కచేయకుండా శేషాచలం అడవుల్లోకి వస్తున్నారు. అందులో సందేహం లేదు.–రవిశంకర్, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ, తిరుపతి -
శేషాచలంలో అలజడి
సాక్షి, చిత్తూరు : శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు. రంగంపేట సమీపంలోని భీమవరం ఘాట్ మామిడిమానుగడ్డ అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా స్మగ్లర్లు తారసపడ్డారు. అడవిలోకి వాహనం వెళ్లినట్లు గుర్తించి ఆ మార్గంలో తనిఖీలు చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. సిబ్బందిని చుట్టుముట్టిన స్మగ్లర్లు మారణాయుధాలు, రాళ్లతో దాడికి దిగారు. ఆత్మరక్షణ కోసం టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఒక రౌండ్ గాలిలోకి కాల్పులు జరపడంతో స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో సుమారు 60 మందికి పైగా స్మగ్లర్లు ఉండొచ్చని సమాచారం. ఉన్నతాధికారులు టాస్క్ ఫోర్స్ అదనపు బలగాలను రంగంలోకి దించారు. కూంబింగ్ కొనసాగిస్తున్నారు. పారిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. -
అడవి తల్లికి రక్షణేదీ?
అటవీ శాఖలోని అన్ని విభాగాల్లో మంజూరైన పోస్టులు 6,882 ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,511 భర్తీ కావాల్సిన ఉద్యోగాలు 3,371 ఖాళీల శాతం 48.98 సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూమి ఆక్రమణలపాలైంది. మరోవైపు అత్యంత విలువైన అటవీ సంపద అడ్డగోలుగా దోపిడీకి గురవుతోంది. ఎర్రచందనం నిరాటంకంగా ఎల్లలు దాటి పోతోంది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు లారీలు, కార్లు, మినీ వ్యాన్లలో సైతం నిత్యం తరలిపోతున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయం కోసం ఇటీవల అటవీశాఖ టెండర్లు నిర్వహించగా నాణ్యమైన కలప టన్ను రూ.30 లక్షలు పలికింది. ఇంత విలువైన ఎర్రచందనం భారీ పరిమాణంలో శేషాచలం నుంచి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో స్మగ్లర్లు పంపిన ఎర్రచందనం కూలీలు అరకొరగా ఉన్న అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడవుల పరిరక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిత్యం అడవుల్లో తిరుగుతూ నిఘా కొనసాగించే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని, ఉన్నతాధికారుల వరకు వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే అడవి తల్లి పాలిట శాపంగా మారిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)కు మంజూరు చేసిన పోస్టుల భర్తీని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అటవీ సంపద పరిరక్షణపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా పోస్టులు ఖాళీయే.. అటవీ భూమి, అటవీ సంపద పరిరక్షణలో క్షేత్రస్థాయిలో ఉండే ఫారెస్టు సెక్షనాఫీసర్లు (ఎఫ్ఎస్ఓ), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల (ఏబీవో) పాత్ర ఎంతో కీలకం. వీరిని పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేసే ఫారెస్ట్ రేంజి ఆఫీసర్లు (ఎఫ్ఆర్ఓ), డిప్యూటీ రేంజి ఆఫీసర్లు (ఆర్ఓ)ల భూమికా ముఖ్యమైనదే. అటవీ పరిభాషలో నిర్దిష్ట ప్రాంతాన్ని బీట్ అంటారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే బాధ్యత బీట్ ఆఫీసరుదే. అటవీ ప్రాంతంలో ఎవరెవరు తిరుగుతున్నారు? టేకు, ఎర్రచందనం, బట్టగడప, రోజ్ ఉడ్ వంటి విలువైన చెట్లను ఎవరు నరుకుతున్నారు? ఎక్కడకు తరలిస్తున్నారు? ఈ దందా వెనుక ఎవరున్నారు? ఎలా అడ్డుకట్ట వేయాలి? అనే సమాచారం తెలియాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం అడవిలో తిరగాలి? రోజూ తిరుగుతూ పరిశీలిస్తుంటేనే ఎక్కడెక్కడ ఏయే చెట్లు ఉండాలి. ఎక్కడ ఏ చెట్లు కొట్టారు.. అనే విషయాలు తెలుస్తాయి. కానీ రాష్ట్రంలో బీట్ ఆఫీసరు కేడర్ స్ట్రెంగ్త్ (మంజూరైన పోస్టులు)లో సుమారు 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 60 శాతం ఖాళీలే. అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షనాఫీసరు పోస్టులు కూడా సగానికి పైగా ఖాళీ ఉన్నాయి. ఇవి మంజూరైన పోస్టుల్లో ఖాళీలు మాత్రమే. వాస్తవ అవసరాల ప్రాతిపదికన అయితే అటవీశాఖకు మంజూరు చేసిన క్షేత్రస్థాయి పోస్టుల కంటే రెట్టింపు సిబ్బంది అవసరం. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా.. క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది ఖాళీల భర్తీ కోసం అటవీశాఖ ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే 13 ఏపీ జిల్లాల్లో 1,256 ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓ, ఏబీవో పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించింది. జిల్లాల వారీగా ఎంపిక పరీక్షలు పూర్తయి ఫలితాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగినా యథాతథంగా ఫలితాలు ప్రకటించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంఆ పరీక్షలను రద్దు చేసింది. మూడేళ్లయినా తిరిగి ఆ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘ఇంట్లో బీరువాలో దాచుకున్న వస్తువులే చోరీ అవుతున్నాయి. ఇక అడవి అనేది బహిరంగ కోశాగారం లాంటిది. ఇందులో విలువైన కలప స్మగ్లింగ్‌ను నిరోధించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే దురదృష్టవశాత్తూ రాష్ట్ర అటవీశాఖలో ఉండాల్సిన సిబ్బందిలో నాలుగోవంతు కూడా లేరు. కేడర్ స్ట్రెంగ్త్‌ను రెండింతలు చేయాల్సిన అవసరం ఉంటే మంజూరైన పోస్టుల్లోనే సగం ఖాళీలుంటే ఎలా..’ అని ఒక సీనియర్ అటవీశాఖ అధికారి ప్రశ్నించారు. ఇక ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పరిరక్షణ కోసం పది సాయుధ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 605 మందిని నియమించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మగ్లింగ్ నిరోధ టాస్క్ఫోర్సులో సగం ఖాళీలు అలాగే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి..’ అని కా అధికారి ప్రశ్నించారు. -
‘ఎర్ర’ బంగారంపై చట్ట సవరణ
పదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం జిల్లాలో పాతస్మగ్లర్ల ఆస్తులజప్తు చేయొచ్చు కాలం చెల్లిన శిక్షలు ఇక కనుమరుగు చిత్తూరు (అర్బన్): ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడానికి చట్టాన్ని కఠినతరం చేశారు. జాతీయ సంపదను రక్షించడానికి రాష్ట్ర అటవీశాఖ చట్టం - 1967కు సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. కొత్త చట్టం ఇలా.. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారిని అరెస్టు చేయడం, వారు జైలుకు వెళ్లి బెయిల్‌పై రావడం మామూలైపోయింది. నూతన చట్టం మేరకు.. నేరం రుజువయితే పదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. స్మగ్లర్లపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు సైతం కల్పించారు. ఇక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేసులు విచారిస్తారు. దీనికి తోడు ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ నేరస్తుల ఆస్తులను సైతం జప్తు చేయడానికి ఇందులో వీలు కల్పించారు. గత ఐదేళ్లలో జిల్లా నుంచి 10 వేల టన్నుల ఎర్రచందనం సరిహద్దులు దాటింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్న 12,356 మందిని పోలీసులు గుర్తించారు. పలు పోలీసు స్టేషన్లలో 864 కేసులు నమోదయ్యాయి. అయితే వీళ్లల్లో ఇప్పటి వరకు కేవలం 5,342 అరెస్టయ్యారు. ఇందులో చైనాకు చెందిన ఇద్దరు విదేశీయులతో పాటు 70 మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. తిరుపతి, చిత్తూరు పోలీసులు జిల్లాలో 62 మందికి పైగా నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేశారు. బడా స్మగ్లర్లు ఎర్రచందనం తరలింపులో రూ.వేల కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించినా వాటిని ప్రభుత్వ పరం చేయడంలో చట్టం అడ్డంకిగా మారింది. తాజాగా అటవీశాఖ చట్టాన్ని సవరించడంతో పాత స్మగ్లర్ల వద్ద గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వె సులుబాటు కల్పించారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే చేసిన సవరణకు ప్రతిఫలం ఉంటుంది.