పదేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా
సవరణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం
జిల్లాలో పాతస్మగ్లర్ల ఆస్తులజప్తు చేయొచ్చు
కాలం చెల్లిన శిక్షలు ఇక కనుమరుగు
చిత్తూరు (అర్బన్): ప్రపంచంలో శేషాచలం అడవుల్లో మాత్రమే లభ్యమయ్యే ఎర్రచందనం చెట్లను కాపాడుకోవడానికి చట్టాన్ని కఠినతరం చేశారు. జాతీయ సంపదను రక్షించడానికి రాష్ట్ర అటవీశాఖ చట్టం - 1967కు సవరణ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి శుక్రవారం ఆమోద ముద్ర వేశారు.
కొత్త చట్టం ఇలా..
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ వారిని అరెస్టు చేయడం, వారు జైలుకు వెళ్లి బెయిల్‌పై రావడం మామూలైపోయింది. నూతన చట్టం మేరకు.. నేరం రుజువయితే పదేళ్ల జైలుశిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. స్మగ్లర్లపై కేసులు నమోదు చేసే అధికారం పోలీసులతో పాటు అటవీశాఖ అధికారులకు సైతం కల్పించారు. ఇక డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో కేసులు విచారిస్తారు. దీనికి తోడు ఇప్పటికే ఎర్రచందనం స్మగ్లింగ్‌లో పట్టుబడ్డ నేరస్తుల ఆస్తులను సైతం జప్తు చేయడానికి ఇందులో వీలు కల్పించారు. గత ఐదేళ్లలో జిల్లా నుంచి 10 వేల టన్నుల ఎర్రచందనం సరిహద్దులు దాటింది. దీనిని అక్రమంగా రవాణా చేస్తున్న 12,356 మందిని పోలీసులు గుర్తించారు. పలు పోలీసు స్టేషన్లలో 864 కేసులు నమోదయ్యాయి.
అయితే వీళ్లల్లో ఇప్పటి వరకు కేవలం 5,342 అరెస్టయ్యారు. ఇందులో చైనాకు చెందిన ఇద్దరు విదేశీయులతో పాటు 70 మంది అంతర్జాతీయ స్మగ్లర్లు ఉన్నారు. తిరుపతి, చిత్తూరు పోలీసులు జిల్లాలో 62 మందికి పైగా నిందితులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు కింద కేసులు నమోదు చేశారు. బడా స్మగ్లర్లు ఎర్రచందనం తరలింపులో రూ.వేల కోట్లు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించినా వాటిని ప్రభుత్వ పరం చేయడంలో చట్టం అడ్డంకిగా మారింది. తాజాగా అటవీశాఖ చట్టాన్ని సవరించడంతో పాత స్మగ్లర్ల వద్ద గుర్తించిన ఆస్తులను స్వాధీనం చేసుకునే వె సులుబాటు కల్పించారు. అయితే చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే చేసిన సవరణకు ప్రతిఫలం ఉంటుంది.