అడవి తల్లికి రక్షణేదీ? | Where is the protection to Forest? | Sakshi
Sakshi News home page

అడవి తల్లికి రక్షణేదీ?

Published Tue, Sep 12 2017 3:44 AM | Last Updated on Tue, Sep 19 2017 4:22 PM

అడవి తల్లికి రక్షణేదీ?

అడవి తల్లికి రక్షణేదీ?

అటవీ శాఖలోని అన్ని విభాగాల్లో మంజూరైన పోస్టులు 6,882
ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,511
భర్తీ కావాల్సిన ఉద్యోగాలు 3,371
ఖాళీల శాతం 48.98
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూమి ఆక్రమణలపాలైంది. మరోవైపు అత్యంత విలువైన అటవీ సంపద అడ్డగోలుగా దోపిడీకి గురవుతోంది. ఎర్రచందనం నిరాటంకంగా ఎల్లలు దాటి పోతోంది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు లారీలు, కార్లు, మినీ వ్యాన్లలో సైతం నిత్యం తరలిపోతున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయం కోసం ఇటీవల అటవీశాఖ టెండర్లు నిర్వహించగా నాణ్యమైన కలప టన్ను రూ.30 లక్షలు పలికింది.

ఇంత విలువైన ఎర్రచందనం భారీ పరిమాణంలో శేషాచలం నుంచి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో స్మగ్లర్లు పంపిన ఎర్రచందనం కూలీలు అరకొరగా ఉన్న అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడవుల పరిరక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిత్యం అడవుల్లో తిరుగుతూ నిఘా కొనసాగించే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని, ఉన్నతాధికారుల వరకు వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే అడవి తల్లి పాలిట శాపంగా మారిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధ టాస్క్‌ఫోర్స్‌ (ఆర్‌ఎస్‌ఏఎస్‌టీఎఫ్‌)కు మంజూరు చేసిన పోస్టుల భర్తీని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అటవీ సంపద పరిరక్షణపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
సగానికి పైగా పోస్టులు ఖాళీయే.. అటవీ భూమి, అటవీ సంపద పరిరక్షణలో
క్షేత్రస్థాయిలో ఉండే ఫారెస్టు సెక్షనాఫీసర్లు (ఎఫ్‌ఎస్‌ఓ), ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్లు (ఎఫ్‌బీఓ), అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్ల (ఏబీవో) పాత్ర ఎంతో కీలకం. వీరిని పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేసే ఫారెస్ట్‌ రేంజి ఆఫీసర్లు (ఎఫ్‌ఆర్‌ఓ), డిప్యూటీ రేంజి ఆఫీసర్లు (ఆర్‌ఓ)ల భూమికా ముఖ్యమైనదే. అటవీ పరిభాషలో నిర్దిష్ట ప్రాంతాన్ని బీట్‌ అంటారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే బాధ్యత బీట్‌ ఆఫీసరుదే. అటవీ ప్రాంతంలో ఎవరెవరు తిరుగుతున్నారు? టేకు, ఎర్రచందనం, బట్టగడప, రోజ్‌ ఉడ్‌ వంటి విలువైన చెట్లను ఎవరు నరుకుతున్నారు? ఎక్కడకు తరలిస్తున్నారు? ఈ దందా వెనుక ఎవరున్నారు? ఎలా అడ్డుకట్ట వేయాలి? అనే సమాచారం తెలియాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం అడవిలో తిరగాలి? రోజూ తిరుగుతూ పరిశీలిస్తుంటేనే ఎక్కడెక్కడ ఏయే చెట్లు ఉండాలి.

ఎక్కడ ఏ చెట్లు కొట్టారు.. అనే విషయాలు తెలుస్తాయి. కానీ రాష్ట్రంలో బీట్‌ ఆఫీసరు కేడర్‌ స్ట్రెంగ్త్‌ (మంజూరైన పోస్టులు)లో సుమారు 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 60 శాతం ఖాళీలే. అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసరు, ఫారెస్ట్‌ సెక్షనాఫీసరు పోస్టులు కూడా సగానికి పైగా ఖాళీ ఉన్నాయి. ఇవి మంజూరైన పోస్టుల్లో ఖాళీలు మాత్రమే. వాస్తవ అవసరాల ప్రాతిపదికన అయితే అటవీశాఖకు మంజూరు చేసిన క్షేత్రస్థాయి పోస్టుల కంటే రెట్టింపు సిబ్బంది అవసరం. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు.  
 
ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా.. 
క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది ఖాళీల భర్తీ కోసం అటవీశాఖ ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే 13 ఏపీ జిల్లాల్లో 1,256 ఎఫ్‌ఎస్‌ఓ, ఎఫ్‌బీఓ, ఏబీవో పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి రాతపరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించింది. జిల్లాల వారీగా ఎంపిక పరీక్షలు పూర్తయి ఫలితాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగినా యథాతథంగా ఫలితాలు ప్రకటించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంఆ పరీక్షలను రద్దు చేసింది. మూడేళ్లయినా తిరిగి ఆ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘ఇంట్లో బీరువాలో దాచుకున్న వస్తువులే చోరీ అవుతున్నాయి.

ఇక అడవి అనేది బహిరంగ కోశాగారం లాంటిది. ఇందులో విలువైన కలప స్మగ్లింగ్‌ను నిరోధించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే దురదృష్టవశాత్తూ రాష్ట్ర అటవీశాఖలో ఉండాల్సిన సిబ్బందిలో నాలుగోవంతు కూడా లేరు. కేడర్‌ స్ట్రెంగ్త్‌ను రెండింతలు చేయాల్సిన అవసరం ఉంటే మంజూరైన పోస్టుల్లోనే సగం ఖాళీలుంటే ఎలా..’ అని ఒక సీనియర్‌ అటవీశాఖ అధికారి ప్రశ్నించారు. ఇక ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పరిరక్షణ కోసం పది సాయుధ బేస్‌ క్యాంపులు ఏర్పాటు చేసి 605 మందిని నియమించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మగ్లింగ్‌ నిరోధ టాస్క్‌ఫోర్సులో సగం ఖాళీలు అలాగే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నిరోధంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి..’ అని కా అధికారి ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement