Redwood smuggling
-
టింబర్ డిపో మాటున ఎర్రచందనం రవాణా
కర్నూలు, మహానంది: టింబర్‌డిపో పెట్టుకుని కలప విక్రయాల మాటున ఎర్రచందనంపై గురిపెట్టాడు. డిపోలోని సామగ్రికి చలనాలు కట్టి అదే పేరుతో ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తూ అక్రమాలకు పాల్పడ్డాడు. తీగలాగితే డొంక కదిలినట్లు పోలీసుల విచారణలో అన్నీ తేలాయి. శేషాచలం నుంచి ముంబైకి అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్న కేసులో ఒకరికి అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఆదివారం మరొకరిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ మల్లికార్జున, మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మహానంది పోలీసుస్టేషన్లో వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న అంకిరెడ్డిచెరువు వద్ద హైదరాబాద్‌లోని నాంపల్లికి చెందిన కల్యాణి యుగల్ కిశోర్‌ను అరెస్ట్ చేసి 177కిలోల బరువున్న 19 ఎర్రచందనం దుంగలు, 193కిలోల బరువున్న ఇతర 13 దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇదే కేసులో ముంబైకి చెందిన హారూన్ అబ్దుల్ లతీఫ్‌ను అరెస్ట్ చేశామన్నారు. లతీఫ్.. ముంబైలో టింబర్ డిపో నిర్వహిస్తూ ఎర్రచందనాన్ని విదేశాలకు తరలిస్తుంటాడన్నారు. హైదరాబాద్‌లోని ఓ పార్సిల్ సర్వీస్‌లో పనిచేస్తున్న కల్యాణి యుగల్ కిషోర్ సహకారం తీసుకునేవాడని చెప్పారు. జైపూర్‌లోని ఓ లాడ్జీలో ఉంటూ కార్యకలాపాలు సాగిస్తుంటాడన్న సమాచారం మేరకు మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మూడేళ్ల నుంచి ఇలాంటి అక్రమ రవాణాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. ఇదే కేసులో రుద్రవరం గ్రామానికి చెందిన ఎర్రశ్రీను, ఢిల్లీకి చెందిన సలీంల ఆచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. వీరిని సైతం త్వరలోనే పట్టుకుంటామన్నారు. అంతర్జాతీయ స్మగ్లర్‌ను పట్టుకున్న మహానంది ఎస్ఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని సీఐ అభినందించారు. కార్యక్రమంలో ఏఎస్ఐ కృష్ణుడు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎర్రచందనం స్మగ్లింగ్‌లో సినిమా ఆర్టిస్ట్
-
అడవి తల్లికి రక్షణేదీ?
అటవీ శాఖలోని అన్ని విభాగాల్లో మంజూరైన పోస్టులు 6,882 ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్య 3,511 భర్తీ కావాల్సిన ఉద్యోగాలు 3,371 ఖాళీల శాతం 48.98 సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, గుంటూరు, చిత్తూరు తదితర జిల్లాల్లో లక్షలాది ఎకరాల అటవీ భూమి ఆక్రమణలపాలైంది. మరోవైపు అత్యంత విలువైన అటవీ సంపద అడ్డగోలుగా దోపిడీకి గురవుతోంది. ఎర్రచందనం నిరాటంకంగా ఎల్లలు దాటి పోతోంది. శేషాచలం అడవుల నుంచి ఎర్రచందనం దుంగలు లారీలు, కార్లు, మినీ వ్యాన్లలో సైతం నిత్యం తరలిపోతున్నాయి. స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విక్రయం కోసం ఇటీవల అటవీశాఖ టెండర్లు నిర్వహించగా నాణ్యమైన కలప టన్ను రూ.30 లక్షలు పలికింది. ఇంత విలువైన ఎర్రచందనం భారీ పరిమాణంలో శేషాచలం నుంచి తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలకు అక్రమంగా తరలిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులో స్మగ్లర్లు పంపిన ఎర్రచందనం కూలీలు అరకొరగా ఉన్న అటవీ సిబ్బందిపై దాడులకు తెగబడిన సందర్భాలూ ఉన్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అడవుల పరిరక్షణను పూర్తిగా గాలికి వదిలేసింది. నిత్యం అడవుల్లో తిరుగుతూ నిఘా కొనసాగించే క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకుని, ఉన్నతాధికారుల వరకు వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడం లేదు. ప్రభుత్వ నిర్లక్ష్యమే అడవి తల్లి పాలిట శాపంగా మారిందని అధికారవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధ టాస్క్‌ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్)కు మంజూరు చేసిన పోస్టుల భర్తీని సైతం ప్రభుత్వం పట్టించుకోకపోవడం అటవీ సంపద పరిరక్షణపై ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సగానికి పైగా పోస్టులు ఖాళీయే.. అటవీ భూమి, అటవీ సంపద పరిరక్షణలో క్షేత్రస్థాయిలో ఉండే ఫారెస్టు సెక్షనాఫీసర్లు (ఎఫ్ఎస్ఓ), ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు (ఎఫ్బీఓ), అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ల (ఏబీవో) పాత్ర ఎంతో కీలకం. వీరిని పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేసే ఫారెస్ట్ రేంజి ఆఫీసర్లు (ఎఫ్ఆర్ఓ), డిప్యూటీ రేంజి ఆఫీసర్లు (ఆర్ఓ)ల భూమికా ముఖ్యమైనదే. అటవీ పరిభాషలో నిర్దిష్ట ప్రాంతాన్ని బీట్ అంటారు. ఆ ప్రాంతాన్ని పర్యవేక్షించే బాధ్యత బీట్ ఆఫీసరుదే. అటవీ ప్రాంతంలో ఎవరెవరు తిరుగుతున్నారు? టేకు, ఎర్రచందనం, బట్టగడప, రోజ్ ఉడ్ వంటి విలువైన చెట్లను ఎవరు నరుకుతున్నారు? ఎక్కడకు తరలిస్తున్నారు? ఈ దందా వెనుక ఎవరున్నారు? ఎలా అడ్డుకట్ట వేయాలి? అనే సమాచారం తెలియాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది నిత్యం అడవిలో తిరగాలి? రోజూ తిరుగుతూ పరిశీలిస్తుంటేనే ఎక్కడెక్కడ ఏయే చెట్లు ఉండాలి. ఎక్కడ ఏ చెట్లు కొట్టారు.. అనే విషయాలు తెలుస్తాయి. కానీ రాష్ట్రంలో బీట్ ఆఫీసరు కేడర్ స్ట్రెంగ్త్ (మంజూరైన పోస్టులు)లో సుమారు 40 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 60 శాతం ఖాళీలే. అసిస్టెంట్ బీట్ ఆఫీసరు, ఫారెస్ట్ సెక్షనాఫీసరు పోస్టులు కూడా సగానికి పైగా ఖాళీ ఉన్నాయి. ఇవి మంజూరైన పోస్టుల్లో ఖాళీలు మాత్రమే. వాస్తవ అవసరాల ప్రాతిపదికన అయితే అటవీశాఖకు మంజూరు చేసిన క్షేత్రస్థాయి పోస్టుల కంటే రెట్టింపు సిబ్బంది అవసరం. ఈ విషయాన్ని అటవీశాఖ అధికారులే అంగీకరిస్తున్నారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా.. క్షేత్రస్థాయి అటవీ సిబ్బంది ఖాళీల భర్తీ కోసం అటవీశాఖ ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. నాలుగేళ్ల క్రితం రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడే 13 ఏపీ జిల్లాల్లో 1,256 ఎఫ్ఎస్ఓ, ఎఫ్బీఓ, ఏబీవో పోస్టుల భర్తీ కోసం అప్పటి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి రాతపరీక్ష, శరీర దారుఢ్య పరీక్షలు కూడా నిర్వహించింది. జిల్లాల వారీగా ఎంపిక పరీక్షలు పూర్తయి ఫలితాలు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజన జరిగినా యథాతథంగా ఫలితాలు ప్రకటించి భర్తీ చేసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుత ప్రభుత్వంఆ పరీక్షలను రద్దు చేసింది. మూడేళ్లయినా తిరిగి ఆ ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘ఇంట్లో బీరువాలో దాచుకున్న వస్తువులే చోరీ అవుతున్నాయి. ఇక అడవి అనేది బహిరంగ కోశాగారం లాంటిది. ఇందులో విలువైన కలప స్మగ్లింగ్‌ను నిరోధించాలంటే పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం. అయితే దురదృష్టవశాత్తూ రాష్ట్ర అటవీశాఖలో ఉండాల్సిన సిబ్బందిలో నాలుగోవంతు కూడా లేరు. కేడర్ స్ట్రెంగ్త్‌ను రెండింతలు చేయాల్సిన అవసరం ఉంటే మంజూరైన పోస్టుల్లోనే సగం ఖాళీలుంటే ఎలా..’ అని ఒక సీనియర్ అటవీశాఖ అధికారి ప్రశ్నించారు. ఇక ‘శేషాచలం అడవుల్లో ఎర్రచందనం పరిరక్షణ కోసం పది సాయుధ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి 605 మందిని నియమించాలన్న ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. స్మగ్లింగ్ నిరోధ టాస్క్ఫోర్సులో సగం ఖాళీలు అలాగే ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదనడానికి ఇంతకంటే నిదర్శనాలు ఏముంటాయి..’ అని కా అధికారి ప్రశ్నించారు. -
చేయితడిపితే రైట్ రైట్
అటవీ సంపదను కాపాడాల్సిన అటవీ సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. ప్రైవేటు వ్యక్తులను అడ్డుపెట్టుకుని మూమూలు కలప వ్యాపారుల నుంచి మామూళ్లు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెక్‌పోస్టుల్లో చేయితడిపితే వాహనాలకు రైట్ చెబుతూ ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అవకాశం కల్పిస్తున్నారు. ఆత్మకూరురూరల్: ఆత్మకూరు రేంజ్ పరిధిలో అటవీశాఖ సిబ్బంది కొందరు ప్రైవేట్ వ్యక్తులను అడ్డుపెట్టుని అక్రమాలకు పాల్పడుతున్నారు. మామూలు కలపను తరలించే వ్యాపారుల వద్ద మామూళ్లు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే తాము ప్రత్యేక అధికారులమని, స్క్వాడ్ బృందంలో సభ్యులమని ప్రైవేటు వ్యక్తులు దబాయిస్తున్నారు. అటవీశాఖ సిబ్బందే అక్రమాలకు పాల్పడుతుండడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక కలప వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ జిల్లా సరిహద్దులు నుంచి సంగం వరకు ఆత్మకూరు రేంజ్ పరిధి. అటవీ శాఖ చెక్‌పోస్టుల వద్ద వాచ్మెన్లు, డీఆర్ఓలు విధులు నిర్వహిస్తుంటారు. కృష్ణాపురం చెక్‌పోస్టు వద్ద కొద్ది రోజులుగా జామాయిల్, చిల్లకర్ర తరలించే వ్యాపారుల వద్ద సిబ్బంది వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇదేక్రమంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి నగదు తీసుకుని వాహనాలకు రైట్ చెబుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మార్గానికి ఎలాంటి సంబంధం లేని దుత్తలూరు మండలానికి చెందిన ఓ వాచర్, డీఆర్వో కృష్ణాపురం ప్రాంతంలో తమ పరిచయాలను ఉపయోగించి వాహనాలను తప్పిస్తున్నట్లు సమాచారం. ఇటీవల పొగాకు క్యూరింగ్ జరుగుతున్న క్రమంలో రైతులు కలపను బ్యారెన్ల వద్దకు తరలిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది రైతుల వాహనాలను సైతం ఆపి వేలాది రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం ఆత్మకూరు రేంజ్ కార్యాలయంలో చర్చ జరిగినట్లు సమాచారం. అటవీశాఖ సిబ్బంది అక్రమాలపై రేంజర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాగా ఈ విషయమై ఆత్మకూరు రేంజర్ రామకొండారెడ్డిని సంప్రదించగా ఎలాంటి స్క్వాడ్, ప్రత్యేక నిఘా బందాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. ఈ విషయంపై విచారించి ప్రైవేటు వ్యక్తులపై చర్యలు తీసుకుం టామన్నారు. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా వసూళ్లకు పాల్పడుతుంటే సమాచారం ఇవ్వాలని కోరారు. -
అప్పు తీర్చుకునేందుకు..
రంగంలోకి దిగిన దేశం నేతలు నకిలీ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పును రక్షించడానికి టీడీపీ కీలక నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన అప్పు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతోపాటు భారీ ఎత్తున డబ్బు సమకూర్చినట్లు అప్పట్లో ఆరోపణలు విన్పించాయి. సీఐడీ పోలీసులు కూడా దీనిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డ అప్పును రక్షించేందుకు దేశం నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తిరుపతి: వెదురుకుప్పం మండలం బాలకృష్ణాపురానికి చెందిన అప్పు అలియాస్ కృష్ణస్వామి అలియాస్ పురుషోత్తంరెడ్డి అలియాస్ అన్బుసెల్వం మొదటి నుంచి టీడీపీ సానుభూతిపరుడు. అప్పు సోదరి పద్మావతమ్మ వెదురుకుప్పం మండలం జక్కదొన పంచాయతీకి టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ మద్యం ఏరులై పారడంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. చెన్నైలో హవ్వాయి ప్రాంతంలో నివసించే అప్పు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం చిత్తూరులో తన సోదరి, జక్కదొన సర్పంచ్ పద్మావతమ్మ ఇంటికి అప్పు వచ్చినట్లు సమాచారం అందుకున్న సీఐడీ పోలీసులు వ్యూహాత్మకంగా ఆయనను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. శ్రీకాళహస్తి పోలీసుస్టే షన్లో నమోదైన ఎర్రచందనం కేసులో అప్పు నిందితుడు. ఎవరీ అప్పు..?: కంచి మఠంలో వరదరాజపెరుమాళ్ ఆలయ పూజారి శంకర్రామన్ హత్య కేసు 2003లో సంచలనం రేపింది. అప్పు సహాయంతోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ హత్య చేయించినట్లు అప్పట్లో కేసు నమోదైంది. శంకర్రామన్ హత్యతో పాటు ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం కేసులోనూ అప్పు నిందితుడు. వెదురుకుప్పం మండలంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అప్పు.. బాల్యం లోనే చెన్నైకి మకాం మార్చారు. తమిళనాడులో ఓ విపక్షంలోని కీలకనేతకు చేరువైన అప్పు నేర సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించారు. ఇదే సమయంలో జిల్లా టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. తమిళనాడులో విపక్షంలోని ఓ సీనియర్ నేత దన్నుతో చెలరేగిపోయిన అప్పు ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ కార్యకలాపాలను సాగించారు. నకిలీ మద్యం వ్యాపారంలో అప్పు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఛోటా స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేసి, విదేశాలకు ఎగుమతి చేయడంలో అప్పుది అందె వేసిన చేయి అని పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ సలీమ్‌కు అప్పు సహచరుడని పోలీసులు అనుమానిస్తున్నారు. టీడీపీ నేతల్లో వణుకు నకిలీ మద్యం కేసులో సీఐడీ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అప్పును అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచడంతో టీడీపీ కీలకనేతల్లో ఆందోళన మొదలైంది. విచారణలో తమ పేర్లు ఎక్కడ బహిర్గతమవుతాయనే భయంతో టీడీపీ నేతలు ఆ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోన్న టీడీపీ నేతలకు.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు అప్పును అరెస్టు చేయడం సం చలనం రేపింది. అప్పును ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నుంచి తప్పించాలని పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ కీలకనేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. ఆ ఒత్తిళ్లకు ఉన్నతాధికారులు తలొగ్గకుండా అప్పును కోర్టులో హాజరుపరచడంతో టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. మన రాష్ట్రంతో పాటూ తమిళనాడు, కర్ణాటకల్లో అప్పు కార్యకలాపాలు, అనుచరులు, ఆస్తులపై ఆరా తీయడానికి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. చెన్నైలో రూ.150 కోట్ల ఖరీదు చేసే హోటల్‌తో పాటు వెదురుకుప్పం మండలం బాలకృష్ణాపురంలో వంద ఎకరాలకుపైగా మామిడి తోట అప్పు ఆస్తులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. టీడీపీ అగ్రనేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోండంతో పోలీసులు రహస్యంగా విచారణను కొనసాగిస్తున్నారు. -
ఎర్రదొంగల..ఆటకట్టు కథేనా?
సెమినార్ చెప్పిన కథ కేబినెట్లో తీర్మానం లేదనే విమర్శలు కఠిన చర్యలకు వెనక్కు తగ్గుతున్న బాబు ఎన్నికలకు ముందు గవర్నర్ వద్ద హడావుడి అధికారంలోకొచ్చాక పట్టించుకోని వైనం అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విషయంలో ప్రభుత్వ హడావుడి బూటకమేనా.. చందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విన్నవించి ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేడం లేదు.. కఠిన చట్టాలు తెచ్చి స్మగ్లర్ల భరతం పడతానని నాడు ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాట మార్చారా.. గత కేబినెట్ సమావేశంలో స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అధికారులను మనస్థాపానికి గురిచేసిందా? అనే అనుమానాలు కొందరు అటవీ అధికారుల మాటలు వింటే నిజమనిపిస్తున్నారుు. బాబు వైఖరిపై ఇటు అటవీ శాఖ, అటు సివిల్ పోలీసు అధికారుల్లోనూ అనుమానాలు ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం చిత్తూరు కలెక్టరేట్లో ఐజీ, డీఐజీ లాంటి ఉన్నతాధికారుల సమక్షంలో సదస్సు నిర్వహించారు. ఆదివారం కూడా కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం జిల్లాకు చెందిన అటవీ, పోలీసు విభాగాలకు చెందిన కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చందనం స్మగ్లర్లపై కఠిన శిక్షలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తే అది జరగలేదంటూ ఆయనబహిరంగంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తించారు. చందనం స్మగ్లింగ్‌ను పోలీసుల సహకారం లేకుండా అరికట్టడం అటవీశాఖకు సాధ్యం కాదని తేల్చారు. అటవీ చట్టంలో చెట్లు నరికితే మూడు నెలలు.. మహా అయితే ఏడాది శిక్ష ఉంటుందన్నారు. ఈ శిక్షతో స్మగ్లర్లకు అడ్డకట్ట వేయడం సాధ్యం కాదన్నారు. అందుకే చందనం నరికివేత కేసుకు మూడేళ్ల నుంచి 7 సంవత్సరాల శిక్షాకాలం ఉండాలని ప్రతిపాదించామని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. దీనికి నాలుగు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుందని భావించామని, అయితే ఎందుకో ఇది జరగలేదని చెప్పకనే చెప్పడం విశేషం. ‘‘స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కఠిన చట్టాలు, ప్రభుత్వ సహకారం అవసరం. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరం భావించాం. ఇటీవల ముగిసిన కేబినెట్లో కఠిన చట్టం కోసం తీర్మానం చేస్తారనుకున్నాం. తీరా చూస్తే వారే వెనక్కు తగ్గారు’’ అంటూ... మరికొందరు అధికారులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికారులకు మద్దతు పలికితేనే అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు చందనం స్మగ్లింగ్‌పై చంద్రబాబు పెద్ద ఆర్భాటమే చేశారు. ఢిల్లీ స్థాయిలో చర్చలేవనెత్తబోయారు. తాము తప్ప ఎదుటివారంతా దొంగలే అన్నట్లు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు అధికారంలో ఆయనే ఉన్నారు. స్మగ్లింగ్‌ను అరికడతామంటూ అధికారులు ముందుకు వస్తున్నారు. చట్టాలను మార్చమని, ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతు పలకాలని కోరుతున్నారు. బాబు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.! -
అరెస్టుల పర్వంలో ...అదే వరుస !
భాకరాపేట తరహాలో చిత్తూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ అందులోనూ టీడీపీ ప్రచారకార్యదర్శి వసంత్‌తో పాటు మధు పేరు ‘సాక్షి’ కథనంతో జిల్లా నుంచి వసంత్ పరార్.. అదే బాటలో మరికొందరు నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం... ‘పచ్చ’ నేతలకు బెయిల్ వచ్చే అవకాశం భాకరాపేట...చిత్తూరు టూ టౌన్. ఊరు ఏదైనా అరెస్టుల పర్వంలో అదే తంతు. ఎర్రచందనం స్మగ్లింగ్లోని ప్రధాన నిందితుల అరెస్టులో నిర్లిప్తత కొనసాగుతోంది. పోలీసులపై అధికారపార్టీ ఒత్తిడే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి వసంత్, ఆపార్టీ నేత మధుపై ఎఫ్ఐఆర్ నమోదై కళ్లెదుట తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. అలాంటి వ్యవహారం చిత్తూరు టూ టౌన్లో జరిగింది. ఇక్కడ కూడా వారిపై కేసులు నమోదైనా పోలీసులు అరెస్టు చేయలేదు. అరెస్టుల పర్వంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుల జాబితాలో మరో నలుగురి పేర్లు పెరిగినట్లు తెలుస్తోంది. పట్టుబడిన దొంగల విచారణలో మరో నలుగురు దొంగలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. దీంతో మొన్నటి వరకూ 196గా ఉన్న సంఖ్య 200కు చేరినట్లయింది. జాబితాలో చేరిన ఆ నలుగురు స్మగ్లర్లు తమిళనాడువాసులుగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. చిత్తూరు టూటౌన్లోనూ అదే సీన్.. టీడీపీ జిల్లా ప్రచారకార్యదర్శి వసంత్‌కుమార్, ఆ పార్టీ నేత మధుతో పాటు 19మంది ఎర్రచందనం దొంగలపై ఈ నెల 13న భాకరాపేట పోలీసుస్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. వసంత్, మధు జిల్లాలో తిరుగుతున్నా పోలీసులు అరెస్టు చేయలేదు. ప్రభుత్వ పెద్దల నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగానే వీరిని అరెస్టు చేయలేదని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈ నెల 21న ‘పసుపు స్మగ్లర్లకు పోలీసు కవచం’ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో వసంత్, మధుతో పాటు జిల్లాకు సంబంధించిన జాబితాలో ఉన్న వ్యక్తులు పరారయ్యారు. అయితే భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఈ నెల 13నే 16మంది ఎర్రచందనం స్మగ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. సెక్షన్యు/ఎస్379, 109ఐపీసీఆర్/డబ్ల్యూ మరియు ఏపీ ఫారెస్ట్యాక్ట్ 1967 సెక్షన్ 29, 32తో పాటు ఎర్రచందనం అక్రమరవాణా, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు పలు సెక్షన్లపై ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలిసింది. భాకరాపేటలో ఎఫ్ఐఆర్ నమోదైన 19 మందిలోని 11 మంది వ్యక్తులపై చిత్తూరు టూటౌన్ పోలీసుస్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదైనట్లు తెలుస్తోంది. వీరిపై మరో కేసు ఉంటే పీడీయాక్టు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే 13 నుంచి భాకరాపేటతో పాటు చిత్తూరు టూటౌన్ పోలీసులు కూడా వీరి అరెస్టుపై దూకుడు ప్రదర్శించలేదు. దీనికి కారణం కూడా ‘పచ్చ’ నేతలకు ‘ప్రభుత్వ’ అండ ఉండటమే అని తెలుస్తోంది. ఇప్పటి వరకూ 84మంది స్మగ్లర్ల అరెస్టు ఎర్రచందనం స్మగర్ల అరెస్టులు, కూంబింగ్‌లో వైఎస్సార్, చిత్తూరు, తిరుపతి పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వీరి పరిధిలో ఈ నెల 22 వరకూ 80 మంది దొంగలు ఉన్నట్లు తెలిసింది. సోమవారం ఎర్రావారిపాళెం పరిధిలో మరో నలుగురు అరెస్టయ్యారు. దీంతో ఈ సంఖ్య 84కు చేరింది. తక్కిన 116 మంది కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి. ఇద్దరు ఏఎస్పీలు, 20మంది సీఐలు, వందమంది పోలీసులు స్మగ్లర్ల కోసం గాలిస్తున్నారు. వీరు మరో స్మగ్లర్ ఆరని రమేష్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రమేష్‌పై భాకరాపేట పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. దీనిపై చిత్తూరు టూటౌన్ ఎస్ఐ లక్ష్మణరెడ్డిని వివరణ కోరగా వారం రోజులుగా తాను ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణలో భాగంగా డీఎస్పీ కార్యాలయంలో ఉన్నానని తెలిపారు. నేడు పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం పీడీయాక్టు అడ్వయిజరీ బోర్డు సమావేశం మంగళవారం జరగనుంది. ఇప్పటి వరకూ పీడీయాక్టు నమోదైన 14మంది స్మగ్లర్లతో పాటు ఇంకెవరిపై పీడీయాక్టు నమోదు చేయాలి? అనే కోణంలో విచారణ జరగనుంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ప్రధాన దొం గలుగా ఉన్న రెడ్డినారాయణ, మహేశ్‌నాయుడు భార్యలు ఇటీవల సీఎం చంద్రబాబునాయుడును కలిసిన సంగతి తెలిసిందే! పార్టీ కోసం తమ భర్తలు పనిచేశారని, భారీగా డబ్బు కూడా ఖర్చు చేశారని, వారిని కేసుల నుంచి ఎలాగైనా తప్పించాలని వారు కోరినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. చంద్రబాబు కూడా వారికి ‘అభయం’ ఇచ్చినట్లు తెలిసిం ది. దీంతో ఆ ఇద్దరికీ బెయిల్ వచ్చే అవకాశం ఉన్నట్లు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. -
మరో 54 మంది ఎర్రచందనం కూలీల అరెస్ట్
చిత్తూరు: మరో 54 మంది ఎర్రచందనం కూలీలను మంగళవారం చంద్రగిరి మండలం మాముండూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్టవేయటం సవాల్ గా మారింది. ఈ రోజు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకుని, ఒక లారీని సీజ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 735 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఏకంగా 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడా స్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు. -
ఆగని స్మగ్లింగ్!
ఓ వైపు పోలీసులు శేషాచలం కొండల్ని జల్లెడ పడుతున్నారు. మరో వైపు శేషాచలాన్ని చెరపట్టిన తమిళ స్మగ్లర్లు పోలీసుల కూంబింగ్‌కు బెదరడం లేదు. మీదారి మీదే...మా దారి మాదే అన్నట్లు...యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. గతంలో పోలీసులను చూసి భయపడే తమిళ కూలీలు...ఇప్పుడు తిరగబడే స్థాయికి...కాదు...కాదు...అవసరమైతే చంపేందుకు తెగబడుతున్నారు. వారం రోజులుగా పోలీసులు స్మగర్ల కోసం గాలిస్తున్నారు. మూడురోజుల క్రితం ముగ్గుర్లు స్మగ్లర్లను చంపారు. అయినా శనివారం 236మంది స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారంటే ‘ఎర్ర’దొంగలు ఎంతకు తెగించారో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు స్మగ్లర్లతో పాటు వారి వెనుక ఉన్న ‘అసలుదొంగ’లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపడంలో పోలీసులు చిత్తశుద్ధి చూపడం లేదా? ఎంత కష్టపడినా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల అండతోనే ఎర్ర సంపద యథేచ్ఛగా ఎల్లలు దాటుతోందా? అంటే ఈప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. వారం రోజులుగా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జల్లెడ పడుతున్నాయి. అయినప్పటికీ స్మగ్లింగ్ ఆగడం లేదు. శనివారం కూడా రైల్వేకోడూరు నుంచి చెన్నైకి వెళుతున్న 236 మంది తమిళ కూలీలను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇంత భారీ సంఖ్యలో కూలీలను అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఈ సంఘటన పోలీసులకు ఓ వైపు ఛాలెంజ్ విసురుతోంది. ‘ఆపరేషన్ శేషాచలం’ పేరుతో పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నా స్మగ్లర్లు ఇంత ధైర్యంగా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారని ఆలోచనలో పడ్డారు. దీని వెనుక బడానేతలు, తమ శాఖకు చెందిన అధికారుల అండ లేకుండా ఇంతకు తెగించే అవకాశం లేదని కొందరు పోలీసు, అటవీ అధికారులు చర్చించుకుంటున్నారు. స్మగ్లర్లు కనిపించినా ఫైర్ చేయని పోలీసులు కూంబింగ్ నేపథ్యంలో ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదురోజుల కిందట రాజంపేట-తిరుమల మధ్యలోని తూర్పు కొండల్లో కూంబింగ్ నిర్వహించారు. ఓ ఏఎస్ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. ఓ పోలీసు అధికారి తెలిపిన సమాచారం మేరకు...50మంది స్మగ్లర్లు దుంగలను నరికి విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించారు. బిర్యానీ తిని, మద్యం సేవించారు. కొండపైన పోలీసులు...కింద స్మగ్లర్లు ఉన్నారు. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. దీనికి కారణం కాల్పులు జరిపే అధికారం తనకు లేదని ఏఎస్ఐ చేతులెత్తేయడమే. పోనీ కొండ దిగి స్మగ్లర్ల అరెస్టుకు ప్రయత్నించారా? అంటే అదీ లేదు. తాము 20మంది మాత్రమే ఉన్నామని, స్మగ్లర్లు 50మంది ఉన్నారని, తమపైనే దాడులకు తెగబడి చంపే ప్రమాదముందనే భయంతో పోలీసులు వెనుదిరిగినట్లు సమాచారం. పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే ఎన్నేళ్లయినా చందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేరని ఇట్టే తెలుస్తోంది. ఎంతమందిని అరెస్టు చేశారో వెల్లడించని పోలీసులు ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 681మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మరో 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడాస్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. దీనిపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లతో పాటు అరెస్టు కాకుండా అజ్ఞాతంలో ఉన్న స్మగ్లర్లను కాపాడేందుకు రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ దుకాణం తెరిచినట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు అరెస్టయిన వారి పేర్లు వెల్లడించడం లేదని తెలుస్తోంది. అలాగే టీడీపీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కూడా పేర్లు వెల్లడించడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కూంబింగ్, అరెస్టుల పర్వం చిత్తశుద్ధితో జరగడం లేదని వారం రోజుల పనితీరు స్పష్టం చేస్తోంది. -
అసలు ‘ఎర్ర’ దొంగలను అరెస్టు చేయూలి
రొంపిచెర్ల, న్యూస్‌లైన్: జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ లో అసలు దోషులను అరెస్టు చేయూల ని వైఎస్సార్ సీపీ నాయకుడు, అటవీ శాఖ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం రొంపిచెర్ల వుండలంలో ఆయన గడప గడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రవుం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిచ్చిలివారిపల్లెలో వూట్లాడుతూ ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో సీఎం సోదరుడు కూడ ఉన్నారని ఆరోపించా రు. అసలు దోషులను వదలిపెట్టి, కూలి కోసం వచ్చిన వారిని అరెస్టు చేయడం న్యాయుం కాదన్నారు. అటవీ, పోలీసుశాఖాధికారులందరూ సీఎం సోదరుని కనుసన్నల్లో నడుస్తున్నారని వివుర్శించారు. ఇందుకు ముఖ్యమం త్రి కూడ పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం దొం గలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు ఉందన్నారు. కిరణ్‌కువూర్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత, ఆయన కుటుంబసభ్యుల ఆస్తులు పెరిగిపోయూయని విమర్శించారు. తాను అట వీశాఖ వుంత్రిగా ఉన్నప్పుడు రాయులసీవు జిల్లాలో ఎర్రచందనం అక్రవు రవాణాను పూర్తిగా నివారించినట్లు చెప్పారు. ప్రస్తుతం కోట్ల రూపాయులు విలువ చేసే ఎర్రచందనం ఇతర దేశాలకు తరలిపోతోందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టలేని సీఎం కిరణ్ వెంటనే పదవికి రాజీనావూ చేయూలని డివూండ్ చేశారు. వైఎస్ హయుంలో రాష్ట్రం అభివృద్ధి చెందితే, కిరణ్ పాలనలో ఆయన కుటుంబం ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందుతోందని ఆరోపించారు. గ్యాస్, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలు పెరగడంతో సామాన్యులు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. -
కుక్కలొచ్చాయి జాగ్రత్త!
రుద్రవరం, న్యూస్‌లైన్: నల్లమల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు పోలీసుల సహకారం తీసుకున్నారు. డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు. దీంతో స్మగ్లర్లలో వణుకు పుడుతోంది. రుద్రవరం రేంజ్ పరిధిలోని ఆర్. నాగులవరం, రుద్రవరం తదితర గ్రామాల్లో ఎర్రచందనం స్మగర్లు దుంగలను నిల్వ ఉంచి తరలిస్తున్నారన్న సమాచారం మేరకు మంగళవారం అటవీ అధికారి రాంసింగ్, పోలీసు అధికారి శ్రీకాంతరెడ్డి డాగ్ స్క్వాడ్ సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా రాంసింగ్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలోని చాలా గ్రామాల్లో ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టగలిగామన్నారు. ఆర్ నాగులవరం, టి లింగందిన్నె, తిప్పారెడ్డి పల్లె గ్రామాల్లో స్మగర్లు ఎర్రచందనం అక్రమ రవాణా కొనసాగిస్తున్నారని అక్రమ రవాణాను అడ్డు కోవడానికి పోలీసుల సహకారం కోసం జిల్లా ఎస్పీ రఘురామి రెడ్డిని కోరామన్నారు. స్పందించిన ఆయన జిల్లా పోలీసు అధికారి పోలీసు బలగాలతోపాటు డాగ్ స్క్వాడ్‌ను పంపించారన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో పేరొందిన ఆర్. నాగులవరం గ్రామాన్ని మొదట ఎన్నుకుని దాడులు నిర్వహించామన్నారు. అలాగే రుద్రవరం గ్రామంలోని బెస్తకాలనీలో సోదాలు నిర్వహించామన్నారు. ఇప్పటి నుంచి డాగ్ స్క్వాడ్ సిబ్బంది రుద్రవరం ఫారెస్ట్ కార్యాలయంలో ఉంటుందని రాత్రి సమయంలో దాడులు చేస్తామన్నారు. దాడుల్లో సెక్షన్ అధికారి జాకీర్ ఉశేన్, బీటు అధికారి రామకృష్ణలతోపాటు డాగ్ స్క్వాడ్, పోలీసు, ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.