ఆగని స్మగ్లింగ్! | rosewood smuggling | Sakshi
Sakshi News home page

ఆగని స్మగ్లింగ్!

Published Tue, Jun 3 2014 3:34 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ఆగని స్మగ్లింగ్! - Sakshi

ఆగని స్మగ్లింగ్!

 ఓ వైపు పోలీసులు శేషాచలం కొండల్ని జల్లెడ పడుతున్నారు. మరో వైపు శేషాచలాన్ని చెరపట్టిన తమిళ స్మగ్లర్లు పోలీసుల కూంబింగ్‌కు బెదరడం లేదు. మీదారి మీదే...మా దారి మాదే అన్నట్లు...యథేచ్ఛగా స్మగ్లింగ్ సాగిస్తున్నారు. గతంలో పోలీసులను చూసి భయపడే తమిళ కూలీలు...ఇప్పుడు తిరగబడే స్థాయికి...కాదు...కాదు...అవసరమైతే చంపేందుకు తెగబడుతున్నారు. వారం రోజులుగా పోలీసులు స్మగర్ల కోసం గాలిస్తున్నారు. మూడురోజుల క్రితం ముగ్గుర్లు స్మగ్లర్లను చంపారు. అయినా శనివారం 236మంది స్మగ్లర్లు పోలీసులకు పట్టుబడ్డారంటే ‘ఎర్ర’దొంగలు ఎంతకు తెగించారో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు స్మగ్లర్లతో పాటు వారి వెనుక ఉన్న ‘అసలుదొంగ’లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
     
 సాక్షి, కడప: ఎర్రచందనం స్మగ్లింగ్‌ను ఆపడంలో పోలీసులు చిత్తశుద్ధి చూపడం లేదా? ఎంత కష్టపడినా స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధుల అండతోనే ఎర్ర సంపద యథేచ్ఛగా ఎల్లలు దాటుతోందా? అంటే ఈప్రశ్నలన్నిటికీ అవుననే సమాధానం వస్తోంది. వారం రోజులుగా చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలోని శేషాచలం అటవీ ప్రాంతాన్ని ప్రత్యేక బృందాలు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు జల్లెడ పడుతున్నాయి. అయినప్పటికీ స్మగ్లింగ్ ఆగడం లేదు. శనివారం కూడా రైల్వేకోడూరు నుంచి చెన్నైకి వెళుతున్న 236 మంది తమిళ కూలీలను తిరుపతి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఇంత భారీ సంఖ్యలో కూలీలను అరెస్టు చేయడం ఇదే ప్రథమం. ఈ సంఘటన పోలీసులకు ఓ వైపు ఛాలెంజ్ విసురుతోంది. ‘ఆపరేషన్ శేషాచలం’ పేరుతో  పెద్ద ఎత్తున కూంబింగ్ చేస్తున్నా స్మగ్లర్లు ఇంత ధైర్యంగా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారని ఆలోచనలో పడ్డారు. దీని వెనుక బడానేతలు, తమ శాఖకు చెందిన అధికారుల అండ లేకుండా ఇంతకు తెగించే అవకాశం లేదని కొందరు పోలీసు, అటవీ అధికారులు చర్చించుకుంటున్నారు.
 
 స్మగ్లర్లు కనిపించినా ఫైర్ చేయని పోలీసులు
 కూంబింగ్ నేపథ్యంలో ఓ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఐదురోజుల కిందట రాజంపేట-తిరుమల మధ్యలోని తూర్పు కొండల్లో కూంబింగ్  నిర్వహించారు. ఓ ఏఎస్‌ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బలగాలు గాలింపు చేపట్టాయి. ఓ పోలీసు అధికారి తెలిపిన సమాచారం మేరకు...50మంది స్మగ్లర్లు దుంగలను నరికి విశ్రాంతి కోసం నిద్రకు ఉపక్రమించారు. బిర్యానీ తిని, మద్యం సేవించారు. కొండపైన పోలీసులు...కింద స్మగ్లర్లు ఉన్నారు. అయినప్పటికీ కాల్పులు జరపలేదు. దీనికి కారణం కాల్పులు జరిపే అధికారం తనకు లేదని ఏఎస్‌ఐ చేతులెత్తేయడమే. పోనీ కొండ దిగి స్మగ్లర్ల అరెస్టుకు ప్రయత్నించారా? అంటే అదీ లేదు. తాము 20మంది మాత్రమే ఉన్నామని, స్మగ్లర్లు 50మంది ఉన్నారని, తమపైనే దాడులకు తెగబడి చంపే ప్రమాదముందనే భయంతో పోలీసులు వెనుదిరిగినట్లు సమాచారం. పోలీసుల వైఖరి ఇలాగే ఉంటే ఎన్నేళ్లయినా చందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయలేరని ఇట్టే తెలుస్తోంది.
 
 ఎంతమందిని అరెస్టు చేశారో వెల్లడించని పోలీసులు
 ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 681మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం మరో 250 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడాస్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు.
 
 అయితే ఈ ప్రక్రియలో ఎక్కడా అధికారులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. దీనిపై కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న స్మగ్లర్లతో పాటు  అరెస్టు కాకుండా అజ్ఞాతంలో ఉన్న స్మగ్లర్లను కాపాడేందుకు రాయలసీమకు చెందిన ఓ టీడీపీ ఎంపీ దుకాణం తెరిచినట్టు తెలుస్తోంది. అందుకే పోలీసులు అరెస్టయిన వారి పేర్లు వెల్లడించడం లేదని తెలుస్తోంది. అలాగే టీడీపీ నేతల నుంచి వచ్చే ఒత్తిళ్లతో కూడా పేర్లు వెల్లడించడం లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కూంబింగ్, అరెస్టుల పర్వం చిత్తశుద్ధితో జరగడం లేదని వారం రోజుల పనితీరు స్పష్టం చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement