చిత్తూరు: మరో 54 మంది ఎర్రచందనం కూలీలను మంగళవారం చంద్రగిరి మండలం మాముండూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక ప్రణాళికతో ఆపరేషన్ నిర్వహిస్తున్న పోలీసులకు ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్టవేయటం సవాల్ గా మారింది. ఈ రోజు అదుపులోకి తీసుకున్న స్మగ్లర్ల నుంచి కోటి విలువ చేసే ఎర్రచందనం స్వాధీనం చేసుకుని, ఒక లారీని సీజ్ చేశారు. ఎర్రచందనం స్మగ్లర్ల కోసం తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఆరునెలలుగా ప్రత్యేక ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ఇప్పటి వరకూ 735 మంది దొంగలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఏకంగా 250 మందిని అదుపులోకి తీసుకున్నారు.
అయితే ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసేందుకు ఎంతమందితో జాబితా సిద్ధం చేశారు?ఎంతమందిని అరెస్టు చేశారు అనే విషయాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పోలీసు వర్గాల సమాచారం మేరకు చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన 57 మంది బడా స్మగ్లర్లు ఉన్నారు. వీరితో పాటు కర్నాటక, తమిళనాడుకు చెందిన 29మంది స్మగ్లర్లతో మరో జాబితాను సిద్ధం చేసి ఆ రాష్ట్రాల పోలీసులకు అందజేశారు. దీంతో కర్నాటక, తమిళనాడులో కూడా వారి అరెస్టు కోసం అక్కడి పోలీసులు గాలించి అరెస్టు చేస్తున్నారు.