అప్పు తీర్చుకునేందుకు..
రంగంలోకి దిగిన దేశం నేతలు
నకిలీ మద్యం, ఎర్రచందనం స్మగ్లింగ్ కేసుల్లో పోలీసులు అరెస్టు చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అప్పును రక్షించడానికి టీడీపీ కీలక నేతలు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాకు చెందిన అప్పు సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో టీడీపీ నాయకులకు నకిలీ మద్యంతోపాటు భారీ ఎత్తున డబ్బు సమకూర్చినట్లు అప్పట్లో ఆరోపణలు విన్పించాయి. సీఐడీ పోలీసులు కూడా దీనిని గుర్తించారు. ఈ నేపథ్యంలో అనూహ్యంగా పోలీసులకు పట్టుబడ్డ అప్పును రక్షించేందుకు దేశం నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
తిరుపతి: వెదురుకుప్పం మండలం బాలకృష్ణాపురానికి చెందిన అప్పు అలియాస్ కృష్ణస్వామి అలియాస్ పురుషోత్తంరెడ్డి అలియాస్ అన్బుసెల్వం మొదటి నుంచి టీడీపీ సానుభూతిపరుడు. అప్పు సోదరి పద్మావతమ్మ వెదురుకుప్పం మండలం జక్కదొన పంచాయతీకి టీడీపీ మద్దతుతో సర్పంచ్‌గా గెలుపొందడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ మద్యం ఏరులై పారడంపై ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించింది. చెన్నైలో హవ్వాయి ప్రాంతంలో నివసించే అప్పు చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు నకిలీ మద్యం సరఫరా చేసినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. పది రోజుల క్రితం చిత్తూరులో తన సోదరి, జక్కదొన సర్పంచ్ పద్మావతమ్మ ఇంటికి అప్పు వచ్చినట్లు సమాచారం అందుకున్న సీఐడీ పోలీసులు వ్యూహాత్మకంగా ఆయనను అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరుపరిచారు. శ్రీకాళహస్తి పోలీసుస్టే షన్‌లో నమోదైన ఎర్రచందనం కేసులో అప్పు నిందితుడు.
ఎవరీ అప్పు..?:
కంచి మఠంలో వరదరాజపెరుమాళ్ ఆలయ పూజారి శంకర్‌రామన్ హత్య కేసు 2003లో సంచలనం రేపింది. అప్పు సహాయంతోనే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఈ హత్య చేయించినట్లు అప్పట్లో కేసు నమోదైంది. శంకర్‌రామన్ హత్యతో పాటు ఆడిటర్ రాధాకృష్ణన్‌పై హత్యాయత్నం కేసులోనూ అప్పు నిందితుడు. వెదురుకుప్పం మండలంలో సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అప్పు.. బాల్యం లోనే చెన్నైకి మకాం మార్చారు. తమిళనాడులో ఓ విపక్షంలోని కీలకనేతకు చేరువైన అప్పు నేర సామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా విస్తరించారు. ఇదే సమయంలో జిల్లా టీడీపీ నేతలతో సన్నిహితంగా మెలుగుతూ వచ్చారు. తమిళనాడులో విపక్షంలోని ఓ సీనియర్ నేత దన్నుతో చెలరేగిపోయిన అప్పు ఆ రాష్ట్రంతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ కార్యకలాపాలను సాగించారు. నకిలీ మద్యం వ్యాపారంలో అప్పు కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు సీఐడీ పోలీసులు గుర్తించారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఛోటా స్మగ్లర్ల నుంచి ఎర్రచందనం కొనుగోలు చేసి, విదేశాలకు ఎగుమతి చేయడంలో అప్పుది అందె వేసిన చేయి అని పోలీసులు చెబుతున్నారు. అంతర్జాతీయ స్మగ్లర్ సలీమ్‌కు అప్పు సహచరుడని పోలీసులు అనుమానిస్తున్నారు.
టీడీపీ నేతల్లో వణుకు
నకిలీ మద్యం కేసులో సీఐడీ పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా అప్పును అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచడంతో టీడీపీ కీలకనేతల్లో ఆందోళన మొదలైంది. విచారణలో తమ పేర్లు ఎక్కడ బహిర్గతమవుతాయనే భయంతో టీడీపీ నేతలు ఆ కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోన్న టీడీపీ నేతలకు.. ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో ఉన్నతాధికారు ల ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి పోలీసులు అప్పును అరెస్టు చేయడం సం చలనం రేపింది. అప్పును ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నుంచి తప్పించాలని పోలీసు ఉన్నతాధికారులపై టీడీపీ కీలకనేతలు తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. కానీ.. ఆ ఒత్తిళ్లకు ఉన్నతాధికారులు తలొగ్గకుండా అప్పును కోర్టులో హాజరుపరచడంతో టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. మన రాష్ట్రంతో పాటూ తమిళనాడు, కర్ణాటకల్లో అప్పు కార్యకలాపాలు, అనుచరులు, ఆస్తులపై ఆరా తీయడానికి తిరుపతి అర్బన్ ఎస్పీ గోపీనాథ్‌జెట్టి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. చెన్నైలో రూ.150 కోట్ల ఖరీదు చేసే హోటల్‌తో పాటు వెదురుకుప్పం మండలం బాలకృష్ణాపురంలో వంద ఎకరాలకుపైగా మామిడి తోట అప్పు ఆస్తులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. టీడీపీ అగ్రనేతల నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోండంతో పోలీసులు రహస్యంగా విచారణను కొనసాగిస్తున్నారు.