సెమినార్ చెప్పిన కథ
కేబినెట్‌లో తీర్మానం లేదనే విమర్శలు
కఠిన చర్యలకు వెనక్కు తగ్గుతున్న బాబు
ఎన్నికలకు ముందు గవర్నర్ వద్ద హడావుడి
అధికారంలోకొచ్చాక పట్టించుకోని వైనం
అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు
సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విషయంలో ప్రభుత్వ హడావుడి బూటకమేనా.. చందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విన్నవించి ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేడం లేదు.. కఠిన చట్టాలు తెచ్చి స్మగ్లర్ల భరతం పడతానని నాడు ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాట మార్చారా.. గత కేబినెట్ సమావేశంలో స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అధికారులను మనస్థాపానికి గురిచేసిందా? అనే అనుమానాలు కొందరు అటవీ అధికారుల మాటలు వింటే నిజమనిపిస్తున్నారుు. బాబు వైఖరిపై ఇటు అటవీ శాఖ, అటు సివిల్ పోలీసు అధికారుల్లోనూ అనుమానాలు ఉన్నట్లు సమాచారం.
ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం చిత్తూరు కలెక్టరేట్‌లో ఐజీ, డీఐజీ లాంటి ఉన్నతాధికారుల సమక్షంలో సదస్సు నిర్వహించారు. ఆదివారం కూడా కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం జిల్లాకు చెందిన అటవీ, పోలీసు విభాగాలకు చెందిన కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చందనం స్మగ్లర్లపై కఠిన శిక్షలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తే అది జరగలేదంటూ ఆయనబహిరంగంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తించారు.
చందనం స్మగ్లింగ్‌ను పోలీసుల సహకారం లేకుండా అరికట్టడం అటవీశాఖకు సాధ్యం కాదని తేల్చారు. అటవీ చట్టంలో చెట్లు నరికితే మూడు నెలలు.. మహా అయితే ఏడాది శిక్ష ఉంటుందన్నారు. ఈ శిక్షతో స్మగ్లర్లకు అడ్డకట్ట వేయడం సాధ్యం కాదన్నారు. అందుకే చందనం నరికివేత కేసుకు మూడేళ్ల నుంచి 7 సంవత్సరాల శిక్షాకాలం ఉండాలని ప్రతిపాదించామని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. దీనికి నాలుగు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుందని భావించామని, అయితే ఎందుకో ఇది జరగలేదని చెప్పకనే చెప్పడం విశేషం.
‘‘స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కఠిన చట్టాలు, ప్రభుత్వ సహకారం అవసరం. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరం భావించాం. ఇటీవల ముగిసిన కేబినెట్‌లో కఠిన చట్టం కోసం తీర్మానం చేస్తారనుకున్నాం. తీరా చూస్తే వారే వెనక్కు తగ్గారు’’ అంటూ... మరికొందరు అధికారులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికారులకు మద్దతు పలికితేనే అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు.
అధికారంలోకి రాకముందు చందనం స్మగ్లింగ్‌పై చంద్రబాబు పెద్ద ఆర్భాటమే చేశారు. ఢిల్లీ స్థాయిలో చర్చలేవనెత్తబోయారు. తాము తప్ప ఎదుటివారంతా దొంగలే అన్నట్లు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు అధికారంలో ఆయనే ఉన్నారు. స్మగ్లింగ్‌ను అరికడతామంటూ అధికారులు ముందుకు వస్తున్నారు. చట్టాలను మార్చమని, ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతు పలకాలని కోరుతున్నారు. బాబు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.!
ఎర్రదొంగల..ఆటకట్టు కథేనా?
Published Sun, Nov 23 2014 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 4:56 PM
Advertisement
Advertisement