Department of Forestry
-
కొండముచ్చు అంటే హీరో లెక్క.. కానీ, వాటికి ఎంత కష్టమొచ్చింది!
కొండముచ్చు అంటే హీరో లెక్క.. ఇంతోటి మనం కూడా ఏమీ చేయలేని కోతుల సమస్యకు అది చిటికెలో పరిష్కారం చూపేది.. రంగంలోకి దిగిందంటే.. ఎలాంటి అల్లరి కోతులైనా తోకలు ముడిచి, పారిపోవాల్సి వచ్చేది.. ఇదంతా నిన్నమొన్నటి సంగతి.. మరి ఇప్పుడు.. సీను రివర్సైంది.. కొండముచ్చులకే కష్టమొచ్చింది.. వీటిని చూస్తే భయపడే కోతులే.. వీటిని భయపెట్టడం మొదలుపెట్టాయి.. సాక్షి, హైదరాబాద్: కొండెంగలు, కోతులు ఒకే రకం జాతికి చెందినవైనా... కొండమచ్చులు అడవుల్లోపలే ఉంటే.. కోతులు మాత్రం రహదారులకు దగ్గరగా ఉండడంతో పాటు ఊర్లు, పట్ట ణాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. ఈ రెండింటి మధ్య జాతివైర మనేది ఏదీ లేకపోయినా కోతుల కంటే ఎక్కువ బరువు, సైజులో రెండు, మూడింతలు పెద్దగా ఉండే.. కొండముచ్చులు నల్లటి ముఖాలు, పొడవాటి తోకలతో ఒకింత భయం గొలి పేలా ఉంటాయి. దీంతో వీటికి కోతులు భయపడతాయనే అభి ప్రాయం ఎప్పటి నుంచో స్థిరపడింది. దీనికి తగ్గట్టుగానే గతంలో చాలా సందర్భాల్లో ఊళ్లలో కోతులను భయపెట్టి తరిమేసేందుకు కొండముచ్చులను ఉపయోగించారు. ఇప్పుడూ రాష్ట్రంలో కోతుల బెడద ఎక్కువున్న గ్రామాల్లో అదే పద్ధతిని ఉపయోగి స్తున్నారు. అయితే, మొదట్లో కొండముచ్చులను చూసి కొన్ని చోట్ల కోతులు వెనక్కు తగ్గినా.. మారిన కాలమాన పరిస్థితులు, మారిన కోతుల ఆహార అలవాట్లు, సొంతంగా కష్టపడకుండానే ఆహారం సంపాదించే మార్గాల కోసం జనావాసాలపై పడడం వంటి పరిణామాలతో వాటి స్వభావా ల్లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో కోతులు వాటికి భయపడడం మానే శాయి. ఇంతటితో ఆగకుండా కొండ ముచ్చులనే భయపెట్టే పరిస్థితులు ఏర్పడడంతో గ్రామ స్తులు తలలు పట్టుకుంటు న్నారు. పైగా.. కొన్ని చోట్ల రెండింటి మధ్య ‘ఫ్రెండ్షిప్’ మొద లవడంతో సమస్య సంక్లిష్టంగా మారింది. కోతులకు తోడు కొత్తగా కొండెంగలు కూడా తిష్ట వేయడంతో ఈ రెండింటి బారి నుంచి ఎలా బయటపడాలో తెలియక గ్రామప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. కోతులను భయ పెట్టేందుకు కొండెంగలను తీసుకురావడాన్ని వన్యప్రాణి హక్కుల కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వన్య ప్రాణి చట్టాలను ఉల్లంఘించి వాటిని తీసుకురావడానికి బదులు కోతుల బెడద నివారణకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచిస్తున్నారు. ఈ జిల్లాల్లో సమస్య ఎక్కువ.. కోతులతో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లడంతో పాటు, ఇళ్లపైకి గుంపులుగా దాడి చేస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య ప్రధానంగా...ఉమ్మడి మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల్లో ఉంది. వివిధ గ్రామపంచాయతీల పరిధిలో కోతుల నియంత్రణకు కొండెంగలను ఉపయోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొండముచ్చులను పెంచారు. కోతుల సమస్య కొంత నియంత్రణలోకి రావడంతో చుట్టుపక్కల ఊళ్ల వారు కూడా వాటిని తీసుకెళ్లి కొంతకాలం ఆయా ఊళ్లలో తిప్పుకున్న సందర్భాలున్నాయి. కరీంనగర్ జిల్లాలో పలుచోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు రక్షణగా కొండముచ్చులను పెంచారు. కరీంనగర్ జిల్లా అల్గునూరులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ ప్రతిభా గురుకుల కేంద్రం కాలేజీలో వీటి సేవలను వినియోగించారు. వాటిని తేవడం చట్టవిరుద్ధం... ‘‘వన్యప్రాణి సంరక్షణ చట్టంలో భాగంగా షెడ్యూల్–1 జాతికి చెందిన కొండముచ్చులను (లంగూరు) తీసుకురావడం చట్టవ్యతిరేకం. అడవుల్లోని కొండెంగలను పట్టి జనావాసాల్లోకి తీసుకురావడాన్ని చట్టం అనుమతించదు. వాటిని తీసుకొస్తే కోతుల సమస్య పరిష్కారమవుతుందని ప్రజలు భావించడం హేతుబద్ధం కాదు. బలవంతంగా తీసుకొచ్చి బంధించి పెడితే తప్ప. మనుషులున్న చోట అవి ఎక్కువగా ఉండవు’’ – అటవీశాఖ వైల్డ్ లైఫ్ విభాగం ఓఎస్డీ ఎ.శంకరన్ -
అటవీ అధికారుల ఆత్మహత్యాయత్నం
నిర్మల్: తాము చేయని తప్పుకు సస్పెండ్ చేశారంటూ అటవీశాఖ అధికారులు ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. నిర్మల్ జిల్లా కేంద్రంలోని అటవీశాఖ కార్యాలయంలోనే డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెల గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. మామడ మండలం ఆరేపల్లి రేంజ్లో అటవీశాఖ భూములను ఆక్రమించడం, పోడుభూముల్లో బోర్లు వేసు కోవడం వంటి చట్టవిరుద్ధ పనులు చేపడుతున్నా.. డబ్బు లు తీసుకుని అడ్డుకోకుండా ఉన్నారంటూ డిప్యూటీ రేంజ్ అధికారి రాజశేఖర్, బీట్ అధికారి వెన్నెలను అటవీశాఖ ఉన్నతాధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులతో మాట్లాడేందుకు గురు వారం అటవీ శాఖ కార్యాలయానికి వచ్చారు. అన్యా యంగా తమను సస్పెండ్ చేశారంటూ ఆఫీస్ ప్రాం గణం లోనే వారు పురుగులమందు తాగారు. అక్కడ ఉన్నవారు అడ్డుకుని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వెన్నెలకు పెద్దగా ప్రమాదం లేదని, రాజశేఖర్‌కు చికిత్స అందించామని వైద్యులు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ తరలించారు. ఆత్మ హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
తొట్లు అమర్చి.. దాహార్తి తీర్చి
రాజంపేట: ఎండలు క్రమంగా పెరుగుతున్నాయి. వేసవిలోప్రజల దాహార్తి తీర్చేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. అడవిలో నీటి వనరులు ఎండిపోయి దాహంతో అలమటించే మూగజీవాలు గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి, అందుకే వాటి దాహార్తి తీ ర్చేందుకు అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. డివిజన్ పరిధిలో శేషాచలం 1.23లక్షల హెక్టార్లలో,పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యం 23వేలహెక్టార్లలో విస్తరించి ఉంది. అరుదైన జంతు జాలానికి నెలవు.. శేషాచలం అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య అటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తించింది. ఇక్కడ ఎక్కడాలేని విధంగా అనేక రకాలైన వన్యప్రాణులు, జంతువులు ఉన్నాయి. వీటిని సంరక్షించాల్సిన బాధ్యత అటవీశాఖపై ఉంది. ఇందులో భాగంగా చిత్తూరు, తిరుమల, వైఎస్సార్ జిల్లా అడవుల్లోని జంతువుల సంరక్షణపై దృష్టి సారించారు. కాగా జిల్లాలో శేషాచలం, పెనుశిల, లంకమల్ల అభయారణ్యాలు ఉన్నాయి. అరుదైన జంతువులకు నిలయం శేషాచలం.. శేషాచలం విస్తీర్ణం 82,500 ఎకరాలు. 2010లో జీవ వైవిధ్య నెలవుగా గుర్తించారు. దేశంలో ఉన్న బయోస్పెయిర్ జాబితాలో శేషాచలం అడవి చేరింది. ఈ అటవీ ప్రాంతం చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలో విస్తరించింది. శేషాచలం అడవిలో పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, వివిధ రకాల పునుగుపిల్లలు, పక్షులు, ఎలుగుబంట్లు, జింకలు, తోడేళ్లు ఉన్నాయి. ఇవి ఆ యా ప్రాంతాల్లోని రోడ్లపైకి నీటి కోసం వస్తున్నాయి. 8 శేషాచలంలో సహజ వనరులు శేషాచలంలో సహజ వనరులు ఉన్నాయి. వర్షాకాలంలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ, వేసవిలో అరకొరగా అయినా నీటి వనరులు అందుబాటులో ఉంటాయి. పెనుశిల అభయారణ్యంలో కూడా సహజవనరులు ఉన్నట్లుగా అటవీ వర్గాలు భావిస్తున్నాయి. పది కుంటలు ఉన్నాయి. ఆరు చెక్‌డ్యాంలున్నాయి. నీటి ఎద్దడి నివారణలో భాగంగా ఇవి దోహదపడతాయి. నిరంతర పర్యవేక్షణ రాజంపేట, సానిపాయి, చిట్వేలి, రైల్వేకోడూరు రేంజ్‌లు ఉన్నాయి. బేస్‌క్యాంపులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 80 మంది ప్రొటెక్షన్ వాచర్లను నియమించారు. ఇక్కడ 25 కెమెరాలు అమర్చారు. వేసవిలో వన్యప్రాణులు దాహార్తికి అల్లాడిపోకుండా నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. మూగజీవాల తాగునీటికి ప్రత్యేక ఏర్పాట్లు అడవిలోని వివిధ ప్రాంతాల్లో 12 మొబైల్ సాసర్పిట్లు ఏర్పాటు చేశారు. చెట్లకు ఉప్పుముద్దలు కట్టారు. దాహార్తి ఉన్న జంతువులు ఉప్పుముద్దలను నాకితే ఉపశమనం కలుగుతుంది. 2వేల నుంచి 3వేల లీటర్ల కెపాసిటీతో నీటి వనరులను వన్యప్రాణులకు అందుబాటులో ఉంచారు. ప్రత్యేక రక్షణ చర్యలు శేషాచలం అటవీ ప్రాంతంలో జంతువుల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో వన్యప్రాణులు నీటి కోసం జనావాసాల్లోకి రాకుండా ఉండేందుకు 12 సాసర్పిట్లు, 12 మొబైల్ సాసర్పిట్లను ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నాం. జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. –నరసింహారావు, ఇన్చార్జి డీఎఫ్ఓ, రాజంపేట -
దుప్పి.. కళ్లుగప్పి
సత్తుపల్లి(ఖమ్మం) : తాళం వేసితిని.. గొళ్లెం మరిచితిని’అన్న చందంగా మారిన అటవీ శాఖాధికారుల వ్యవహార శైలి విమర్శలకు తావిస్తోంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో రూ.1.7 కోట్లతో అర్బన్ పార్కును అభివృద్ధి చేశామని.. వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలున్నాయి. సత్తుపల్లిలో అర్బన్ పార్కు ఏర్పాటు ప్రాంతంలో సహజ సిద్ధంగానే దుప్పులు, పునుగులు, కుందేళ్లు, తాబేళ్లు ఉన్నాయి. వీటిని సంరక్షించేందుకు అటవీశాఖ 375 ఎకరాల్లో కంచె, గోడల నిర్మాణం చేపట్టారు. ఇటీవల కొత్తూరు వైపు దుప్పి కంచె దాటుకుని సమీప ఇళ్లల్లోకి వెళ్లగా స్థానికులు పట్టుకుని అటవీశాఖకు అప్పగించారు. మరికొన్ని దుప్పులు కంచె దాటే క్రమంలో తీగలు తగిలి మృత్యువాత పడగా, రేజర్ల గ్రామానికి చెందిన ఒక దుప్పిని హతమార్చి మాంసం విక్రయించడంతో కేసులు నమోదయ్యాయి. గురువారం అర్ధరాత్రి కూడా జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వైపు నుంచి దుప్పులు రోడ్లపై పరుగులు తీస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇటీవల పార్కు నిర్వహణ పేరిట రుసుము కూడా వసూలు చేయడం ఆరంభించిన అటవీ అధికారులు వన్య ప్రాణుల సంరక్షణపై దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రభుత్వ సలహాదారుగా శోభ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.శోభ సోమవారం పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆమెను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ హోదాలో ఆమె రెండేళ్లపాటు కొనసాగుతారని సీఎస్ సోమేశ్‌కుమార్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాల అటవీశాఖల్లో ఇలాంటి నియామకం ఇదే తొలిసారని అధికారవర్గాలు పేర్కొన్నాయి. కాగా, పదవీ విరమణ సందర్భంగా అరణ్యభవన్‌లో పువ్వులతో అలంకరించిన జీప్‌లో శోభను నిలుచోబెట్టి అటవీశాఖ అధికారులు, సిబ్బంది తాళ్లతో లాగి ఆమెకు వీడ్కోలు పలికారు. అంతకు ముందు జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో శోభను అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పెషల్ సీఎస్ ఎ.శాంతికుమారి, పీసీసీఎఫ్‌గా నియమితులైన ఆర్ఎం డోబ్రియల్ తదితరులు అభినందించారు. అడవులతో, అటవీశాఖతో ఎంతో అనుబంధమున్న శోభ సేవలను విడిచిపెట్టే ప్రసక్తి లేదని, సలహాదారు రూపంలో ఆమె సేవలు ప్రభుత్వానికి ఉపయోగపడతాయని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. అటవీశాఖలో వివిధ హోదాల్లో పనిచేసి, పీసీసీఎఫ్‌గా బాధ్యతలు నిర్వహించడం ద్వారా శాఖలో అనేక మార్పులకు తాను కారణం కావడం గర్వంగా ఉందని శోభ పేర్కొన్నారు. అటవీ శాఖలో ఆమె అందించిన సహకారం మరువలేనిదని, అనేక అంశాల్లో తమను ప్రోత్సహించారని డోబ్రియల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆమెను ఘనంగా సన్మానించారు. -
అభయారణ్యాల్లో ‘అండర్‌పాస్’లకు అనుమతి
నిర్మల్/నిర్మల్‌టౌన్/సాక్షి, హైదరాబాద్: అభయారణ్యాల్లో రహదారులు వన్యప్రాణుల ఆవాసాలకు అడ్డు రాకుండా, అవి స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అండర్‌పాస్‌లు నిర్మించాలని అటవీశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వన్యప్రాణి మండలి ఆమోదం తెలిపింది. నిర్మల్‌లోని అటవీశాఖ కార్యాలయంలో గురువారం అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర వన్యప్రాణి మండలి సమావేశం నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్మల్ నుంచి మంత్రి పాల్గొనగా, అరణ్య భవన్ నుంచి అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. అభయారణ్యాల్లో వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరించేలా రహదారుల వద్ద ముఖ్యమైన ప్రాంతాల్లో అండర్‌పాస్‌ల నిర్మాణం, వాహనాల వేగ నియంత్రణ, రాత్రి వేళల్లో వాహనాల రాకపోకలపై నిషేధం, పులుల గణన.. తదితర అంశాలపై సమావేశాలో చర్చించారు. మంత్రి మాట్లాడుతూ వన్యప్రాణుల సంరక్షణ కోసమే అండర్‌పాస్‌ల ఏర్పాటుకు ఆమోదం తెలిపామన్నారు. ఈ ప్రతిపాదనలకు కేంద్ర వన్యప్రాణి మండలి నుంచి త్వరితగతిన అనుమతులు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారుల నిర్మాణం, మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న వేసవిలో వన్యప్రాణుల దాహాన్ని తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నెహ్రూ జూపార్క్ అభివృద్ధికి చర్యలు.. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న ‘నెహ్రూ జూలాజికల్ పార్కు’ను దేశంలోనే నంబర్‌వన్‌గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రి అధ్యక్షతన జాపాట్ (జ్యూస్ అండ్ పార్కస్ అథారిటీ ఆఫ్ తెలంగాణ) కార్యవర్గ సమావేశాన్ని కూడా వర్చువల్ విధానంలో నిర్వహించారు. నెహ్రూ జూలాజికల్ పార్కుతోపాటు రాష్ట్రంలోని 8 పార్కుల్లో వన్యప్రాణుల సంరక్షణ, పార్కుల అభివృద్ధి, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేందుకు ప్రత్యేక చర్యలపై చర్చించారు. కాగా, నెహ్రూ జూలాజికల్ పార్కు కోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను రూపొందిస్తున్నట్లు పీసీసీఎఫ్ ఆర్.శోభ తెలిపారు. టికెట్ బుకింగ్, విరాళాలు, వన్యప్రాణుల దత్తత వంటి సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు వెల్లడించారు. అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎ.కె. సిన్హా, బోర్డు సభ్యులు ఎమ్మెల్యే కోనప్ప, రాఘవ, జూ పార్క్ డైరెక్టర్ ఎంజే అక్బర్, సీఎఫ్ వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసిఫాబాద్‌లో పులి చర్మం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: అక్రమంగా పులి చర్మాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. కొట్నాక దేవరావు, గొడుగు అవినాశ్ అనే వ్యక్తులు ఈ చర్మాన్ని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం వడగామ్ గ్రామం నుంచి తీసుకొచ్చినట్టు ఆదివారం రాత్రి అటవీశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వీరిద్దరిని విచారించిన అనంతరం ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ నేతృత్వంలో ఉట్నూరు, ఆసిఫాబాద్ ఎఫ్‌డీవోలు, కాగజ్‌నగర్ అటవీ సిబ్బంది వడగామ్ గ్రామానికి చెందిన మేస్రం మంకు, మేస్రం దీపక్, మేస్రం చంద్రకాంత్, మేస్రం ఈశ్వర్, మేస్రం లక్ష్మణ్‌లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నట్టు అటవీ శాఖ తెలిపింది. గత ఏడాది ఇంద్రవెల్లి మండలం వాలుగొండ గ్రామంలో పెందూరు దేవరావు అనే వ్యక్తి పొలంలో అడవి పందుల కోసం అమర్చిన ఉచ్చులకు చిక్కి పులి మరణించినట్టు తెలుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. అదే గ్రామంలోని పెందూరు ముకంద్‌రావు ఇంట్లో సోదా చేయగా పులి కింది దవడ, ఇతర ఎముకలు దొరికినట్లు తెలిపింది. అదుపులోకి తీసుకున్న వారిని విచారణ అనంతరం, సిర్పూర్ కోర్టు మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నట్లు తెలిపింది. కాగా, పవిత్ర దండారీ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అటవీ శాఖ అధికారులు సోదాల పేరుతో తమ ఇళ్లలోకి బూటుకాళ్లతో ప్రవేశించి సంస్కృతి, సంప్రదాయాలకు భంగం కలిగించారంటూ ఇంద్రవెల్లిలోని అటవీ శాఖ కార్యాలయం ఎదుట ఆదివాసీలు రెండు గంటల పాటు ఆందోళన చేశారు. -
పోడుపై కీలక భేటీ.. కేసీఆర్ నిర్ణయాలపై ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్/ ఏటూరునాగారం /ములుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోడు భూములు, అటవీ సంరక్షణ, హరితహారం వంటి అంశాలపై ఎలాంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుందా అన్న దానిపై అటవీశాఖ ఉన్నతాధికారుల్లో ఉత్కంఠ నెలకొంది. శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ముఖ్యమైన సమావేశంలో పోడు ఆక్రమణలను క్రమబద్ధీకరించే దిశలో ప్రభుత్వం నిర్ణయిస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది. ఈ సమీక్షా సమావేశంలో పోడు భూములపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొననున్నారు. అటవీ శాఖతో పాటు పలు ఇతర శాఖల ఉన్నతాధి కారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు హాజరుకానున్నారు. 2005 తర్వాత మళ్లీ పోడు భూముల పేరిట అటవీ ఆక్రమణలను క్రమబద్ధీకరిస్తే జరిగే నష్టంపై పర్యా వరణ నిపుణుల వాదనలు, ఇతర అంశాలు పరిగణ నలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చ ని, అటవీశాఖకు సంబంధించిన ప్రత్యేక ఆదేశాలతో కార్యాచరణ ప్రణాళికలు ప్రకటించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఏరియల్ సర్వే పోడు భూముల సాగు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు శుక్రవారం ములుగు జిల్లా ఏటూరునాగారం, తాడ్వాయి, కన్నాయిగూడెం మండలాల్లో అధికారులు హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఫొటోలు తీయడంతో పాటు వీడియో చిత్రీకరణ చేసినట్లు సమాచారం. ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన భూముల వివరాలు, పోడు భూముల దరఖాస్తులపై ప్రభుత్వం ఇప్పటికే సమాచారాన్ని తెప్పించుకుంది. పోడు భూముల సర్వే పూర్తయ్యే వరకు హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే కొనసాగుతుందని అధికారులు తెలిపారు. పోడు భూములపై ఆరా ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లు, ఆర్డీఓలు, అటవీశాఖ డీఎఫ్ఓలు, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులతో.. పోడు భూముల కమిటీ సభ్యులు శాంతికుమారి, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఏయే తెగలు నివాసం ఉంటున్నాయో ఆరా తీశారు. నాలుగు జిల్లాల్లో పోడు భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
ప్రజా ఉద్యమంలా హరితహారం
భువనగిరి: 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మొ దలుపెట్టిన హరితహారం కార్యక్రమం ప్రజా ఉద్యమంలా సాగుతోందని అటవీశాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని వడాయి గూడెం గ్రామ పరిధిలోని ఆంజనేయ అభయారణ్యంలో డ్రోన్ మెషీన్ ద్వారా సీడ్‌బౌల్స్‌ను చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఏడేళ్ల కాలంలో హరితహారం లక్ష్యాన్ని చేరుకున్నామని, రాష్ట్రంలో 5 శాతం గ్రీన్‌బెల్ట్ పెరిగిందని పేర్కొన్నారు. 2030లోగా 1 బిలియన్ సీడ్‌బౌల్స్ ప్లాంటేషన్ చేసేలా కార్యాచరణను రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది అభయారణ్యాల్లో డ్రోన్ ద్వారా ప్లాంటేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు. మొక్కలు నాటడానికి వీల్లేని ప్రాంతాలు, కొండలపై డ్రోన్ ద్వారా సీడ్‌బౌల్స్ వెదజల్లుతున్నామని, సంవత్సరం తర్వాత శాటిలైట్ ద్వారా పరిస్థితిని తెలుసుకుంటామని తెలిపారు. అంతకుముందు మండలంలోని హన్మాపురం, తుక్కాపురం గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను పరిశీలించి మొక్కలు నాటారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, సీసీఎఫ్ అక్బర్, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, డీఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి, జిల్లా అటవీశాఖ అధికారి పాల్గొన్నారు. -
నేడు ‘పచ్చ తోరణం, వన మహోత్సవం’
సాక్షి, అమరావతి/మంగళగిరి: వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు. వర్షాకాలమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్ చెప్పారు. 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్ ఆవరణలో సీంఎ వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులున్నారు, జేసీ దినేష్‌కుమార్ తదితరులున్నారు. -
క్వారీ లీజుల జారీకి సింగిల్ డెస్క్ పోర్టల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో క్వారీ లీజుల జారీకి వివిధ విభాగాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా సింగిల్ డెస్క్ పోర్టల్ (ఏకగవాక్ష తరహా) విధానానికి భూగర్భ గనుల శాఖ శ్రీకారం చుట్టింది. క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఈ పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరిస్తోంది. మాన్యువల్‌గా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని రద్దు చేసింది. ఇకపై ఎవరైనా క్వారీ లీజులు/ రెన్యువల్ కోసం ఆంధ్రప్రదేశ్ భూగర్భ గనుల శాఖ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్న విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేస్తే దానిని సంబంధిత సహాయ సంచాలకులు/ ఉప సంచాలకులు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోసం ఆన్లైన్లోనే ఆ ప్రాంత తహసీల్దారుకు పంపుతారు. తహసీల్దారు దానిని పరిశీలించి గ్రామ రెవెన్యూ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి నివేదిక తెప్పించుకుని, వ్యక్తిగతంగా పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే ఆన్లైన్లోనే గనుల శాఖకు ఎన్ఓసీ పంపుతారు. అటవీ భూమి అయితే.. ఒకవేళ అటవీ భూమిలో లీజు కోసం దరఖాస్తు చేసుకుంటే సంబంధిత అధికారి ఆ దరఖాస్తును ఆ ప్రాంత డివిజనల్ అటవీ అధికారికి పంపుతారు. ఆయన నిబంధనలను పరిశీలించి, దరఖాస్తుదారు ప్రత్యామ్నాయ భూమికి, ప్రత్యామ్నాయ వనీకరణ కింద నిధులు జమ చేసేందుకు అంగీకరిస్తే అటవీ శాఖకు నివేదిక పంపుతారు. అటవీశాఖ దానిని పరిశీలించి అనుమతిస్తుంది. ఎక్కువ విస్తీర్ణమైతే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. పారదర్శకంగా, జవాబుదారీతనంతో లీజుల జారీకి నిబంధనలు రూపొందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సింగిల్ డెస్క్ పోర్టల్’విధానం అమల్లోకి తెచ్చామని గనుల శాఖ సంచాలకులు వెంకటరెడ్డి తెలిపారు. దీనివల్ల దరఖాస్తుదారుల డబ్బు, సమయం కూడా ఆదా అవుతాయని చెప్పారు. -
ధన‘మొక్క’టే మూలం!
టి.నరసాపురం: రాజమండ్రి విజిలెన్స్ ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ ఏవీఎస్‌ఆర్‌కే అప్పన్న, జిల్లా సామాజిక అటవీ అధికారి ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అధికారులు సోమవారం మండలంలోని టి.నరసాపురం, మల్లుకుంట గ్రామాల్లోని నర్సరీల్లో తనిఖీలు నిర్వహించారు. సామాజిక అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రెండు నర్సరీల నుంచి 17 వేల కొబ్బరిమొక్కలను అక్రమంగా తరలిస్తుండగా, కొందరు రైతులు కామవరపుకోట మండలం తడికలపూడి వద్ద ఆదివారం లారీని అడ్డుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో స్పందించిన విజిలెన్స్ అధికారులు లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. సబ్సిడీ మొక్కలు కోల్‌కతాకు.. జగనన్న హరితహారం పథకం కింద ఈ మొక్కలను రైతులకు సబ్సిడీపై అందించాల్సి ఉంది. అయితే ఫారెస్టు అధికారులు రైతులకు సరఫరా చేయకుండా వ్యాపారులకు అక్రమంగా విక్రయిస్తే వారు ఆ మొక్కలను నేరుగా కోల్‌కతాకు తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జీలుగుమిల్లికి చెందిన రైతు మల్లిపాటి నారాయణరావు కథనం ప్రకారం.. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నరసాపురం రేంజ్‌ల పరిధిలో 8 లక్షల కొబ్బరి మొక్కలను రైతులకు అందించేందుకు సామాజిక అటవీ అధికారులు ఫిబ్రవరి నుంచి వివిధ నర్సరీల్లో పెంచారు. ఈ మొక్కలను ఒక్కోటి పాలకొల్లు సమీపంలోని అడవిపాలెంకు చెందిన ఒక వ్యాపారి వద్ద రూ.25కు కొని ప్రభుత్వం నుంచి మొక్కకు రూ.60 చొప్పున నిధులు డ్రా చేశారు. మొక్కల కొనుగోలులోనే అవినీతికి పాల్పడ్డారు. నర్సరీలో పెంచిన తర్వాత ఒక్కో మొక్కను రైతుకు సబ్సిడీపై రూ.10కే అందించాల్సి ఉండగా, తిరిగి కొనుగోలు చేసిన వ్యాపారికే మొక్కను రూ.25 నుంచి రూ. 30కి విక్రయిస్తున్నారు. ఇలా కొన్న మొక్కలను వ్యాపారి నేరుగా కోల్‌కతాకు తరలించి ఒక్కోటి రూ.60కు పైగా అమ్మి లక్షలు గడిస్తున్నారు. ఇప్పటికే 30 టన్నుల సామర్థ్యంగల 3 లారీల మొక్కలు కోల్‌కతాకు తరలిపోయాయి. ఇప్పుడు అడ్డుకున్న లారీ నాలుగోది. టీనరసాపురం నర్సరీలో 1.90 లక్షల మొక్కలు, మల్లుకుంట నర్సరీలో 1.30 లక్షల మొక్కల్లో రైతులకు పంపిణీ చేసింది నామమాత్రమే. లారీలో తరలిస్తున్న మొక్కలను పాలకొల్లు రైతులు కొన్నట్టు అధికారులు చెబుతున్నా.. నరసాపురం రేంజ్లో సోషల్ ఫారెస్ట్ అధికారులు పెంచిన 85 వేల కొబ్బరిమొక్కలు సిద్ధంగా ఉండగా, 10 కిలోమీటర్లలోపు ఉన్న మొక్కలను తీసుకోకుండా అక్కడి రైతులు ఇక్కడికి ఎందుకు వస్తారన్నది ప్రశ్నార్థకం. ఇదంతా వ్యాపారుల, సోషల్ ఫారెస్ట్ అధికారుల మాయాజాలం. ఈ అవినీతిలో సోషల్ ఫారెస్ట్ సెక్షన్ అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు చేసినట్టు రైతులు చెబుతున్నారు. విచారణ చేస్తాం: ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ డీఎఫ్ఓ అప్పన్న తెలిపారు. లారీలో మొక్కలు తరలిస్తున్న అధికారులు రైతులకు సంబంధించిన పాస్ పుస్తకాలు తీసుకోలేదనే విషయాన్ని గుర్తించామని వివరించారు. రైతుల ఆరోపణలను విలేకరులు ఆయన దృష్టికి తీసుకువెళ్లగా, ఆ అంశాలన్నీ పరిశీలిస్తామని, విచారణ నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని తెలిపారు. అక్రమాలు ప్రాథమికంగా జరిగినట్లు గుర్తించి నివేదిక సోషల్ ఫారెస్ట్ డీఎఫ్ఓ ఎం.శ్రీనివాసరావు ఉన్నతాధికారులకు సమర్పించగా, టి.నరసాపురం, మల్లుకుంట నర్సరీల ఇన్చార్జి, ఫారెస్టు సెక్షన్ అధికారి గోపీకుమార్‌ను సస్పెండ్ చేసినట్లు అప్పన్న తెలిపారు. -
రెండు రోజుల క్రితమే..
తిరుపతి: రెండు రోజుల క్రితం వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన ఓ స్మగ్లర్ 500 మంది తమిళ కూలీలను శేషాచల అడవుల్లో దింపినట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ కూలీలను పంపడంలో చిత్తూరుకు చెందిన ఓ ప్రధాన స్మగ్లర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దాదాపు 100 మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు అటవీ శాఖ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాయచోటి, చిత్తూరుకు చెందిన స్మగ్లర్లను వదిలేసి కేవలం ఎర్రచందనం కూలీలను కాల్చి చంపడంపై ప్రజా సంఘాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా టాస్క్‌ఫోర్స్ సిబ్బంది సోమవారం రాత్రి అడవిలోనే బసచేసి వారి అడుగుజాడల ఆధారంగా ఎక్కడ ఉన్నారో కనుగొని మట్టుపెట్టారన్న వాదన కూడా పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. రాత్రే అదుపులోకి తీసుకున్నారా? సోమవారం రాత్రే అటవీ శాఖ, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఎర్రచందనం స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. వారిని పుత్తూరు నుంచి ఇక్కడికి తరలించారని, వారి వద్ద బస్సు టికెట్లు కూడా లభ్యమైనట్లు సమాచారం. ఈ ఘటనపై ఇప్పటికే ఆధారాలు సేకరించిన డీఐజీ, ఐజీలు టాస్క్‌ఫోర్స్ బృందంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రి చెప్పారు.. కాల్చేశారు: అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు కన్పిస్తే కాల్చివేస్తామని పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో వారు చెప్పిన మాటలను పోలీసులు నిజం చేశారు. కూలీలను అడవిలోకి దింపిన ఇద్దరు ప్రధాన స్మగ్లర్లను వదిలేసి అమాయక కూలీలను కాల్చి చంపడంపై తమిళనాడులో తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్కౌంటర్ జరిగిన తీరు పరిశీలించిన కొందరు అధికారులు వారికి ఎలాంటి హెచ్చరికలు లేకుండా కాల్పులు జరిపినట్లు తెలుస్తోందన్నారు. డీఎస్పీ స్థాయి అధికారులు కూడా దీనిని బూటకపు ఎన్‌కౌంటర్‌గా అభివర్ణించారు. -
అమ్మో పులి!
అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వారం రోజులుగా అటవీ సమీప నివాస ప్రాంతాల్లో సంచారం బర్డ్, రుయా సమీపంలో ఓ దూడ, కుక్కపై చిరుత దాడి ప్రేక్షక పాత్రలో అటవీ శాఖ అధికారులు తిరుపతి కార్పొరే షన్/మంగళం: అభయారణ్యంలో సంచరించాల్సిన క్రూర మృగాలు యథేచ్ఛగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎర్రచందనం అన్వేషణ, వన్య మృగాల వేట, నీరు లభించకపోవడంతో ఇవి జనావాసాల వైపు వస్తున్నా యి. రెండు రోజులుగా తిరుపతి రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులతో పాటు సమీపంలోని భారతీయ విద్యాభవన్, ఎస్వీబీసీ శ్రీవారి నమూనా ఆలయం, వేదిక్, ఎస్వీయూ, ఎన్సీసీ నగర్, రీజనల్ సైన్స్ సెం టర్లో పులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులకు సవాల్ విసురుతూ, సమీప జనావాసాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రుయా, బర్డ్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రహరీ గోడపైకి చిరుతపులి ఓ కుక్కను, మరో లేగ దూడను తీసుకొచ్చి తిన్న సంఘటన గురువారం సంచలనం రేపింది. రుయాలోని ఐడీహెచ్ వార్డు విసిరేసినట్టు దూరంగా ఉండటం, చుట్టూ దట్టమైన చెట్లు, పొదలు ఉండడంతో వన్య మృగాలకు నిలయంగా మారుతోంది. 15 రోజుల క్రితం వేదిక్ వ ర్సిటీ, ఎన్సీసీ నగర్ వద్ద చిరుత జింకపై దాడి చేయడం, శ్రీవారిమెట్టు, మామండూరు సమీప గ్రామాల్లో సంచరించడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు పులి వచ్చి దాడి చేస్తుందోనని జనం భయపడుతున్నారు. రాత్రి స్మగ్లర్లు.. పగలు పోలీసులు.. అశేష వన్యమృగాలకు నిలయమైన శేషాచల అడవిలోకి ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడుగులు వేస్తున్నారు. రాత్రిపూట వృక్షాలను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ఆ చప్పుడు కారణంగా వన్యమృగాల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. రాత్రిల్లో ఆహార అన్వేషణలో భాగంగా సమీపంలోని జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రిళ్లు స్మగ్లర్ల బెడదైతే పగలు పోలీసుల అలజడి వన్యమృగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న పోలీసులు మారణాయుధాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ ప్రభావం వన్యమృగాలపై పడుతోంది. ఆహారం కోసం కాకుండా తమ ఉనికి కోసం అడవిని ఖాళీ చేస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి. వేట కూడా కారణమే... శేషాచల అడవుల్లోని వన్యప్రాణులు ఆహార అన్వేషణలో భాగంగా నీటి కోసం భాకరాపేట, ఎర్రావారి పాళెం, కళ్యా ణి డ్యాంల వద్దకు వస్తున్నాయి. నాటుతుపాకులు, విల్లంబులు, బరిసెలతో వేటగాళ్లు దాడి చేస్తుండడంతో వన్యమృగాలు అలజడికి గురవుతున్నాయి. వేటగాళ్ల దాడులకు భయపడి అటవీ సమీప గ్రామాల వైపు వెళ్తున్నాయి. అదే క్రమంలో కుక్కలు, ఆవులు, దూడలపై దాడి చేస్తున్నాయి. నీటి కోసం అన్వేషణ.. వర్షాభావం కారణంగా శేషాచల అడవుల్లో చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి. దీంతో దాహం తీర్చుకునేందుకు అడవి జంతువులు సుదీర్ఘంగా పయనిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో కృత్రిమంగా నీటి కొలనులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అక్కడక్కడా కొలనులు ఉన్నా వాటిలో నీటిని నింపడం లేదు. దీంతో నీటిని అన్వేషిస్తూ జనావాసాల్లోకి వస్తున్నాయి. -
వ్యవస్థను మార్చలేకపోతే అధికారం ఎందుకు
స్పీకర్ కాగోడు తిమ్మప్ప సాక్షి, బెంగళూరు: కుళ్లిపోయిన పరిస్థితుల్లో ఉన్న వ్యవస్థను మార్చలేకపోతే అధికారంలోకి రావాల్సిన అవసరమేముందని ప్రభుత్వాన్ని స్పీకర్ కాగోడు తిమ్మప్ప ప్రశ్నించారు. బెంగళూరులోని కుమారకృపా రోడ్డులో ఆదివారం ఏర్పా టు చేసిన చిత్రసంతె ప్రదర్శనను ఆయన సందర్శించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైద్యుల కొరతను నివారించడం, ప్రజలకు సరైన వైద్య సదుపాయాలను చేరువ చేయలేకపోతే అధికారంలో ఉండికూడా ఫలితం లేదని రాష్ర్ట వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్‌పై విమర్శలు గుప్పించారు. ఇక అట వీశాఖ కూడా తానో సార్వభౌమత్వ శాఖగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రా ష్ట్ర ప్రభుత్వంలో ఒక శాఖగా తాము పని చేస్తున్నామన్న స్పృహతో పాటు, అసెంబీ ్లలో రూపొందించే చట్టాలపై కూడా ఆ శాఖలోని వ్యక్తులకు అవగాహన లేకుం డా పోతోందని విమర్శించారు. మఠాలపై నియంత్రణ కోసం రూపొందించిన బిల్లుపై ప్రజావ్యతిరేకత పెల్లుబుకుతున్న నేపథ్యంలో దానిని వెనక్కు తీసుకోవచ్చని, ఇది పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన విషయమని అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. విధానసౌధలో నవీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
‘అటవీశాఖ స్థలం’పై ఆందోళన
లింగంపేట : మండలకేంద్రంలోని ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం ముందు గల ఖాళీ స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వేనంబర్ 1065లో గల ఖాళీ స్థలంలో భవన నిర్మాణాల కోసం సంజీవరెడ్డి, రమేశ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, సిద్దారెడ్డి, వంజరి ఎల్లమయ్య కలిసి పనులను ప్రారంభిస్తుండగా, స్థానికులు అబ్దుల్‌నయీం, ఎంఏ, షానూర్,ఆకుల సంగయ్య, జొన్నల రాజు,మాజీ సర్పంచి షేక్ మహిమూద్ తదితరులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పలె ్లరాకేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలం గత 60 ఏళ్లుగా అటవీశాఖ ఆధీనంలో ఉండగా, 2006లో పిట్లరాజు,సాయవ్వ అనే వ్యక్తులు లింగంపేట జడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజీవరెడ్డి,పోల్కంపేటకు చెందిన రమేశ్‌రె డ్డి,వర్గీయులకు విక్రయించాడు.కాగా వారు భవన నిర్మాణానికి అనుమతిని ఇవ్వాలని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో గ్రామస్తులు అటవీశాఖ స్థలాన్ని కాపాడాలని ఆందోళనకు దిగారు.ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం సర్వే నంబర్ 1064లో ఉందని, తాము కొనుగోలు చేసిన భూమి సర్వే నంబర్ 1065లో ఉందని సంజీవరెడ్డి వర్గీయులు వాదిస్తుండగా, అటవీ శాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలం(సర్వే నంబర్ 1065లో కలభూమి) గతంలో పోకల భూమవ్వ అనే మహిళ అటవీ కార్యాలయానికి ఉచితంగా భూమిని ఇచ్చిందని, అలాంటి భూమిని పిట్లరాజు,సాయవ్వ లు ఎలా విక్రయిస్తారని గ్రామస్తులు, అఖిల పక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ల్యాండ్ సర్వే అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించి సర్వే నంబర్ 1065లో గల స్థలం సంజీవరెడ్డి వర్గీయులకే చెందుతుందని నిర్ధారించారు. ల్యాండ్ సర్వే అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్ర హైకోర్టు సైతం ఈ స్థలం సంజీవరెడ్డి వర్గీయులకే చెందుతుందని ఆదేశాలు జారీ చేసింది. విషయం తెల్సుకున్న స్థానిక అఖిల పక్ష నాయకులు సైతం 60 ఏళ్లుగా అటవీశాఖ కార్యాలయం ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కాపాడాలని కోరు తూ హైకోర్టును ఆశ్రయించారు.ఈక్రమంలోనే ఆదివారం సంజీవరెడ్డి వర్గీయులు భవన నిర్మాణ పనులను పూనుకోగా స్థానికులు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మద్య రెండు గంటలపాటు ఘర్షణ జరిగింది. ఎస్సై పల్లెరాకేశ్, తహశీల్దార్ పీవీఎల్ నారాయణ ఇరు వర్గాలను సముదాయించారు. వచ్చే నెల 20వ తేదీన సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. భూమికి సంబంధించిన రికార్డులు,ఆధారాలను తీసుకువచ్చిన వారికే భూమి చెందుతుందని ఇరువర్గాలవారికి చెప్పగా, వారు అందుకు ఒప్పుకుని వెళ్లిపోయారు. ఆందోళనలో గ్రామ సర్పంచు బాలమణి,ఉపసర్పంచి అప్రోజ్,అఖిల పక్ష నాయకులు ఆకుల సంగయ్య,శేఖ్మహిమూద్,ఎంఏ,షానూర్, అబ్దుల్ నయీం,జొన్నల రాజు.ఆకుల రాములు,ఆశయ్య తదితరులు ఉన్నారు. పోలీస్ పికెట్ ఏర్పాటు మండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలంవద్ద స్థానిక పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.స్థలం కొనుగోలు చేసిన సంజీవరెడ్డి వర్గీయులకు,అఖిలపక్ష నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఎస్సై పల్లెరాకేశ్ ముందస్తు చర్చలలో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
అటవీశాఖలో అవినీతి చెట్లు
కనిగిరి : ‘కంచే చేను మేసింది’ అన్న చందంగా తయారైంది కనిగిరి అటవీశాఖ పరిస్థితి. అటవీ సంపదను కాపాడాల్సిన అటవీశాఖాధికారులు, సిబ్బంది లంచాల మత్తులో జోగుతూ స్మగ్లర్లతో చేతులు కలుపుతున్నారు. ఏకంగా అధికారులే తమతో కుమ్మక్కవడంతో స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. ఎంతో విలువైన ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించుకుపోతున్నారు. కొండంత ఎర్రచందనం స్మగ్లర్ల పాలవుతుంటే గోరంత మాత్రమే అధికారులు పట్టుకుంటూ బాధ్యతగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో దట్టమైన అడవులున్నాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి కర్నూలు, కడప, గుంటూరు జిల్లాల సరిహద్దుల వరకూ విస్తరించి ఉన్నాయి. పశ్చిమ ప్రకాశంలోని సీఎస్ పురం, వెలిగండ్ల, కనిగిరి, చుండి, మార్కాపురం, కంభం, గిద్దలూరు, యర్రగొండపాలెం ప్రాంతాలతో పాటు డెల్టా ప్రాంతాలైన ఊళ్లపాలెం, కరేడు, ఉలవపాడు, తెట్టు, గుడ్లూరు, ఈతముక్కల, చినగంజాం ప్రాంతాల్లోనూ అడవులున్నాయి. వాటిలో పశ్చిమ ప్రకాశంలోని అడవుల్లో ఎర్రచందనం, వేగిస, వేప, సిరిమాను, నారవేపి లాంటి చె ట్లు సంమృద్ధిగా ఉన్నాయి. ఎంతో విలువైన ఈ అటవీ సంపదను స్మగ్లర్లు నరికించి చెన్నై, చిత్తూరు, బెంగళూరు, ముంబై తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రధాన నిందితులను పట్టుకోని అధికారులు... పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు, మార్కాపురం, అర్ధవీడు, యర్రగొండపాలెం, కనిగిరి ప్రాంతంలోని సీఎస్ పురం, మైలుచర్ల, తుంగోడు, వీ బైలు, వెలిగండ్ల తదితర చోట్ల ఖరీదైన ఎర్రచందనం, వేగిస, మారేడు, మద్ది, నారవేపి చెట్లు అధికంగా ఉన్నాయి. ఈ కలపకు మంచి డిమాండ్ ఉండటంతో నిత్యం స్మగ్లర్లు వాటిని నరికి అక్రమంగా తరలిస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. ఇసుక, బత్తాయి, నిమ్మ, సీతాఫలాల లోడుల్లో వేసి సరిహద్దులు దాటిస్తున్నారు. అటవీ ప్రాంతం నుంచి సింగరాయకొండ బైపాస్ వైపుగానీ, వేములపాడు ఘాట్‌రోడ్డు మీదుగా కడపవైపుగానీ తరలించి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. అలా తరలిస్తూ కొంతమంది ఎర్రచందనంతో సహా పట్టుబడుతున్నారు. వారిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేస్తున్న అటవీశాఖాధికారులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ప్రధాన నిందితులను పట్టుకున్న దాఖలాలు లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల అవినీతితో పాటు కొందరు రాజకీయ నాయకుల జోక్యం కూడా అందుకు కారణమన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఆరేళ్లలో 90 కేసులు..154 టన్నులు... గత ఆరేళ్ల నుంచి ఇప్పటి వరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై 90 కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించి దాదాపు 154 టన్నుల ఎర్రచందనం దుంగలు, 32 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 2007-08 సంవత్సరంలో 21 కేసులు నమోదవగా, 4,126 దుంగలు (7,1066 కిలోలు) స్వాధీనం చేసుకున్నారు. 2008-09లో 5 కేసులు 710 దుంగలు (1,557 కిలోలు), 2009-10లో 4 కేసులు 354 దుంగలు (8,900 కిలోలు), 2010-11లో 7 కేసులు 307 దుంగలు (6,362 కిలోలు), 2011-12లో 19 కేసులు 177 దుంగలు (27,957 కిలోలు), 2012-13లో 20 కేసులు 1495 దుంగలు (11,689 కిలోలు), 2013-14లో 6 కేసులు 140 దుంగలు (4,500 కిలోలు), 2014-15లో మైలుచర్ల, తుంగోడు, భైరవకోన బీట్లలో సుమారు 400 దుంగల వరకూ అటవీ శాఖాధికారులు పట్టుకున్నారు. అయితే, వీటికి రెండింతలకుపైగా అక్రమంగా తరలివెళ్లినట్లు సమాచారం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి అవినీతికి పాల్పడటం వల్లే విలువైన అటవీ సంపద స్మగ్లర్ల పాలవుతున్నట్లు తెలుస్తోంది. వీడని దుంగల మాయం కేసు... 2012 జూలై 5న కనిగిరి అటవీ రేంజ్ కార్యాలయంలో ఉన్న సుమారు రూ.8 లక్షల విలువైన 130 ఎర్రచందనం దుంగలు అపహరణకు గురయ్యాయి. తుంగోడు, వెదుళ్ల చెరువు, చెన్నపునాయునిపల్లె బీట్లలో పట్టుకున్న ఎర్రచందనం దుంగలను కార్యాలయంలో ఉంచగా రాత్రికిరాత్రే అవి మాయమయ్యాయి. అప్పట్లో ఈ సంఘటన జిల్లాలోనే సంచలనం రేపింది. అటవీశాఖాధికారులు ఫిర్యాదు చేయడంతో పోలీసు జాగిలాలను సంఘటన స్థలానికి తీసుకువచ్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక చర్యగా వాచ్‌మన్‌ను సస్పెండ్ చేసి మమ అనిపించారు. డీఎఫ్‌వో స్థాయి అధికారి విచారణ జరిపినప్పటికీ నేటికీ ఆ కేసు పరిష్కారం కాలేదు. -
అడవుల అభివృద్ధికి శ్రీకారం
నర్సాపూర్: రాష్ట్రంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు అటవీశాఖ రాష్ర్ట ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ మిశ్రా వెల్లడించారు. ఆదివారం ఆయన పలువురు అటవీశాఖ అధికారులతో కలిసి నర్సాపూర్ అడవులలో పర్యటించిన అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో అడవులను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని, అందుకు అవసరమైన నిధులు ఉన్నాయని ఆయన తెలిపారు. అడవులను ఎలా అభివృద్ధి చేయాలో పరిశీలించేందుకే తాను నర్సాపూర్ అడవిలో పర్యటించినట్లు ఆయన తెలిపారు. అడవుల అభివృద్ధి ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. కాగా అటవీ శాఖ పరిధిలో 1250 చెరువులు,కుంటలు ఉన్నాయని, వాటిలో 20శాతం చెరువులు,కుంటలను ఎంపిక చేసి అభివృద్ధి చేయాలని నిర్ణయించామని, ఎంపిక చేసిన చెరువులు,కుంటల అభివృద్ధి పనులు వచ్చే మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్రంలోని అటవీశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. నర్సాపూర్ అటవీ శాఖ రేంజ్ పరిధిలోని సహజసిద్ధమైన అడవుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. అందుకే నర్సాపూర్ అడవులను పరిశీలించేందుకు వచ్చానన్నారు. అడవిలో చాలా మేర పర్యటించామని చెప్పారు. హైదరాబాద్‌కు సమీపానే నర్సాపూర్ ఉండడం చెంతనే అడవి, చెరువుల్ని కల్గి ఉండడం వల్ల ఇక్కడ అభివృద్ధి చేస్తే ప్రశాంత వాతావరణం మరింత పెరుగుతుందన్నారు. నర్సాపూర్‌లో జింకల అభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతులు పొందాల్సి ఉందని మిశ్రా చెప్పారు. ఆయన వెంట అడిషనల్ పీసీసీఎఫ్ బాబురావు, జిల్లా డీఎఫ్ఓ సోనిబాల, సబ్ డీఎఫ్ఓ రాజేందర్‌కుమార్, వైల్డ్ లైఫ్ డీఎఫ్ఓ శివ్వయ్య, ఏసీఎఫ్ రేఖాబాను పర్యటించారు. -
అటవీశాఖలో ఇంటి దొంగలు..?
దుమ్ముగూడెం: దుమ్ముగూడెం అటవీ రేంజ్ పరి ధి పర్ణశాల సెక్షనలోని ఒక బీట్ అధికారి ఇంట్లో అక్రమంగా 40టేకు దిమ్మలు ఉన్నట్లు సమాచా రం అందుకున్న అటవీ శాఖ ప్రత్యే సిబ్బంది దాడిచేసి పట్టుకున్నారు.ఆపై ఇంటి దొంగలను కాపాడేందుకు పైఅధికారుల ఒత్తిడి మేరకు యూడీఆర్ కేసును మాత్రమే నమోదు చేసి సిబ్బందిని కాపాడారు . వివరాలు ...చినబండిరేవులో బీట్ అధికారి ఇంటి వెనుక 40టేకు దిమ్మలు అక్రమంగా ని ల్వ ఉంచారని భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన ఆప్రాంతానికి ప్రత్యేక సిబ్బందిని పంపి తనిఖీలు చేయించగా టేకు దిమ్మలతో పాటు ఇంట్లోనే ఫర్నీచర్ చేయించడం వారి కంట పడింది. ఈ కలపను మూడు నెలల క్రితం గ్రామాలలో దాడులు చేసి పట్టుకొచ్చి నిల్వ ఉంచారు. నిల్వచేసిన వారిలో ముగ్గురు సిబ్బంది హస్తం ఉన్నట్లు సమాచారం. కలపను పట్టుకున్న వెంటనే యూడీఆర్ కేసు నమోదు చేసి దానిపై నంబర్లు నమోదు చేయాలి. కానీ మూడు నెలలు దాటినా కేసు నమోదు చేయకపోగా నంబర్లు సైతం వేయలేదు. దీనికి తోడు ఆ కలపను స్మగ్లర్లకు విక్రయించడానికి మరో సిబ్బంది సుమారు 45 వేలు వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కలప నిల్వపై ప్రత్యేక సిబ్బంది దాడిచేసి పట్టుకోవడంతో అధికారులు కూడా తమకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేసును తారుమారు చేసినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ వ్యవహారం గోప్యంగా ఉంచిన అటవీ సిబ్బంది, అదేరోజు దాడి చేసి దిమ్మలను పట్టుకున్నట్లు, యూడీఆర్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ముగ్గురు సిబ్బందితో యూడిఆర్ కేసు నమోదు చేయించిన అధికారులు, కలపను రాత్రికి రాత్రే భద్రాచలం డిపోకు తరలించారు.ఈ విషయంపై భద్రాచలం నార్త్ ఇన్చార్జ్ డీఎఫ్ఓ రాథోడ్‌ను వివరణ కోరగా.. కలప కోసం ప్రత్యేక సిబ్బందిని పంపినమాట వాస్తవమేనన్నారు. కలప ఉన్నమా ట వాస్తవమేనని, కేసు ఎప్పుడు నమోదు చేశారు అనే విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. -
ఆర్వీఎంలో అక్రమం
అటవీ శాఖలో బోగస్ కొలువుల బాగోతం ఇంకా సద్దుమణుగక ముందే రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ఉద్యోగాల్లో ఇలాంటి అక్రమమే మరొకటి వెలుగు చూసింది. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అక్రమార్కులు అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకున్నారు. కొలువుల ఆశ చూపి నిరుద్యోగుల వద్ద పెద్ద మొత్తంలో వసూళ్లకు తెరలేపారు. రూ.లక్షల్లో దండుకున్నారు. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాజీవ్ విద్యామిషన్ పరిధిలో జిల్లాలో 52 కేజీబీవీలు ఉన్నాయి. వీటిలో ఖాళీగా ఉన్న 54 పోస్టులను ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అకౌంటెంట్లు, ఏఎన్ఎంలు, అటెండర్లు(ఆఫీస్ సబ్ ఆర్డినేట్స్), వాచ్మెన్లు, స్వీపర్లు ఇలా వివిధ రకాల నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇది అక్రమార్కులకు వరంగా మారింది. అనుకున్నదే తడువుగా పెద్ద ఎత్తున వసూళ్ల పర్వానికి తెరలేపారు. ఒక్కో పోస్టుకు సుమారు రూ.30 నుంచి రూ.50వేల వరకు వసూలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొలువులు.. రానున్న రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారంటూ అమాయక అభ్యర్థులను మభ్య పెట్టారు. సర్కారు కొలువు వస్తుందని.. ఎప్పటికైనా పర్మినెంట్ ఉద్యోగులమయ్యే అవకాశాలున్నాయని భావించిన అమాయక అభ్యర్థులు అక్రమార్కుల బుట్టలో పడ్డారు. ఇలా వసూలు చేసిన సొమ్ములో పైస్థాయి అధికారులకు వాటా ఇవ్వాల్సి ఉంటుందని చెప్పి మరీ వసూళ్ల దందాకు తెరలేపారు. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాల్సిన ఈ పోస్టులకు కొందరు అభ్యర్థుల వద్ద ఆర్వీఎం కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించడం గమనార్హం. అడ్డదారిలో ఔట్ సోర్సింగ్ ఎంపిక.. ఈ పోస్టులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ఏజెన్సీ ఎంపిక కోసం టెండరు నోటిఫికేషన్ విడుదల చేయాలి. దాంతోపాటుగా బహిరంగ ప్రదేశాల్లో, పలు ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులపై ఈ నోటిఫికేషన్‌ను ఉంచాలి. అలా చేస్తేనే వివిధ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు టెండర్లలో పాల్గొంటాయి. కానీ ఇవేవీ పట్టించుకోకుండా ఎలాంటి టెండర్లు పిలవకుండానే గుట్టుచప్పుడు కాకుండా ఈ ఔట్ సోర్సింగ్ ఏజెన్సీనీ ఎంపిక చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమకు అనుకూలమైన వారికి ఏజెన్సీని కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో ఉండే జిల్లా మహిళా సమాఖ్యనే ఔట్సోర్సింగ్ ఏజెన్సీగా ఎంపిక చేశారు. ఇప్పుడు అలా కాకుండా కొన్ని ఏజెన్సీల నుంచి దరఖాస్తులు స్వీకరించి, ఎంపిక చేసేందుకు తెరవెనుక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మాకు ఎలాంటి సంబంధం లేదు - పి.యాదయ్య, ఆర్వీఎం పీవో కేజీబీవీ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించాం. ఉద్యోగాలిప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు మా దృష్టికి రాలేదు. ఈ అక్రమాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. డబ్బులు ఇచ్చిన, ఉద్యోగాలిపిస్తామని చెప్పి డబ్బులు పుచ్చుకున్న వారే బాధ్యులవుతారు. ఔట్సోర్సింగ్ ఎంపిక ఇంకా పూర్తికాలేదు. -
ఎర్రదొంగల..ఆటకట్టు కథేనా?
సెమినార్ చెప్పిన కథ కేబినెట్లో తీర్మానం లేదనే విమర్శలు కఠిన చర్యలకు వెనక్కు తగ్గుతున్న బాబు ఎన్నికలకు ముందు గవర్నర్ వద్ద హడావుడి అధికారంలోకొచ్చాక పట్టించుకోని వైనం అనుమానాలు వ్యక్తం చేస్తున్న అధికారులు సాక్షి, చిత్తూరు: ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే విషయంలో ప్రభుత్వ హడావుడి బూటకమేనా.. చందనం స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు గవర్నర్ నరసింహన్‌ను కలిసి విన్నవించి ఆర్భాటం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్ల పట్ల ఎందుకు కఠినంగా వ్యవహరించలేడం లేదు.. కఠిన చట్టాలు తెచ్చి స్మగ్లర్ల భరతం పడతానని నాడు ప్రగల్భాలు పలికి ఇప్పుడు మాట మార్చారా.. గత కేబినెట్ సమావేశంలో స్మగ్లర్లపై కఠినంగా వ్యవహరించే విషయమై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అధికారులను మనస్థాపానికి గురిచేసిందా? అనే అనుమానాలు కొందరు అటవీ అధికారుల మాటలు వింటే నిజమనిపిస్తున్నారుు. బాబు వైఖరిపై ఇటు అటవీ శాఖ, అటు సివిల్ పోలీసు అధికారుల్లోనూ అనుమానాలు ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనం అక్రమరవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శనివారం చిత్తూరు కలెక్టరేట్లో ఐజీ, డీఐజీ లాంటి ఉన్నతాధికారుల సమక్షంలో సదస్సు నిర్వహించారు. ఆదివారం కూడా కొనసాగనున్న ఈ సదస్సులో శనివారం జిల్లాకు చెందిన అటవీ, పోలీసు విభాగాలకు చెందిన కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకూ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాటలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. చందనం స్మగ్లర్లపై కఠిన శిక్షలకు సంబంధించి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తే అది జరగలేదంటూ ఆయనబహిరంగంగా వ్యాఖ్యానించి ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు రేకెత్తించారు. చందనం స్మగ్లింగ్‌ను పోలీసుల సహకారం లేకుండా అరికట్టడం అటవీశాఖకు సాధ్యం కాదని తేల్చారు. అటవీ చట్టంలో చెట్లు నరికితే మూడు నెలలు.. మహా అయితే ఏడాది శిక్ష ఉంటుందన్నారు. ఈ శిక్షతో స్మగ్లర్లకు అడ్డకట్ట వేయడం సాధ్యం కాదన్నారు. అందుకే చందనం నరికివేత కేసుకు మూడేళ్ల నుంచి 7 సంవత్సరాల శిక్షాకాలం ఉండాలని ప్రతిపాదించామని తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చామన్నారు. దీనికి నాలుగు రోజుల క్రితం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ఆమోదం తెలుపుతుందని భావించామని, అయితే ఎందుకో ఇది జరగలేదని చెప్పకనే చెప్పడం విశేషం. ‘‘స్మగ్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే కఠిన చట్టాలు, ప్రభుత్వ సహకారం అవసరం. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అందరం భావించాం. ఇటీవల ముగిసిన కేబినెట్లో కఠిన చట్టం కోసం తీర్మానం చేస్తారనుకున్నాం. తీరా చూస్తే వారే వెనక్కు తగ్గారు’’ అంటూ... మరికొందరు అధికారులు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అధికారులకు మద్దతు పలికితేనే అక్రమ రవాణాను అరికట్టడం సాధ్యమవుతుందని వారు అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాకముందు చందనం స్మగ్లింగ్‌పై చంద్రబాబు పెద్ద ఆర్భాటమే చేశారు. ఢిల్లీ స్థాయిలో చర్చలేవనెత్తబోయారు. తాము తప్ప ఎదుటివారంతా దొంగలే అన్నట్లు మసిపూసి మారేడు కాయచేసే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు అధికారంలో ఆయనే ఉన్నారు. స్మగ్లింగ్‌ను అరికడతామంటూ అధికారులు ముందుకు వస్తున్నారు. చట్టాలను మార్చమని, ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్దతు పలకాలని కోరుతున్నారు. బాబు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.! -
అటవీశాఖలో బోగస్ నియామకాలు
ఆదిలాబాద్ క్రైం : సాక్షాత్తు అటవీ శాఖ మంత్రి సొంత జిల్లా.. సొంత శాఖ అయిన అటవీశాఖలో బోగస్ నియామకాలు కలకలం సృష్టించాయి. గిరిజన యువకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని.. బోగస్ నియామక ఉత్తర్వులు సృష్టించి.. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.6 లక్షలు వసూలు చేసిన వైనం బహిర్గతమైంది. ఆదిలాబాద్ డీఎఫ్‌వో సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ దీనంతటికి సూత్రధారి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం 2012లో నోటిఫికేషన్ వెలువడింది. 23 బీట్ ఆఫీసర్, 10 అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేశారు. పోస్టులకు ఎంపికైన 33 మంది అభ్యర్థుల్లో కొందరికి బోగస్ పత్రాలు ఉన్నట్లు తేలింది. అయితే.. తమ ధ్రువీకరణ పత్రాలు సరైనవేనని, తాము ఉద్యోగాలకు అర్హులమేనని అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో నియామక ప్రక్రియను నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చక్రం తిప్పిన సీనియర్ అసిస్టెంట్.. అటవీశాఖలో బోగస్ నియామకాలు సృష్టించి.. అభ్యర్థుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడంలో డీఎఫ్‌వో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్ చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో సొంత శాఖ అధికారుల చేతివాటం ఉన్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. గతంలో అటవీశాఖ కార్యాలయంలో పనిచేసిన టెక్నికల్ అసిస్టెంట్‌ను తోడుగా చేసుకుని పక్క ప్రణాళిక రూపొందించినట్లు తెలిసింది. అటవీశాఖ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను తెలుసుకుని లాబీయింగ్ చేశారు. రెండేళ్ల నుంచి అభ్యర్థులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. ఓ రోజు హైకోర్టులో విచారణ పూర్తైదని.. ఉద్యోగాలకు మీరు ఎంపికయ్యారంటూ వారికి సమాచారం అందించారు. అటవీ కార్యాలయంలోని 08732-226984 ల్యాండ్ ఫోన్ నుంచి ఈ తతంగం నడిపించారు. అభ్యర్థులు నమ్మేలా బోగస్ ఉత్తర్వులును సృష్టించారు. ఏకంగా ఇంటర్వ్యూలు నిర్వహించి నెల రోజుల క్రితం నియామక పత్రాలు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చిన ప్రాంతాల్లో వెళ్లి యూనిఫాం తీసుకోవాలని, ఉద్యోగంలో చేరాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో అభ్యర్థులు బోగస్ నియామక పత్రాలతో ఆయా అటవీశాఖ డివిజన్ కార్యాలయాలకు వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. తాము బోగస్ ఉత్తర్వులతో నియామకమయ్యామని, డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు గుర్తించిన కొంత మంది బాధితులు సోమవారం అడిషనల్ ఎస్పీ పనసారెడ్డిని, మంగళవారం ఎస్పీ తరుణ్జోషిని కలిశారు. గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు.. గత సెప్టెంబర్ 29న అభ్యర్థులకు జిల్లా కేంద్రంలోని అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో గుట్టుచప్పుడు కాకుండా ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉదయం 10 గంటలకు ముందు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే ఇంటర్వ్యూలు కొనసాగించారు. అయితే.. ఇంటర్వ్యూలు నిర్వహించిన వారిలో తమ ప్రమేయం లేదని రేంజ్ అధికారి నాగేశ్వర్రావు గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. ఉదయం అధికారుల రాక ముందు.. మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఇంటర్వ్యూలు నిర్వహించారని తెలిపారు. ఆ సమయంలో ఎవరెవరు కార్యాలయానికి వచ్చారో విచారణ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ అసిస్టెంట్‌ను రేంజ్ ఆఫీస్‌కు పిలిపించారు. బాధితుల ఎదుట ఆయన్ను ప్రవేశపెట్టగా గుర్తించిన బాధితులు తమ వద్ద డబ్బులు తీసుకున్న వ్యక్తి ఇతనేనంటూ రేంజ్ అధికారులకు, డీఎఫ్‌వో సర్కిల్ కార్యాలయ అధికారులకు చూపించారు. పూర్తిస్థాయిలో ఆధారాలు సైతం చూపించారు. కాగా.. తనకు వారెవరో తెలియదంటూ సదరు సీనియర్ అసిస్టెంట్ విషయాన్ని దాటవేశారు. తాను డబ్బులు ఎవరి వద్దా తీసుకోలేదని వాపోయాడు. సీనియర్ అసిస్టెంతోపాటు టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో ప్రమేయం ఉందని బాధితులు చెప్పారు. టెక్నికల్ అసిస్టెంట్‌ను విచారించిన తర్వాతే నిందితులను గుర్తించి పోలీసులకు అప్పగిస్తామని రేంజ్ అధికారులు పేర్కొన్నారు. బాధితుల రోదన.. తమను మోసం చేసి డబ్బులు తీసుకున్న వ్యక్తి బాధితుల ముందరికి రాగానే వారు కన్నీళ్లు కార్చారు. ఎన్నో అప్పులు చేసి డబ్బులు తెచ్చిస్తే తమను మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమిలో ఉద్యోగం కోసం వచ్చిన అవకాశాన్ని సైతం వదులోకోమని ప్రలోభపెట్టాడంటూ ఓ అభ్యర్థి రోదించిన తీరు అందరినీ కలిసివేసింది. తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. -
అదిగో.. చిరుత
కొద్ది రోజుల క్రితం భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో బహిర్భూమికి వెళ్లిన వాచ్‌మన్ బాలరాజుచిరుతను చూసి జడుసుకున్నాడు. దోమకొండలో పొలానికి వెళ్లిన రైతు వెంకటరెడ్డి భార్య ఇందిర బంతిపూల తోటలో చిరుతను చూసి హడలిపోయింది. మాక్లూరు మండలం మాదాపూర్ శివారులో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు చిరుతను చూసి బెంబేలెత్తిపోయారు. అడవులలో సంచరించాల్సిన చిరుతపులులు జనారణ్యంలో అలజడి రేపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారు. - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ భిక్కనూరు టు మాక్లూరు * వయా పాల్వంచ, దోమకొండ * జనారణ్యంలో చిరుత సంచారం * పొద్దుగూకితే భయం భయం * అభయారణ్యంలో కరువైన రక్షణ * ‘పోచారం’ను వీడి జనావాసాల్లోకి * వన్యప్రాణుల సంరక్షణ గాలికి * చోద్యం చూస్తున్న అటవీ శాఖ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పదిహేను రోజులుగా జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా చిరుతలు జనారణ్యం వైపు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణను విస్మరించిన కారణంగానే పులులు, చిరుతలు జనంలోకి వస్తున్నాయంటున్నారు. నిజామాబాద్‌ను ఆనుకుని ఉన్న ఆదిలాబా ద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి కూడ చిరుతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రహసనంగా వన్యప్రాణుల సంరక్షణ అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణుల సంరక్షణ ప్రహసనంగా మారింది. చట్టం అభాసుపాలవుతోంది. పులి గోర్లు, చర్మాల కోసం జంతువుల వేట ప్రధాన వృత్తిగా పెట్టుకున్న స్మగ్లర్ల కారణంగా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. మిగిలిన వాటి ని అధికారులు పట్టించుకోకపోవడంతో అవి జనావాసాల వైపు దూసు కొస్తున్నాయి. జిల్లా వైశాల్యం 17,655 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో 17.40 శాతం (2,718.09 చ. కి. మీ) వరకు అడవులు విస్తరించి ఉన్నాయి. పోచారం అభయా రణ్యాన్ని 1952 ఫిబ్రవరి 29 నుంచి జీఓ నంబర్ 124 ప్రకారం వన్యప్రాణుల రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అడవిలో మూడు పులులు, పన్నెండు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి జింకలు, కృష్ణజింకలు, అడవిదున్నలు తదితర వన్యప్రాణులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు చిక్కుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంతతి రోజు రోజుకూ అంతరించిపోతోందని ‘జాతీయ పులుల గణన సమితి’ ఆందోళన చెం దు తున్నది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయి తే, అధికారులు వాటికి అడవిలో తగిన వసతులు కల్పించడం లో విఫలమవుతున్నారు. లెక్కలు తేలేది ఇలాగ ప్రభుత్వం ఏటా అభయారణ్యాలలో జీవించే వన్యప్రాణుల గణనను చేపడుతోంది. నాలుగేళ్లకు ఓసారి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా వన్యమృగాల గణాం కాలపై సర్వే నిరహిస్తోంది. రాష్ట్రంలో మాత్రం దట్టమైన అడవులలో ఏటా మే నెలలో వన్యప్రాణులను గణిస్తారు. జంతువుల ‘అడుగుజాడ (ఇన్‌ప్రింట్)ల’ ఆధారంగా వీటిని లెక్కిస్తారు. గత ఏడాదితో పోల్చి తే ఈ సంవత్సరం వన్యప్రాణుల సంఖ్య తగ్గిందా? పెరిగిందా? అన్నది కూడా ఈ పద్ధతి ద్వారానే తెలుస్తుంది. 2004లో జిల్లాలో మూడు పులులు, పన్నెం డు చిరుతలు ఉండేవి. ప్రస్తుతం పులుల ఆచూకీ లేకపోగా, చిరుతల సంఖ్య ఎనిమిదికి తగ్గిందని సమాచారం. ఇతర వన్యప్రాణుల విషయానికి వస్తే పో చారం అభయారణ్యంలో 168 అడవి పందులు, 96 నీల్గాయిలు, కుందేళ్లు, నెమళ్లు, కృష్ణ జింకలు, 400 సాంబారులు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అధికారులు వ్యవహరిస్తే పులులు, చిరుతలు జనంలోకి రాకుండా అడవులకే పరిమితమవుతాయి. కానీ, అంతరిస్తున్న అడవులు, చట్టు బండలవుతున్న కారణంగా చిరుతలు జనంలోకి చేరి ఆందోళన కలిగిస్తున్నాయి. మా ఇంటికి సమీపంలోనే కన్పించింది మా ఇంటికి సమీపంలోనే సమారు 200 మీటర్ల దూరంలో పులి కన్పించింది, రాత్రి పూటి ఇంటినుంచి బయటకు రావడంలేదు, రాత్రి ఎనిమిది గంటలకు తలుపులు వేస్తే ఉదయం వరకు తీయడంలేదు. భయంగా ఉంది, రాత్రి పూట నిద్రలేకుండా గడుపుతున్నం. అధికారులు వచ్చి పోయిండ్రు.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. -దుర్గేష్, కూలి, మాదాపూర్ ఐదు రోజులలో మూడు సార్లు .. నేను కంకర మిషన్‌లో పని చేస్తా. మేం పని చేసే చోట చిరుత ఐదు రోజులలో మూడు సార్లు కనిపించింది. మొదట ఏడవ తేదీన, తరువాత ఎనిమిది, పదవ తేదీల లో మళ్లీ కన్పిపించింది. మేం ఒంటరిగా పనికి పోవడం లేదు. అందరం కలిసే పోతున్నం. భయంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. - అనిల్రామ, మాదాపూర్ -
నేడు ‘పచ్చని ప్రకాశం’
ఒంగోలు: ‘పచ్చని ప్రకాశం...పరిశుభ్రమైన ప్రకాశం’లో భాగంగా జిల్లా పరిషత్ తొలి అడుగు వేసింది. ‘పచ్చని ప్రకాశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జెడ్పీ చైర్మన్ నూకసాని బాలాజీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. తొలి విడత శనివారం లక్ష మొక్కలు నాటేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ఈమేరకు జిల్లా అటవీశాఖ అధికారులతో కూడా చర్చించారు. లక్ష మొక్కలను అటవీశాఖ అధికారులు సిద్ధంగా ఉంచారు. పాఠశాలలే తొలి లక్ష్యం: జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల పరిధిలో దాదాపు 4 వేల ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. లక్ష మొక్కలను పాఠశాలల్లోనే నాటడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవాలనేది జిల్లా పరిషత్ ఆకాంక్ష. అందుకు ఉపాధ్యాయులు, విద్యార్థుల భాగస్వామ్యం తీసుకునే బాధ్యత ఎంపీడీవోలపై ఉంచారు. ప్రతి పాఠశాలలో కనీసం 25 మొక్కల చొప్పున పెంచాలని ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో స్థలాభావం వల్ల మొక్కలు పెంచలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఆవరణ, గ్రంథాలయాలు, స్థానిక సంస్థల కార్యాలయాల వద్ద మొక్కలు నాటాలని దిశా నిర్దేశం చేశారు. -
మాట నిలబెట్టుకుంటాం
నేరడిగొండ/ఇచ్చోడ : రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, రుణమాఫీ చేస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీ గోడం నగేష్, జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులతో కలిసి నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో పర్యటించారు. నేరడిగొండ మండలం లఖంపూర్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.42లక్షలతో నిర్మించిన అదనపు గదులు, మండల కేంద్రంలో రూ.25లక్షలతో నిర్మించిన స్త్రీనిధి భవనం, వాంకిడిలో రూ.18లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనం, కోర్టికల్-కె ఆశ్రమ పాఠశాలలో రూ.కోటి 9లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.16.87లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇచ్చోడలో ఐటీడీఏ ఇంజినీరింగ్ కార్యాలయ ఆవరణలో రూ.15లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి రామన్న మాట్లాడుతూ రైతులకు రుణాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు వివిధ పథకాల ద్వారా అందజేస్తామని చెప్పారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. దీపావళి నుంచి పింఛన్ డబ్బులు పెంచుతామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు. పిల్లలను తప్పకుండా చదివించాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మథుర కులస్తులను ఎస్టీల్లో చేరుస్తామని తెలిపారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజనులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలని కోరారు. జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య అమలు కానుందని తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడే చదువుకోవాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రత్యేక పథకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు. ఇచ్చోడ మండలంలోని 15 మజీద్‌లకు తెలంగాణ మైనార్టీ అభివృద్ధి శాఖ తరఫున మజీద్ కమిటీ సభ్యులకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపీణీ చేశారు. ఒక్కో మజీద్‌కు రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సయ్యద్ యాస్మిన్, రేణుక, ఎంపీపీలు బర్దావల్ సునీత, అమీనాబీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.