నేరడిగొండ/ఇచ్చోడ : రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని, రుణమాఫీ చేస్తామని, ఈ విషయంలో ఆందోళన చెందవద్దని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన ఎంపీ గోడం నగేష్, జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులతో కలిసి నేరడిగొండ, ఇచ్చోడ మండలాల్లో పర్యటించారు. నేరడిగొండ మండలం లఖంపూర్ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.42లక్షలతో నిర్మించిన అదనపు గదులు, మండల కేంద్రంలో రూ.25లక్షలతో నిర్మించిన స్త్రీనిధి భవనం, వాంకిడిలో రూ.18లక్షలతో నిర్మించిన పశువైద్యశాల భవనం, కోర్టికల్-కె ఆశ్రమ పాఠశాలలో రూ.కోటి 9లక్షలతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. ఇచ్చోడ మండలం మేడిగూడ ఆశ్రమ పాఠశాలలో రూ.16.87లక్షలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇచ్చోడలో ఐటీడీఏ ఇంజినీరింగ్ కార్యాలయ ఆవరణలో రూ.15లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాల్లో మంత్రి రామన్న మాట్లాడుతూ రైతులకు రుణాలు, వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు వివిధ పథకాల ద్వారా అందజేస్తామని చెప్పారు. తాగునీరు, విద్య, వైద్యం వంటి కనీస సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. దీపావళి నుంచి పింఛన్ డబ్బులు పెంచుతామని, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయని తెలిపారు. పిల్లలను తప్పకుండా చదివించాలని, ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. మథుర కులస్తులను ఎస్టీల్లో చేరుస్తామని తెలిపారు. ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని చెప్పారు. గిరిజనులు కష్టపడి చదువుకోవాలని సూచించారు. బంగారు తెలంగాణకు అందరూ సహకరించాలని కోరారు.
జెడ్పీ చైర్‌పర్సన్ శోభారాణి మాట్లాడుతూ రానున్న రోజుల్లో తెలంగాణా ప్రాంతంలో కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య అమలు కానుందని తెలిపారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ అక్కడే చదువుకోవాలనే తపనతో ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢనిశ్చయంతో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, ప్రత్యేక పథకాలను ప్రభుత్వం రూపొందిస్తోందని చెప్పారు.
ఇచ్చోడ మండలంలోని 15 మజీద్‌లకు తెలంగాణ మైనార్టీ అభివృద్ధి శాఖ తరఫున మజీద్ కమిటీ సభ్యులకు మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు పంపీణీ చేశారు. ఒక్కో మజీద్‌కు రూ.20వేల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సయ్యద్ యాస్మిన్, రేణుక, ఎంపీపీలు బర్దావల్ సునీత, అమీనాబీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.
మాట నిలబెట్టుకుంటాం
Published Sat, Sep 20 2014 3:09 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
Advertisement
Advertisement