రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం | Forgive the debt on the opposition | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం

Published Mon, Jun 16 2014 1:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం - Sakshi

రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం

- మేనిఫెస్టో హామీలను కచ్చితంగా అమలు చేస్తాం
- మంత్రి జోగు రామన్న

మంచిర్యాల టౌన్ : రుణ మాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దుయ్యబట్టారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఐబీ విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐబీలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రిగా మొదటిసారి మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు.

పూర్తిస్థాయిలో అధికారులు లేకున్నా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగిస్తున్నామని, ఇదే అదనుగా ప్రతిపక్షాలు కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు కమిటీ మాత్రమే వేశాడని, కానీ తెలంగాణలో కచ్చితంగా రూ.లక్ష లోపు రుణాల మాఫీతో పాటు రుణాలు తిరిగి అందేలా కూడా చూస్తున్నామని చెప్పారు. ఇక ఖరీఫ్ సీజన్‌లో రైతాంగాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో పంపిణీ జరిగేలా చూస్తున్నామని వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పింఛన్‌దారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు.
 
అడవులను సంరక్షిస్తాం
జిల్లాలో అంతరిస్తున్న అడవులను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడుగురు అటవీ శాఖ సిబ్బంది స్మగ్లర్ల దాడుల్లో మృత్యువాత పడ్డారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని అన్నారు. ఇదే సమయంలో అక్రమ కలప రవాణా, స్మగ్లర్ల ఆగడాలను నియంత్రించేలా తగిన విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, సోయం బాపురావు, మంచిర్యాల జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్‌రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, నాయకులు సిరిపురం రాజేశ్, పల్లె భూమేశ్, కర్ణ శ్రీధర్, ముత్తినేని రవికుమార్, గోగుల రవీందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మహిళా నాయకురాళ్లు అత్తి సరోజ, జోగుల శ్రీదేవి, గౌరీప్రియ, తిరుమల యాదవ్ పాల్గొన్నారు.
 
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కుభీర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జోగు రామన్న అన్నారు. మండలానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో జరిగిన శుభకార్యానికి హజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని పల్సిలో సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. పాలజ్ గణేశ్ మందిరంలో సైతం పూజలు చేశారు. ఆయన వెంట భైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, ఆదిలాబాద్ మాజీ చైర్మన్ భోజారెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, మండల నాయకులు దామాజీ, హన్మండ్లు, దేవెందర్, గులాబ్, పోశెట్టి, కల్యాణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement