Forgive the debt
-
రుణమాఫీపై టీడీపీ డ్రామా!
మచిలీపట్నం : రుణమాఫీ చేస్తామని అబద్దపు హామీలిచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయంలో రానురాను టీడీపీ వైఖరి బయటపడుతోందని వైఎస్సార్సీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి అన్నారు. పార్టీ జెడ్పీటీసీల సమావేశం శనివారం ఆర్కే ప్యారడైజ్‌లో జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా తాతినేని పద్మావతి ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యులు రైతాంగం, పేద ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ హామీని నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేశారని చెప్పారు. అయితే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలాడుతున్నారని సారథి ధ్వజమెత్తారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కూడా రుణమాఫీపై హామీ ఇస్తే బాగుండేదని ప్రతి ఒక్కరూ భావించారన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ హామీని వైఎస్ జగన్ ఏ కారణంతో ఇవ్వలేదో స్పష్టంగా అర్ధమవుతోందని చెప్పారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగడం, అక్రమ కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలపై పోరాటం చేస్తామన్నారు. రైతులపై కేసులు పెడితే ఊరుకోం తాగునీటి కోసం కాలువలకు నీరు విడుదల చేశారని నారుమడులు ఎండిపోతుంటే నీటిని వాడుకుంటుంటే పోలీసులు కేసులు పెడతామని రైతులను బెదిరిస్తున్నారన్నారు. రైతులపై కేసులు పెడితే వైఎస్సార్ సీపీ తరఫునపోరాటం చేస్తామని హెచ్చరించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఆదర్శరైతులను, ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని ఒకేఒక్క అబద్ధం ఆడకపోవటం వలనే వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు. -
ధాన్యం..దైన్యం
- ధాన్యం కొనేనాథుడు కరువు - మళ్లీ పెట్టుబడులు లేక అవస్థలు - రుణ మాఫీపై స్పష్టతేదీ పంట చేతికందే దాకా రైతుకు ఒక రకమైన శ్రమ.. తీరా ధాన్యపు రాశులు ఇంటికి చేరాక వాటిని అమ్ముకోవడం అన్నదాతకు పెద్ద పనవుతోంది. కష్టించి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాక ధాన్యాన్ని పురుల్లోనే నిల్వ చేసుకుంటున్నారు. జిల్లా ధాన్యాగారంగా పేరొందిన కారంచేడు ప్రాంతంలో సరైన ధర లేక ధాన్యపు నిల్వలు పేరుకుపోయాయి. కారంచేడు: అన్నదాతలు వరిసాగంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. పండించిన వరిధాన్యంను పురులు కట్టుకొని గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. గతంలో కొంత కాలం ఆశాజనకంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం కొనే వారు లేక నానా అవస్థలు పడుతున్నారు. మండలంలోని కారంచేడు, స్వర్ణ, కుంకలమర్రు, ఆదిపూడి, రంగప్పనాయుడువారిపాలెం, స్వర్ణపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తుంటారు. మండలంలో మొత్తం 40 వేల ఎకరాల సాగు విస్తీర్ణం ఉండగా 15 వేల ఎకరాలు ఖరీఫ్‌లో, 10 వేల ఎకరాలు రబీలో వరి సాగు చేస్తుంటారు. ఈ ప్రాంతంలో కారంచేడు మండలంలోనే వరి ఎక్కువగా సాగవుతుంది. గత సంవత్సరం అక్టోబరులో వచ్చిన వరదలతో వేసిన పంటలు తుడిచిపెట్టుకుపోవడంతో నాట్లు ఆలస్యంగా వేశారు. అష్ట కష్టాలు పడి పండించిన పంటలను ఇళ్ల ముంగిట పెట్టుకొని కొనే వారి కోసం దైన్యంగా ఎదురు చూస్తున్నారు. కొనేనాథుడే కరువయ్యాడు.. - మండలంలో ఏటా సుమారు 8 లక్షల క్వింటాళ్ల ధాన్యం పండిస్తుంటారు. ప్రస్తుతం వీటిలో సుమారు 98 శాతం ధాన్యం రైతుల ముంగిట పురుల్లో మూలుగుతోంది. - ఈ ప్రాంతంలో 92 రకం, 2270 రకం, జీలకర రకం ధాన్యం సాగు చేస్తుంటారు. - 92, 2270 రకం ధాన్యం క్వింటా రూ.1200-రూ.1300 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. జిలకర రకం ధాన్యం క్వింటా 1050-రూ.1100 మాత్రమే పలుకుతోంది. ప్రస్తుతం అవి కూడా కొనేవారు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. - మళ్లీ సాగు సీజన్ ప్రారంభం కావడంతో వాటికి అవసరమైన పెట్టుబడులకు సన్న, చిన్నకారు రైతులతో పాటు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. - కౌలు ఎకరానికి 18-20 వేలు వరకు ఉంది. వీటిలో ఎక్కువ మంది డబ్బు కౌలుకే మొగ్గు చూపడంతో కౌలు రైతులు అప్పులు చేసి కౌలు కట్టుకున్నారు. ఇవి కాకుండా దుక్కులు, విత్తనాలు, ఎరువులకు అవసరమైన పెట్టుబడులకు అవసరమైన డబ్బు కోసం నానా అవస్థలు పడుతున్నారు. రుణమాఫీపై స్పష్టత లేదు.. అధికారంలోకి రాగానే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఇంకా దానిపై ఏ విధమైన ప్రకటన చేయకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. గత ఏడాది తీసుకున్న రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న అన్నదాతలు రుణమాఫీలు చేస్తారా.. లేదా, ఒకవేళ చేసినా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేస్తారు అనే సందిగ్ధంలో ఉన్నారు. మళ్లీ అప్పుల కోసం బ్యాంకులకు ఎలా వెళ్లాలి, వెళ్తే ముందు తీసుకున్న రుణాలు చెల్లించాలని వారు ఒత్తిడి చేస్తే పరిస్థితి ఏంటని అన్నదాతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో మళ్లీ సాగు ప్రశ్నార్థకమేనని రైతులంటున్నారు. -
విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
- వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం - వ్యవసాయశాఖ మంత్రి పోచారం కోటగిరి : తెలంగాణా రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిపదవి చేపట్టి మొదటిసారిగా ఆదివారం కోటగిరి మండలానికి విచ్చిన సందర్భంగా మండలంలోని రాణంపల్లి, కోటగిరి, పోతంగల్, హంగర్గ గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోచారం, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ పోతంగల్ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి పోచారం రైతులతో, నాయకులతో మాట్లాడారు. మండలంలోని టాక్లీ, ఎక్లాస్పూర్, కోటగిరి, తదితర ఫీడర్లలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని వారు మంత్రి ఎదుట వాపోయారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు సక్రమంగా లేదన్నారు. స్పందించిన మంత్రి ట్రాన్స్‌కో డీఈతో ఫోన్లో మాట్లాడి విద్యుత్ కోతలు లేకుండా ఏడు గంటల పాటు కరెంటు ఇవ్వాలని సూచించారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు మరమ్మతులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని పనులు త్వరలో చేపడుతామన్నారు. అనంతరం మంత్రి పోచారం విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన అన్నిరకాల విత్తనాలు మనకు సరిపోగా మిగిలిన విత్తనాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు. హార్టికల్చర్, చేపల ఉత్పత్తి, డైరీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పండ్లు, పూలు, కూరగాయలు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఏడాది లక్షా 10 వేల ఎకరాల్లో సాగుచేసేందుకు రూ.130 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, మధ్యతరగతి రైతులకు 75 శాతం, పెద్దతరహా రైతులకు 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీపై స్త్రీనిధి ద్వారా గేదెల రుణాలకోసం మండలానికి రూ. 2 నుంచి 3 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. బంగారు ఆభరణాలపై రుణమాఫీ: వ్యవసాయ పంటల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలపై లక్షలోపు రుణమాఫీ చేస్తామని ఈవిషయం రైతులు గమనించాలని మంత్రి పోచారం తెలిపారు. పంట రుణమాఫీ వల్ల తెలంగాణలో 2 లక్షల 64 మంది రైతులకు లబ్ధికలుగుతోందన్నారు. కార్యక్రమంలో మంత్రి, ఎంపీతోపాటు జడ్పీటీసీ సభ్యుడు పుప్పాల శంకర్, పోతంగల్, కోటగిరి, లింగాపూర్, ఎక్లాస్పూర్, హంగర్గ సర్పంచ్‌లు గంగామణి, స్వరూప, మహేశ్, సంజీవ్, ఉదయ్‌భాస్కర్, టీఆర్ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి గంగాధర్దేశాయ్, తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై ప్రతిపక్షాలది రాద్ధాంతం
- మేనిఫెస్టో హామీలను కచ్చితంగా అమలు చేస్తాం - మంత్రి జోగు రామన్న మంచిర్యాల టౌన్ : రుణ మాఫీపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తూ రైతులను పక్కదోవ పట్టిస్తున్నాయని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న దుయ్యబట్టారు. ఆదివారం మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా ఐబీ విశ్రాంతి భవనంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అంతకు ముందు ఐబీలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. మంత్రిగా మొదటిసారి మంచిర్యాలకు వచ్చిన సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులు, అటవీ శాఖ అధికారులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. పూర్తిస్థాయిలో అధికారులు లేకున్నా ప్రజా సంక్షేమాన్ని కాంక్షిస్తూ పాలన సాగిస్తున్నామని, ఇదే అదనుగా ప్రతిపక్షాలు కుతంత్రాలు చేస్తున్నాయని మంత్రి దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు కమిటీ మాత్రమే వేశాడని, కానీ తెలంగాణలో కచ్చితంగా రూ.లక్ష లోపు రుణాల మాఫీతో పాటు రుణాలు తిరిగి అందేలా కూడా చూస్తున్నామని చెప్పారు. ఇక ఖరీఫ్ సీజన్లో రైతాంగాన్ని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో పంపిణీ జరిగేలా చూస్తున్నామని వివరించారు. అమరుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు పింఛన్‌దారులకు న్యాయం చేస్తామని పేర్కొన్నారు. అడవులను సంరక్షిస్తాం జిల్లాలో అంతరిస్తున్న అడవులను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే జిల్లాలో ఏడుగురు అటవీ శాఖ సిబ్బంది స్మగ్లర్ల దాడుల్లో మృత్యువాత పడ్డారని, ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకుని అందుకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తామని అన్నారు. ఇదే సమయంలో అక్రమ కలప రవాణా, స్మగ్లర్ల ఆగడాలను నియంత్రించేలా తగిన విధంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. మంచిర్యాల, బెల్లంపల్లి, బోథ్ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, సోయం బాపురావు, మంచిర్యాల జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత వెంకటేశ్వర్రావు, మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ కృష్ణారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ, నాయకులు సిరిపురం రాజేశ్, పల్లె భూమేశ్, కర్ణ శ్రీధర్, ముత్తినేని రవికుమార్, గోగుల రవీందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మహిళా నాయకురాళ్లు అత్తి సరోజ, జోగుల శ్రీదేవి, గౌరీప్రియ, తిరుమల యాదవ్ పాల్గొన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం కుభీర్ : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జోగు రామన్న అన్నారు. మండలానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్రలోని పాలజ్ గ్రామంలో జరిగిన శుభకార్యానికి హజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం మండలంలోని పల్సిలో సాయిబాబా ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సన్మానించారు. పాలజ్ గణేశ్ మందిరంలో సైతం పూజలు చేశారు. ఆయన వెంట భైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ గంగాధర్, ఆదిలాబాద్ మాజీ చైర్మన్ భోజారెడ్డి, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి పాకాల రాంచందర్, మండల నాయకులు దామాజీ, హన్మండ్లు, దేవెందర్, గులాబ్, పోశెట్టి, కల్యాణ్ పాల్గొన్నారు. -
బాబు తొలి సంతకం ఓ డ్రామా
వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం విధివిధానాలు, నిర్ధిష్టమైన అమలు తేదీ ఏదీ? అసాధ్యమంటూ ఆశ్రీత మీడియా ప్రచారం ప్రమాణానికి రూ.30 కోట్ల ఖర్చు విజ్ఞతేనా? రాజధాని కోసం విరాళాలడుగుతూ ఇదేం పని? ప్రధాన ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తాం రాజమండ్రి: ప్రమాణ స్వీకారం చేయగానే రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెడతానంటున్న చంద్రబాబు మాటలు ఒక డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజమండ్రిలో ఆయన చేపట్టిన ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల సమీక్షలు శనివారంతో ముగిశాయి. అనంతరం హైదరాబాద్ బయలుదేరేముందు శనివారం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఫలానా తేదీ నుంచి రైతుల రుణాలు మాఫీ అవుతున్నాయంటూ ఫైలుపై తొలి సంతకం చేయడంలో అర్థముంటుంది. కానీ ఎలాంటి విధివిధానాలూ ప్రకటించకుండా తొలి సంతకమేమిటి? ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం సాగుతోంది. చంద్రబాబు సంతకం చేస్తారు. కానీ పథకం అమలు కాదు. ఆ తర్వాత రుణమాఫీ చేయాలని బాబు మంచి మనసుతో ప్రయత్నించినా అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదంటూ బాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ ముందస్తు పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తాయి’’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి విలేకరిని ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ విమర్శలు, పోరాటం కొన్ని మీడియా యాజమాన్యాలపైనే తప్ప విలేకరులతో కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. విలేకరులెప్పుడూ తమ మిత్రులేనని చెప్పారు. విమానానికి సమయం అవుతున్నందువల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనిలా సమాధానమిచ్చారు. ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లా? నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రానికి నవ రాజధాని నిర్మాణానికి రూ.5,000 నుంచి రూ.10,000... మరెంతైనా విరాళాలు తీసుకుంటామని చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రమాణస్వీకారానికి రమ్మని చంద్రబాబు నన్ను ఆహ్వానించారు. నేను ఆయనకు అభినందనలు తెలిపాను. ఇక అక్కడ హాజరై ఆ ఖర్చుకు నా సమ్మతిని తెలపాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మేం పెరుగుతూనే ఉన్నాం 1.ఎన్నికల్లో ఓడిపోయినందువల్లే అసెంబ్లీ నియోజక వర్గాలవారీగా సమీక్షలు చేపడుతున్నామన్నది దుష్ర్పచారం మా త్రమే. మేము గతంలో అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు ఓడిపోలేదు. గతంలోనూ ప్రతిపక్షంలోనే ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేశాం. 2. ఒకప్పుడు అమ్మ, నేనే పార్టీలో ఉన్నాం. తర్వాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగారు. ఇప్పుడు మొత్తంగా తొమ్మిది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలను పార్టీ గెలుచుకుంది. ఆవిర్భావం నుంచీ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాం. 3. ఓడిన చోట్ల ఎక్కడ ఏ లోపాలున్నాయో గుర్తించి మున్ముందు వాటిని సరిచేసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. నేరుగా కార్యకర్తలతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ఆ మేరకు పార్టీని పటిష్టం చేసుకుంటాం. 4. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు చేస్తాం. సమయాభావంతో కొన్ని సమీక్షలు వాయిదా కార్యకర్తలందరి అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ సమీక్షలు సుదీర్ఘంగా కొనసాగడంతో సమయాభావంతో విశాఖ, అనకాపల్లి లోక్‌సభ స్థానాల సమీక్షలను వాయిదా వేసినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ‘‘శుక్రవారం నాటి సమీక్ష ఉదయం పదింటికి మొదలై శనివారం ఉదయం ఏడింటి దాకా కొనసాగింది. రాజమండ్రి నగర నియోజకవర్గ సమీక్షతో ముగిసింది.సమయాభావంవల్ల కాకినాడ లోక్‌సభ స్థానంపరిధిలోని కాకినాడ సిటీ, జగ్గంపేట, ఏలూరు లోక్‌సభ స్థాన పరిధిలోని ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ స్థానాల సమీక్షలను వాయిదా వేశాం. వాటిని ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తాం. తిరుపతి సమీక్షల తర్వాత అనకాపల్లి, విశాఖ సమీక్షలను విశాఖలో నిర్వహిస్తాం’’ అని చెప్పారు.