రుణమాఫీపై టీడీపీ డ్రామా!
మచిలీపట్నం : రుణమాఫీ చేస్తామని అబద్దపు హామీలిచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, ఈ విషయంలో రానురాను టీడీపీ వైఖరి బయటపడుతోందని వైఎస్సార్‌సీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త కొలుసు పార్థసారథి అన్నారు. పార్టీ జెడ్పీటీసీల సమావేశం శనివారం ఆర్‌కే ప్యారడైజ్‌లో జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ ప్రతిపక్ష నేతగా తాతినేని పద్మావతి ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ జిల్లా పరిషత్ సభ్యులు రైతాంగం, పేద ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిపై అధ్యయనం చేసి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ హామీని నమ్మిన ప్రజలు టీడీపీకి ఓట్లు వేశారని చెప్పారు. అయితే రుణమాఫీపై తొలి సంతకం చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలాడుతున్నారని సారథి ధ్వజమెత్తారు.ఎన్నికల ఫలితాలు విడుదలైన సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కూడా రుణమాఫీపై హామీ ఇస్తే బాగుండేదని ప్రతి ఒక్కరూ భావించారన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ హామీని వైఎస్ జగన్ ఏ కారణంతో ఇవ్వలేదో స్పష్టంగా అర్ధమవుతోందని చెప్పారు. పదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడులకు దిగడం, అక్రమ కేసులు బనాయించడం వంటివి చేస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలపై పోరాటం చేస్తామన్నారు.
రైతులపై కేసులు పెడితే ఊరుకోం
తాగునీటి కోసం కాలువలకు నీరు విడుదల చేశారని నారుమడులు ఎండిపోతుంటే నీటిని వాడుకుంటుంటే పోలీసులు కేసులు పెడతామని రైతులను బెదిరిస్తున్నారన్నారు. రైతులపై కేసులు పెడితే వైఎస్సార్ సీపీ తరఫునపోరాటం చేస్తామని హెచ్చరించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన మాట్లాడుతూ బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రచారం చేసిన టీడీపీ నాయకులు చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక ఆదర్శరైతులను, ఉపాధి హామీ ఫీల్డు అసిస్టెంట్లను, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నారని ధ్వజమెత్తారు. తిరువూరు ఎమ్మెల్యే రక్షణనిధి మాట్లాడుతూ రుణమాఫీ చేస్తామని ఒకేఒక్క అబద్ధం ఆడకపోవటం వలనే వైఎస్సార్ సీపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చిందన్నారు.