విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తెలంగాణ
- వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం
- వ్యవసాయశాఖ మంత్రి పోచారం
కోటగిరి : తెలంగాణా రాష్ట్రాన్ని విత్తన ఉత్పత్తి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిపదవి చేపట్టి మొదటిసారిగా ఆదివారం కోటగిరి మండలానికి విచ్చిన సందర్భంగా మండలంలోని రాణంపల్లి, కోటగిరి, పోతంగల్, హంగర్గ గ్రామాల ప్రజలు, నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి పోచారం, జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ పోతంగల్ సాయిబాబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పలువురు శాలువలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మంత్రి పోచారం రైతులతో, నాయకులతో మాట్లాడారు.
మండలంలోని టాక్లీ, ఎక్లాస్‌పూర్, కోటగిరి, తదితర ఫీడర్లలో విద్యుత్ కోతలు తీవ్రంగా ఉన్నాయని వారు మంత్రి ఎదుట వాపోయారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు సక్రమంగా లేదన్నారు. స్పందించిన మంత్రి ట్రాన్స్‌కో డీఈతో ఫోన్‌లో మాట్లాడి విద్యుత్ కోతలు లేకుండా ఏడు గంటల పాటు కరెంటు ఇవ్వాలని సూచించారు. రుద్రూర్ నుంచి పోతంగల్ వరకు రోడ్డు మరమ్మతులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని పనులు త్వరలో చేపడుతామన్నారు.
అనంతరం మంత్రి పోచారం విలేకరులతో మాట్లాడారు. రైతు సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన అన్నిరకాల విత్తనాలు మనకు సరిపోగా మిగిలిన విత్తనాలను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కృషి చేస్తామన్నారు. హార్టికల్చర్, చేపల ఉత్పత్తి, డైరీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. పండ్లు, పూలు, కూరగాయలు మైక్రో ఇరిగేషన్ ద్వారా ఈ ఏడాది లక్షా 10 వేల ఎకరాల్లో సాగుచేసేందుకు రూ.130 కోట్లు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, బీసీలకు 90 శాతం, మధ్యతరగతి రైతులకు 75 శాతం, పెద్దతరహా రైతులకు 40 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీపై స్త్రీనిధి ద్వారా గేదెల రుణాలకోసం మండలానికి రూ. 2 నుంచి 3 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు.
బంగారు ఆభరణాలపై రుణమాఫీ:
వ్యవసాయ పంటల కోసం తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలపై లక్షలోపు రుణమాఫీ చేస్తామని ఈవిషయం రైతులు గమనించాలని మంత్రి పోచారం తెలిపారు. పంట రుణమాఫీ వల్ల తెలంగాణలో 2 లక్షల 64 మంది రైతులకు లబ్ధికలుగుతోందన్నారు. కార్యక్రమంలో మంత్రి, ఎంపీతోపాటు జడ్పీటీసీ సభ్యుడు పుప్పాల శంకర్, పోతంగల్, కోటగిరి, లింగాపూర్, ఎక్లాస్‌పూర్, హంగర్గ సర్పంచ్‌లు గంగామణి, స్వరూప, మహేశ్, సంజీవ్, ఉదయ్‌భాస్కర్, టీఆర్‌ఎస్ బాన్సువాడ నియోజకవర్గ ఇన్‌చార్జి గంగాధర్‌దేశాయ్, తదితరులు పాల్గొన్నారు.