బాబు తొలి సంతకం ఓ డ్రామా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
విధివిధానాలు, నిర్ధిష్టమైన అమలు తేదీ ఏదీ?
అసాధ్యమంటూ ఆశ్రీత మీడియా ప్రచారం
ప్రమాణానికి రూ.30 కోట్ల ఖర్చు విజ్ఞతేనా?
రాజధాని కోసం విరాళాలడుగుతూ ఇదేం పని?
ప్రధాన ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తాం
రాజమండ్రి: ప్రమాణ స్వీకారం చేయగానే రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెడతానంటున్న చంద్రబాబు మాటలు ఒక డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజమండ్రిలో ఆయన చేపట్టిన ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల సమీక్షలు శనివారంతో ముగిశాయి. అనంతరం హైదరాబాద్ బయలుదేరేముందు శనివారం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఫలానా తేదీ నుంచి రైతుల రుణాలు మాఫీ అవుతున్నాయంటూ ఫైలుపై తొలి సంతకం చేయడంలో అర్థముంటుంది. కానీ ఎలాంటి విధివిధానాలూ ప్రకటించకుండా తొలి సంతకమేమిటి? ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం సాగుతోంది. చంద్రబాబు సంతకం చేస్తారు. కానీ పథకం అమలు కాదు. ఆ తర్వాత రుణమాఫీ చేయాలని బాబు మంచి మనసుతో ప్రయత్నించినా అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదంటూ బాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ ముందస్తు పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తాయి’’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి విలేకరిని ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ విమర్శలు, పోరాటం కొన్ని మీడియా యాజమాన్యాలపైనే తప్ప విలేకరులతో కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. విలేకరులెప్పుడూ తమ మిత్రులేనని చెప్పారు. విమానానికి సమయం అవుతున్నందువల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనిలా సమాధానమిచ్చారు.
ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లా?
నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రానికి నవ రాజధాని నిర్మాణానికి రూ.5,000 నుంచి రూ.10,000... మరెంతైనా విరాళాలు తీసుకుంటామని చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా.
ప్రమాణస్వీకారానికి రమ్మని చంద్రబాబు నన్ను ఆహ్వానించారు. నేను ఆయనకు అభినందనలు తెలిపాను. ఇక అక్కడ హాజరై ఆ ఖర్చుకు నా సమ్మతిని తెలపాల్సిన అవసరం లేదనుకుంటున్నా.
మేం పెరుగుతూనే ఉన్నాం
1.ఎన్నికల్లో ఓడిపోయినందువల్లే అసెంబ్లీ నియోజక వర్గాలవారీగా సమీక్షలు చేపడుతున్నామన్నది దుష్ర్పచారం మా త్రమే. మేము గతంలో అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు ఓడిపోలేదు. గతంలోనూ ప్రతిపక్షంలోనే ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేశాం.
2. ఒకప్పుడు అమ్మ, నేనే పార్టీలో ఉన్నాం. తర్వాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగారు. ఇప్పుడు మొత్తంగా తొమ్మిది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలను పార్టీ గెలుచుకుంది. ఆవిర్భావం నుంచీ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాం.
3. ఓడిన చోట్ల ఎక్కడ ఏ లోపాలున్నాయో గుర్తించి మున్ముందు వాటిని సరిచేసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. నేరుగా కార్యకర్తలతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ఆ మేరకు పార్టీని పటిష్టం చేసుకుంటాం.
4. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు చేస్తాం.
సమయాభావంతో కొన్ని సమీక్షలు వాయిదా
కార్యకర్తలందరి అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ సమీక్షలు సుదీర్ఘంగా కొనసాగడంతో సమయాభావంతో విశాఖ, అనకాపల్లి లోక్‌సభ స్థానాల సమీక్షలను వాయిదా వేసినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ‘‘శుక్రవారం నాటి సమీక్ష ఉదయం పదింటికి మొదలై శనివారం ఉదయం ఏడింటి దాకా కొనసాగింది. రాజమండ్రి నగర నియోజకవర్గ సమీక్షతో ముగిసింది.సమయాభావంవల్ల కాకినాడ లోక్‌సభ స్థానంపరిధిలోని కాకినాడ సిటీ, జగ్గంపేట, ఏలూరు లోక్‌సభ స్థాన పరిధిలోని ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ స్థానాల సమీక్షలను వాయిదా వేశాం. వాటిని ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తాం. తిరుపతి సమీక్షల తర్వాత అనకాపల్లి, విశాఖ సమీక్షలను విశాఖలో నిర్వహిస్తాం’’ అని చెప్పారు.