ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో మెజార్టీ ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారన్న అభిప్రాయం ఉంది. దానికి పలు కారణాలు ఉండవచ్చు. ప్రభుత్వపరంగా కొన్నిలోపాలు ఉండవచ్చు. కాని అదే టైమ్ లో ముఖ్యమంత్రి జగన్ ఏ అధికారిని లేదా ఏ ఉద్యోగిని అగౌరవపరచలేదు. ఎవరిని మోసం చేసే యత్నం చేయలేదు. ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఇస్తానని ఎన్నికల ముందు చెప్పినా , అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి అర్ధం చేసుకుని ఉద్యోగులకు పాత పెన్షన్ ఇవ్వలేకపోయినా, ఏ రకంగా వారికి మేలు చేయవచ్చన్నదానిపై దృష్టి పెట్టారు. అందులో బాగంగానే వారికి గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ను తీసుకు వచ్చారు. ఇందుకోసం చాలా కసరత్తు చేశారు. ఉద్యోగ సంఘాలతో కూడా పలుమార్లు చర్చించారు. అయినా కొంతమంది ఉద్యోగులకు అది నచ్చలేదు.
అదే టైమ్ లో అప్పటి విపక్షనేత, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాని, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లు సీపీఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. వారిని రెచ్చగొట్టడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా చేయని ప్రయత్నం లేదు. అబద్దాలను నిత్యం వండి వార్చేవి. అయినా జగన్ తాను చేయదలచుకున్నది చిత్తశుద్దితో చేసి ఉద్యోగులు రిటైరైనప్పుడు వచ్చే జీతంలో ఏభై శాతం పెన్షన్ వచ్చేలా స్కీమును తెచ్చారు. ఇప్పుడు అది దేశవ్యాప్తంగా చర్చ అయింది. ఆంధ్ర మోడల్ పేరుతో కేంద్రం కూడా దీనిని పరిగణనలోకి తీసుకుంటోంది. ఇతర రాష్ట్రాలు కూడా ఇది బాగానే ఉందని అభిప్రాయపడుతున్నాయి. కొన్ని రాష్ట్రాలు తాము ఓపీఎస్‌కు వెళుతున్నామని చెప్పినా, ఆచరణలో చేయలేకపోయాయి.
ఈ నేపధ్యంలో ఏపీలో ఎన్నికలు జరగ్గా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మొదలైనవారు జగన్‌కు వ్యతిరేకంగా మారారు. కొన్ని ఆందోళనలు కూడా చేపట్టారు. వారంతా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లతో పాటు, ఈనాడు, జ్యోతి వంటి ఎల్లో మీడియా ట్రాప్ లో పడ్డారు. నిజంగానే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పాత పెన్షన్ స్కీమ్ వస్తుంందని అనుకున్నారు. కాని అలా జరగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులలోనే చంద్రబాబు ప్రభుత్వం యుటర్న్ తీసుకుని జగన్ ప్రభుత్వం ఇచ్చిన జిఓనే అమలు నిమిత్తం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి కూడా ఈనాడు మీడియా దుర్మార్గంగా జగన్ ప్రభుత్వానిదే తప్పు అన్నట్లు పచ్చి అబద్దపు వార్తను రాసి, టీడీపీ ప్రభుత్వ తప్పేమిలేదన్నట్లు కవరింగ్ ఇస్తూ కధనాన్ని ఇచ్చింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ కాని దీని గురించి మాట్లాడడం లేదు. కనీసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించలేదు.
నిజంగానే వీరికి చిత్తశుద్ది ఉంటే జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీఓని, చట్టాన్ని రద్దు చేసి ఉండవచ్చు కదా! లేని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించిన చంద్రబాబు నాయుడు జీపీఎస్‌ను మాత్రం ఎందుకు కొనసాగిస్తున్నారు. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేసినట్లు కాదా? అబద్దాలు చెప్పడంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పోటీపడినట్లు కాదా?అంటే ఎవరు బదులు ఇవ్వాలి. కూటమికి మద్దతు ఇచ్చిన ఉద్యోగులు అవాక్కవడం తప్ప ఇంక చేయగలిగింది లేదు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలు దీనిపై నిరసన బాట పట్టినా పెద్దగా ఫలితం ఉండదన్న అభిప్రాయం ఉంది. గత ప్రభుత్వం కొద్దిగా ఆలస్యం చేసినా జీతాలు ఏ నెల ఆపలేదు. పేదల స్కీములకు ప్రాధాన్యత ఇచ్చిన కారణంగా ఈ ఇబ్బంది వచ్చింది. అలాగే వారికి సంబంధించిన జిపిఎఫ్,గ్రాట్యుటి తదితర చెల్లింపులలో కొంత ఆలస్యమైన మాట నిజమే. అదే టైమ్ లో ఉద్యోగుల మీద ఎక్కడా వేధింపులు లేవు.
గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థలు తెచ్చిన తర్వాత వీరిపై పని ఒత్తిడి కూడా తగ్గింది. నేరుగా లబ్దిదారులకు నగదు బదిలీని విజయవంతంగా అమలు చేయడంతో అవినీతి తగ్గింది. అయితే ఈ పద్దతుల వల్ల తమ ప్రాధాన్యత తగ్గిందని కొంతమంది భావించి ఉండవచ్చు. కాని ప్రజల విశాల ప్రయోజనాల రీత్యా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు చేయక తప్పు. ఉద్యోగులను జగన్ ఎప్పుడూ అన్నా.. అంటూ సంబోధించి చాలా మర్యాద ఇచ్చేవారు. అదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఒకలా, అధికారం వచ్చాక మరొలా ఉంటారని మరోసారి రుజువు చేసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం ఒక శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఏదో చిన్న సమస్య వచ్చింది. కొద్ది సెకన్లపాటు అంతరాయం కలిగింది.దానికే ఆయన ఉద్యోగులపై మండిపడ్డారు. వారు ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని, తమాషాగా ఉందా అని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో మాట్లాడుతూ తాను 1995 నాటి పాలన తెస్తానని అన్నారు. ఆ రోజుల్లో ఆయన తన గుర్తింపు కోసం ఆకస్మిక తనిఖీలు చేపట్టేవారు. ఎక్కడబడితే అక్కడ ఉద్యోగులను, అధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వారిని బహిరంగంగా మందలించేవారు.ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఒక అధికారి గుండెపోటుకు గురై మరణించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అది పెద్ద సంచలనం అయింది. అంతేకాదు.2014 టరమ్‌లో చంద్రబాబు తెలుగుదేశం మీడియా ప్రముఖుడు ఒకరితో కూర్చుని ఉద్యోగుల జీతభత్యాల గురించి ఏమి మాట్లాడుకుంది అంతా విన్నారు. అయినా చంద్రబాబు గొప్పతనం ఏమిటంటే ఉద్యోగులను మళ్లీ తనవైపు తిప్పుకోగలగడం, వారిని నమ్మించడం.అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చినా, చెప్పిన వాగ్దానాన్ని అమలు చేయకపోయినా ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయడం. 19952004 మద్య ఏభైకి పైగా ప్రభుత్వరంగ సంస్థలను మూసివేయించారు. ప్రపంచ బ్యాంకు రుణం కోసం వారు పెట్టిన కండిషన్ల ప్రకారం ఉద్యోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోవడానికి అంగీకరించారన్న విమర్శ ఉండేది. అదే చంద్రబాబు విపక్షంలో ఉన్నప్పుడు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శించేవారు. టీచర్ల పోస్టులను భర్తీ చేయడం లేదని, మెగా డీఎస్సీ అంటూ ఊదరగొడతారు.
విశేషం ఏమిటంటే సుమారు లక్షన్నర ఉద్యోగాలను సృష్టించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అయితే, ఆయన ఉద్యోగాలు ఇవ్వలేదని చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు ప్రచారం చేస్తే, ఈనాడు, ఆంధ్రజ్యోతి డప్పు కొడితే దానిని కూడా కొంతమేర ప్రజలు నమ్మడం. ఇలా ఎన్నో జిమ్మిక్కులు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు యథాప్రకారం యుటర్న్‌లు తీసుకోవడం ఆరంభించారు. ఈసారి ఆయనకు పవన్ కళ్యాణ్ జత అయ్యారు. అంతే తేడా. గతంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు వారు ఎన్నికలకు ముందు ఏమి చెప్పారు? ఇప్పుడు ఏమి చేస్తున్నారు ?అన్నదానిపై విశ్లేషణలు వచ్చేస్తున్నాయి. ప్రజలను ఒకటి, రెండుసార్లు మోసం చేయవచ్చుకాని, ఎల్లకాలం మోసం చేయలేరన్న సూక్తి ఉంది. కాని అది చంద్రబాబు విషయంలో వాస్తవం కాదని రుజువు అయింది. ఈ సందర్భంలో మోసం చేసేవారి తప్పుకన్నా, మోసపోయేవారి తప్పే అధికమని అనుకోవాలన్న నానుడి కరెక్టేనేమో!
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment