First Sign
-
కొత్త సచివాలయంలో తొలి సంతకం చేసిన కేటీఆర్, సీఎస్
-
ముఖ్యమంత్రిగా యెడ్డీ సంచలన నిర్ణయం
సాక్షి, బెంగళూరు : ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన బీఎస్ యడ్యూరప్ప సంచలన నిర్ణయం తీసుకున్నారు. 56వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేస్తూ ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేశారు. రైతు వ్యతిరేక నిర్ణయాల కారణంగానే సిద్దరామయ్య ప్రభుత్వం ఓడిపోయిందన్న విషయాన్ని గమనించిన యడ్యూరప్ప.. సీఎంగా ప్రమాణ స్వీకారం మొదలు మొదటి నిర్ణయం వరకు రైతు అనుకూల వైఖరిని అనుసరించారు. రైతులకు సంఘీభావంగా ఆకుపచ్చ కండువా కప్పుకొని ప్రమాణం స్వీకారం చేసిన యడ్యూరప్ప.. దైవసాక్షిగా, రైతుసాక్షిగా ప్రమాణం చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపొందితే రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని యడ్యూరప్ప హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదట రైతులకు ఇచ్చిన హామీని యడ్యూరప్ప నెరవేర్చారు. ప్రస్తుతం యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ప్రమాణం స్వీకరించిన సంగతి తెలిసిందే. బలనిరూపణ విషయంలో సందిగ్ధం కొనసాగుతుండటంతో మంత్రిమండలి ప్రమాణం చేయలేదు. అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుందుకే యెడ్డీకి గవర్నర్ 15 రోజులు గడువు ఇచ్చారు. బలనిరూపణ చేసుకున్న తర్వాత ఆయన మంత్రిమండలి కొలువుదీరే అవకాశముంది. పూర్తిస్థాయిలో మంత్రిమండలి కొలువుదీరిన తర్వాత యడ్యూరప్ప మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోవచ్చునని భావిస్తున్నారు. -
ట్రంప్ తొలి సంతకం దేని పైనో తెలుసా?
అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డోనాల్డ్ ట్రంప్.. ముందునుంచి చెబుతున్నట్లు గానే ఒబామా కేర్ ఫైల్ మీద తన తొలి సంతకం చేశారు. తన ప్రారంభ ప్రసంగం అయిన తర్వాత ఓవల్ కార్యాలయంలో ప్రవేశించిన ఆయన ఒబామా కేర్‌కు సంబంధించిన నిబంధనలను సడలించాలని ఏజెన్సీలకు సూచించారు. ఒబామాకేర్ను మార్చి తీరుతానని ఆయన తన ఎన్నికల ప్రసంగాల్లో పదే పదే చెప్పిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద ట్రంప్ సంతకం చేశారు. అయితే, ఈ ఆర్డర్లో వివరాలు ఏంటన్న విషయాన్ని వైట్ హౌస్ అధికారులు వెంటనే వెల్లడించలేదు. ఒబామాకేర్ అనే ఆరోగ్య పథకాన్ని మారుస్తానని ఆయన చెప్పినా, దాని స్థానంలో ఎలాంటి పథకం తీసుకురాబోతున్నామన్న విషయాన్ని అటు ట్రంప్ గానీ, ఇటు రిపబ్లికన్లు గానీ ఇంతవరకు ఎక్కడా చెప్పలేదు. కొత్తగా నియమితులైన రక్షణ శాఖ మంత్రి జేమ్స్ మాటిస్, హోంలాండ్ సెక్యూరిటీ మంత్రి జాన్ కెల్లీలకు సంబంధించిన కమిషన్ల మీద కూడా ట్రంప్ సంతకాలు చేశారు. తొలిరోజు చాలా బిజీగా ఉంది గానీ, ఇది చాలా అందమైన రోజని ట్రంప్ విలేకరులతోవ్యాఖ్యానించారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రత్యేకంగా మరో కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. కాగా, వైట్‌హౌస్ ప్రాంగణంలో ఇంతకుముందు విన్స్టన్ చర్చిల్ విగ్రహం ఉండేది. దాన్ని తీసేసి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ విగ్రహం పెట్టారు. అలాగే ఇంతకుముందున్న క్రిమస్సన్ డ్రేప్స్‌ను తీసి బంగారు డ్రేప్స్ వేలాడదీశారు. -
సర్వం.. జయం..
తమిళనాడు ప్రజల గుండెల్లో అమ్మగా కొలువైన జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి బాధ్యతలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మద్రాసు వర్సిటీలోని సెంటినరీ ఆడిటోరియంలో అట్టహాసంగా జరిగిన వేడుకల్లో నాయకులు, అభిమానులు జయజయ ధ్వానాలమధ్య పురిట్చితలైవి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 28 మంది మంత్రులు రెండు బృందాలుగా నిలబడి సామూహికంగా ప్రమాణం చేశారు. ప్రమాణస్వీకారోత్సవంలో సర్వం జయలలిత మయంగా కనిపించింది. అన్నీ తానై ఆమె వ్యవ హరించారు. అంతకు ముందు వేలసంఖ్యలో అభిమానులు రోడ్డు కిరువైపులా నిలబడి అమ్మకు స్వాగతం పలికారు. * ఆరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన జయలలిత * 28 మంత్రులతో క్యాబినెట్ * 25న మరో నలుగురు మంత్రుల ప్రమాణం సాక్షి ప్రతినిధి, చెన్నైః అన్నాడీఎంకే అధినేత్రి జే జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా సోమవారం ఆరోసారి పదవీ ప్రమాణం చేశారు. జే జయలలిత అనే నేను.. అంటూ తమిళనాడు గవర్నర్ కే రోశయ్య ఆమె చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత అమ్మ కేబినెట్లోని 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. జయలలితకు అనాదిగా ఆనవాయితీగా వస్తున్న చెన్నైలోని మద్రాసు యూనివర్సిటీ సెంటినరీ ఆడిటోరియం ప్రమాణస్వీకారోత్సవానికి ఆదివారానికే ముస్తాబైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎంగా ప్రమాణం చేయనుండగా ఉదయం 9గంటలకే పార్టీ నేతలు, అధికారులు అక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. 11.40 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న జయకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరులు స్వాగతం పలికారు. ఆహూతులకు అభివాదం చేస్తూ 11.50 గంటలకు జయలలిత వేదికపైకి వచ్చారు. 12 గంటలకు వేదికపైకి చేరుకున్న గవర్నర్ కే రోశయ్యకు జయలలిత పుష్పగుచ్చం ఇచ్చి అభివాదం చేశారు. జాతీయగీతం, తమిళ్‌తాయ్ గీతం తరువాత మంత్రివర్గంలో చేరబోతున్న వారిని గవర్నర్‌కు జయ పరిచయం చేశారు. 12.10 గంటలకు జయలలిత చేత గవర్నర్ రోశయ్య పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమిళంలో ‘నాన్’(నేను) అని రోశయ్య పలుకగా జయలలిత కొనసాగించారు. దేవుడిపైన అంటూ ఆమె ప్రమాణం సాగించారు. ప్రమాణం పూర్తయిన తరువాత జయలలిత ను అభినందిస్తూ రోశయ్య పుష్పగుచ్చం అందజేశారు. జయ తరువాల మంత్రులు ప్రమాణం చేశారు. సహజంగా ఒక్కో మంత్రి ప్రమాణం చేయాల్సి ఉంది. అయితే కొత్త సంప్రదాయానికి తెరదీస్తూ మొత్తం 28 మంది మంత్రులను రెండుగా బృందాలుగా విభజించి మూకుమ్మడిగా ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆయన విదేశాల్లో ఉన్నందున ప్రధాని తర ఫున కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హాజరైనారు. అలాగే కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ కొంత వెనుక వరుసలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. అమ్మ టీంలో మరో నలుగురు 28 మందితో జయలలిత తన మంత్రివర్గ బృందాన్ని ప్రకటించగా తమకు న్యాయం జరుగలేదని ఓ సామాజికవర్గం నిరసన తెలిపింది. మంత్రుల ఎంపికలో సామాజిక న్యాయం చోటుచేసుకోలేదనే విమర్శల నేపథ్యంలో కొత్తగా మరో నలుగురిని కేబినెట్లోకి తీసుకోవాలని సోమవారం సాయంత్రానికి సీఎం జయలలిత నిర్ణయం తీసుకున్నారు. జీ భాస్కరన్-ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, సెవ్వూరు ఎస్ రామచంద్రన్-దేవాదాయ ధర్మాదాయ శాఖ, డాక్టర్ నిలోఫర్ కబిల్-కార్మికశాఖ, పీ బాలకృష్ణారెడ్డి -పశుసంవర్దకశాఖ..ఈ నలుగురు మంత్రులు 25వ తేదీన రాజ్‌భవన్‌లో ప్రమాణం చేస్తారు. అన్నిరంగాల వారికి ఆహ్వానం ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణస్వీకారోత్సవానికి అన్నిరంగాల వారికీ ఆహ్వానాలు అందాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం ప్రతినిధిగా డీఎంకే కోశాధికారి స్టాలిన్ 12వ వరుసలో కూర్చున్నారు. మిత్రపక్షానికి చెందిన సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షులు,నటుడు శరత్‌కుమార్ ముందు వరుసలో కూర్చున్నారు. సీపీఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి త పాండియన్, పలువురు పారిశ్రామికవేత్తలు, ఆధ్యాత్మిక వేత్త మధురై ఆదీనం హాజరైనారు. కోలీవుడ్ నుంచి దక్షిణ భారత నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, నటులు ప్రభు, ఆనందరాజ్,సెంధిల్, మనోబాల, నటిలు వింధ్య, ఆర్తీగణేష్, సంగీత దర్శకులు శంకర్ గణేష్, గాయనిమణులు పీ సుశీల, వాణీజయరాం హాజరయ్యారు. అమ్మ..ఆకుపచ్చ అమ్మ గత రెండేళ్లుగా పాటిస్తున్న ఆకుపచ్చదనం సెంటిమెంట్‌ను అధికారులు అంతటా పాటించారు. వేదిక తెర, అలంకరించిన పూలు మొదలుకుని సర్వం ఆకుపచ్చమయం అయిపోయింది. చివరకు మీడియాకు ఇచ్చిన పాస్‌లు సైతం పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. అమ్మ సహా ఇద్దరు మహిళా మంత్రులు పచ్చని చీరలు కట్టుకుని వచ్చారు. మిన్నంటిన అభిమానం.. తమ అభిమాన నేత జయలలిత ముఖ్యమంత్రిగా ఆరోసారి పదవీప్రమాణం చేస్తున్న వేళ జనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఉదయం 11.30 గంటలకు పోయిస్గార్డెన్ నుంచి బయలుదేరిన జయలలితకు దారిపొడవునా జనం బ్యాండుమేళాలు వాయిస్తూ బ్రహ్మరథం పట్టారు. రెండాకుల చిహ్నాన్ని చూపుతూ జే జేలు కొట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు, కార్లు, వ్యాన్లలో అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్దసంఖ్యలో ప్రాంగణానికి చేరుకున్నారు. సరిగ్గా 12.30గంటలకు ప్రమాణ స్వీకారోత్సవం పూర్తికాగానే జయలలిత అక్కడి నుంచి నేరుగా సచివాలయానికి వెళ్లారు. ఉన్నతాధికారుల స్వాగతం, బాధ్యతల స్వీకరణ, ఐదు పథకాలపై సంతకం పూర్తి చేసుకుని సుమారు 1.30 గంటలకు సచివాలయం నుండి తిరుగుప్రయాణం అయ్యారు. అమ్మను మరోసారి చూడాలన్న ఆతృతతో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అభిమాన జనం అంతసేపూ ఎండలోనే నిలబడి ఆమెకు బ్రహ్మరథం పట్టారు. -
జయలలిత తొలి సంతకం ఇదే..
చెన్నై: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జయలలిత రైతు రుణమాఫీ ఫైలుపై తొలి సంతకం చేశారు. అంతేకాకుండా పలు కొత్త పథకాలతో ప్రజలకు అమ్మ వరాల జల్లు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయం అల్పాహారం, మద్యం దుకాణాలకు సమయం కుదింపు, వంద యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, చేనేత కార్మికులకు 700 యూనిట్లు ఉచితంగా విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ కొత్త పథకాలు జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ నేపథ్యంలో మద్యం దుకాణాల సమయం కుదింపుపై జయలలిత తన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే 500 రిటైల్ మద్యం షాపుల మూసివేతకు ఆమె ఆదేశాలు ఇచ్చారు. కాగా తమిళనాడులో అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ మద్యం దుకాణాలు తెరిచి ఉండేవి. అయితే కొత్త విధానం అమల్లోకి రావడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10 గంటల నుంచి తెరుచుకోనున్నాయి. కాగా జయలలితతో పాటు 28 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. గతంలో మాదిరిగానే మంత్రులందరూ సామూహికంగా ప్రమాణం చేశారు. జయ కేబినెట్లో ఈసారి 13 మంది కొత్తవారికి అవకాశం దక్కింది. వీరిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో 232 సీట్లు ఎన్నికలు జరగ్గా, అన్నాడీఎం 134 స్థానాల్లో విజయం సాధించి సంపూర్ణ మెజార్టీతో తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. మంత్రులు-శాఖలు 1. జయలలిత : హోంశాఖ, రెవెన్యూ, జనరల్ అడ్మినిస్ట్రేషన్ 2. పన్నీరుసెల్వం : ఆర్థిక శాఖ 3. శ్రీనివాసన్ - అటవీశాఖ 4. ఈదప్పడి కె. పలానీస్వామి - రహదారులు, పబ్లిక్ వర్క్స్ 5. సెల్లూర్ కె. రాజు - సహకార మరియు కార్మిక శాఖ 6. తంగమణి - విద్యుత్ మరియు ఎక్సైజ్ శాఖ 7. వీపీ వేలుమణి - గ్రామీణాభివృద్ధి మరియు మున్సిపల్ శాఖ 8. డి. జయకుమార్ - మత్స్యశాఖ 9. శణ్ముగమ్ - న్యాయ, జైళ్ల శాఖ 10. కేపీ అన్భజ్హగన్ - ఉన్నత విద్య 11. ఆర్బీ. ఉదయ్‌కుమార్ - రెవెన్యూ 12. కేటీ. రాజేంత్ర బాలాజీ - గ్రామీణ పరిశ్రమలు 13. కేసీ వీరమణి - వాణిజ్య పన్నుల శాఖ 14. పి. బెంజీమెన్ - పాఠశాల విద్య, ఆటలు మరియు యువజన సంక్షేమం 15. వెల్లమండి ఎన్. నటరాజన్ - పర్యాటక శాఖ 16. ఎస్. వలార్మఠి - వెనుకబడిన తరగతులు మరియు మైనార్టీ సంక్షేమ శాఖ 17. వీఎం. రాజలక్ష్మీ - ఆది ద్రవిడర్ మరియు గిరిజన సంక్షేమ శాఖ 18. ఎమ్. మణికందన్ - ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) 19. ఎంఆర్. విజయ్‌భాస్కర్ - రవాణా శాఖ. 20. డాక్టర్ వీ. సరోజ - సాంఘీక సంక్షేమ శాఖ 21. కేసీ కరుప్పన్నన్ - పర్యావరణ శాఖ 22. ఎంసీ సంపత్ - పరిశ్రమలు 23. ఆర్. కామరాజ్ - ఆహార, పౌరసరఫరాల శాఖ 24. ఓఎస్ మనేన్ - చేనేత మరియు జౌళి శాఖ 25. ఉడుమలై రాధాకృష్ణన్ - గృహ మరియు పట్టణాభివృద్ధి శాఖ 26. సీ. విజయ్‌భాస్కర్ - ఆరోగ్య శాఖ 27. ఎస్పీ శణ్ముగనాథన్ - పాలు మరియు పాడి పరిశ్రమ అభివృద్ధి 28. ఆర్. దురైకన్ను - వ్యవసాయం మరియు పశు సంరక్షణ శాఖ 29. కదంబూర్ రాజు - సమాచార శాఖ -
ఇది మోసం కాదా?
రైతులు, డ్వాక్రా రుణాల మాఫీపై మాట మార్చిన చంద్రబాబు రుణాలన్నీ మాఫీ అవుతాయని ఎదురుచూసిన రైతుల నోట్లో మట్టి హైదరాబాద్: గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగం భయపడుతున్నదే జరిగింది. అధికారంలోకి వచ్చీ రాగానే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తన తొలి సంతకంతోనే రైతాంగాన్ని నిండా ముంచారు.ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుంచి గడిచిన 45 రోజులుగా రుణ మాఫీపై రకరకాల సాకులు చెబుతూ కాలయాపన చేసిన చంద్రబాబు సోమవారం అడ్డంగా మాటమార్చారు. రైతులను నిలువునా ముంచారు. ఆంధ్రప్రదేశ్‌లో రైతులు తీసుకున్న రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉన్నాయి. ఇవి ప్రభుత్వ రికార్డులు చెబుతున్న అధికారిక లెక్కలే. అలాగే రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలున్నాయి. రెండూ కలిపి 1 లక్షా 1816 కోట్ల రూపాయలు ఉండగా వాటన్నింటినీ మాఫీ చేస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన క్షణం నుంచి మాట మార్చుతూ వచ్చారు. తీరా సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో రైతులను నిలువునా ముంచే మోసపూరిత నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ భేటీలో రుణ మాఫీపై చర్చించిన అనంతరం సీఎం స్వయంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రైతుల రుణాలు, డ్వాక్రా రుణాలు కలిపి రూ.30 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల మేరకు రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆయన ప్రతి సభలోనూ రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తానని ఊరూవాడా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఆరోజుల్లో ఎలాంటి పరిమితులు, ఆంక్షల గురించి చెప్పకపోగా, వ్యవసాయం కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీ ఏదో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చింది కాదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేరువేరుగా టీడీపీ మేనిఫెస్టోలు విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోల్లో రైతులు, డ్వాక్రా మహిళల రుణాలన్నీ మాఫీ చేస్తామన్న వాగ్దానాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం మొత్తం ఎన్ని రుణాలు తీసుకున్నారో ఇంతకాలం తెలియదనుకోవడం కూడా పొరపాటే. రాష్ట్ర స్థాయి బ్యాంక ర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) నివేదికల్లో రైతాంగం తీసుకున్న రుణాలె న్ని? అందులో వ్యవసాయ రుణాలెన్ని? బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయం కోసం తీసుకున్న రుణాలెన్ని? టర్మ్ రుణాలెన్ని? డ్వాక్రా సంఘాలు తీసుకున్న రుణాలెన్ని? వంటి మొత్తం వివరాలున్నాయి. పైగా తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేయడానికి ముందున్న లెక్కలే ఇవి. అన్నీ తెలిసే రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామంటూ అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అరుుతే అధికారం చేపట్టిన తర్వాత ఈ విషయంలో ఆయన రూటు మార్చారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినరోజు రుణ మాఫీ ఫైలుమీదే తొలి సంతకం చేస్తానన్న వాగ్దానం నెరవేర్చకుండా, రుణమాఫీ సాధ్యాసాధ్యాలను పరిశీలించడానికంటూ నాబార్డ్ మాజీ చైర్మన్ కోటయ్య నేతృత్వంలో ఒక కమిటీ వేయడానికి సంబంధించిన ఫైలుపై సంతకం చేసి చేతులు దులుపుకున్నారు. దాంతో రైతులు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి ఒక్కసారిగా విమర్శల దాడి మొదలైంది. అయినప్పటికీ కమిటీ సూచనలు, సిఫారసుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో చంద్రబాబు ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలోనూ రైతులు తీసుకున్న రుణాలెన్ని అన్న విషయూన్ని బ్యాంకర్ల కమిటీ చాలా స్పష్టంగా బహిరంగంగా ప్రకటించింది. ఇన్ని వాస్తవాలు ప్రత్యక్షంగా కనబడుతున్నప్పటికీ చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు నిన్నమొన్నటి వరకు కూడా రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ పచ్చిగా నమ్మిస్తూ వచ్చారు. ఒక్కో దశలో ఒక్కో పరిమితి విధిస్తూ, ఆంక్షలు పెడుతూ సాకులు చెబుతున్న సమయంలో వివిధ రాజకీయ పక్షాలు, రైతు సంఘాల నుంచి విమర్శలు వ స్తున్న సమయంలోనూ రుణ మాఫీకి కట్టుబడి ఉన్నామంటూ చెప్పుకొచ్చారు. దాదాపు నెలన్నర నుంచి ఇలా కాలం వెళ్లబుచ్చిన చంద్రబాబు ప్రభుత్వం సోమవారం తన నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది. వ్యవసాయం కోసం కోటి మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకుంటే వారిలో 90 శాతం మందికి లబ్ది చేకూర్చుతున్నామని బుకాయించే ప్రయత్నం చేయడం పట్ల రైతుల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రూ.87,612.25 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలు, రూ.14,204 కోట్ల మేరకు డ్వాక్రా రుణాలు కలిపి మొత్తం లక్ష కోట్లకు పైగా రుణాలుంటే.. అందులో రూ.30 వేల కోట్ల నుంచి 35 వేల కోట్ల మేరకు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వమే.. మళ్లీ 90 శాతం రైతులకు మేలు కలిగిస్తున్నామని చెప్పడం పట్ల రైతు సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. డ్వాక్రా రుణాలతో కలిపి లక్ష కోట్ల రుణాలుంటే అందులో కనీసం 30 శాతం రుణాలను మాఫీ చేయలేనప్పుడు ఏ విధంగా 90 శాతం మంది రైతులకు ప్రయోజనం కలిగించినట్టు అవుతుందని ప్రశ్నిస్తున్నాయి. వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు సంబంధించి కోటికి పైగా బ్యాంకుల్లో ఖాతాలున్నాయని కేవలం రూ.30 వేల కోట్లు మాఫీ చేసి 90 శాతం లబ్ది చేకూర్చామని చెప్పడం మరో మోసమని పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు జరిగిన తతంగం చూస్తుంటే ఆ రూ.30 వేల కోట్లను కూడా తగ్గించేలా ప్రభుత్వ వ్యవహారం కనబడుతోందని ఆ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. -
బాబు తొలి సంతకం ఓ డ్రామా
వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం విధివిధానాలు, నిర్ధిష్టమైన అమలు తేదీ ఏదీ? అసాధ్యమంటూ ఆశ్రీత మీడియా ప్రచారం ప్రమాణానికి రూ.30 కోట్ల ఖర్చు విజ్ఞతేనా? రాజధాని కోసం విరాళాలడుగుతూ ఇదేం పని? ప్రధాన ప్రతిపక్షంగా పోరాటాలు చేస్తాం రాజమండ్రి: ప్రమాణ స్వీకారం చేయగానే రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం పెడతానంటున్న చంద్రబాబు మాటలు ఒక డ్రామా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజమండ్రిలో ఆయన చేపట్టిన ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర నియోజకవర్గాల సమీక్షలు శనివారంతో ముగిశాయి. అనంతరం హైదరాబాద్ బయలుదేరేముందు శనివారం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘ఫలానా తేదీ నుంచి రైతుల రుణాలు మాఫీ అవుతున్నాయంటూ ఫైలుపై తొలి సంతకం చేయడంలో అర్థముంటుంది. కానీ ఎలాంటి విధివిధానాలూ ప్రకటించకుండా తొలి సంతకమేమిటి? ఇదంతా ఓ స్క్రిప్ట్ ప్రకారం సాగుతోంది. చంద్రబాబు సంతకం చేస్తారు. కానీ పథకం అమలు కాదు. ఆ తర్వాత రుణమాఫీ చేయాలని బాబు మంచి మనసుతో ప్రయత్నించినా అందుకు పరిస్థితులు అనుకూలించడంలేదంటూ బాబుకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్ ముందస్తు పథకం ప్రకారం వ్యూహాత్మకంగా ప్రచారం చేస్తాయి’’ అని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి విలేకరిని ‘అన్నా’ అంటూ ఆప్యాయంగా పలకరించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తమ విమర్శలు, పోరాటం కొన్ని మీడియా యాజమాన్యాలపైనే తప్ప విలేకరులతో కాదన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని అభ్యర్థించారు. విలేకరులెప్పుడూ తమ మిత్రులేనని చెప్పారు. విమానానికి సమయం అవుతున్నందువల్ల ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నానని చెప్పారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయనిలా సమాధానమిచ్చారు. ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లా? నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం చంద్రబాబు తన ప్రమాణ స్వీకారానికి రూ.30 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఓవైపు రాష్ట్రానికి నవ రాజధాని నిర్మాణానికి రూ.5,000 నుంచి రూ.10,000... మరెంతైనా విరాళాలు తీసుకుంటామని చంద్రబాబు చెప్తున్నారు. మరోవైపు తన ప్రమాణ స్వీకారానికి భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారనే అంశాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. ప్రమాణస్వీకారానికి రమ్మని చంద్రబాబు నన్ను ఆహ్వానించారు. నేను ఆయనకు అభినందనలు తెలిపాను. ఇక అక్కడ హాజరై ఆ ఖర్చుకు నా సమ్మతిని తెలపాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మేం పెరుగుతూనే ఉన్నాం 1.ఎన్నికల్లో ఓడిపోయినందువల్లే అసెంబ్లీ నియోజక వర్గాలవారీగా సమీక్షలు చేపడుతున్నామన్నది దుష్ర్పచారం మా త్రమే. మేము గతంలో అధికారంలో ఉండి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినందుకు ఓడిపోలేదు. గతంలోనూ ప్రతిపక్షంలోనే ఉన్నాం. ప్రజల పక్షాన పోరాటాలు చేశాం. 2. ఒకప్పుడు అమ్మ, నేనే పార్టీలో ఉన్నాం. తర్వాత ఇద్దరు ఎంపీలు, 20 మంది ఎమ్మెల్యేలకు పెరిగారు. ఇప్పుడు మొత్తంగా తొమ్మిది మంది ఎంపీలు, 70 మంది ఎమ్మెల్యేలను పార్టీ గెలుచుకుంది. ఆవిర్భావం నుంచీ అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాం. 3. ఓడిన చోట్ల ఎక్కడ ఏ లోపాలున్నాయో గుర్తించి మున్ముందు వాటిని సరిచేసుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టాం. నేరుగా కార్యకర్తలతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నాం. ఆ మేరకు పార్టీని పటిష్టం చేసుకుంటాం. 4. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే బాధ్యతను ప్రజలు మాకు అప్పగించారు. దాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరుగని పోరాటాలు చేస్తాం. సమయాభావంతో కొన్ని సమీక్షలు వాయిదా కార్యకర్తలందరి అభిప్రాయాలకు పెద్దపీట వేస్తూ సమీక్షలు సుదీర్ఘంగా కొనసాగడంతో సమయాభావంతో విశాఖ, అనకాపల్లి లోక్‌సభ స్థానాల సమీక్షలను వాయిదా వేసినట్టు జగ్గంపేట ఎమ్మెల్యే, సీజీసీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ తెలిపారు. ‘‘శుక్రవారం నాటి సమీక్ష ఉదయం పదింటికి మొదలై శనివారం ఉదయం ఏడింటి దాకా కొనసాగింది. రాజమండ్రి నగర నియోజకవర్గ సమీక్షతో ముగిసింది.సమయాభావంవల్ల కాకినాడ లోక్‌సభ స్థానంపరిధిలోని కాకినాడ సిటీ, జగ్గంపేట, ఏలూరు లోక్‌సభ స్థాన పరిధిలోని ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు అసెంబ్లీ స్థానాల సమీక్షలను వాయిదా వేశాం. వాటిని ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తాం. తిరుపతి సమీక్షల తర్వాత అనకాపల్లి, విశాఖ సమీక్షలను విశాఖలో నిర్వహిస్తాం’’ అని చెప్పారు. -
రైతుల రుణ మాఫీపైనే తొలి సంతకం: కేసీఆర్
సాక్షి, కరీంనగర్, వరంగల్: టీఆర్ఎస్ను గెలిపిస్తే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీపైనే తొలి సంతకం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్ఎస్ పాత్ర లేదని కరీంనగర్ సభలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా చెప్పింది. అవును టీఆర్ఎస్ పాత్ర ఉంటే.. ఇప్పటికే సంపూర్ణ తెలంగాణ వచ్చేది. ఇప్పుడూ చెబుతున్న.. టీఆర్ఎస్తోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమైతది. ఇప్పటివరకు ఉద్యమం నడపడం నా చేతిలో ఉండే.. ఇక టీఆర్ఎస్ను గెలిపించే పగ్గాలు మీ చేతిలోనే ఉన్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా గెలవాల్సిన అవసరముంది. ప్రాణం పోయినా సరే.. నేను చెప్పింది చేసి చూపిస్తా’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని మడికొండలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ‘14 ఏళ్ల టీఆర్ఎస్ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. ఇది పూర్తిగా రాలేదు. మనం అనుకున్న తీరుగా రాలె. వచ్చిన తెలంగాణలో కొంత నత్తి ఉంది. కొంత వెలితి ఉంది. తెలంగాణ వచ్చినా ఆంధ్రోళ్లతో డేంజర్(ముప్పు) తొలగిపోలేదు. దోపిడీ కొనసాగించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలె. వచ్చిన తెలంగాణను సన్నాసుల(కాంగ్రెస్) చేతుల్లో పెడితే ప్రయోజనం ఉండదు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో మన పరిస్థితి కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కేంద్రంలో మన మాట నెగ్గేలా సీట్లు వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పొరపాటున వచ్చినా కేవీపీ రామచందర్‌రావు వంటి వారు.. ప్రభుత్వంలోని వారికి బాస్‌లుగా ఉంటారు. టీఆర్ఎస్ వాళ్లకు అట్ల కాదు. మాకు ప్రజలే బాస్‌లు. తెలంగాణను కాకులు, గద్దలకు వేయొద్దు. రాజకీయ అవినీతిని వందకు వంద శాతం బొంద పెడతాం. నా బిడ్డ, కొడుకు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే జైలుకు పంపిస్తా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా.. 50 ఏళ్ల నుంచి కరువు కాటేస్తోందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నిసార్లు.. ఎన్ని పదవులను అనుభవించినా తెలంగాణకు నీళ్లు మాత్రం రాలేదని.. కన్నీళ్లు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రిజర్వాయర్లు, శ్రీరాంసాగర్ వరద కాలువ నిర్మాణం పూర్తికాక నీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కరెంటు లేక రైతులు అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. టీడీపీ-బీజేపీ పొత్తు అత్యంత ప్రమాదకరమైందని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకొస్తే.. అవినీతికి పాల్పడ్డ వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తామని చెప్పడంతో ఇప్పటికే ఆంధ్ర దోపిడీదార్లకు భయం పట్టుకుందన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబు మళ్లీ ఈ ప్రాంతంలో మకాం వేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తానని టీఆర్ఎస్ చీఫ్ హామీ ఇచ్చారు. వరంగల్ కు పూర్వవైభవం తెస్తాం: ‘11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్‌షెడ్ స్ఫూర్తిని అందించిన ఘనత వరంగల్ జిల్లాకు ఉంది. ఇప్పుడు వరంగల్ నగరం తాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణంగా ఉన్న వరంగల్.. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకురావాలె. భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి జయశంకర్‌సార్ పేరు పెడతాం. జిల్లాకు చెందిన జయశంకర్‌ను నేను బతికి ఉన్నంత వరకు గుండెల్లో పెట్టుకుంటా. వరంగల్‌ను టెక్స్టైల్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. పత్తి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం. జూరాల-పాకాల కాలువ నిర్మించి జిల్లాకు సాగునీటిని అందిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా గిరిజన విద్యార్థులపై ఉన్న 3.41 లక్షల కేసులను ఎత్తివేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. పొన్నాలపై ధ్వజం: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరేళ్లు సాగునీటి మంత్రిగా పనిచేసిన పొన్నాల.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న పొన్నాల ముఖమే అయనది.. నడిపించే సూత్రధారి కేవీపీ రామచందర్‌రావు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన యాకూబ్‌రెడ్డి వంటి వారిని పోలీసులతో కొట్టించిన పొన్నాల.. వారి జీవితం నాశనం చేశారని మండిపడ్డారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్రావుపైనా కేసీఆర్ విమర్శలు చేశారు. ‘కంచికి వెళ్తే బల్లి ఉంటది. దాన్ని తాకితే పుణ్యం వస్తుంది. ఇక్కడ పాలకుర్తిలో ప్రమాదకరమైన బల్లి ఉంది. అది ఎర్రబల్లి. పొద్దున లేస్తే నా మీద, తెలంగాణ మీద విషం కక్కుతున్నది’ అని వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా మడికొండ సభలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు పేర్వారం రాములు, రామచంద్రునాయక్, జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్రావు, ఎమ్మెల్యే బిక్షపతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను సభకు కేసీఆర్ పరి చయం చేశారు. ఇక హుస్నాబాద్ సభలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు. సోనియా మీటింగ్ ఫెయిలైంది! సోనియాగాంధీ పాల్గొన్న కరీంనగర్ సభ ఫెరుుల్ అరుుందని వరంగల్ జిల్లాలో జరిగిన సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘కరీంనగర్లో సోనియా మీటింగ్ ఫెయిలైంది. నాకు ఎవరో జెప్పలే. ఇంటెలిజెన్స్ వాళ్లు చెప్పిన్రు. కొందరు ప్రెస్ మిత్రులు కంగ్రాట్స్ చెప్పిన్రు. ఇంకేంది అంతా ఏకపక్షమే అన్నరు. అట్లని మనం అలసత్వంతో ఉండొద్దు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్లజేత్తరానయా.. కొండా సురేఖ పోతే ఇంక ఎక్కువ మంది వస్తరు’ అని ఆయన ఎద్దేవా చేశారు.