రైతుల రుణ మాఫీపైనే తొలి సంతకం: కేసీఆర్
సాక్షి, కరీంనగర్, వరంగల్: టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే రైతులకు లక్ష రూపాయల రుణ మాఫీపైనే తొలి సంతకం చేస్తానని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పాత్ర లేదని కరీంనగర్ సభలో కాంగ్రెస్ నాయకురాలు సోనియా చెప్పింది. అవును టీఆర్‌ఎస్ పాత్ర ఉంటే.. ఇప్పటికే సంపూర్ణ తెలంగాణ వచ్చేది. ఇప్పుడూ చెబుతున్న.. టీఆర్‌ఎస్‌తోనే సంపూర్ణ తెలంగాణ సాధ్యమైతది. ఇప్పటివరకు ఉద్యమం నడపడం నా చేతిలో ఉండే.. ఇక టీఆర్‌ఎస్‌ను గెలిపించే పగ్గాలు మీ చేతిలోనే ఉన్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు కూడా గెలవాల్సిన అవసరముంది. ప్రాణం పోయినా సరే.. నేను చెప్పింది చేసి చూపిస్తా’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోని మడికొండలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో కేసీఆర్ ప్రసంగించారు. సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకునే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ‘14 ఏళ్ల టీఆర్‌ఎస్ పోరాటం తర్వాత తెలంగాణ వచ్చింది. ఇది పూర్తిగా రాలేదు. మనం అనుకున్న తీరుగా రాలె. వచ్చిన తెలంగాణలో కొంత నత్తి ఉంది. కొంత వెలితి ఉంది. తెలంగాణ వచ్చినా ఆంధ్రోళ్లతో డేంజర్(ముప్పు) తొలగిపోలేదు. దోపిడీ కొనసాగించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలె. వచ్చిన తెలంగాణను సన్నాసుల(కాంగ్రెస్) చేతుల్లో పెడితే ప్రయోజనం ఉండదు. రాష్ట్రం ఏర్పడిన తరుణంలో మన పరిస్థితి కొత్త కుండలో ఈగ సొచ్చినట్లు ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి, కేంద్రంలో మన మాట నెగ్గేలా సీట్లు వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పొరపాటున వచ్చినా కేవీపీ రామచందర్‌రావు వంటి వారు.. ప్రభుత్వంలోని వారికి బాస్‌లుగా ఉంటారు. టీఆర్‌ఎస్ వాళ్లకు అట్ల కాదు. మాకు ప్రజలే బాస్‌లు. తెలంగాణను కాకులు, గద్దలకు వేయొద్దు. రాజకీయ అవినీతిని వందకు వంద శాతం బొంద పెడతాం. నా బిడ్డ, కొడుకు ఎవరైనా సరే అవినీతికి పాల్పడితే జైలుకు పంపిస్తా’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో కృష్ణా, గోదావరి నదులు ప్రవహిస్తున్నా.. 50 ఏళ్ల నుంచి కరువు కాటేస్తోందన్నారు. ఈ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎన్నిసార్లు.. ఎన్ని పదవులను అనుభవించినా తెలంగాణకు నీళ్లు మాత్రం రాలేదని.. కన్నీళ్లు పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో రిజర్వాయర్లు, శ్రీరాంసాగర్ వరద కాలువ నిర్మాణం పూర్తికాక నీటి కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కరెంటు లేక రైతులు అవస్థలు పడ్డారని గుర్తు చేశారు. టీడీపీ-బీజేపీ పొత్తు అత్యంత ప్రమాదకరమైందని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకొస్తే.. అవినీతికి పాల్పడ్డ వారి నుంచి సొమ్మును రికవరీ చేస్తామని చెప్పడంతో ఇప్పటికే ఆంధ్ర దోపిడీదార్లకు భయం పట్టుకుందన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ చంద్రబాబు మళ్లీ ఈ ప్రాంతంలో మకాం వేస్తున్నాడని ఆయన మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే హుస్నాబాద్‌ను సస్యశ్యామలం చేస్తానని టీఆర్‌ఎస్ చీఫ్ హామీ ఇచ్చారు.
వరంగల్ కు పూర్వవైభవం తెస్తాం: ‘11వ శతాబ్దంలోనే ప్రపంచానికి వాటర్‌షెడ్ స్ఫూర్తిని అందించిన ఘనత వరంగల్ జిల్లాకు ఉంది. ఇప్పుడు వరంగల్ నగరం తాగునీటికి ఇబ్బంది పడాల్సిన దుస్థితి వచ్చింది. 40 ఏళ్ల క్రితం హైదరాబాద్ తర్వాత పెద్ద పట్టణంగా ఉన్న వరంగల్.. ఇప్పుడు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదు. వరంగల్‌కు పూర్వ వైభవం తీసుకురావాలె. భూపాలపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి జయశంకర్‌సార్ పేరు పెడతాం. జిల్లాకు చెందిన జయశంకర్‌ను నేను బతికి ఉన్నంత వరకు గుండెల్లో పెట్టుకుంటా. వరంగల్‌ను టెక్స్‌టైల్స్ హబ్‌గా తీర్చిదిద్దుతాం. పత్తి మార్కెట్‌ను అభివృద్ధి చేస్తాం. జూరాల-పాకాల కాలువ నిర్మించి జిల్లాకు సాగునీటిని అందిస్తాం. తెలంగాణ వ్యాప్తంగా గిరిజన విద్యార్థులపై ఉన్న 3.41 లక్షల కేసులను ఎత్తివేస్తాం’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పొన్నాలపై ధ్వజం: టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఆరేళ్లు సాగునీటి మంత్రిగా పనిచేసిన పొన్నాల.. దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయాడని విమర్శించారు. టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఉన్న పొన్నాల ముఖమే అయనది.. నడిపించే సూత్రధారి కేవీపీ రామచందర్‌రావు అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాడిన యాకూబ్‌రెడ్డి వంటి వారిని పోలీసులతో కొట్టించిన పొన్నాల.. వారి జీవితం నాశనం చేశారని మండిపడ్డారు. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్రబెల్లి దయాకర్‌రావుపైనా కేసీఆర్ విమర్శలు చేశారు. ‘కంచికి వెళ్తే బల్లి ఉంటది. దాన్ని తాకితే పుణ్యం వస్తుంది. ఇక్కడ పాలకుర్తిలో ప్రమాదకరమైన బల్లి ఉంది. అది ఎర్రబల్లి. పొద్దున లేస్తే నా మీద, తెలంగాణ మీద విషం కక్కుతున్నది’ అని వ్యాఖ్యానించారు. వరంగల్ జిల్లా మడికొండ సభలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యులు పేర్వారం రాములు, రామచంద్రునాయక్, జిల్లా అధ్యక్షుడు టి.రవీందర్‌రావు, ఎమ్మెల్యే బిక్షపతిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులను సభకు కేసీఆర్ పరి చయం చేశారు. ఇక హుస్నాబాద్ సభలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ అభ్యర్థులు పాల్గొన్నారు.
సోనియా మీటింగ్ ఫెయిలైంది!
సోనియాగాంధీ పాల్గొన్న కరీంనగర్ సభ ఫెరుుల్ అరుుందని వరంగల్ జిల్లాలో జరిగిన సభలో కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘కరీంనగర్‌లో సోనియా మీటింగ్ ఫెయిలైంది. నాకు ఎవరో జెప్పలే. ఇంటెలిజెన్స్ వాళ్లు చెప్పిన్రు. కొందరు ప్రెస్ మిత్రులు కంగ్రాట్స్ చెప్పిన్రు. ఇంకేంది అంతా ఏకపక్షమే అన్నరు. అట్లని మనం అలసత్వంతో ఉండొద్దు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్లజేత్తరానయా.. కొండా సురేఖ పోతే ఇంక ఎక్కువ మంది వస్తరు’ అని ఆయన ఎద్దేవా చేశారు.