
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘చేనేత కార్మికులకు రుణమాఫీ పథకం’కింద రూ.33 కోట్లు మంజూరు చేస్తూ పరిశ్రమలు, వాణిజ్య శాఖ తరఫున ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025–26 బడ్జెట్ నిధుల నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేయనున్నారు. చేనేత కార్మికులపై ఉన్న అప్పులను తీర్చేందుకు ఈ నిధులను వినియోగిస్తారు. హ్యాండ్లూమ్స్, టెక్స్‌టైల్స్, అప్పారెల్ ఎక్స్‌పోర్ట్ పార్క్స్ కమిషనర్‌కు ఈ నిధులను విడుదల చేసి, లబ్ధిదారులకు చెల్లించేందుకు పూర్తి అధికారం ఇచ్చారు.
రూ.33 కోట్లను చేనేత కార్మికులకు రుణమాఫీగా చెల్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆర్థికశాఖ ఇచ్చిన అనుమతితో 2025 జూన్ 24న విడుదలైన నోటు ఆధారంగా ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలిపారు. ఈ నిర్ణయం చేతివృత్తులను ఆధారంగా చేసుకొని జీవిస్తున్న వేలాది చేనేత కార్మికులకు పెద్ద ఊరటగా నిలుస్తుందని, వడ్డీల భారంతో సతమతమవుతున్న నేతన్నలకు ఇది ఊరట కలిగించే నిర్ణయమని ప్రభుత్వం పేర్కొంది.