మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత | Loom Workers Facing Problems Due To Lockdown In Telangana | Sakshi
Sakshi News home page

మూగబోయిన మగ్గంపై కన్నీళ్ల నేత

Published Sat, May 2 2020 3:22 AM | Last Updated on Sat, May 2 2020 4:50 AM

Loom Workers Facing Problems Due To Lockdown In Telangana - Sakshi

సిరిసిల్లలో పనిలేక చేనేత మగ్గంపై నిరాశతో కూర్చున్న ఓ నేత కార్మికుడు

సాంచాల చప్పుళ్లతో కళకళలాడే నేతన్నల ఇళ్లలో మూగ రోదనలు వినిపిస్తున్నాయి. రంగు రంగుల పట్టుచీరలు నేసే ఆ మగ్గాలు.. పూట గడవక కన్నీళ్లను నేస్తున్నాయి. ధగధగ మెరిసే పట్టు చీరలను చూసి మురిసిపోయే ఆ కళ్లు.. వంటగదిలో నిండుకున్న కుండలను చూసి కన్నీళ్లు పెడుతున్నాయి. రాట్నాలు ఒడికే చేతులు.. అన్నార్థుల సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదీ రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగంపై ఆధారపడి బతుకు వెళ్లదీస్తున్న నేతన్నల దుస్థితి. యాదాద్రి, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో లాక్‌డౌన్‌తో పనుల్లేక ఇక్కట్లు పడుతున్న వేలాది మంది నేతన్నల బతుకు చిత్రంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. 

సాక్షి యాదాద్రి/గద్వాల/సిరిసిల్ల/సిద్దిపేట: కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మగ్గం చప్పుళ్లు ఆగిపోయాయి. పూటగడవని నేతన్న అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్నాడు. ఒకపూట తిండికోసం, వైద్య ఖర్చులు, నిత్యావసరాల కోసం చేనేత కుటుంబాలు అవస్థలు పడుతున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా నేతన్నల జీవితాలు తారుమారయ్యాయి. చేనేతకు అవసరమైన ముడి పట్టు, కాటన్, నూలు రవాణా నిలిచిపోయాయి. రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి, గద్వాల, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో ఎక్కువగా చేనేత వృత్తిపై ఆధారపడి వేలాది మంది జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వారందరికీ చేతిలో పనిలేక, డబ్బుల్లేక పోవడంతో నిత్యావసరాలు కొనుక్కోలేక పస్తులు ఉండాల్సి వస్తోంది. 

మందులకు డబ్బులు లేవు.. 

యాదాద్రి భువనగిరిజిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామానికి చెందిన చేనేత కార్మికురాలు వడ్డెపల్లి గీతావాణి. లాక్‌డౌన్‌తో పని లేక నానా అవస్థలు పడుతోంది. ఈమె భర్త గోపాల్‌ 7 సంవత్సరాల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. ఏకైక కుమారుడు శ్రీధర్‌ (10) మానసిక వికలాంగుడు. శ్రీధర్‌ వైద్యఖర్చులు, మందులకే నెలకు నాలుగైదు వేలు ఖర్చవుతోంది. గీతావాణి మస్‌రస్‌ చీరలను మగ్గంపై నేస్తుంది. నెలకు 5 నుంచి 6 చీరలు నేయడం ద్వారా సరాసరి నాలుగున్నర వేలు సంపాదిస్తుంది. నెలరోజులుగా మగ్గం నడవట్లేదు. చేనేత అనుబంధ పనులు ఏమైనా చేద్దామంటే అవి కూడా మూతపడ్డాయి. మందులు కొనడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం ఇచ్చిన రేషన్‌బియ్యం, రూ.1,500 నిత్యావసర సరుకులు కొనడానికే సరిపోతున్నాయని చెబుతోంది.

చేతిలో డబ్బుల్లేక ఇక్కట్లు
పోచంపల్లికి చెందిన ఈమె పేరు కాముని పద్మ. భర్త, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఇంటి బాధ్యతను భుజాలకు ఎత్తుకుని 22 ఏళ్లుగా మగ్గం నేస్తోంది. అద్దె ఇంట్లో ఉంటోంది. కూలీ మగ్గం నేసి ముగ్గురు కుమార్తెల వివాహం చేసింది. ఇంటి పనులు పూర్తి చేసుకున్న తర్వాత రోజూ 8 గంటలు కూలీకి మగ్గం నేస్తుంది. నెలంతా పనిచేస్తే రూ.5 వేలు సంపాదిస్తుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. మహిళా సంఘం ద్వారా బ్యాంకులో తీసుకున్న లోన్, పొదుపు డబ్బులు కట్టలేకపోతోంది.  

పేరుకుపోతున్న వస్త్ర నిల్వలు 
యాదాద్రి జిల్లా వ్యాప్తంగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో రూ.70కోట్లకు పైగా పట్టు చీరల నిల్వలు, రామన్నపేట, మిగతా ప్రాంతాల్లో రూ.60కోట్ల కాటన్‌ వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. పోచంపల్లిలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 100కు పైగా దుకాణాలు ఉన్నాయి. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద రూ.10 కోట్లు, చేనేత సహకార సంఘంలో రూ.1.5 కోట్లు, వస్త్ర దుకాణాల్లో మరో రూ.50 కోట్లకు పైగా వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరుతున్నారు. స్టాక్‌ అమ్మాకే కార్మికులకు ఉపాధి ఇవ్వగలుగుతామని మాస్టర్‌ వీవర్స్‌ అంటున్నారు. 

‘ఇక్కత్‌’కు కష్టాలు

పోచంపల్లి మగ్గాల కేంద్రానికి తాళం
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉత్పత్తి అయిన పట్టు చీరలు, కాటన్‌ ఉత్పత్తుల అమ్మకాలు నిలిచిపోవడంతో రూ.130 కోట్ల విలువ చేసే చేనేత ఉత్పత్తులు పేరుకుపోయాయి. సహకార, సహకారేతర రంగంలో భూదాన్‌పోచంపల్లి, రామన్నపేట, చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం, మోత్కూరు, భువనగిరి, రాజపేట, ఆలేరు, గుండాల, ఆత్మకూర్‌ (ఎం) యాదగిరిగుట్ట, మోటకొండూరు మండలాల్లో చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కత్‌ వస్త్రాలకు ప్రసిద్ధిగాంచిన పోచంపల్లిలో 1,300 పైచిలుకు మగ్గాలు ఉండగా, 3 వేలకు పైగా చేనేత కార్మికులు చేనేత పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 5,500 మంది జియో ట్యాగింగ్‌లో నమోదు కాగా, మరో 15 వేల మందికి పైగా ఈ రంగంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. 

నిలిచిన ముడి సరుకు రవాణా  
ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇస్తూ చేనేత కార్మికులు పని చేసుకోవచ్చని తెలిపింది. కానీ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో చేనేత కార్మికులకు పని కల్పించే సానుకూల పరిస్థితులు లేవు. చైనా దేశం నుంచి దిగుమతి అయ్యే పట్టు ముడిసరుకు, రంగులు, రసాయనాలు 3 నెలల కిందటే నిలిచిపోయాయి. బెంగళూరులో ఉత్పత్తి అయ్యే పట్టు దేశంలోని కార్మికుల అవసరాలకు సరిపోవట్లేదు. చీరల జరీ సూరత్‌ నుంచి వస్తుంది. కాటన్‌ వస్త్రాలS తయారీకి అవసరమైన కాటన్‌ నూలు తమిళనాడులోని ఈరోడ్, సేలం, ఆదిలాబాద్‌ నుంచి జిల్లాకు వస్తుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా సౌకర్యాలు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో ముడిసరుకు దిగుమతి ఆగిపోయింది. చాలా చోట్ల ముడి నూలు లేక వస్త్రాల తయారీ నిలిచిపోయింది. 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌లో నేతన్నల దుస్థితి 
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సుమారు 10,550 మంది చేనేత కార్మికులు వివిధ రకాల డిజైన్లతో జరీ చీరలు, దుప్పట్లు, తువాళ్లను తయారు చేస్తున్నారు. మగ్గం ఉన్న ప్రతి కుటుంబం నెలకు సగటున నాలుగు జరీ చీరలు నేస్తారు. లాక్‌డౌన్‌ రోజుల్లో సుమారు 10 వేల వరకు జరీ చీరలు తయారయ్యాయి. కార్మికులు నేసిన ఈ చీరలను మాస్టర్‌ వీవర్స్‌ లాక్‌డౌన్‌ కారణంగా కొనుగోలు చేయట్లేదు. దీంతో కార్మికులు తయారు చేసిన చీరలను ఇళ్లలోనే నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. పని నిలిచిపోవడం, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో నిత్యావసర సరుకులు, కూరగాయలు కూడా కొనుగోలు చేయలేని పరిస్థితిలో కొంతమంది నేత కార్మికులు ఉన్నారు. ప్రధానంగా గద్వాల, రాజోలి, అమరచింత, నారాయణపేట, కొత్తకోట, అయిజ, ధన్వాడ, గట్టు, మాచర్ల, గోర్లఖాన్‌దొడ్డి తదితర ప్రాంతాల్లో నేత కార్మికుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది.  

నూలు ధరలపై నియంత్రణేది 
చైనా నుంచి నూలు ముడి సరుకు నిలిచిపోయింది. దీంతో సిల్క్‌ ఉత్పత్తి తగ్గి బెంగళూరు కేంద్రంగా సరఫరా అయ్యే నూలుకు డిమాండ్‌ పెరిగి ధరలు రెట్టింపయ్యాయి. లాక్‌డౌన్‌కు ముందు 3 నెలల కింద కిలో పట్టు వార్పు రూ.3,200ల నుంచి రూ.4,500లకు, వెప్ట్‌ కిలో రూ.3,500ల నుంచి రూ.4,800లకు పెరిగింది. మొత్తానికి వార్పు (7చీరలు)పైన రూ.15 వేల వరకు ధర పెరిగిందని వాపోతున్నారు. పెరిగిన నూలు ధరలకు అనుగుణంగా చీరల ధరలు పెంచితే మార్కెట్‌లో కొనుగోలుదారులు వస్త్రాలను కొనలేని పరిస్థితి నెలకొంది. గతంలో జరిపిన విక్రయాలకు డబ్బులు రాకపోవడంతో మాస్టర్‌ వీవర్స్‌ తమ వద్ద పనిచేసే కార్మికులకు పని నిలిపేశారు. దీంతో పనులు లేక కార్మికులు అర్ధాకలితో గడుపుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్‌ బియ్యం, రూ.1,500 మాత్రమే వారికి జీవనాధారం అయ్యాయి. 

మూగబోయిన సిరిసిల్ల.. 
సిరిసిల్లలో కరోనా ప్రభావంతో కార్ఖానాలు బంద్‌ అయ్యాయి. బట్ట ఉత్పత్తి చేస్తేనే నేత కార్మికుల పొట్ట గడుస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిరిసిల్ల శివారులోని టెక్స్‌టైల్‌ పార్క్‌లోనూ ఆధునిక మరమగ్గాలు బంద్‌ అయ్యాయి. దీంతో మొత్తంగా సిరిసిల్లలో 25 వేల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సిరిసిల్లలో వేలాది మంది కార్మికుల ఉపాధికి విఘాతం ఏర్పడింది. కాగా, సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులకు ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చింది.

6.2 కోట్ల మీటర్లు బతుకమ్మ చీరల బట్టను ఉత్పత్తి చేయాలని సిరిసిల్లలో వస్త్రోత్పత్తిదారులకు గత ఫిబ్రవరిలో ఆర్డర్లు ఇచ్చారు. చీరల డిజైన్‌ను మార్చడంతో బతుకమ్మ చీరలకు అవసరమైన నూలును దిగుమతి చేసుకుంటున్న దశలో కరోనా లాక్‌డౌన్‌ అయింది. దీంతో సిరిసిల్లకు పూర్తి స్థాయిలో నూలు ఇంకా రాలేదు. వచ్చిన నూలుతో వస్త్రోత్పత్తికి లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ పడింది. దీంతో సిరిసిల్లలో అటు పాలిస్టర్‌ బట్ట, ఇటు బతుకమ్మ చీరల బట్ట ఏదీ ఉత్పత్తి కావట్లేదు. దీంతో నేత కార్మికుల బతుకు దయనీయంగా మారింది. నిత్యం పని చేసే కార్మికులకు నెల రోజులుగా పని లేకపోవడంతో మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. 

ఉపాధి లేక.. దిక్కుతోచక..! 
ఈ చిత్రంలో దీనంగా కనిపిస్తున్న శంకర్, పద్మ దంపతులిద్దరూ చేనేత కార్మికులు. వీరికి ఆరేళ్లపాప ఉంది. చేనేత వృత్తే ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. దంపతులిద్దరూ కష్టపడి మగ్గం ద్వారా జరీ చీరలను తయారు చేస్తారు. నెలకు 3 చీరలు నేయడమే గగనం. వీటి ద్వారా సంపాదన నెలకు రూ.10 వేలకు మించదు. లాక్‌డౌన్‌ విధించడం, రాజోలి రెడ్‌జోన్‌లోకి వెళ్లడంతో మగ్గాలు నిలిచిపోయాయి. దీంతో వారు ఉపాధి
లేక దిక్కుతోచని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. 

ఘొల్లుమంటున్న ‘గొల్లభామ’ 

గత 40 రోజులుగా సిద్దిపేట జిల్లాలో నేతన్నల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. గత నాలుగు రోజుల నుంచే చేనేత కార్మికులు పని ప్రారంభించారు. జిల్లాలో 13 సహకార సంఘాలు ఉన్నాయి. ఇందులో 5,450 మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా గొల్లభామచీరలు, లివర్‌ టవల్స్, జర్నరీ టవల్స్‌ అధికంగా తయారు చేస్తారు. ఇక్కడ తయారైన వస్త్రాలను టెస్కో ఖరీదు చేస్తుంది. గత 4 నెలల నుంచి వస్త్రాలను ఖరీదు చేయడంలో టెస్కో ఆలస్యం చేయడంతో కార్మికులకు కూలీ చెల్లించలేకపోతున్నారు. సహకార సంఘాల వద్ద వస్త్రాలు పేరుకుపోయాయి. జిల్లావ్యాప్తంగా 2.5 కోట్ల విలువైన వస్త్రాలు సహకార సంఘాల వద్ద ఉన్నాయి. వీటిని విక్రయిస్తేనే కార్మికులకు వేతనాలు అందుతాయి. ప్రభుత్వం ఈ వస్త్రాలను త్వరగా ఖరీదు చేసి అదుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. 

పొట్ట నిండటమే కష్టమవుతోంది.. 
ఇతడి పేరు చాప శ్రీనివాస్‌ (38). నిత్యం సాంచాలు నడుపుతూ రూ.300 నుంచి రూ.500 వరకు సంపాదించే వాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో శ్రీనివాస్‌కు ఉపాధి కరువైంది. అద్దె ఇంట్లో ఉండే శ్రీనివాస్‌కు ఇద్దరు ల్లలు.
భార్య బీడీ కార్మికురాలు. పొట్ట నింపుకోవడం కష్టమైతుందని వాపోతున్నాడు. చాప శ్రీనివాస్, పవర్‌లూమ్‌ కార్మికుడు, సిరిసిల్ల

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement